*డా॥ జాషువా డానియేల్*
(లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్)
జననం:06-02-1928 ~ పరలోక పిలుపు:18-10-2014
*మంచి పోరాటము పాలాడితిని నా పరుగు తన కడముట్టించితిని. విశ్వాసము కాపాడుకొంటిని.* - (2.తిమోతి 4:7)
*డా॥ జాషువా డానియేల్ (జో) గారి గురించి క్లుప్తంగా*
పదిహేనేళ్ళప్రాయంలో జోగారి జీవితాన్ని యేసుప్రభువు మార్చినప్పటినుండి అంతమువరకు ఆయన దేవుని కొరకే దేదీప్యమానంగా ప్రకాశించారు.
జోగారి తండ్రియైన దానియేలుగారు గొప్ప దైవజనులు, దేవునికి సమీపంగా నడిచినవారు. ఉజ్జీవములో దేవునిచేత బలముగా వాడబడినవారు.
ప్రార్థనాపరురాలైన తల్లి దీవెనమ్మగారు జోగారికి గొప్ప ప్రేరణగా ఉంటూ ఎన్నో సుదీర్ఘమైన సంవత్సరాలు ఆయనకు సహాయమునందించారు. ఉజ్జీవ వాతావరణములో పెరుగుటను బట్టి ఉజ్జీవము కొరకైన లోతైన వాంఛ జోగారిని బలముగా పట్టుకొన్నది. నశించిపోతున్న ఆత్మలకొరకు గొప్ప ప్రేమను, కనికరమును, దేవునికొరకు రోషమును ప్రభువు జోగారిలో పుట్టించారు.
ఉజ్జీవ వాతావరణము తన చుట్టూ ఆవరించియుండుట వలన ఆయన కన్నీటితో కూడిన విజ్ఞాపనా ప్రార్థనను నేర్చుకున్నారు. అతి శీఘ్రముగా ఆయన *ప్రజ్వరిల్లు ఉజ్జీవ జ్వాల* గా మారి ఆత్మలకొరకు ప్రయాసపడుటకారంభించారు. ఆయన సేవలో దేవుడు ఉజ్జీవమును అనుగ్రహించుట వలన ఆయన *'బాల ఉజ్జీవకారుడు'* గా పేరుగాంచారు.
ఆయన నవ యౌవనుడుగా ఉన్నప్పుడు ఆత్మలకొరకు ఎంతో కన్నీటితో ప్రయాసపడినప్పుడు, ఆయన కూటములలో గొప్ప ఉజ్జీవము కుమ్మరించబడటం చూశారు.
ఎక్కడా రాజీపడని ఆయన యొక్క సూటియైన వర్తమానములు ప్రజల గర్వమును, దురాభిప్రాయమును విరుగగొట్టి, పాపమును గూర్చి బలమైన ఒప్పింపు వారిమీదికి దిగునట్లుగా చేశాయి. ఆయన సేవ ద్వారా వేలాదిమంది సవాలు చేయబడ్డారు. ఆశీర్వదించబడ్డారు. దేవుడు గొప్పగా మహిమ పరచబడ్డాడు.
ఆయన పేదవారిని, సామాన్యులను ఎంతో ప్రేమించేవారు. వీరు కూడా ఆయనను బహుగా ప్రేమించారు. *"నిన్ను జనములకు ప్రవక్తగా నియమించితిని"* (యిర్మీయా 1:5) అన్న దేవుని వాగ్దాన నెరవేర్పుగా ప్రభువు ఆయనను ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, ఇండోనేషియా, బర్మా, బంగ్లాదేశ్ మొదలగు దేశములకు తీసుకువెళ్ళి ఆయనను బలముగా వాడుకుని అనేకుల జీవితములను మార్చినారు. 2014, ఫిబ్రవరిలో థాయ్లాండ్ దేశమునకు వెళ్ళి ప్రయాసపడుట ఆయన ఆఖరి మిషనరీ సేవ. ఈ సేవా ఫలితముగానే తాయ్ భాషలో మన నూతన టెలివిజన్ ప్రసారములు ప్రారంభించబడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా సేవ విస్తరణ కొరకు ప్రయాసపడుట వలన ఆయన తరచుగా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చేది. "నాకు కోట్లాది రూపాయలిచ్చినా నా భార్య, పిల్లలను విడిచి వెళ్ళను. కాని నా రక్షకుని కొరకు నేను వెళుతున్నాను" అని ఆయన అనేవారు. సహోదరి లిల్లమ్మగారు దీనిని గురించి ఎన్నడు సణుగుకొనలేదు. కాని సుదీర్ఘకాలం ఆయన దూరముగా ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకముగా ఆయనకు సహకరిస్తూ పిల్లలనందరినీ దేవునియందు భయభక్తులలో పెంచారు. ఆయన జీవితం ప్రభువు కొరకు ఎన్నో త్యాగాలతో కూడుకున్నదైనప్పటికీ, దానిని త్యాగము అని చెప్పటానికి ఇష్టపడేవారు కాదు. కాని *"నా రక్షకునికి అచ్చియున్న గొప్ప ఋణమును తీర్చుకొనుటకు నేను ప్రయాసపడుచున్నాను"* అని చెప్పేవారు. యేసు ప్రభువువలె జీవించాలనేదే ఆయన హృదయవాంఛ మరియు తపన *"అయ్యో, నేను యేసు ప్రభువు వలె లేనే!!"* అని వేదిక మీదనుండి వేదనతో ప్రార్థించేవారు.
దేవుని మహిమను చూడాలని, నశించిపోవుచున్న లోకానికి దేవుని శక్తిని నిరూపించాలన్నదే ఆయన హృదయవాంఛగా ఉండేది. ఆయన ప్రార్థనద్వారా వేలాదిమంది స్వస్థపరచబడినారు. ఆయన పోనులో ప్రార్థన చేయగా వేల కిలోమీటర్ల దూరములోనున్న ప్రజలలోనుండి దురాత్మలు పారిపోయేవి..
దేవుడు ఆయనను ఎంతో బలముగా వాడుకొనినప్పటికీ దీనునిగా విరిగినలిగిన హృదయముతో *"నేను వట్టివాడను"* అని వేదిక మీదనుండి తరచుగా పునరుద్ఘాటించేవారు. *"నేను ఆయోగ్యుడను. నిష్ప్రయోజకుడనైన దాసుడను. నేను చేయవలసిన పనినే చేశాను"* అని చెప్పేవారు..
ఆయన ఎన్నో గొప్ప పుస్తకములు వ్రాశారు. ఇవి ప్రపంచమంతటా అనేకులకు గొప్ప దీవెనగా మారిపోయినవి. ఒక పుస్తకాన్ని సిద్ధము చేయటానికి ఆయన నెలల తరబడి రాత్రింబవళ్ళు ప్రయాసపడేవారు. కాని పుస్తకాల ద్వారా వచ్చిన డబ్బులో ఎన్నడు ఒక రూపాయి కూడ ముట్టుకోలేదు. అలా వచ్చిన మొత్తమును వివిధ భాషలలో మరిన్ని పుస్తకములను ముద్రించటానికి వినియోగించేవారు. ఆత్మలను గెలుచుట, వారిని సరియైన ఆత్మీయ ఆహారముతో పెంచి పోషించాలనేదే ఆయన హృదయవాంఛ.
టెలివిజన్ ప్రసారములలో దేవుని వాక్య సత్యములను గర్జించినట్లుగా దైవికమైన అభిషేకముతో వర్తమానములలో ఆయన హృదయమును క్రుమ్మరించుచుండగా అనేకమంది క్రైస్తవేతరులు, అపరిచితులైనవారు సహితము వాటిని వినుటకు ఇష్టపడేవారు. ఆయన జీవితముద్వారా, ప్రసంగములద్వారా ప్రపంచములోని వేలాది మందిని ప్రభావితం చేశారు. ఆయన టెలివిజన్ ప్రసారములలో ఎన్నడు డబ్బు కొరకు విజ్ఞప్తి చేయకూడదని నిశ్చయించుకున్నారు.
ఆయన 1988వ సంవత్సరము నవంబరు నెలలో యింఫాల్లో సేవ చేస్తూ సంతకము కూడ చేయలేనంతగా నీరసించిపోయారు. ఇటువంటి పరిస్థితిలో ఆయన ఇంటికి చేరగా, మొదటిసారి డిశంబరు 21న (1988) గుండెపోటు వచ్చినది. ఈ నొప్పిలేని గుండెపోటు కారణముగా మనము 25 సం॥ల క్రితమే ఆయనను కోల్పోయి ఉండేవారము. కాని దేవుడు లిల్లమ్మ గారిని రాత్రి 1 గంటకు నిద్ర మేల్కొల్పగా జోగారు గుండె నొప్పితో కళ్ళు తేలవేయడాన్ని ఆమె చూశారు. అప్పుడు సకాలమునకు ఆయనము హాస్పిటల్ కి తరలించారు. రెండవసారి రావలసిన గుండెపోటు దేవుని కృపవలన ఆయనకు ఎన్నడు రాలేదు. ఆయన కోలుకుంటూ ఉండగా తల్లి దీవెనమ్మగారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రక్కన ఉండి ప్రార్థన చేయాలని ఆశించారు. కాని జోగారు *"అమ్మా, నువ్వెక్కడే ఉండి దేవుని సేవను కట్టుము"* అని చెప్పారు. ఆయన మనసెప్పుడూ దేవుని పని మీదనే ఉండేది.
25 సంవత్సరములుగా ఆయన గుండె ధమనులు 99% మూసికొని పోవుటవలన అనేకసార్లు ఆయన ప్రాణమునకు ముప్పు వాటిల్లినది. శారీరకముగా ఎంతో బలహీనముగా ఉన్నప్పటికీ ఆయన ప్రభువు కోసం నిరంతరం ప్రయాసపడుతూనే ఉండేవారు. "ఆయన ఇంత ఆనారోగ్యముగా ఉంటే ఎందుకు ఆయనను మీటింగులకు వెళ్ళవిస్తున్నారమ్మా?" అని ప్రజలు లిల్లమ్మగారిని ప్రశ్నిస్తే *"నేను ఆయనను వెళ్ళనివ్వకపోతే త్వరగా చనిపోతారు. ఎందుకంటే, ఆయన ప్రాణాత్మలు దేవుని పని మీదనే ఉన్నాయి"* అని ఆమె బదులిచ్చేవారు. ఆ విధముగా ఆయన *అపాయముల మధ్య జీవించారు, దీనముగా సేవించారు, విస్తారముగా ప్రేమించారు.* బైబిల్ అధ్యయనము ద్వారా ఆయన స్వంతము చేసుకున్న దేవుని రాజ్య విలువలే ఆయనను అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తినిగా చేశాయి. ఆ వాక్య విలువలనుండి ఆయన ఎన్నడు కొంచెమైనను ప్రక్కకు తొలగలేదు.
ఆయన మనసెప్పుడూ సహవాసపు మే రిట్రీటుల మీదనే ఉండేది. 2014వ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలలో ఆయన ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ మే రిట్రీటుకు వచ్చేశారు. ఆయన ఇండియాకు ప్రయాణమగుచున్నపుడు ఆక్సిజన్ కోసం అడగమని మన వైద్యుడొకరు ఆయనకు సూచించారు. అలా అడిగితే ఎయిర్ లైన్స్ వారు నన్ను ఇండియాకు వెళ్ళుటకు అనుమతించరని నిరాకరించారు. 'మే రిట్రీటులంటే ఆయనకు అంత భారముండేది. వాటిని చాలా విలువగా ఎంచేవారు. ఎట్టి పరిస్థితులలోనూ వాటిని పోగొట్టుకొనుటకు ఆయన ఇష్టపడేవారు కాదు. ఆయన శారీరకముగా ఎంతో బలహీనముగా ఉన్నప్పటికీ మే రిట్రీటులో వేదిక మీదికి వచ్చి 20 నిమిషాల వరకు ప్రజలతో మాట్లాడుటకు దేవుడు ఆయనకు కృప చూపారు.
ఆయన జీవితకాలమంతటిలో దేవుని రాజ్యము కొరకు ప్రమాదాలను ఎదుర్కొనవలసి వచ్చినా ఎన్నడు భీతి చెందలేదు. సువార్త వ్యాప్తి కొరకు తన జీవితాన్ని ఎల్లప్పుడు సిద్ధముగా ఉంచుకున్నారు. 1928వ సంll ఫిబ్రవరి నెల నుండి 2014వ సం|| అక్టోబరు నెల వరకు జోగారు తన జీవితకాలములో అనేక సందర్భాలలో మరణానికి సమీపముగా వెళ్ళిన పరిస్థితులను జయించగలిగారు.
2014వ సం॥ మే నెలలో సముద్రాలు దాటి వచ్చిన ఆయన కడసారి ప్రయాణం ఆయనకు సహకరించలేదు. ఆయన గుండెలో చెడు రక్తము, మంచి రక్తము కలిసిపోవడము, కాలేయము, మూత్రపిండములు సరిగా పనిచేయకపోవడము వంటి సమస్యలు తలెత్తినవి. కాని చివరి వరకు ఆయన గుండె దృఢముగానే ఉండినది. నిమిషానికి 60 సార్లు కొట్టుకునేది. (బి.పి) రక్తపోటు కూడా స్థిరముగానే ఉండేది. వైద్యుల పర్యవేక్షణలో ఆయన వ్యాయామములు చేస్తూ అక్టోబరు 16 వరకు కండరాలు సత్తువగానే ఉంచుకొనగలిగారు. 17వ తేదీన ఆయనకు దగ్గు, 102 డిగ్రీల జ్వరము వచ్చినది. రాత్రి 10:30 గంటలకు హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. ఆ రాత్రి ఆయన బాగానే నిద్రపోయారు. తరువాత రోజు అనగా అక్టోబరు 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన సిద్ధపడుతూ ఉండగా హఠాత్తుగా ఆయన ఊపిరి ఆగిపోయినది. పిమ్మట 9.45 నిమిషాలకు ఆయన హృదయస్పందన ఆగిపోయినది.
గత కొన్ని వారములుగా ఆయన ఎంతో బలహీనుడుగా ఉన్నప్పటికీ దేవుని రాజ్య అవసరతలకొరకు, ఇతర భారముల కొరకు ఆయన హృదయము ఎప్పుడూ మండుతూనే ఉండేది. ఆయన ఆనారోగ్యముగా ఉండినప్పుడు లిల్లమ్మగారు రాత్రింబగళ్ళు ఆయన ప్రక్కనే ఉండి ఎంతో ప్రేమతో ఆయనకు పరిచర్య చేశారు. ఆయన తుదిశ్వాస వరకు ప్రభువుకు నమ్మకస్తునిగానుండి ప్రభువు కొరకు రోషము కలిగి జీవించారు.
ఆయన చివరి దినాల్లో అంత ఎక్కవగా మాట్లాడలేకపోయినప్పటికీ స్పష్టమైన ఆలోచనలను చురుకైన జ్ఞాపక శక్తిని కలిగియుండినారు. ఆఖరి దినాలలో ఆయన పలికిన కొద్ది మాటలలో *"దేవుడు నమ్మదగినవాడు"* అనే మాట ఎక్కువసార్లు పలికారు..
ఆయన మనకొరకు విడిచి వెళ్ళిన ఉన్నతమైన ప్రమాణములను మనము కాపాడుకుంటూ ఆయన మాదిరిని శ్రద్ధగా అనుకరిస్తూ, అనుసరిస్తూ ముందుకు సాగిపోవునట్లు ప్రభువే మనందరికీ కృప చూపును.
*సహా॥ జాషువా దానియేల్ గారు వ్రాసిన పుస్తకముల కొరకు*
www.beautifulbooks.org అను మా వెబ్ సైట్ ను దర్శించండి.
*లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి