అంశం) క్రిస్మస్ గానము
⭕⭕⭕⭕⭕⭕⭕
నేడు ప్రజలు పాటలకు విశేష ప్రాముఖ్యతనిస్తున్నారు. సంఘమందు సహితం
ఆరాధనలో సంగీతానికి ప్రాముఖ్యత పెరిగింది. యవ్వనస్తులు అనేక మంది పాటల పరిచర్య చేయడమే కాక స్వయంగా దేవుడు తమకిచ్చిన తలాంతులను బట్టి పాటలు వ్రాసి బాణీలు సమకూర్చుచున్నారు. దేవుని ఆరాధనలో సంఘమును నడిపించాలన్న వారి కృషి అభినంద నీయమే. అయితే అనేక మంది పాత ఆంధ్ర క్రైస్తవ సాహిత్యానికి అలవాటు పడిన వారు నేటి పాటలను బట్టి పెదవి విరవడం అగుపడును. సాహిత్యాన్ని మరియు సంగీతాన్ని ప్రక్కన పెడితే నేడు పాటలలో ఆరాధన ఆత్మీయత తగ్గిపోయిందనేది అందరిని ఏక రీతిగా బాధించే అంశం. ఇది క్రిస్మస్ సమయంలో మరింత బాధిస్తుంది. కటిన శిలలుగా మారిన దైవ వ్యతిరేక హృదయాలను కదిలించే పాటలు నేడు మనకు కావాలంటే, ఆనాటి మొదటి క్రిస్మస్ ఆరాధనా ఆలాపనలను మనము ఆలకించ వలసినదే.
1. పరిశుద్ధాత్మలో గానము, ఎలీసబెతు (లూకా 1:41-45) :-
యాజక కుటుంబము మరియు బహు వృద్ధులైన జెకర్యా మరియు ఎలీసబెతు దంపతులను దేవుడు దర్శించి, అతని ప్రార్ధన దేవునికి వినబడినది కాబట్టి అతనికో కుమారుడు కలుగునని అతని పేరు యోహాను అని ప్రభువు దూత అతనికి తెలుపుట, అద్భుతమైన క్రీస్తు జన్మకు మరొక రుజువును ఇచ్చుటకే, వారు దేవుని స్తుతి గానము చేయుటకు ఇంత కన్నా గొప్ప సందర్భమేముంది? అయితే అవిశ్వాసము ఇబ్బందికర వాతావరణముకు కారణమాయెను. అయితే దేవుని స్తుతింప అంతకు మించిన మరొక గొప్ప సందర్భము ఎలీసబెతుకు దొరికెను. అది మరియ తన ఇంటనే తనను కలిసికొనుట. ఇది ఆమెకు భాగ్యము వెంట భాగ్యము దొరుకుటయే. మరియ వందన వచనములకు ఎలీసబెతు గర్భములోని శిశువు గంతులు వేసెను. ఆమె పరిశుద్ధాత్మతో నిండు కొనినదై బిగ్గరగా తన శుభ వచనములను గానము చేసెను. ప్రభువు ఆమెకు తెలియ జేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను (లూకా 1:45), ఎలీసబెతు స్తుతి గానమందు పరిశుద్ధాత్ముని యందు ఆనందము అంతరంగ మందు ఆదరణ, ఆనందము, దేవునికైన స్తుతి తోటి దేవుని బిడ్డలకు దీవెన వచనములు, అన్యజనులకైన సువర్తమానము కలవు.
2. మహిమ గానము-మరియ (లూకా 1:46-55) :-
ఎలీసబెతును చూచుటతో ఆమె మాటలచే ఆదరింప బడుటతో మరియ హృదయములోని సంశయములు సందేహములు యెరిగిపోయెను. నిండిన హృదయముతో మరియ దేవుని ఘన
పరచమొదలు పెట్టెను. నా ప్రాణము ప్రభువును ఘన పరచుచున్నది అనునది ఆమె గాన ఆరంభము. మరియ తన గాన మందు తన దీన స్థితిని అంగీకరించుటలో సిగ్గు పడలేదు మరియు దేవుని యందలి ఆనందమును గూర్చి దాచి పెట్టలేదు గాన ఆమెది ఆనంద గానము (లూక 1:47, 48). సర్వ శక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. అది సాక్ష్యపు గానము. ఆమె దేవుడు తన కొరకు చేసిన కార్యములను బట్టియే కాక దేవుడు అక్కరలోని వారి కొరకు మరియు ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ధ్యానించుచు దేవుని ఘనపరచెను (వ 53, 53). దేవుని బట్టి సంతోషించు వ్యక్తి దేవుని ఘనపరచును మరి మన గాన పరిచర్య దేవుని శక్తిని గూర్చిన మహిమ గానమేనా? మనకొరకు దేవుడు చేసిన కార్యములు బట్టి సాక్ష్యపు గానమేనా? తను కాస్త కాస్త పడినను తన ద్వారా అనేకులకు రక్షణ తెచ్చుటకు దేవుడు సంకల్పించుటకు ఆమె సమ్మతమే ఆమె స్తుతిగానము యొక్క గొప్పతనము. ఇతరులకు ఆశీర్వాదముగా నుండునట్లు మన జీవితములో కష్టమును మనము ఓర్చుకొనగలగుదుమా? అప్పుడు కూడా దేవుని ఘన పరచ గలమా?
3. పరవశపు గానము-సుమెయోను (లూకా 2:29-32) :-
ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందనని ఎరిగి, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుచున్న సుమయోను ఆత్మవశుడై దేవాలయమునకు వచ్చి శిశువైన యేసును చేతులలో ఎత్తుకొని నాథా,.... నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను నీ కన్నులారా చూచితినియనుచు దేవుని పరవశముతో గానము చేసెను. దేవుని కొరకు ఎదురు చూచుటలోని పరవశము, దేవుని దర్శించుటలోని పరవశము మరియు దేవుని రక్షణ గూర్చి ఎరుగుటలోని పరవశము అతను దేవుని మహి పరచుటకు కారణమాయెను. దేవుని రక్షణ గూర్చిన మరియు నిరీక్షణ గూర్చిన గానము మనలను పరవసింపచేస్తోందా? లేక భారముగా భావింపచేస్తోందా?
4. స్తోత్రగానము-దేవదూతలు (లూకా 2:14) :-
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. సర్వ సృష్టిని తన నోటి మాటచే సృష్టించిన సర్వ శక్తిమంతుడు నోరులేని పసివానిగా, పొత్తి గుడ్డలలో మరియు పసుల తొట్టిలో పరుండుట చూచిన పరలోక సైన్యము ఆ మొదటి క్రిస్మస్ దినమందు దేవునికి స్తోత్ర గానము చేసెను. దేవునికి ఘనత, మహిమ మరియు పరిశుదత గూర్చి మాత్రమే గానము ఆలపించే దూతలు ఇక్కడ సరిక్రొత్తగా మనుష్యులకు దొరికిన సమాధానమును గూర్చి గానము చేసెను. మరి నీకు ప్రభువు రక్షకునిగా ఇవ్వజూపిన సమాధానపు గొప్పతనము నీవు ఎరిగి యున్నావా? నేడే అడుగు ఆయనే నీకు దానిని ఇవ్వగలవాడు.
ప్రియ విశ్వాసి, నీ గాన పరిచర్య అభినందించ వలసినదే, కాని అది వోగొప్ప దైవ కార్యముగా చూడుము. అది అనేకులకు ఆశీర్వాదముగా వుండవలెను గాని ఆటంకముగా నుండరాదు. ఒక గొప్ప నిజ క్రిస్మస్ సందేశము నీ గానము ద్వారా, ఆ గాన మాలపించు నీ ద్వారా ప్రజలు కనుగొనవలెను. అప్పుడు నిజ ఆనందం, ఆరాధన నిన్ను నింపును. ఆశీర్వాదం నీకును మరియు ఇతరులకు సహితం ప్రవహించును. దేవుని ఆశీర్వాదములు ఈ క్రిస్మస్ దినములందు నీవు పొందుకొందువు గాక, ఆమేన్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి