#క్రీస్తు_శాస్త్రము_పార్ట్-1
#దైవ_లక్షణములు...
యేసు ప్రభువుయొక్క వ్యక్తిత్వములో దైవ లక్షణాలు లేదా గుణగణాలు ప్రస్ఫుటమవుతున్నాయి.
ఈ గుణశీలాలు కేవలం దేవునికి మాత్రమే పరిమితం. దేవుడు తప్ప సృజింపబడింది ఏది కూడా దేవదూత అయినా, మానవుడు అయినా ఈ లక్షణాలు మూర్తీభవించినవారుకారు. దేవుని ఈ గుణగణాలను దేవునికి తప్ప మరి ఎవరికి ఆపాదించినా అది దైవదూషణ అవుతుంది.
యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కనుకనే దేవునికే స్వంతమయిన గుణశీలాలను తను కూడా కలిగి ఉన్నాడు అన్నది నిర్వివాదాంశం.
1. స్వయంభవుడు (self-existent):
దేవుడు “స్వయంభవుడు” అనగా తనంతట తానే కలవాడు. మరెవ్వరూ దేవుని యొక్క ఉనికికి కారణం
కాదు. దేవుణ్ణి ఎవ్వరూ సృష్టించలేరు. దేవున్ని ఏ శక్తి కూడ సృజించలేదు. దేవుడు తనంతట తానే ఉన్నవాడు,
ఉన్నవాడు అనగా కలిగినవాడుకాదు. ఉంచబడినవాడు కూడా కాదు. దేవుడు స్వయంభవుడు. స్వయంభవత్వం
వలన దేవుడు సర్వ స్వతంత్రుడు. దేవుడు ఎవరిమీద ఆధారపడడు. పరాధీనుడు కాదు. క్రీస్తు ప్రభువు
స్వయంభవుడు.
యోహాను 5:26 లో యేసుప్రభువు బహుతేటగా ఈ విషయాన్ని వెల్లడిచేశాడు. “తండ్రి ఏలాగు తనంతట తానే జీవంగలవాడై యున్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవంగలవాడై యుండుటకు అధికారం అనుగ్రహించాడు.” తండ్రియైన యెహోవా దేవుడు ఎలాంటి వ్యక్తో, కుమారుడైన యేసుకూడా అలాంటి వ్యక్తియే అని మనం గ్రహించాలి. క్రీస్తు తన జీవాన్ని తండ్రి నుండి గ్రహించలేదు. లేదా
తండ్రి కుమారుని లోనికి తన జీవాన్ని ప్రవేశపెట్టలేదు. యేసుక్రీస్తు తనంతట తానే జీవాన్ని కలిగి ఉన్నాడు.
కాబట్టి కుమారుడు జీవప్రదాత. ఒకరినుండి జీవాన్ని గ్రహించిన వ్యక్తి దాన్ని ఇతరులకు ప్రసాదించలేడు.
యేసుక్రీస్తు ప్రభువు స్వయంభవుడు.
2. నిర్వికారుడు (Immutable):
దేవుడు నిర్వికారుడు. దేవుడు వికారములేని వాడు అనగా చపలుడు కాదు స్థిరుడు. మార్పులేనివాడు.
దేవునిలో వ్యత్యాసం లేదు. ఆయనలో చంచలత్వం లేదు. గమనాగమనాల వలన కలుగు ఛాయలేదు.
ఈ లక్షణాన్ని బట్టి దేవునిలోని దైవత్వం నీరసించేది కాదు,
క్షయమయ్యేది కాదు, కృశించిపోయేది కాదు.
హెబ్రీ 1:11-12(కీర్తన 102:25, 27; మలాకీ 3:6)
దేవుడు సదానిలిచి ఉండేవాడు. ఆయన ఏకరీతిగానే ఉన్నాడు.
ఈ మాటలు దేవుడు కాకతాళీయంగా పలుకలేదు.
కాని తన కుమారునితోనే చెప్పాడు. కుమారుడైన యేసుక్రీస్తు నిర్వికారుడు. యేసుక్రీస్తు శరీరధారి కాకమునుపు, శరీరధారిగా ఉన్నప్పుడు, ఇప్పుడు రాబోయే యుగములలో కూడా ఒకేరీతిగా ఉన్నాడు.
హెబ్రీ 13:8.
యేసుక్రీస్తు నిన్న, నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును
యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. . యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయనలో ఏ మార్పులేదు. దైవలక్షణాలన్నీ పుణికిపుచ్చుకొనే ఉన్నాడు. ఆయన దైవత్వానికి మానవత్వం కలుపబడిందే తప్ప, దైవత్వములో ఏదీ కొదువ కాలేదు. ఆయన నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు.
3. నిత్యుడు ( Eternal ) :
దేవుడు నిత్యుడు. ఆయన నిత్యత్వము కలవాడు. దేవునికి ప్రారంభంలేదు. ఆయనే ఆది, ఆరంభం, మొదటివాడు. దేవునికి అంతము లేదు. ఆయనే అంతం, ముగింపు, కడపటివాడు. దేవుడు కాలపరిమితి
లేనివాడు. కాలాతీతుడు, కాలానికి అందనివాడు. యేసుక్రీస్తు నిత్యుడు. ఆయనే కాలాన్ని సమయాన్ని సృజించాడు.
“నేను అబ్రాహాముకంటే ముందు ఉన్నాను” అన్నాడు
(యోహాను 8:58).
పేతురు తన రెండవ పత్రిక 3:8 లో ప్రభువు దృష్టికి ఒక దినం వేయి సంవత్సరాలవలెను లేక వేయి సంవత్సరాలు ఒక దినంగాను ఉన్నాయి.
(ప్రకటన 1:8 ). “అల్ఫాయు, ఒమేగాయు నేను, వర్తమాన, భూత, భవిష్యత్కాలములలో ఉన్నవాడను
నేనే అని సర్వాధికారియు, దేవుడుగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.” యేసుక్రీస్తు ప్రభువు కాలాతీతుడు.
ఆయన సర్వకాలసర్వావస్థలలో ఉన్నవాడు. (పకటన 4:8,4:9), యుగయుగాలకు జీవించుచున్నవాడు, అల్ఫా ఒమేగా అనునవి గ్రీకు అక్షరములు. అల్ఫా మొదటి అక్షరము,ఒమేగా ఆఖరి అక్షరము. అనగా యేసుకు ముందు ఏదీకూడా లేదు. అంతేకాదు, ఆయన తరువాతా ఏదీ ఉండదు. దాని భావం యేసుక్రీస్తు నిత్యుడు.
4. పరిశుద్ధుడు (Holy) :
దేవుడు పరిశుద్ధుడు. దేవునిలో ఏ పాపం లేదు. ఆయన పాపరహితుడు. యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధుడు,
పాపరహితుడు, నిర్దోషి, నిర్మలుడు, నిష్కల్మషుడు. (హెబ్రీ 7:26). (అ.కా. 4:28-30) - "పరిశుద్ధ సేవకుడైన
యేసు” (మార్కు 1:24) - “దేవుని పరిశుద్ధుడవు” (1 పేతురు 1:19).
యేసు రక్తము నిర్దోషమైనది, నిష్కళంకమైనది. యేసు ప్రభువు పరిశుద్ధుడు కాకపోతే మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగదు. “మీరు పరిశుద్ధుడును, నీతిమంతుడైన వానిని నిరాకరించి” (అ.కా. 3:14).
మీరు పరిశుద్ధుని వలన” (యోహాను 2:20), “సత్యస్వరూపియగు పరిశుద్ధుడు” (ప్రకటన 3:7; లూకా 1:35; యోహాను 6:69).
5. సార్వభౌముడు (Sovereignty):
అనగా సర్వాధికారంగలవాడని అర్థం (ప్రకటన 19:6-7) “సర్వాధికారియు....” ఆయన సృష్టికర్త గనుక సర్వాధికారము కలిగినవాడైయున్నాడు. యేసు ప్రభువు సర్వాధికారియైన దేవుడు (యోహాను 10:17,18)
“నా ప్రాణము పెట్టుచున్నాను....
దాని పెట్టుటకు తీసుకొనుటకు నాకు అధికారం కలదు.”
6. సర్వశక్తిమంతుడు (Omnipotent) :
యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు. ఆయనకు తన శక్తిని వినియోగించడానికీ, ఏ పనికీ కూడా ఎవరి
ఆధారం, అవసరం, సహకారం అక్కరలేదు. ఎవరి సహాయం అవసరం లేదు. యేసుక్రీస్తు భూమిమీద
ఉన్నప్పుడు తన శక్తిని ప్రదర్శించాడు. (లూకా 7:14, 15). చనిపోయిన నాయీను విధవరాలి కుమారుణ్ణి
బ్రతికించినప్పుడు; (మత్తయి 9:29,30) ఇద్దరు గ్రుడ్డివారికి దృష్టి ప్రసాదించినప్పుడు; (మార్కు 1:40-42)
కుష్టురోగిని స్వస్థపరచినప్పుడు; యేసుక్రీస్తు పక్షవాతరోగము గలవానిని, కుష్ఠురోగులను శుద్ధి చేసినప్పుడు, వ్యాధిపై తన శక్తిని ఆయన ప్రదర్శించాడు. (లూకా 8:54,55). సమాజ మందిరపు అధికారి కుమార్తెను బ్రతికించుట; (యోహాను 11:43,44) చనిపోయిన లాజరును బ్రతికించుట; యేసుక్రీస్తుకు మరణం మీద శక్తి ఉంది (మత్తయి 8:16) . యేసుక్రీస్తు దయ్యములపై, అపవిత్రాత్మలపై తన శక్తిని చూపాడు. (మత్తయి 8:26, 27). యేసుప్రభువు సృష్టిపై, నీటి పై, గాలిపై, చెట్లపై తన శక్తిని చూపాడు. యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు.
7.సర్వవ్యాపి (Omnipresent):
యేసుక్రీస్తు సర్వవ్యాపి. ఆయన సర్వవేళల్లోను, సర్వస్థలాల్లోను, సర్వావస్థల్లోను - ఏకకాలంలో
ఉండగలడు. ఆయనను అడ్డగించగలిగినదేమీలేదు (మత్తయి 18:20). ఆయన శిష్యులు ప్రపంచమంతటా
చెదిరి ఉన్నారు. ఆయన నామంలో వారు ఎప్పుడు ఎక్కడ కూడినను ప్రభువు తాను వారి మధ్యను ఉంటానని
వాగ్దానం చేసినాడు. ఆయన మాట తప్పనివాడు. సత్యవంతుడు. ఆయన అబద్ధికుడు కాడు. (మత్తయి 28:20).
ఆయన సువార్తను ప్రపంచం నలుదిక్కులకు తీసుకువెళ్ళే ప్రతి వ్యక్తితోను కూడా ఆయన ఉన్నాడు(యోహాను
14:20). యేసుక్రీస్తు ప్రతి విశ్వాసిలోను నివసించుచున్నాడు(ఎఫెసీ 1:23).
యేసుక్రీస్తు ప్రభువు సమస్తమును పూర్తిగా నింపు సంపూర్ణుడు. యేసుక్రీస్తు ప్రభువు
సర్వవ్యావి.
(సర్వాంతర్యామి అనే మాటను ఇక్కడ నేను వాడలేదు. సర్వాంతర్యామి అనగా అన్నిటిలోను
వ్యాపించియున్నవాడు. కాని దేవుడు అన్నింటిలో లేడు; రాళ్ళల్లో చెట్లల్లో ఆయన ఉండడు. సర్వవ్యాపి అంటే
అన్ని స్థలాల్లో ఉన్నవాడు. అంతేకాని ఆయన ఆంతర్యామి కాదు).
8. సర్వజ్ఞాని (Omniscient) :
యేసుక్రీస్తు ప్రభువు సర్వజ్ఞాని. ఆయన సమస్తాన్ని ఎరుగును. ప్రతి వ్యక్తిని ఎరుగును. భూత, వర్తమాన,
భవిష్యత్కాలాలలోని సంభవాలన్నీ ఎరుగును. ఆయన జ్ఞానం మితిలేనిది. పరిమితులు లేనిది( యోహాను1:16-19;:16-19;
రోమా 7:10). యేసుక్రీస్తు మనుష్యుల రహస్య జీవితాన్ని ఎరుగును(యోహాను 1:48). దూరంగా ఉన్న వ్యక్తులు ఏమి చేస్తున్నది ప్రభువు ఎరుగును(యోహాను 2:24,25). రహస్య ఆలోచనలు ఎరుగును.
(లూకా 5:22 ) యేసుక్రీస్తుకు మనుష్యుల హృదయాలు, వారి మనస్సులలో ఏమున్నదో, వారి ఆలోచనలు
తెలియును(లూకా 5:22-12). యేసుకు సంభవించబోయే సంగతులు ప్రతి చిన్నవి కూడా క్షుణ్ణంగా తెలుసు
(లూకా 22:10-12). మానవులు భవిష్యత్తులో దేనిని ఎన్నిక చేసుకుంటారో ప్రభువుకు తెలుసు.
ఆయనయందు ఎవరు విశ్వాసముంచుతారో, ఎవరు ఆయనను తృణీకరిస్తారో కూడా ఆయన ఎరుగును(యోహాను 6:64). యేసుక్రీస్తు సమస్తము ఎరుగును. ఆయనకు మరుగైయున్నదేదీ లేదు.
ఆయనయందు సమస్తమైన జ్ఞానసంపదలు గుప్తమైయున్నవి(యోహాను 16:30; కొలొస్స2:3).
9. సత్యసంధత్వము (Truthfulness) :
దేవుని సత్యసంధ్యత్వము అనగా దేవుని జ్ఞానము. దేవుని మాటలు, క్రియలు, సత్యమైనవి, మరియు
సత్యానికి ప్రామాణికమైనవి అని అర్థం. ఆయనలో అబద్ధము లేదు. ఆయనే సత్యం. యోహాను 14:6 నేనే
సత్యం...”. యేసుప్రభువు నేను సత్యాన్ని అని ఎలుగెత్తి చాటాడు(యోహాను 17:17, యోహాను 1:1-14). వాక్యము అనగా దైవ వాక్కే అనగా సత్యము. యేసుప్రభువు వాక్యము అనగా సత్యము. (1యోహాను
2:8; యోహాను 1:9). సత్యమునకు 'వెలుగు' పర్యాయపదముగా వాడబడింది. చీకటి అనగా అబద్ధం.
యేసుక్రీస్తు నిజమైన వెలుగు. ఆయన సత్యము; అనగా యేసుక్రీస్తు క్రియలు, మాటలు, జ్ఞానము, ప్రణాళికలు,
సంకల్పాలు అన్నీ కూడా సత్యమే.
ఆయన సత్యవంతుడు కనుక నమ్మకమైనవాడు ఆయనే. ఆయన సత్యము కనుక న్యాయాధిపతియైనవాడు.
ఆయన తీర్పులు సత్యము. (ప్రకటన 3:7) “... సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. ( పరిశుద్ధుడు
సత్యవంతుడైయుండాలి ). యేసుక్రీస్తు సత్యస్వరూపి. వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన
మధ్య నివసించెను. సత్యమునకు భౌతిక రూపం యేసుక్రీస్తు. సత్యమునకు సంపూర్ణత యేసుప్రభువు(ప్రకటన 3:14). యేసుక్రీస్తు సత్య సాక్షి. యేసుక్రీస్తు ప్రభువు తనను గూర్చి తాను చెప్పుకొనిన సాక్ష్యం సత్యం.
10. ప్రేమ (Love) :
దేవుడు ప్రేమాస్వరూపి. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమామయుడు. దేవుని ప్రేమ అనగా ఆయన తన్నుతాను
అర్పించుకొనుట. యేసుప్రభువు తన్నుతాను మానవాళి కొరకు బలి అర్పణ గావించాడు. (యోహాను 13:1)
లోకములో ఉన్న తనవారిని ప్రేమించాడు, అంతమువరకు ప్రేమించాడు. (1యోహాను 3:16). మనకొరకు
ప్రాణం పెట్టాడు గనుక ఆయన ప్రేమ ఎట్టిదో అర్థము చేసికొనవచ్చు (గలతీ 2:20). ప్రేమించి తన్ను తాను
అర్పించుకొన్న దేవుని కుమారుడు.
ఈ సమాచారము::
'జోషి లీలన్ రెడ్డి' గారు వ్రాసిన ""క్రీస్తు శాస్త్రము"" అను పుస్తకము లోనిది.
పేజీ 16-19
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి