✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(23 వ భాగము )
*అన్నా ప్రవక్తి - మొదటి భాగం*
లూకా 2:38 ఆమెకూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.
సుమెయోను మరియు అన్నా ఇశ్రాయేలుకు మెస్సీయ వచ్చేటప్పుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇశ్రాయేలులో మెస్సీయ వచ్చాడని వారు గుర్తించారు. పరిశుద్ధ గ్రంధంలో అన్నాను గురించి కొంచెమే వ్రాయబడినది. అదైనా లూకా మాత్రమే అన్నాను గురించి వ్రాశాడు.
అయినా ఆమె జీవితం ఆమె పరిచర్య ఎంతో మనకు ఆదర్శం, దేవుని పరిశుద్ధ గ్రంధంలో వెలుగులోనికిరాని అనేకమంది వినయ విధేయతలు దైవభక్తి మరియు గొప్ప పరిచర్య చేసిన నాయకులు సేవకుల్లాగే, ఆమె కూడా గుర్తించబడలేదు. కానీ ఆమె ఇజ్రాయెల్ లో ఒక గొప్ప శక్తివంతురాలుగా ఉన్నది. అన్నా ప్రవక్తిగురించి కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం.
*1. అన్నా దేవునికి సాక్షిగా ఉన్నది:* అన్నా కూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.
ఇక్కడ అన్నా ప్రవక్తి యేసును గూర్చి ఏమి మాటలాడు చుండెను? ఈ ఘటన ద్వారా మలాకీ 3: 1-5 యొక్క ప్రవచనాన్ని నెరవేర్చబడినది.
(మలాకీ 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, *తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును;* ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.)
దేవుడు ఇశ్రాయేలులో మెస్సీయను ధృవీకరించడానికి దైవభక్తిగల మనిషిగా మరియు దైవిక స్త్రీ యొక్క సాక్ష్యాన్ని కోరుకున్నాడు. అదే సమయంలో అన్నా అక్కడకు వచ్చి ఇశ్రాయేలు కొరకు వచ్చిన మెస్సియా ఈ బాలుడేనని అన్నా చెప్పిన సాక్ష్యమే దేవాలయంలో ఆమె యొక్క మాటలు.
*2. అన్నా మరియు సుమెయోను ద్వారా యేసే మెస్సియా అనే సంగతి ధృవ పరచబడినది:* ఎందుకు దేవుడు ఒకే సమయంలో సిమియోను మరియు అన్నా ప్రవక్తిలను దేవాలయమునకు రప్పించాడు? దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది.
ఏదైనా ఒక విషయాన్ని ధర్మశాస్త్రం ప్రకారం ధ్రువీకరించాలంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల నోటి ద్వారా విషయం నిర్ణయించ బడుతుంది.
అందువలన ధర్మశాస్త్రం నిబంధన నెరవేరునట్లు, సుమెయోను మరియు అన్నా ప్రవక్తి ద్వారా దేవుడు యేసే మెస్సియా అని సాక్ష్యం చెప్పించాడు.
(ద్వితీయోపదేశకాండము 19:15 ... ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింప కూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును).
అపోస్తలుడైన పౌలు కొరింథు సంఘమునకు వ్రాసినప్పుడు అదే భావనను పౌలు ధృవీకరించాడు, II కొరింథీయులకు 13: 1 ... "ఈ మూడవ సారి నేను మీయొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచ బడవలెను."
మెస్సీయ రాకను ధృవీకరించడానికి దేవుడు సుమెయోను మరియు అన్నాలను ఎన్నుకున్నాడు. భక్తులైన పురుషులను మరియు భక్తులైన మహిళలను ప్రభువు నేడు తన పని నిర్ధారించడానికి కోరుకుంటున్నాడు.
*౩. అన్నా అనగా కృప:* గ్రీకులో అన్నా అంటే "కృప". హిబ్రూలో అదే పేరు హన్నా, మరియు ఇది కూడా "కృప" అని అర్థం ఇచ్చు పదమే. దేవుని అధ్బుతమైన కృప పొందిన స్త్రీలుగా *అన్నా మరియు హన్నా* ఉన్నారు. మనం రక్షించబడాలంటే కృప ద్వారా మాత్రమే అది సాధ్యం.
(ఎఫెస్సీ 2:8 మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.)
మనమందరం రక్షించబడాలని దేవుని గొప్ప కృపగా ఉన్న యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తీతు 2:11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన *దేవుని కృప* ప్రత్యక్షమై...
దేవుని కృప అందరికీ అందుబాటులోకి వచ్చింది. క్రీస్తులో నమ్మకం ఉంచితే అందరూ విముక్తి, రక్షణ పొందుతారని అర్థం. (యోహాను 1:16 ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు)
పాప విముక్తిద్వారా మనుష్యులను రక్షించిన కృప వారిని విడిచి పెట్టునది కాదు. వారిలో ఉండి వారిని బలపరచునది.
కీర్తనలు 86:13 ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది.మనం కేవలం కృప ద్వార మాత్రమే రక్షించ బడితిమి.
"అర్హత లేనివాడు అర్హునిగా ఎంచ బడడమే కృప యొక్క నిర్వచనం. మనకు అర్హత లేకపోయినా యేసు తన కృప ద్వారా మనలను రక్షించుటకు కృపా స్వరూపుడుగా ఈ లోకంలో జన్మించినాడు. ప్రభువా అని పిలువడానికి కూడా అర్హతలేని మనకు తండ్రీ అని పిలిచే యోగ్యత నిచ్చింది ఆయన కృప.
(2 కొరింది 12:9 అందుకునా కృప నీకు చాలును) ఎటువంటి వ్యక్తిగత, కుటుంబ, మానసిక, ఆర్ధిక, సామాజిక సమస్యలైనా సరే భయపడవద్దు. దిగులు చెందవద్దు. నీ ప్రియ రక్షకుడు నీకిస్తున్న వాగ్దానం 'నా కృప (యేసు) నీకు చాలు' కారణం ఆయన మన యెడల చూపు కృప గొప్పది.
అవును! అవి ఎట్లాంటి పరిస్థితులైనాసరే. చివరకు అది అగ్నిగుండమైనా సరే. ఆయన కృప నీకు తోడుగా వుండబోతుంది.
పర్వతములు తొలగి పోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు యెషయా 54:10
మనము చేయునదంతయు ఆయన కృపను బట్టియేగాని, మనము సాధించిన దేనిని బట్టి కూడా ఆయన సేవ చేయలేమని దేవుని వాక్యంలో మనము స్పష్టముగా చూచుచున్నాము.
కీర్తనలు 103:11 భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.
అన్నా పేరు మనకు దేవుని కృపను మరోసారి గుర్తు చేస్తున్నది.
అన్నా ప్రవక్తి గురించిన మరి కొన్ని విషయాలు రేపు పరిశీలిద్దాం. ప్రభువు తన గొప్ప కృపను మన హృదయాలలో సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆమెన్! (To be continued..)
దైవాశ్శీసులు
From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_
Immanuel Bible College
NIDUBROLU, Guntur dt.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి