*బైబిలులోని ""అబీషై"" గారి క్లుప్త చరిత్ర...*
"అబీషై" అనగా దానమునకు తండ్రి అని అర్థము..
*"అబీషై" గారు దావీదు గారి అక్కైన సెరూయా గారి రెండవ కుమారుడు*
అనగా దావీదు గారికి సొంత మేనల్లుడు.
(2సమూ 2:18)
*"అబీషై" గారి జీవితం నేటి ప్రతి యవ్వన క్రైస్తవులు తప్పకుండా తెలుసుకోవాలి...*
అబీషై ఈ పేరు మనకు బైబిలు లో ఎక్కడ కనిపించినా అక్కడ ఘోర భయంకరమైన యుద్ధం జరుగుతుంటుంది....
*1.దావీదు గారిని సౌలు గారు చంపడానికి తరుముతున్నప్పుడు దావీదు గారు అనేక చోట్లకు పారిపోతూ ఉండేవారు.*
దావీదు గారితో పాటు కొంతమంది కూడా ఉండేవారు వారిలో ఒకరు ఈ అబీషై గారు.
*ఒకరోజు దావీదు గారిని చంపడానికి తరుముతూ సౌలు గారు వచ్చి ఒక పాళెములో పడుకుంటాడు.*
సౌలు గారి చుట్టూ మూడు వేల మంది సైనికులు, ఆ సైన్యానికి నాయకుడైన అబ్నేరు గారు ఉంటారు.
*ఆ విషయం తెలుసుకున్న దావీదు గారు తనతో ఉన్న వారితో నాతో సౌలు గారు ఉన్న పాళెములోకి ఎవరు వస్తారు అని అడుగుతారు.*
అప్పుడు ఈ అబీషై గారు నీతోకూడా నేనే వత్తును అని చెప్పి దావీదు గారితో వెళతాడు.
*పాళెములోకి వెళ్లడం అంటే మాటలు కాదు అక్కడ దావీదు చంపడానికి చూస్తున్న సౌలు రాజు, అతని మూడువేల మంది సైన్యం, సైన్యానికి అధిపతి అయిన అబ్నేరు అనే మహా యుద్ధ వీరుడు వున్నారు.*
వారి దగ్గరకు వెళ్లడం అంటే ప్రాణాలమీద ఆశ వదులుకోవటమే కానీ తన మేనమామ కోసం, మేనమామ ప్రాణ రక్షణ కోసం తన ప్రాణాన్ని లెక్కచేయకుండా ధైర్యంగా నేనే వత్తును అని చెప్పి వెళ్ళాడు.
(1సమూ 26:1-7)
*2.సౌలు గారు చనిపోయాక సౌలు గారి సైన్యాధిపతి అయిన అబ్నేరు గారు సౌలు కనిష్ఠ కుమారుడైన ఇష్బోషెతు గారిని దావీదు గారి మీద పోటీగా రాజుగా అభిషేకించి దావీదు గారిపై యుద్ధానికి వస్తాడు.*
ఆ రోజు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఘోర యుద్ధం జరుగుతుంది.
ఈ యుద్ధంలో దావీదు గారి పక్షముగా వచ్చి అబ్నేరు సైన్యముతో తలపడినవారిలో ఈ అబీషై గారు ఒకరు.
*ఆ రోజు అబ్నేరు గారి సైన్యం ఓడిపోయింది, అబ్నేరు గారిని అతని సైన్యాన్ని తరుమూతూనే వున్నారు.*
మేనమామ రాజ్యానికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను అని ధైర్యంగా నిలబడేవాడు అబీషై గారు.
(2సమూ 2:12-24)
*3.అమ్నోను రాజు తనకు చేసిన మేలును బట్టి దావీదు గారు అమ్నోను కుమారుడైన హానూను గారికి సహాయం చేద్దాము అని తన సేవకుల్ని హనూను గారి దగ్గరకు పంపుతాడు.*
కానీ ఈ హనూను గారు తన రాజ్యంలో ఉన్న ఘనులు చెప్పిన చెప్పుడు మాటలు విని దావీదు గారి సైనికుల్ని అవమానిస్తాడు.
*పైగా చుట్టుప్రక్కల రాజ్యాల సైనికుల సహాయం తీసుకుని దావీదు గారి మీదకు యుద్ధానికి వస్తాడు ఈ హనూను గారు.*
అప్పుడు కూడా తన మేనమామ పక్షముగా అబీషై ను అతని అన్నయ్య అయిన యోవాబు గారు హనూను గారి మీదకు యుద్ధానికి వెళ్లి యుద్ధం చేసి వారిని జయించి దావీదు గారికి విజయాన్ని అందిస్తారు.
(2సమూ 10:1-15)
*4. దావీదు గారి కుమారుడైన అబ్షాలోము గారు తన తండ్రికి వ్యతిరేకంగా మారి తండ్రినే చంపేద్దాం అని అనుకున్నప్పుడు దావీదు గారు తన కుమారుడి చేతిలో నుంచి తన ప్రాణాలను కాపాడుకోవటానికి అరణ్యములోకి పారిపోతాడు.*
అప్పుడు దావీదు గారితో పాటు ఈ అబీషై గారు కూడా అరణ్యంలోకి వెళ్తాడు.
*ఒకరోజు అబ్షాలోము గారితో యుద్ధం చేయాల్సి వస్తుంది*
అప్పుడు దావీదు గారు తన సైన్యాన్ని 3 భాగాలు చేసి ఒక్కక్క భాగం మీద ఒక్కో నాయకుడిని నియమిస్తారు.
*ఆ మూడు భాగాలలో ఒక భాగం ఈ అబీషై గారిదే, ఆ భాగానికి నాయకుడు కూడా అబీషై గారే.*
*అబ్షాలోము గారితో యుద్ధానికి వెళ్లి విజయాన్ని సాధించి తిరిగి తన మేనమామను రాజును చేయటంలో తన శక్తి కొలది శ్రమిస్తాడు ఈ అబీషై గారు.*
(2సమూ 18 వ అధ్యాయం)
*5.రాజైన దావీదు గారిని షిమీ అను ఒకడు దూషిస్తూ, శపిస్తూ రాజుమీద, సైన్యం మీద రాళ్లు విసురుతాడు*
అది చూసిన ఈ అబీషై గారు ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును, రాజువగు నిన్ను శపిస్తాడా??
*నీ చిత్తమైతే వాని తల నరికి వస్తాను అని దావీదు గారితో అంటాడు. కానీ దావీదు గారు అబీషై గారిని వద్దు అని ఆపుతారు.*
తన రాజుని, మేనమామను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకునే వాడు కాదు ఈ అబీషై గారు.
(2సమూ 16:5-14, 19:18-23)
*6. షెబ అను ఒకడు దావీదు గారికి ద్రోహము చేసి ఇశ్రాయేలు వారు రాజైన దావీదును విడిచి తనను వెంబడించేలా చేసుకున్నాడు.*
ఈ దావీదు వలన మనకు భాగము లేదు, స్వాస్థ్యము లేదు. మనకు అన్యాయం జరిగింది ని మోసపు మాటలు పలికి ప్రజలను తనవైపు తిప్పుకున్నాడు.
*అది చూసిన దావీదు గారు అబీషై గారిని పిలిచి ఈ షెబ అబ్షాలోము కంటే ఎక్కువ కీడు చేసాడు కాబట్టి అతన్ని వెళ్లి పట్టుకోమని ఆజ్ఞ ఇస్తాడు.*
అబీషై గారు తన సైన్యాన్ని, తన అన్నయ్య అయిన యోవాబు గారిని తీసుకుని షేబ గారిని తరుముకుంటూ వెళ్లి ఒక షేబ దాక్కున్న రాజ్యంలో ఒక స్త్రీ తో నిబంధన చేసుకుని ఆ రాజ్య ప్రజలతోనే షేబ గారి తలను నరికేలా చేసి తన మేనమామ అధికారాన్ని, రాజ్యాన్ని కాపాడతారు.
(2సమూ 20:1-22).
*7. ఫిలిష్తీయులతో దావీదు గారు యుద్ధం చేస్తున్నప్పుడు సిమ్మసిల్లి పడిపోతారు.*
దావీదు గారు పడిపోవడం చూసి ఫిలిష్తీయుడైన ఇష్బిబేనోబ అను ఒకడు నేను దావీదును చంపేస్తాను అని గట్టిగా అరచి తన కత్తిని దావీదు చంపడానికి దూయగా *ఈ అబీషై గారు దావీదు గారిని ఆనుకొని ఆ ఫిలిష్తీయున్ని చంపి తన మేనమామ ప్రాణాలను కాపాడతాడు.*
(2సమూ 21:15-17)
*ఇలా చెప్పుకుంటూ పోతే అబీషై గారు తన మేనమామ కోసం ఎన్నెన్నో యుద్ధాలు చేసాడు. ప్రాణాలకు తెగించి రాజ్యాన్ని, రాజుని కాపాడాడు..*
రాజుకి కవచంలా మారాడు.
రాజ్యానికి రక్షణ గోడగా నిలిచాడు...
*ఈ అబీషై గారు భయంకరమైన గొప్ప యుద్ధ వీరుడు.*
1 Chronicles(మొదటి దినవృత్తాంతములు) 18:12
*సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేల మందిని హతము చేసెను.*
1 Chronicles(మొదటి దినవృత్తాంతములు) 11:20
*యోవాబు సహోదరు డైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను.*
దావీదు గారి రాజ్య విస్తరణకు, దావీదు గారి ప్రాణ రక్షణకు ఈ అబీషై గారు చేసిన యుద్ధాలు, పడిన కఠోర శ్రమ వర్ణాతీతం అని చెప్పాలి.
*తన బ్రతుకు, తన చావు, తన ఊపిరి అన్ని తన మేనమామ అయిన దావీదు కోసమే అనేటట్లుగా జీవించిన గొప్ప నమ్మకమైన యుద్ధ వీరుడు ఈ అబీషై గారు.*
ఈ అబీషై గారి వలె నేటి క్రైస్తవ యువతి యువకులు కూడా *దేవుని రాజ్య విస్తరణ కోసం, ఆత్మల రక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తే చాలా బాగుంటుంది.*
అబీషై గారు తన మేనమామ కోసం కష్టపడ్డాడు.
మనము మన పరమ తండ్రి అయిన దేవుని కోసం కష్టపడదాము.
*సువార్త పనికోసం ఎందరో భక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు.*
*బైబిలు అనేక బాషలలోకి తర్జమా చేయటానికి ఎందరో భక్తులు తమ ఆస్తులను, కుటుంబాలను, ప్రాణాలను కోల్పోయారు.*
*ఇప్పటికి అనేకులు మన పరమ తండ్రి పనికోసం ప్రాణాలకు తెగించి సువార్త చేస్తున్నారు.*
నిందలు, అవమానాలు, హేళనలు, దూషణలు భరిస్తున్నారు.
*ఓ క్రైస్తవ యువకా!!!*
*నీ క్రైస్తవ జీవితంలో ఒక్కసారైనా క్రీస్తు కొరకు ఒక నిందను భరించావా?*
ఒక దెబ్బ తిన్నావా?
*ఏదైనా నష్టపోయావా??*
ఒక్కసారి ఆలోచించు...
*ఈ అబీషై గారు తన మేనమామ కోసం శత్రువుల మధ్యకు ఒంటరిగా వెళ్ళాడు.*
శత్రువులతో అనేకమార్లు యుద్ధం చేసాడు.
*మేనమామ కోసం భోగాలను వదిలి అరణ్యానికి కూడా వెళ్ళాడు.*
మేనమామ మీద ఈగ కూడా వాలకుండా చూసుకున్నాడు.
*మేనమామ చేత ఒక భాగానికి అధికారిగా నియమించబడ్డాడు.*
ప్రాణాలకు తెగించి ఫిలిష్తీయుని చేతిలో నుంచి దావీదు గారిని కాపాడాడు.
*మనము కూడా మన దేవుని కోసం చెప్పడానికి అన్యుల మధ్యకు ఒంటరిగా వెళ్ళేవారముగా ఉండాలి (సువార్త పరిచర్య).*
దేవుని రాజ్య విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు అపవాదితో,వాడి సైన్యముతో అలుపెరుగని యుద్ధం చేస్తూ ఉండాలి.
*దేవుని పని కోసం భోగాలను, సుఖాలను వదిలిపెట్టాలి.*
యుద్ధయుధాలను ధరించి గొప్ప యుద్ధ వీరులముగా ప్రార్ధనలో, సువార్తలో, పరిచర్య చేయుటలో, క్రీస్తు ప్రేమను మన ప్రవర్తనలో చూపేవారముగా ఉండాలి
(ఎఫెసి 6:10-18)
*దేవుని పనికోసం అవసరమైతే ప్రాణాలను పణంగా పెట్టేవారముగా ఉండాలి.*
ప్లీజ్ మనము కూడా అబీషై గారివలె కష్టపడదాము....
*రెండవ రాకడలో ఎగిరి వెళ్లిపోదాము.....*
*ఈ అబీషై గారి ద్వారా మన దేవాది దేవునికే మహిమ కలుగును గాక!!!*
మన ద్వారా కూడా దేవునికి మహిమ కలుగును గాక!!!!
*మరనాత= ప్రభువు వచ్చుచ్చున్నాడు.*
1కోరింది 16:22.
*ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.*
ప్రకటన 22:7
*ప్రభువైన యేసూ రమ్ము..*
ప్రకటన 22:20.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి