*""సాధు సుందర్ సింగ్"" గారు స్విట్జర్లాండ్ లో చెప్పిన ప్రసంగము = 2.*
అంశము::
*""క్రీస్తును గూర్చి తెలుసుకొనుట, క్రీస్తును ఎరుగుట""*
మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు.
యోహాను 8:31,32.
*"నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి.*
"యోహాను 6:63.
సత్యమనగా నేమి? సత్యము అనునది ఒక సిద్ధాంతము,
మూఢనమ్మకము కాదు. *యేసుక్రీస్తు తానే సత్యముగా ఉన్నాడు. సత్యమును మనము ఆయా గ్రంథములలో కనుగొనలేదు.*
ప్రచురించబడిన అనేక పుస్తకములలో ఎన్నో విశేషములు కనబడుట నిజమేగాని వాటిలోని ఏదియు మిమ్మును స్వతంత్రులనుగా చేయదు.
*కేవలము క్రీస్తు మాత్రమే మిమ్ములను స్వతంత్రులనుగా చేయగలడు.*
*నిజమైన మతమును కనుగొనుటకు నేను ప్రయత్నించి హైందవ మత గ్రంథములను పరిశీలించాను గాని యేసుక్రీస్తునందే సమాధానమును కనుగొంటిని.*
ఇహసంబంధమైనవాటిలో సమాధానమును కనుగొనవలెనని మీరు చూచుచున్నారు. అయితే అది మీకు లభించెననుటకు ఏమైనా ఋజువు కలదా? లేదు!
*క్రీస్తు ద్వారా మనము ఈ లోక మందు స్వతంత్రులము. నేను ఆశ్రయించిన హైందవ్యము, జీవముగల క్రీస్తును నాకు ఇవ్వలేకపోయెను.*
ఇప్పుడు నేను ఆయనతో కూడ పరలోకమందు జీవించుటకు సిద్ధముగా ఉన్నాను. *అయినను పరలోకము భూమిమీదనే ప్రారంభమగుచున్నది*. మన ఆత్మ దేవునిచేత తాకబడిన తక్షణము ఆయన ప్రసన్నతను మనము గ్రహించుచున్నాము. *ఆత్మయందు పరిపూర్ణ సంతోషము కలిగియుండుటయే పరలోకముగా ఉన్నది.*
యేసుక్రీస్తును గూర్చి నేను వినినపుడు ఆయనను ద్వేషించితిని, దానికి విరుగుడు కనబడలేదు. *క్రీస్తును బట్టి సంతృప్తి చెందని చాలామంది క్రైస్తవులు ఆయనను ఎరుగని వారైయున్నారు*. అయితే క్రీస్తు సత్యమై ఉన్నాడు. ఆ సత్యము మనలను స్వతంత్రులనుగా చేయుచున్నది. మనము శోధనలను జయించగలము.
*మనలో నివసించు జీవముగల క్రీస్తునుబట్టి శక్తిగలవారమై సాతానును జయించుదుము.* పుస్తకములు, ఉపన్యాసముల ద్వారా కాదుగాని
ప్రార్థనద్వారా జయించుదుము.
*ప్రతిదినము ప్రార్థనలో వీలైనంత ఎక్కువ సమయమును గడపండి. ఆయనలో జీవించండి. ఆయనే సత్యము, సత్యము మిమ్ములను స్వతంత్రులను చేయును,*
మనుష్యులచేత చేయబడిన అనేక ఆశ్చర్యకరమైన వస్తువులను నేను చూశాను. *మనుష్యులు ఆకాశములో ఎగురు శక్తి, యంత్రములను స్వాధీనపరచుకొను శక్తి, విధ్యుతను వాడుకొనగలిగిన శక్తి కలిగియున్నారుగాని తమ శరీర ఆశను అదుపులో ఉంచుకొను శక్తిలేనివారై యున్నారు*. వారు ప్రకృతిని పాలించుచున్నారుగాని వారు తమ్మునుతాము పాలించుకొనలేని వారైయున్నారు.
*రెండు వారముల క్రిందట నేను పాలస్తీనాలో ఉంటిని, మన ప్రభువు అక్కడనే బోధించాడు అనే తలంపు నాలో ఉండినది.* ఆయన తన స్వహస్తములతో తన శిష్యుల కొరకు ఏమయినా గొప్ప సంగతులను వ్రాసేనా అనే ప్రశ్న?
నాలో బయలుదేరెను. అయితే ఆయన ఏమియు వ్రాసి ఇవ్వలేదు.
*ఎందుకనగా తన ప్రజల హృదయమందు ఆత్మయు జీవమునైయున్న వాక్యము జీవించునని ఆయనకు తెలుసు. శిష్యులకొరకు ఆయన ఏమియు వ్రాయలేదు. 'నేను సదాకాలము మీతోకూడ ఉండెదను” ఇదే ఆయన వాగ్దానము. ఆయన మనలను పాపమునుండి స్వతంత్రులనుగా చేయును. తరువాత కాలమందు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయుటకు శిష్యులు ప్రేరేపించబడిరి.*
చాలామంది క్రైస్తవులు తమ మరణము తర్వాత పరలోకమును అనుభవించగోరుచున్నారు గాని *పరలోకము భూమిమీదనే ప్రారంభమగుచున్నది.*
పశ్చిమ దేశముల నాగరికతను గూర్చి నా ఉద్దేశ్యము ఏమని కొందరు స్నేహితులు అడుగుచున్నారు. *అయితే నేను నిజమైన నాగరికతను చూడలేదనియు జంతు స్వభావమునే చూచితిననియు చెప్పుచున్నాను.*
క్రీస్తును ఎరుగని ప్రజలు క్రీస్తుతో కూడ జీవించుటలేదు. దుస్తులు ధరించుటకును, భుజించుటకును, టైం ప్రకారము సమస్తము చేయుట నేర్చుకొనిన వారు - శిక్షణ పొందిన జంతువులతో సమానము. అది నాగరికతకాదు.
*దేవునితో గల మన బంధుత్వమును గుర్తించినపుడే మన జీవితము నిజమైన జీవితముగాఉండును.*
*“మానవుడా, నిన్ను నీవు తెలుసుకొనుము.”*
యేసుక్రీస్తు నందు నిజ జీవితమును మనము కలిగియుంటే మరెన్నో విషయములను తెలుసుకొనెదము.
*ఆయనను ఎరుగుటకు మనము విద్యావంతులుగా ఉండనక్కరలేదు.* సామాన్యమానవుడు క్రీస్తునందున్న నిజ జీవమును తెలుసుకొనగలడు. చదువుకున్న విద్యావంతులు గ్రహించలేక పోవచ్చును.
*గతసంవత్సరము టిబెట్ దేశమందుండగా దిగువ సాక్ష్యమును విన్నాను*.
ఒక చిన్న బాలిక యేసు క్రీస్తును గూర్చి వినినపుడు ఆయనను ప్రేమించుట మొదలు పెట్టెను. *ఆమె సొంత ఉపాధ్యాయుడు ఒక బౌద్ధ గురువు.*
అందువలన ఆమెను ద్వేషించెను. అంతేకాదు, ఒక దినము 13 సం॥ల వయసుగల ఆ బాలిక ఒక గదిలో బంధింపబడెను.
*3 దినములు అన్న పానములు ఇవ్వబడలేదు. ఆ బాలిక ఎంతో దుఃఖపడెను. క్రీస్తు యేసు నందు విశ్వాసముంచినందున ఆయన కొరకు బంధింపబడెను. ఆమె ఎల్లప్పుడు ప్రార్థించెను. క్రీస్తు యేసునందున్న ఆశ్చర్యకరమైన సంతోషమును అనుభవించుట వలన ఆమె సంతోషించెను.*
మూడు దినముల తరువాత ఆ బాలికను కలుసుకొనిన గురువు ఆమె సంతోషముగా నుండుటను బట్టి విస్మయము చెందెను. *అంతేకాదు, ఆమె కనుగొనిన క్రీస్తు సంతోషము ఆయనను మార్చెను. ప్రారంభములో వారి మధ్య జరిగిన సంభాషణ ఇలాగున్నది.*
నీవు సంతోషముగా నుండుటకు కారణమేమి?"
*"నేను క్రైస్తవురాలను!"*
క్రీస్తును గూర్చి నీకు ఏమి తెలుసు?"
*"ఆయన గూర్చి ఎక్కువగా నాకు తెలియదు. ఒకటేమిటంటే నేను ఆయనను ఎరుగుదును.”*
పిచ్చిబాలికా, నీకు చదువులేదు కదా?”
*"నేను, నా తల్లిదండ్రులను గూర్చి ఎరిగిన దానికంటే ఎక్కువగా క్రీస్తును ఎరుగుదును. తల్లిదండ్రులు నన్ను ప్రేమించుచున్నారు. నేను వారిని ప్రేమించుచున్నాను. అయితే నేను క్రీస్తును ఎరుగుదును.*
ఆయన నాలో
జీవించుచున్నాడు. యేసు క్రీస్తు లోకము ఇవ్వలేని, లోకము తీసుకొనలేని సమాధానమును నాకు ఇచ్చియున్నాడు."
*బాలికకు పిచ్చిపట్టినదని తలంచిన గురువు, ఆహారములేకుండా ఆమెకు మరో 24 గంటలు బంధించి ఉంచెను. తరువాత వచ్చి, “నీవు ఎలాగున్నావు?” అని అడిగెను.* ఆమె హృదయమందు సంతోషముతో పాటలు పాడుచుండెను. ఆమెలో ఏమాత్రము అలసట కనబడలేదు.
*మరల రెండు దినములు బంధించి ఉంచిన తరువాత ఆఖరుగా తలుపులు తెరచి చూచినపుడ ఆమె ఆశ్చర్యకరమైన శాంతి సమాధానములతో నిండినదై ఇంకనూ పాటలు పాడుచుండుటను చూచెను*.
ఆ విధ్యలేని బాలికలోని శాంతి, సమాధానములను బట్టి గురువు ఇలాగు చెప్పెను:
*“నీవే నా గురువు! నేను వృద్ధుడను, నీవు కేవలము 13 సం॥లు వయసుగల బాలికవు అయినను నేను నీ శిష్యుడను. నేను పొందని దానిని నీవు పొందియున్నావు” అని ఒప్పుకొనెను.*
*యేసుక్రీస్తును కనుగొనుటకు వయసుతో నిమిత్తములేదు. చదువుతో నిమిత్తములేదు*. ఆ బాలిక ప్రసంగించలేకపోయెను. అయితే ఆ గురువు కనుగొనలేని ఒకదానిని ఆమె కనుగొనెను.
చాలామంది ఆయారీతులలో సమాధానము కొరకు ప్రయత్నించుచున్నారు. క్రైస్తవులుగా ఉండగోరుచున్నారు.
అన్ని ప్రయత్నములు చేసి సంతృప్తి చెందగోరుచున్నారు.
*అంతేకాదు, ఏదయినా ఒక మార్పు కొరకు ఎదురుచూచుచున్నారు*. బట్టల విషయములో మార్పు!
ఆహార విషయములో మార్పు! కొన్నిసార్లు - ఇది ఎక్కువ వేడిగా ఉన్నది; ఎక్కువ చల్లగా ఉన్నది అని చెప్పి ఎన్నడు సంతృప్తి చెందనివారైయుంటున్నారు. ఎందుకు?
*మార్పు చెందు ఇహసంబంధమైన వాటితో వారు సంతృప్తి చెందజాలరు. మార్పులేని దానిని బట్టియే వారు సంతృప్తి చెందుదురు. కేవలము ఆయన యందే వారు సమాధానమును కనుగొనెదరు.*
ఆయన మార్పు లేనివాడైయున్నాడు. ఆయనను కనుగొనిన యెడల మనము ఇంకను “అది కావాలి ఇది కావాలి" అని అడుగము: ఎందుకంటే మనము సంపూర్ణముగా సంతృప్తిచెందుదుము.
*క్రీస్తును గూర్చి ప్రజలు తెలుసుకొనియున్నారు. అది వారు సంతృప్తి చెందుటకు సహాయపడుటలేదు.* వారాయనను ఎరిగియుండక పోవుటకు, కారణము చాలినంతగా ప్రార్థన చేయక పోవుటయే!
*(మన గ్రామంలో ఒక పెద్ద అధికారి కోసం మనము అనేక సంగతులను వింటూవుంటాము. ఆయన చేసిన పనులు, ఆయన చేసిన మేలులు కోసం వింటాము కాబట్టి ఆయన కోసం మనకు తెలుసు కానీ ఆయనని ఎరుగము అనగా ముఖ పరిచయం లేనందున మనకు ఆయనతో పరిచయం లేదు.*
అలాగే నేడు క్రైస్తవులు కూడా క్రీస్తు కొరకు వింటున్నారు కానీ ఆయనతో పరిచయం లేనివారిగా వుంటున్నారు. *ఆయనతో ఏకాంతముగా మాట్లాడితేనే (ఏకాంత ప్రార్ధన) మనకు ఆయనతో పరిచయం పెరుగుతుంది.*
*పుష్పములలోను పండ్లలోను మనము దేవుని క్రియలను చూచుచున్నాము. మనము ఆయనను అర్థముచేసుకొనుటకు ఆయన పాదసన్నిధానములో కూర్చొనవలెను*.
ప్రశాంత వాతవరణములోన పాదసన్నిధానములో కూర్చొనవలెను. ప్రశాంత వాతవరణములో
వేచియున్నపుడు ఆయన మహిమగల ప్రసన్నతను గ్రహించెదము. దేవుడు మనతో మాట్లాడుతాడు.
ఆయన జీవమును, సమాధానమును, శోధనలను
జయించుటకు కావలసిన శక్తిని దయచేయును.
*క్రీస్తు కొరకు శ్రమను అనుభవించువారు వెర్రివారు కారు గాని వారు క్రీస్తునందు ఆశ్చర్యకరమైన సంతోష సమాధానములు కనుగొనినవారు.* వారు తమ్ము స్వతంత్రులనుగా చేయు సత్యమును ఎరిగినవారు!
*టెబెట్ దేశమందు బహు చెడ్డ జీవితము జీవించిన ఒక వ్యక్తిని ఎరుగుదును. అతడు ఘోరమైన పాపి. అతడు సమాధానము కొరకు వెతకెను గాని దానిని పొందలేక పోయెను. అయితే తరువాత కాలమందు ఒక వింత అనుభవమును పొందెను*.
తన హృదయమును క్రీస్తుకు సమర్పించుకొనినపుడు సంతోషముతో నింపబడెను. ఆయనను అర్థము చేసుకొనని ప్రజలు ఆయన మీద రాళ్ళు రువ్వినందున గాయపరచబడిన దేహమునుండి రక్తము కారుచుండెను.
*అయినను అతడు సాక్ష్యము ఇచ్చుచున్నందున అతడు పిచ్చివాడని ప్రజలు తలంచిరి.*
కొన్ని దినముల తరువాత నేను అతనిని కలుసుకొనినపుడు తన అనుభవమును నాతో చెప్పెను. నిజముగా అది ఒక అద్భుతమే!
అతడు తిరిగి జన్మించినవాడు! లోకము గ్రహించలేని దానిని అతడు పొందియుండెను.
*క్రీస్తు యేసును చూచినవారు అద్భుతములను పొందుకొనుటకు సమస్యలు ఉండవు. జీవమును పొందుటయు, సత్యమును ఎరుగుటయు, భూమిమీద పరలోకమును అనుభవించుటయు గొప్ప అద్భుతములుగా ఉన్నవి.*
*మా దేశమందు ఉన్నత కులమునకు చెందిన ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారినపుడు ఎన్నో శ్రమలను, హింసలను అనుభవించవలసియున్నది*. అదే నాకు సంభవించినది. ఇందును గూర్చి నేను క్రితమే మాట్లాడియున్నాను.
*దేవుడు తన్నుతాను మనకు బయలు పరచినపుడు మనము భూమిమీద పరలోకమును అనుభవించుచున్నాము*. సత్యము మనలను స్వతంత్రులనుగా చేయుచున్నది.
మనము ఈ, ఆ మతమందు నమ్మకము ఉంచుట వలన
సమాధానమును పొందలేము. మనము క్రీస్తును ఎరుగవలెను. ఆయన యందు జీవమును కనుగొనవలెను.
*ఆ సమాధానమును కనుగొనని యెడల అది మనపొరపాటేగాని ఆయనలో ఏ తప్పిదములేదు.*
మనమెంతో హడావుడిగ ఉన్నాము.
*ప్రార్థించుటకు కూడ మనకు సమయములేదు*. క్రైస్తవ దేశముల యందున్న ప్రజలు కేవలము ప్రార్థనలో సమయము గడపనందున బ్రష్టులగుచున్నారు.
*ఆయనను ప్రేమించుటకు ఆయన బలవంత పెట్టడు. అయితే జీవము, రక్షణ, భూమిమీద పరలోకమును అనుభవించగోరిన యెడల మనము తప్పక ప్రార్థించవలెను.*
యేసుక్రీస్తు తానే సత్యముగా ఉన్నాడు.
*ఆయనను తెలివితేటల ద్వారా కాదుగాని హృదయమందున్న విశ్వాసము ద్వారానే కనుగొనగలము.*
క్రొత్త మతములమీద ప్రజలు నమ్మకమును ఉంచుచున్నారు. అనేక సంగతులను తమ తెలివితేటలను బట్టి గ్రహించుటకు ప్రయత్నించుచున్నారు. అయితే నిజమైన వెలుగు ప్రకాశించువరకు వారు పొరపాటులోనే కొనసాగుదురు. వెలుగు వచ్చినపుడు వారు సత్యము - అసత్యము మధ్య ఉన్న వ్యత్యాసమును కనుగొనెదరు.
*తెలివితేటలు గల నేత్రములతో మనలను స్వతంత్రులనుగా చేయు సత్యమును మనము చూడలేము.*
సమాధానము, శ్రేష్టమైన వాటి కొరకు మనము ఆశించుచున్నాము.
అయితే అది నెరవేరుటలేదు. *ఇహమందైనా వాటివలన మనము సంతృప్తి చెందుటలేదు. మన హృదయమును సృష్టించిన వానియందే మన హృదయములు సమాధానమును కనుగొనగలవు.*
ఈ స్విట్జర్లాండ్ దేశము ఎంతో మధురమైన దేశము! క్రీస్తు కొరకు మనము జీవించినపుడు మనము నిజ సమాధానమును కనుగొనగలము. ఆయన ప్రసన్నతను గ్రహించగలము.
*కేవలము పుస్తకములు చదువుట వలన మాత్రము కాదు, ప్రార్థించుట ద్వారానే ఇది సాధ్యము!*
ప్రార్థించండి! మీకు సమాధానము ఇచ్చుటకు ఒక అవకాశమును దేవునికి ఇవ్వండి! ఆయనే సత్యమైయున్నాడు.
*ఆయన ప్రసన్నతను గ్రహించుటకు దేవునికే అప్పగించుకొనెదము.*
*ఆయనను గూర్చి తెలుసుకొనుట మాత్రముచాలదు. ఆయనను ఎరిగియుండవలెను.*
*పూర్వము నేను హింసకుడను, క్రైస్తవ మిషనరీల మీద రాళ్లు రువ్విన వాడను. అప్పుడు క్రీస్తు వ్యక్తిగతముగా నాకు తెలియదు. తరువాత కాలమందు నేనాయనను ఎరిగితిని. యేసు క్రీస్తునందే జీవమున్నది. ఆయనే దేవుడు!*
మనుష్యులను రక్షించుటకై ఆయన నరుడు ఆయెను. ప్రార్థన ద్వారా మనమాయనను ఎరుగుటకును, ఆయన నామము మహిమ పరచుటకును
దేవుడు తానే సహాయము చేయును గాక! "ఆమేన్"
ఈ ప్రసంగము
*సాధు సుందర్ సింగ్ గారు స్విట్జర్లాండ్ లో చెప్పిన ప్రసంగములు అను పుస్తకములోనిది...*
పేజీ నెం. 23-30
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి