సమస్తాన్ని కోల్పోయిన యోబు, దేవునిని ఎట్లా స్తుతించగలుగు చున్నారు?
బైబిల్ తెలిసినవారికెవరికైనా శ్రమలు అనే పదము కనబడితే, మొట్టమొదట గుర్తొచ్చే వ్యక్తి యోబు గారు. ఆయన శ్రమ పడడం గొప్పవిషయం కాదుగాని, ఆ శ్రమలలో తన పరిశుద్ధతను, శోధనలలో తన విశ్వాస్యతను కాపాడుకోవడం గొప్ప విషయం.
సాతాను యోబు విషయంలో దేవునికి విసిరిన సవాలును గురించి ఆయనకు తెలియదు. ఆయన శ్రమపడిన దినాలలో అప్పుడప్పుడే వాక్య ప్రత్యక్షత ప్రారంభమైన దినాలు. ఆయనకు ఎట్లాంటి వాగ్ధానాలు గాని, ఆదరించే మాటలుగాని లేవు, నిరీక్షించడానికి యేసు ప్రభువు సిలువవేయబడి, మరణించి, లేచిన సంఘటన అప్పటికి ఇంకా జరుగలేదు. ఇట్లాంటి సందర్భంలో పదిమంది పిల్లలను, కలిగిన సమస్తాన్ని కోల్పోయి, ఒక వైపు భార్య మాటలు, మరొక వైపు ముగ్గురు స్నేహితుల మాటలు మరింత బాధించాయి.
సమస్తాన్ని కోల్పోయిన యోబు నోటినుండి వచ్చే దూషణ మాటలు కొరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు సాతాను. కానీ, “నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక”. (యోబు 1:21) అంటూ పలికిన మాటలు సాతాను చెంప చెళ్లుమనిపించాయి. ఇక్కడే సాతానుకు ఓటమి ప్రారంభమయ్యింది.
ఈ వాక్యంలో బైబిల్లోని అత్యున్నతమైన క్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి మనలో యోబు పట్ల గౌరవ భావాన్ని కలిగించాలి. యోబు విశ్వాసం అతనికి కలిగిన నష్టాలు, దుఃఖం వీటన్నిటికంటే ఉన్నతంగా ఉంది. సాతాను అబద్ధికుడన్న విషయం రుజువైంది. మానవ హృదయాల్లో దేవుని కృపా పరిచర్య శక్తివంతమైనదీ నిజమైనదీ అన్న విషయం నిరూపించబడింది. సైతాను ఊహించినట్టు దేవునిని దూషించేందుకు బదులు యోబు ఆయనను స్తుతించాడు. యోబు తనకు కలిగిన నష్టాల విషయం షెబావారిని గానీ కల్దీయవారిని గానీ సుడిగాలిని అగ్నిని గానీ చివరికి సాతానునూ కూడా నిందించలేదు. జరిగినవన్నీ ప్రమాదవశానో, మనుషుల దౌర్జన్యం వల్లనో, ప్రకృతి వైపరీత్యం వల్లనో జరిగాయని అతడు భావించలేదు. ఇచ్చినది దేవుడే, తీసివేసినది దేవుడే అన్నాడు. అంతటిలో దేవుని సర్వాధిపత్యాన్ని గుర్తించాడు. దేవుడు జరగనిస్తే తప్ప అక్కడ జరిగినవన్నీ సంభవించవని యోబుకు తెలుసు. అందుకే, యోబు గ్రంధములో ఎక్కడాకూడా కనీసం ఆయన సాతానును నిందించే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకంటే దేవుడు అనుమతించకుంటే వాటివల్ల ఏమీ కాదని ఆయనకు తెలుసు. మనమైతే చెయ్యకూడనివన్నీ చేసి, ఆ తప్పంతా సాతానుమీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తాము. సాతాను నిన్ను పాపము చెయ్యడానికి ప్రేరేపిస్తాడుతప్ప. నీతో పాపం చేయించలేడు. పాపము చెయ్యాలో లేదో నిర్ణయం తీసుకోవలసింది నీవే. అట్లా అని, దేవుడే నన్ను పాపము చెయ్యడానికి అనుమతించారని నీకు నీవే సర్దిచెప్పేసుకొనే ప్రయత్నం చెయ్యొద్దు. పరిశుద్ధుడైన దేవుడు పాపమునకు నిన్ను ఎట్లా అనుమతిస్తారు? మనిషియొక్క భ్రష్ట స్వభావమే పాపమునకు కారణమవుతుంది.
వాక్య ప్రత్యక్షత సరిగా లేని దినాలలో సహితం, యోబు ఎంతటి ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను అధిగమించగలిగారు? నేటి దినాన సంపూర్ణ వాక్య ప్రత్యక్షత వుంది. ఆదరణ కర్త మనతోనున్నారు. సజీవమైన నిరీక్షణ మనకుంది. అయినప్పటికీ, దేవునిని నిందించేవారముగానే ఉంటున్నాము. శ్రమలలో సహితం ప్రభువును స్తుతించగలిగే యోబు జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు సరికొత్త పాఠం. ప్రతీ పరిస్థితియందు ప్రభువును స్తుతించగలిగే జీవితాలను కలిగియుందము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి