క్రూరమృగము:పార్ట్.1
🎯🎯🎯🎯🎯🎯🎯
మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దాని నోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.
ప్రకటన 13:1,2
*ఎవరీ క్రూరమృగము?*
అంత్య క్రీస్తు
*అంత్య క్రీస్తుకు గల పేర్లు:*
⭕⭕⭕⭕⭕⭕⭕⭕
* క్రీస్తు విరోధి (1యోహాను 2:18)
* బాబేలు రాజు (యెషయా 14:4)
* తేజో నక్షత్రము, వేకువ చుక్క (యెషయా 14:12)
* చిన్న కొమ్ము ( దానియేలు 7:8,9)
* నాశన పాత్రుడు ( 2థెస్స 2:3)
* మృగము( ప్రకటన 13:1)
* క్రూర ముఖముగల రాజు (దానియేలు 8:23)
* నాశన పుత్రుడు (2థెస్స 2:2,8)
* ఇష్టానుసారంగా ప్రవర్తించు రాజు (దానియేలు 11:36)
క్రూర మృగమును గూర్చిన సంపూర్ణ అవగాహన కొరకు దానియేలు గ్రంథములోని, నెబుకద్నెజరు మరియు దానియేలుకు కలిగిన దర్శనములను తప్పక ధ్యానించాలి.
రాజైన నెబుకద్నెజరు తన రాజ్యములోని జ్ఞానులందరిని పిలిపించి, నేను ఒక కల కని, మరచిపోయాను. ఆ కల, దాని భావం చెప్పాలి. లేకపోతే, బబులోను రాజ్యంలోనున్న జ్ఞానులందరు తుత్తునీయులుగా చేయబడతారనే కఠినమైన ఆజ్ఞ జారీ చేసాడు. అట్లాంటి పరిస్థితుల్లో, దానియేలు తన ముగ్గురు స్నేహితులతో కలసి ప్రార్ధించి, దేవుని ద్వారా ఆ కలను, దాని భావాన్ని తెలుసుకోగలుగుతాడు.
*రాజు కనిన కలను, దాని భావమును తెలియజేసిన దానియేలు.అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరు నకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనో చింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవుదానిని తమరికి తెలియజేసెను.
ఇతర మనుష్యులకందరికంటె నాకు విశేష జ్ఞానముండుటవలన ఈ మర్మము నాకు బయలుపరచ బడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమకన బడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను. ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయ మైనదియు,దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను. మరియు చేతిసహా యము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కన బడెను. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.
దానియేలు 2:28-35
*కల భావము:*
🌠🌠🌠🌠🌠🌠
రాజా, పరలోక మందున్న దేవుడు రాజ్య మును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్ర హించి యున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మను ష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్ని టిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించి యున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరు వాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును. పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైనవాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును. పాద ములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపది గానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్య ములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును. పాదముల వ్రేళ్లు కొంతమట్టు నకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాల ములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.
దానియేలు 2:37-44
ప్రతిమలో గలిగిన నాలుగు భాగములు, నాలుగు రాజ్యములు లేదా రాజులు. ( ప్రాచీనకాలంలో రాజ్యము, రాజు ఒకే అర్ధముతో వాడబడేవి)
ప్రతిమ:
*శిరస్సు*
బంగారము
*బబులోను సామ్రాజ్యము*
*రొమ్ము, భుజములు*
వెండి
*మాదీయ, పారసీక సామ్రాజ్యము*
*ఉదరము, తొడలు*
ఇత్తడి
*గ్రీకు సామ్రాజ్యము*
*మోకాళ్ళు*
ఇనుము
*రోమా సామ్రాజ్యము*
*పాదములు*
ఇనుము, మట్టి
*పదిమంది రాజులు*
*చేతి సహాయంలేక తీయబడిన రాయి:*
“ప్రభువైన యేసు క్రీస్తు.” అన్య రాజ్యములన్నీ నశించిపోతాయి. ప్రభు యేసు క్రీస్తు రాజ్యమే శాశ్వతంగా నిలుస్తుంది.
ఈ దర్శనాన్ని దేవుడు, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే రాజైన నెబుకద్నెజరుకు తెలియజేశాడు. ఆయన తెలియజేసినట్లుగానే, ప్రపంచ చరిత్ర గమనాన్ని చూడవచ్చు. మనము ధ్యానము చేయబోయే *క్రూర మృగము* రోమా రాజ్యమునుండియే రాబోతుంది.
ఇక ఆదినము మరెంతో దూరంలో లేదు. పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడిన ప్రవచనాలు 70 శాతానికిపైగా నెరవేరిపోయాయి. ఇక జరుగ వలసినవి త్వరితముగా జరుగుతున్నాయి.
ఎవరీ క్రూరమృగము?*
అంత్య క్రీస్తు
Note:
⭕⭕⭕⭕⭕
అంత్య క్రీస్తు అనగా? యుగాంతంలో “నేనే క్రీస్తునని చెప్పుకొనే వారిలో చివరివాడు” అని అర్ధం. బైబిల్ లో ఈ పదము లేదు కదా! అని ప్రశ్నించాలని మీరు అనుకుంటే? అట్లా పిలవడం మీకు ఇబ్బంది అనిపిస్తే, వానికి అనేకమైన పేర్లు పరిశుద్ధ గ్రంధములో ఇవ్వబడ్డాయి. వాటిలో మీకు నచ్చినట్లుగా పిలవొచ్చు. సమస్యేమిలేదు. వాని పేరు కంటే, వాని వ్యక్తిత్వం, మూర్తిమత్వం మనకు అత్యంత ప్రాధాన్యం.
అంత్య క్రీస్తును గూర్చిన సంపూర్ణ అవగాహన కోసం, నెబుకద్నెజరు కనిన కలతోపాటు, దానియేలు గారికి కలిగిన దర్శనం కూడా ధ్యానించడం అత్యంత ప్రాముఖ్యం.
నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పై కెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను. మొదటిది సింహ మును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టు కొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. కొందరులెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులినిపోలిన మరియొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్య మియ్య బడెను. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయం కరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.
దానియేలు 7:3-7
దానియేలు గారు చూచిన నాలుగు జంతువులు దేనికి సాదృశ్యం?
ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.
దానియేలు 7:17
( ప్రాచీనకాలంలో రాజ్యము, రాజు ఒకే అర్ధముతో వాడబడేవి)
ఈ నాలుగు జంతువులు ఎక్కడనుండి వస్తున్నాయి?
* సముద్రములోనుండి.
ప్రకటన 7:3
సముద్రము అంటే?
భక్తిహీనుల సమూహం
భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.
యెషయా 57:20
మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెనుఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జన ములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.
ప్రకటన 17:15
అంటే? ఈ నాలుగు రాజ్యాలు భక్తిహీనుల సమూహంలోనుండి పుట్టుకొస్తున్నాయి. ఇవి అన్య రాజ్యాలు.
రాజైన నెబుకద్నెజరు తాను కనిన కలలో చూచిన ప్రతిమ యొక్క వివరణ, దానియేలుగారు చూచిన దర్శనములోని నాలుగు జంతువులకు సరిగ్గా సరిపోతుంది.
🎯1. మొదటి జంతువు
(బబులోను సామ్రాజ్యానికి సూచన)
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.
దానియేలు 7:4
సింహాన్ని పోలివుంది. కానీ, జంతువు కాదు. రెక్కలున్నాయి. కానీ, పక్షి కాదు. మనిషివలె నిలబడింది, మానవ మనస్సుంది. కానీ మనిషికాదు. ఇదే బబులోను సామ్రాజ్య పరిస్థితి.
* ప్రాచీన బబులోను జాతీయ చిహ్నము “ రెక్కలుగలిగిన సింహము గా ఉండేది.
* మరింత ఆసక్తికరమైన విషయమేమిటంటే? బబులోనును పరిపాలించిన కల్దీయుల రాజైన నెబుకద్నెజరు సింహముగాను, పక్షిరాజుగాను పరిశుద్ధగ్రంధములో చెప్పబడుట గమనార్హము.
ఇశ్రాయేలువారు చెదిరిపోయిన గొఱ్ఱలు సింహములు వారిని తొలగగొట్టెను మొదట అష్షూరురాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన యీ నెబుకద్రెజరు వారి యెముకలను నలుగగొట్టుచున్నాడు.
యిర్మియా 50:17
నానావిధములగు విచిత్ర వర్ణములు గల రెక్కలును ఈకెలును పొడుగైన పెద్ద రెక్కలునుగల యొక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి యొక దేవదారు వృక్షపు పైకొమ్మను పట్టుకొనెను....తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుముఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండు టకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.
యెహెఙ్కేలు 17:3,12
బబులోను రాజైన నెబుకద్నెజరు, సింహము వంటి బలము, ధైర్యముతో, పక్షి వంటి వేగముతో ఇతర రాజ్యాలను జయిస్తూ పోతున్న సమయంలో, దాని రెక్కలు తీసివేయబడ్డాయి. రాజ్యములపై దండెత్తడం మాని, నెమ్మది కలిగి, భూమి మీద కాలుమోపింది. మానవ మనస్సు వంటి మనసు దానికివ్వబడడం ద్వారా ప్రజలను మానవతా దృక్పధంతో పరిపాలన చెయ్యడం జరిగెను.
🎯2. రెండవ జంతువు:
(మాదీయ, పారసీక సామ్రాజ్యము)
🌀🌀🌀🌀🌀🌀🌀🌀
రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. కొందరులెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి.
దానియేలు 7:5
ఎలుగుబంటి పరిమాణంలో సింహముకంటె పెద్దదిగాను, వేగంలో సింహము కంటే తక్కువగాను ఉంటుంది. అట్లానే ఈ రాజ్యాలు, బబులోను కంటే, విస్తీర్ణంలో పెద్దవిగాను, వేగములో తక్కువగాను ఉంటాయి.
అది ఒక పార్శ్వముమీద పండుకున్నది. అంటే, ఈ రెండు రాజ్యాలు కలసివున్నప్పటికీ, వాటి ఆధిపత్యం కోసం పోరాటం కొనసాగేది. పార్శ్వము మీద పండుకున్నది అంటే, ఏ క్షణంలోనైనా ఎటువైపు అయినా తిరగవచ్చు.
తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. ఆ మూడు ప్రక్కటెముకలు తర్వాత దినాల్లో అవి జయించిన, లిబియా, ఐగుప్తు, బబులోను రాజ్యాలను సూచించవచ్చు.
కొందరులెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. మాదీయ పారశీక రాజ్యాలు, విపరీతమైన రాజ్య కాంక్షను కలిగియుండడం వలన, లేచి, రాజ్యాలను జయించు అంటూ వాటిని పురిగొల్పుతున్నారు.
ఈ దర్శనాన్ని దేవుడు, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే దానియేలు గారికి తెలియజేసారు. ఆయన తెలియజేసినట్లుగానే, ప్రపంచ చరిత్ర గమనాన్ని చూడవచ్చు.
మొదటి జంతువు బబులోను సామ్రాజ్యానికి, రెండవ జంతువు మాదీయ, పారశీక సామ్రాజ్యాలకు సాదృశ్యముగా వుందని అర్ధము చేసుకోగలిగాము.
🎯3. *మూడవ జంతువు:*
( గ్రీకు సామ్రాజ్యము)
🌀🌀🌀🌀🌀🌀🌀🌀
అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరియొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్య మియ్య బడెను.
దానియేలు 7:6
చిరుతపులి బలమైనది, వేగంగా పరుగెత్తగలిగేది. దాని వీపున పక్షిరాజు వంటి నాలుగు రెక్కలున్నాయి. పక్షి రెండు రెక్కలతోనే అత్యంత వేగంగా దూసుకుపోగలదు. అయితే, దీనికి నాలుగు రెక్కలున్నాయంటే, ఇక సుడిగాలి వేగముతో దూసుకుపోగలదు.
ఈ వర్ణన ప్రపంచాన్ని జయించిన, గ్రీకు వీరుడైన “అలెగ్జాండర్ ది గ్రేట్” కు చక్కగా సరిపోతుంది. కేవలం ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో సుడిగాలి వేగముతో, గ్రీసు మొదలుకొని, భారత దేశం వరకు అంటే, సుమారు పదకొండువేల మైళ్ళ విస్తీర్ణం గలిగిన భూభాగాన్ని జయించగలిగాడు. యుద్దరచన చేయడంలో ఆయనకు సాటిలేరెవ్వరు.
ఆ చిరుతపులికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్య మియ్యబడెను. అనగా? అలెగ్జాన్డర్ తన ముప్పదిరెండవ ఏటను
క్రీ. పూ. 323 జూన్ 13 న మరణించగా, అతని మరణానంతరము అతని సామ్రాజ్యమును అతని యొక్క నలుగురు సైన్యాధిపతులు పంచుకున్నారు. అందువలన ఆ చిరుతపులి యొక్క నాలుగు తలలు అలెగ్జాన్డరు యొక్క నలుగురు సైన్యాధిపతులకు సూచనగా దర్శనములో చూపబడినది.
🎯4. *నాలుగవ జంతువు:*
(రోమా సామ్రాజ్యము)
🌀🌀🌀🌀🌀🌀🌀🌀
నేను చూచుచుండగా, ఘోరమును భయం కరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.
దానియేలు 7:7
మొదటి జంతువు సింహము, రెండవది ఎలుగుబంటి, మూడవది చిరుతపులి. కానీ, నాలుగవ జంతువును పోల్చడానికి ఈ భూమి మీద ఏ జంతువూ సరిపోలేదు. అంటే, అది అంతటి భయంకరమైనది.
*అది ఎట్లాంటిదంటే?*
* ఘోరమైనది
* భయంకరమైనది
* యితర జంతువులకు భిన్నమైనది
* మహాబలము గలది
* మహాత్త్యములు గలది
* పెద్ద ఇనుప దంతములున్నాయి.
* పది కొమ్ములున్నాయి
* అది విధ్వంసం సృష్టించేది.
ఇదే మనము ధ్యానము చేస్తున్న “క్రూర మృగము”. ఈ క్రూర మృగము రోమా సామ్రాజ్యంలోనుండే రాబోతుంది. ఆ క్రూరమృగమే “అంత్య క్రీస్తు లేదా క్రీస్తు విరోధి.”
ఇప్పుడు మీకో సందేహం రావొచ్చు! గ్రీకు సామ్రాజ్యం గతించిపోయింది కదా? ఆ సామ్రాజ్యంలోనుండి క్రూరమృగము (అంత్య క్రీస్తు) ఎట్లా వస్తుంది?
*నెబుకద్నెజరు కనిన కలలోని ప్రతిమ*:
శిరస్సు - బంగారం
బబులోను
రొమ్ము, భుజాలు - వెండి
మాదీయ, పారశీక
ఉదరము, తొడలు- ఇత్తడి.
గ్రీకు
కానీ,
కాళ్ళు మాత్రం?
మోకాళ్ళ వరకు - సంపూర్ణముగా ఇనుము.
పాదములు - ఇనుము, మట్టి
రోమా సామ్రాజ్యం.
ఇక్కడ మనము ఆలోచన చేయగలిగినట్లయితే? రోమా సామ్రాజ్యాన్ని సూచించే ప్రతిమ భాగంలో రెండు పదార్ధాలున్నాయి. (ఇనుము, మట్టి)
అంటే? ఈ సామ్రాజ్యము రెండు సార్లు రాజ్యాధికారాన్ని కలిగివుంటుందని గ్రహించగలము. ప్రతిమలోని మోకాళ్ళు పూర్తిగా ఇనుము. అంటే, అది గతించిన కాలంలో ఒకసారి ఏకఛత్రాధిపత్యంతో ఏలుబడి చేసింది. ఇప్పుడు యుగాంతములో, పాదములకున్న పది వ్రేళ్ళు, పదిమంది రాజులను సూచిస్తోండగా, పదిమంది రాజుల కూటమితో, తిరిగి రోమా సామ్రాజ్యం భూలోకాన్ని పరిపాలించబోతుంది. దానిలోనుండే క్రూరమృగము పుట్టుకొస్తుంది.
*ప్రియా నేస్తమా!*
ప్రపంచ చరిత్ర కళ్లకుకట్టినట్లు మనముందుండగా, ప్రభురాకడను గూర్చి నీకింకా సంశయమా?
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ సమీపమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి