*"యేసుప్రభువు" గారికి చోటు దొరకని ""సత్రము"" యొక్క పూర్వపు చరిత్ర...*
*న్యాయాధిపతుల కాలంలో ఒకసారి కరువు వచ్చింది. దానికి తట్టుకోలేక అన్న వరము అని పేరుగాంచిన బేత్లెహేము నుండి ఎలీమెలెకు తన భార్య అయిన నయోమిని, తన ఇద్దరు కుమారులు మహోను, కిల్యోగులను తీసికొని మోయాబుదేశానికి వలసపోయాడు.*
అక్కడే ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు ఇద్దరు కుమారులు మోయాబు స్త్రీలను పెండ్లి
చేసికొన్నారు. మోయాబీయులు లోతు సంతతివారని, ఈజిప్టు, కనాను దేశస్థులు నోవాహం చిన్న కుమారుడైన హాము సంతతివారని, ఇశ్రాయేలీయులు షేము సంతతివారని గుర్తుంచుకోవాలి.
*ఇంచుమించు పది సంవత్సరాలైన తరువాత ఎలీమెలెకు ఇద్దరు కుమారులు చనిపోయారు.* నయోమి, తన ఇద్దరు కోడళ్ళు విధవరాళ్ళు అయ్యారు. యూదాదేశంలో
తన ప్రజల్ని దేవుడు దర్శించాడని అక్కడ పంటలు బాగా పండుతున్నాయని నయోమి విన్నది. తాను మోయాబునుండి తన స్వగ్రామమైన బేత్లెహేము వెళ్ళాలని కోడళ్ళతో చెప్పి, వారిని తమదేశంలోనే తమ తల్లిదండ్రుల దగ్గర ఉండమని సలహా ఇచ్చింది.
*పెద్దకోడలు ఓర్పా ఒప్పుకొని అక్కడే ఉండిపోయింది తమ దేవుళ్ళ యొద్దకు మరలి చిన్నకోడలు రూతు “నీవు వెళ్ళే చోటుకి నేను వస్తాను, నీవు ఎక్కడ వుంటే నేను అక్కడ వుంటాను. నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను. నీవు ఎక్కడ పాతిపెట్టబడితే నేను అక్కడ పాతిపెట్టబడతాను.*
నీ జనమే నా జనం. నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మన ఇద్దరిని ఏమి వేరు చేయకుండు గాక!" అని చెప్పి అత్తతోకూడా బేత్లెహేము వచ్చింది. అప్పటికే తాను ఇశ్రాయేలీయుల దేవునిపై విశ్వాసముంచి ఆయనను తన హృదయంలో చేర్చుకొన్నది.
*అత్త సూచన మేరకు బోయజును పెండ్లి చేసుకొంది. ఎవరు ఈ బోయజు? ఇశ్రాయేలు సర్వశక్తిగల దేవునియందు విశ్వాసముంచి, ఆయనను ఆశ్రయించి, తన ప్రాణానికి తెగించి యెరికో కోట గోడపై ఇశ్రాయేలు గూఢచారుల్ని రక్షించి, తనను, తన ఇంటివారిని రక్షించుకొన్న కనాను వేశ్య రహాబుకి, ఆమెను పెండ్లి చేసికొన్న యూదా గోత్రానికి పెద్దయైన నయస్సోను కుమారుడైన శల్మానుద్వారా పుట్టిన కుమార రత్నమే బోయజు.*
తన్ను ఆశ్రయించే అనాధలను
అక్కున చేర్చుకొని ఆదరించే కరుణామయుడు. బోయజు బేళ్లేహేంలో పెద్ద రైతు.
బోయజు రూతుకన్న వయస్సులో పెద్దవాడుగా కనిపిస్తున్నాడు. కాకుంటే అతను సుమారు
పాతికేళ్ళ వయస్సులో నున్న రూతును "నా కుమారీ!” అని మూడుసార్లు సంబోధించాడు.
*“ఈ చిన్నది ఎవరు?” అని అడిగాడు. రూతుకి పదిహేనళ్ళకే పెండ్లి అయినా, దాదాపు పది సంవత్సరాలు భర్తతో కాపురంచేసింది. కాని దేవుడామె గర్భాన్ని మూసి ఉంచాడు.*
బోయజు ధనవంతుడు ధనానికి తోడు మంచి గుణంగలవాడు. భక్తిగలవాడు. అతను రూతు గుణానికే ప్రాధాన్యమిచ్చాడు గాని, పైరూపుకు మాత్రం ప్రాధాన్యమియ్యలేదు. (1 సము 16:7)
*తాను ధనవంతుడైయుండి, తన చేలో పరిగే ఏరుతున్న బీద విధవరాల్ని, నయోమి కోడల్ని, అందునామోయాబుదేశానికి చెందిన స్త్రీని పెండ్లి చేసికొనడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు కనాను దేశానికి చెందిన రహాబుకి, యూదా దేశానికి చెందిన నయోమికి రూతు కోడలయింది.*
బోయజు తన ఇంటి ప్రక్కన రాతిబండలో తొలిపించుకొన్న గుహలో కాపురం పెట్టారు. యూదుల సాంప్రదాయం చెప్పేదాన్నిబట్టి ఇరువురు లోక రక్షకుడైన క్రీస్తు పుట్టడానికి సుమారు పదకొండు వందల సంవత్సరాలకి ముందే ఆయనకు ఆహ్వానం పంపారు. ఆహ్వానం అందింది.
*మెల్లగ అదే గుహకి వచ్చాడు బాలయేసు. మెస్సీయ, ఆ గుహపొడవు 39 అడుగులు. వెడల్పు 11 అడుగులు లోతు లేక ఎత్తు 9 అడుగులు. ఆ గుహలోనే రూతు బోయజుద్వారా ఓబేదును కన్నది. ఓబేదు పెద్దవాడై పెండ్లి చేసికొని ఆ గుహలోనే యెష్షయికి తండ్రి అయ్యారు.*
ఆ గుహలోనే యెషయి తొమ్మిదిమంది పిల్లలు ఆడుకొన్నారు. ఆ గుహలోనే యెష్షయి చిన్న కుమారుడు దావీదు తన బాల్యంలో సమూయేలుచేత యూదాదేశం మీద రాజుగాఅభిషేకించబడ్డాడు.
*రాజైన తరువాత దావీదు తన మకాంను హెబ్రోనుకు, తరువాత సీయోను కోటకి మార్చాడు. ఆ గుహను దావీదు తన స్వాధీనంలోనే వుంచుకొన్నాడు.*
రాజైన దావీదు తన కుమారుడైన అబాలోము తనపై తిరుగుబాటు చేసి తనను చంప ప్రయత్నించినప్పుడు దావీదు తన పదిమంది ఉపపత్నులను యెరూషలేంలోని ఇంటి దగ్గర వుంచి, తన ఇంటివారందరిని వెంటబెట్టుకొని, రాజనగరును విడిచి, యొర్దాను నదిని
దాటివెళ్ళి, మహానయీములో దాగుకొన్నాడు.
*అప్పుడు గిలాదీయుడైన బర్ధిల్లయి ఎనభై సంవత్సరాల వయస్సులో వుండి తన స్వగ్రామమైన రొగెలీమునుండి వచ్చి, తన అధిక ఐశ్వర్యం చొప్పున తన కుమారులచేత భోజన పదార్థాలను తెప్పించి రాజుకు మహనయీములో సేవచేసాడు.*
అబ్షాలోము చనిపోయాడు. దావీదురాజు తిరిగి యెరూషలేం వెళ్ళుతూ, బర్ధిల్లయిని తనతోపాటు యొర్దాను నదిని దాటి యెరూషలేం రమ్మని ఆహ్వానించాడు.
*అతడు వస్తే దావీదు రాజు అతనిని తన బల్లయొద్ద కూర్చుండబెట్టుకొని అతనిని పోషిస్తానని చెప్పాడు.*
అప్పుడు బర్ధిల్లయి, రాజుతో ఈలా అన్నాడు. “రాజా! మీతో కూడా యెరూషలేం రావడానికి నేనింకా ఎంతకాలం బ్రతుకబోతున్నాను. నేటికి నాకు ఎనుబదియేండ్లు.
*సుఖ దుఃఖాల భేదాన్ని నేను గుర్తించగలనా? అన్నపానాల రుచి తెలిసికోగలనా?*
గాయకుల, గాయకరాండ్ర స్వరం నాకు వినబడుతుందా? మీ దాసుడనైన నేను రాజువగు మీకు ఎందుకు భారంగా వుండాలి? నేను నా గ్రామానికి వెళ్ళి, మరణమై, నా తల్లిదండ్రుల సమాధిలో పెట్టబడడానికి నాకు సెలవియ్యండి.
*'రాజా! మీ చిత్తమైతే మీకు = సేవచేసిన నా కుమారుడు కింహాను తమరు వెంట దీసికొని పోయి, మీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయండి”*
అని మనవి చేసాడు.
అందుకు రాజు సంతోషించి బర్ధిల్లయిని ముద్దు పెట్టుకొని, దీవించి, కింహాంను తన వెంట యెరూషలేం తీసికొనివచ్చాడు (2 సమూ 19:31-40)
*రాజైన దావీదు తాను జీవించిన కాలమంతా కింహాంను తన బల్లయొద్ద కూర్చుండబెట్టుకొని, భోజనం పెట్టి సత్కరించి, బెత్లహేంలో తన స్వాస్థ్యమైన గుహను బహుమానంగా ఇచ్చాడు*.
అంతటితో ఆగక, తన తరువాత రాజైన తన కుమారుడు సొలొమోనుకు కూడా బర్ధిల్లయి. అతనికుమారులు చేసిన మేలునుగూర్చి చెప్పి, బర్ధిల్లయి కుమారుని తన భోజనపు బల్లయొద్ద కూర్చుండబెట్టుకొని గౌరవించమని చెప్పాడు. ఆ విధంగానే సొలొమోను చేసాడు
(1 రాజులు2:7).
*అయితే గిలాదీయుడైన బర్ధిల్లయి చనిపోయాడు. అతడు అధిక ఐశ్వర్యం గలవాడు గాన బల్లయి కుమారుడైన కింహాం తనకు బహుమానంగా ఇవ్వబడిన బేత్లెహేములోని గుహను బాటసారులకు సత్రంగా వదలి తన స్వగ్రామానికి వెళ్ళిపోయాడు.*
ఆ గుహ అప్పటినుండి "కింహాం సత్రము” లేక కింహాం వసతి గృహము (Habitation of chimham) “గెరూత్ కింహాం” అని పిలువబడింది. తరువాత దావీదు వంశానికి చెందిన వారెవ్వరూ దానిని తమ స్వాస్థ్యంగా భావించి తీసికొనలేదు.
*నెబుకద్నెజరు క్రీ.పూ. 586వ సం||లో చివరిసారిగా యెరూషలేంను దేవాలయాన్ని నాశనం చేసి, యూదాదేశంపై గెడల్యాను తన ప్రతినిధిగా నియమించి పోగా, ఆ గెదల్యాను హత్యచేసి ఈజిప్టు దేశానికి పారిపోయే హంతకులు ఆ రాత్రి బెళ్లేహేంలో రహదారిపైనున్న గెరూత్ కింహాంలోనే విశ్రాంతి తీసికొనిపోయారు.*
(యిర్మీయా 41:18)
ఈ గుహ మనుష్యులు పండుకోడానికే సరిపోతుంది కాని ఒంటెల్ని కట్టివేయడానికి దాని ఎత్తు సరిపోదు. ఆ దినాల్లో సుదూర ప్రయాణం చేసే బాటసార్లు,
బిడారి వర్తకులు, తమ ప్రయాణంలో మధ్యమధ్య ఆగి, పూటకూళ్ల ఇంటిలో భోజనంచేసి, దాని యజమాని చూపించే వసతి గృహంలో విశ్రాంతి తీసికొనిపోయేవారు.
*వారెక్కివచ్చిన జంతువులను వసతిగృహం వెలుపలే కట్టివేసికొని మేపుకునేవారు. ఎందరెందరో బాటసార్లుకు నీడనిచ్చి సేదదీర్చింది ఆ గుహ.*
*దాని అసలు యజమాని దావీదు కుమారుడైన ""యేసుక్రీస్తు"" వారు వచ్చేటప్పటికి అందులో ఖాళీలేకుండాపోయింది.* ముందుగా వచ్చిన వారితో ఆ గుహ నిండిపోయింది.
*అందులోనే వెలుపలి భాగాన కన్య మరియమ్మ మెస్సీయ్యను ప్రసవించింది. శిశువును పండుకోబెట్టడానికి స్థలంలేక పశువులకు మేతవేసే తొట్టిలో, పొత్తిగుడ్డలతో చుట్టి పండుకోబెట్టింది.*
ఈ సమాచారము::
*కుంచకర్ర శ్యామ సుందరరావు గారు వ్రాసిన ""బైబిలు చారిత్రక వాస్తవాలు మొదటిభాగం"" అను పుస్తకము లోనిది*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి