♻️ *అమ్నోనును దావీదు మందలించలేదెందుకు?....✍️*
పరిశుద్ధ గ్రంధములో లిఖించబడిన అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఒకటి, దావీదు జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను, తన చెల్లెలైన తామారు విషయంలో జరిగించిన నీచమైన చర్య. విమర్శించేవారు ఇట్లాంటి సంఘటనలు వ్రాసివున్న గ్రంధం పరిశుద్ధ గ్రంధం ఎట్లా అయ్యిందని వితండవాదం చేసేవారు అనేకులు. అయితే, పరిశుద్ధ గ్రంధం ఎవ్వరి పాపమును దాచిపెట్టదు. గతకాలంలో వారు చేసిన పాపము, దాని పర్యవసానం ఏమిటో, నేడు అట్లాంటి క్రియలు చేసి. అట్టి శిక్షకు గురికాకుండా దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి అనే గ్రహింపును కలిగియున్నవారెవ్వారూ అట్టి విమర్శలు చెయ్యలేరు.
అమ్నోను, తామారులు ఎవరు?
▫️దావీదు, అహీనోయము కు పుట్టినవాడు “అమ్నోను”
▫️దావీదు, మయకాకు పుట్టినది “తామారు”
▫️తండ్రి ఒక్కడే, తల్లులు వేరు.
▫️అమ్నోను, తామారులు వరుసకు అన్నా చెల్లెల్లు.
అమ్నోను, తామారును మోహించాడు. కపటోపాయాంతో ఆమెను తన ఇంటికి రప్పించుకొని, ఆమెను పాడుచేసి, బయటకు త్రోసివేసాడు. తన కుమార్తె చెరచబడిందని, అట్లా చేసినవాడు తన కుమారుడే అని తెలిసి కోపంతో ఊగిపోయాడు దావీదు. ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. (2 సమూ 13:21) కానీ ఒక్కమాట కూడా అమ్నోనును మందలించినవాడు కాదు. దావీదు ఎందుకట్లా మిన్నకుండిపోవలసి వచ్చింది? దానికి రెండు కారణాలుండొచ్చు.
1. దావీదు బెత్సేబాతో పాపం చేసి, తన భర్తను చంపించిన దాని కారణంగా, నాతాను ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటల నెరవేర్పు ( 2 సమూ 12: 9-12 ) ప్రారంభమయ్యిందనే గ్రహింపులోనికి దావీదు వచ్చారు.
2. తన కుమారుడైన అమ్నోనును మందలిస్తే. గతంలో తాను చేసిన పాపమును అతడు ఎత్తిచూపుతాడేమోననే భయం దావీదులో వుండిపోయిందేమో?
ఇక్కడే కొద్దిసేపాగి మీతో మాట్లాడాలనుకొంటున్న. మన కుటుంబాలలో అనేకమంది యవ్వనబిడ్డలు నైతికంగా, ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నారంటే దానిలో ఒక కారణం తలిదండ్రుల జీవన విధానమే వారి బిడ్డలపై ఎక్కువ ప్రభావాన్ని చూపగలుగుతుందనేది తిరుగులేని వాస్తవం. . అనేకులైన తలిదండ్రుల జీవితాలు వారి బిడ్డలను మందలించగలిగే స్థితిలో లేవు. వారి బిడ్డలను ఎంత సూటిగా ప్రశ్నిస్తే, వారి బిడ్డలు కూడా వారిని అంతే సూటిగా ప్రశ్నిస్తారు. గోడకు కొట్టిన బంతి తిరిగొచ్చి ముఖం పగలగొట్టినట్లవుతుంది. కారణం? పెళ్ళికెదిగిన పిల్లలున్నారు. కొందరైతే మనవళ్లను ఎత్తేసారు. కానీ వారి బ్రతుకులు మాత్రం నేటికిని మారలేదు. ఇట్లాంటివారు వారి బిడ్డలను ఏమని మందలించగలరు? ఒకవేళ మందలించినా నిన్ను పట్టించుకొనే దెవరు. నోట్లో సిగరెట్టు పెట్టుకొని, నీ కొడుకును సిగరెట్టు కాల్చొద్దని గొంతు చించుకున్నా, నీ మాటకు విలువిచ్చేదెవరు? మరింత దయనీయమైన పరిస్థితి ఏమిటంటే తలిదండ్రులైన వారు వారి బ్రతుకులు మార్చుకోలేక, వారి పాపమును కొనసాగించుటకువీలుగా బిడ్డలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పరోక్షంగా వారిని పాపమునకు ప్రోత్సహించేవారు లేకపోలేదు. అంటే వీరి విధానం ఒక్కటే. నా బిడ్డలను వారి పాపము గురించి నేను ప్రశ్నించకపోతే, నా పాపమును గురించి వారూ ప్రశ్నించరు. అంటే, నీ క్షణికమైన ఆనందం కోసం నీ బిడ్డల జీవితాలను ఫణంగా పెట్టేస్తావా? అతల్యా తన కుమారునికి దుర్మార్గముగా ఎట్లా ప్రవర్తించాలో నేర్పిస్తూ వచ్చిందట (2 దిన 22:3). నీవు ఒకవేళ పనిపెట్టుకొని నేర్పించకపోయినప్పటికీ, నీ బిడ్డలు తప్పుచేస్తున్నప్పుడు మందలించగలిగే ధైర్యం నీవు చెయ్యలేకపోతున్నావంటే, పరోక్షంగా దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పించే స్థితిలో నీవున్నట్లే. నీ బిడ్డలను మందలించే ధైర్యం నీకు లేదంటే, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఒక్క క్షణం ఆగి ఆలోచించు.
తలిదండ్రులైన వారు పాపపు పీకల్లోతుల్లోనికి కూరుకుపోయి వారి బిడ్డలను మందలించలేక, సక్రమమైన మార్గంలో వారిని పెట్టలేక, వారితో రాజీపడి, వారి పతనానిని కారణమయ్యేవారు కొందరైతే, ఆధ్యాత్మికంగా, నీతిగా జీవిస్తూ కూడా వారి బిడ్డలను మందలించలేనివారు మరికొందరు. యాజకుడైన ఏలీ గారు, తన బిడ్డలు వ్యభిచారులయ్యారని తెలిసినప్పుడు ఎంత ముద్దుగా మందలిస్తున్నారో చూడండి. నా కుమారు లారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు (1సమూ 2:24). చిట్ట చివరకు మనకు తెలుసు అమ్నోను గాని, ఏలీ కుమారులుగాని ఎట్లాంటి మరణాన్ని పొందారో. వారి అంతం అత్యంత విషాదం.
చివరిగా ఒక్కమాట! నీ బిడ్డలను మందలించగలిగినట్టి జీవితాన్ని నీవు జీవించగలుగుచున్నావా? లేకుంటే, మొట్ట మొదట నిన్ను నీవు సరిచేసుకో. తర్వాత పాపములో కొనసాగుతున్న నీ బిడ్డల జీవితాలను సరిచెయ్యి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ జీవితం ధన్యమవుతుంది. లేకపోతే, న్యాయాధిపతియైన దేవుడు, నీకు అప్పగించిన భాద్యత విషయంలో నిన్ను తూస్తే? నీవు తేలిపోతావ్. అది అత్యంత భయంకరం. వద్దు! సరిచేసుకుందాం! ప్రభువులో ముందుకు సాగిపోదాం! అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
Note: హృదయానుసారుడైన దావీదే పాపం చేసినప్పుడు నేనంత? అని నీకు నీవే సర్ది చెప్పేసుకోవద్దు. ఆయన పాపం చేశారు. ఆ శిక్షను అనుభవించారు. పశ్చాత్తాపపడ్డారు. క్షమించబడ్డారు. సంవత్సరాల తరబడి అదే రొంపిలో కూరుకుపోయి, దావీదు గారితో పోల్చుకొని నిన్ను నీవే మోసం చేసుకోవద్దు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి