*ఇస్సాకు కాలములో కనిపించే అబీమెలెకు, ఫీకోలు అబ్రాహాము కాలమునాటి వారా?*
"అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారు నుండి అతనియొద్దకు వచ్చిరి" ఆదికాండము 26:26
పై వాక్యము ఇస్సాకు గెరారు లోయలో నివాసమున్నప్పుడు జరిగిన సంఘటన. అప్పుడు ఇస్సాకు వద్దకు రాజైన అబీమెలెకు, అతని స్నేహితుడైన అహుజతు, సేనాధిపతియైన ఫీకోలు వచ్చినట్లు చెప్పబడినది. అయితే వీరిలో అబీమెలెకు, ఫీకోలు ప్రస్థావన అబ్రాహాము కాలమందు కూడా కనిపించును. వారు అబ్రాహామును కూడా కలిసినట్లు లేఖనములో చెప్పబడినది.
"ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడి" ఆదికాండము 21:22
ఇస్సాకు కాలములో చెప్పబడిన అబీమెలెకు మరియు అతని సేనాధిపతియైన ఫీకోలు పేరులు ఇస్సాకు తండ్రియైన అబ్రాహాము కాలముతో చెప్పబడినట్లు పై లేఖనము ద్వారా గ్రహించవచ్చును. అయితే అబ్రాహామును కలిసిన మరియు అతని కుమారుడైన ఇస్సాకును కలిసిన అబీమెలెకు, ఫీకోలు ఒక్కరేనా? అనే ప్రశ్నకు లేఖనముల యందు స్పష్టమైన సమాధానము లేదు. అందువలన లేఖన పరిశీలన ద్వారా వారు ఒక్కరేనా అనే విషయమును తెలుసుకొనేందుకు ప్రయత్నిద్దాం.
శారాకు ఇస్సాకుకు జన్మించునని (ఆదికాండము 17:19) చెప్పబడిన కాలమునకు, శారకు ఇస్సాకు జన్మించిన (ఆదికాండము 21:2) కాలమునకు మధ్య కాలములో జరిగిన సంఘటనకు సంబంధించినదే పై వాక్యము. అబ్రాహామునకు ఇస్సాకు జన్మించునని చెప్పబడినప్పుడు అబ్రాహాముకు 99 యేండ్లు (ఆదికాండము 17:17) కాగా అబ్రాహాముకు నూరేండ్ల వయస్సులో ఇస్సాకు జన్మించెను (ఆదికాండము 21:5). ఈ రెండు సంఘటనల మధ్య కాలములో అనగా అబ్రాహాముకు 99_100 యేండ్ల మధ్య కాలములో ఆయన్ను అబీమెలెకు మరియు ఫీకోలు కలిశారని గ్రహించగలము.
ఇస్సాకును అబీమెలెకు మరియు ఫీకోలు కలిసిన కాలము కచ్చితముగా చెప్పబడలేదు. ఇస్సాకు గెరారు వెళ్లడానికి ముందటి అధ్యాయములో ఏశావు, యాకోబు పుట్టినట్లు చెప్పబడగా, గెరారులో ఉన్న కాలములో ఇస్సాకు, రిబ్కా గురించి మాత్రమే ప్రస్థావింపబడినది. అందువలన ఆ సంఘటన ఇస్సాకుకు సంతానము కలుగుటకు ముందుగా జరిగినదా? లేక సంతానము కలిగిన తరువాత జరిగినదా? అనే స్పష్టత లేదు. అందువలన ఇస్సాకు గెరారుకు వెళ్లిన కాలము గురించి కొంత అస్పష్టత కనిపించును. అయితే ఇస్సాకుకు 40 యేండ్ల కాలములో రిబ్కాతో పెండ్లి అయినట్లు (ఆదికాండము 25:20) లేఖనములో చెప్పబడుట వలన అబ్రాహామును అబీమెలెకు, ఫీకోలు కలిసిన 40 యేండ్ల తరువాత ఇస్సాకు గెరారు వెళ్లినట్లు గ్రహించవచ్చును.
ఒక్కరే కావచ్చు
అబ్రాహాము కాలములోని అబీమెలెకు గురించి లేఖనములను పరిశీలించిన యెడల అప్పటికి అతను వృద్ధుడు కాదని గ్రహించవచ్చును. ఎందుకనగా అతడు శారాను మోహించి తన యింట చేర్చుకొనినట్లు (ఆదికాండము 20:2) లేఖనము చెబుతున్నది. అయితే ఇస్సాకు కాలములోని అబీమెలెకు గురించిన లేఖనములను పరిశీలించిన యెడల అతడు వృద్ధుడై యుండవచ్చుననే భావన కలుగును. "ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే" (ఆదికాండము 26:10) అనే వాక్య భాగమును పరిశీలించినట్లయితే రిబ్కాను అబీమెలెకు మోహించలేదని తెలియుచున్నది. రిబ్కాను అబీమెలెకు మోహించినట్లయితే అబ్రాహాముతో ఫరో చెప్పినట్లు "నేనామెను నా భార్యగా చేసికొందునేమో" (ఆదికాండము 12:19) అని, లేక అబ్రాహాముతో అబీమెలెకు చెప్పినట్లు "నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు" (ఆదికాండము 20:9) అంటూ తనతో అన్వయించుకొని మాట్లాడి ఉండేవాడు. అయితే "ఈ జనులు' అంటూ ఇతర జనాలతో అన్వయించి మాట్లాడుట వలన ఇస్సాకు కాలము నాటి అబీమెలెకు వృద్ధాప్యము వలన కామవాంఛలు కోల్పోయినవాడై యుండవచ్చని, అందువలన అబ్రాహాము కాలము నాటి అబీమెలెకు, ఫీకోలు అనువారే ఇస్సాకు కాలములోను ఉన్నారని లేఖన పరిశీలకుల్లో కొందరి అభిప్రాయం.
అబీమెలెకు, ఫీకోలు అనేవి హోదాలు?
ఇస్సాకుకు కలిసిన అబీమెలెకు, ఫీకోలు అబ్రాహాము కాలమునాటి వారు కాదని లేఖన పరిశీలకుల్లో కొందరి అభిప్రాయం. ఈజిప్టు రాజును 'ఫరో' అని పిలుస్తున్నట్లు గెరారు రాజును అబీమెలెకు అని, అతని సేనాధిపతిని ఫీకోలు అని పిలువబడినట్లు లేఖన పరిశీలకుల్లో కొందరి అభిప్రాయం.
'మెలెకు' అనే పదమునకు హెబ్రీ భాషయందు 'రాజు' అని అర్థము ఉన్నది. అబి+మెలెకు అనగా 'రాజుకు తండ్రి' అనే అర్థము ఉన్నది. అలాగే రాజాధినేత అనే నానార్థం కూడా ఉంది. దీనిని బట్టి అబీమెలెకు అనేది గెరారు రాజులను సూచించే పదమని కొందరి అభిప్రాయం. అలాగే ఫీకోలు అనేది సేనాధిపతికి ఉద్దేశింపబడిన ప్రత్యేకించిన పదమని కూడా లేఖన పరిశీలకుల్లో కొందరు అభిప్రాయమును వ్యక్తము చేస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి