ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(13 వ భాగము )
*ఎవరీ శిశువు - గొప్ప వెలుగు*


యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు *గొప్ప వెలుగును* చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద *వెలుగు* ప్రకాశించును. 

క్రిస్మస్ సందర్భంగా మందిరాలకు ఇండ్లకు ఎలక్ట్రికల్ లైట్లతో అలంకరణ చేయడం, సంఘంలో క్రొవత్తులు వెలిగించి ఆరాధన చేయడం ఎంత వరకు సమంజసం?

యెషయా కాలంనాటి ప్రజలు భయంకరమైన పాపపు చీకటిలో మ్రగ్గుచుండగా *గొప్ప వెలుగుగా* శిశువు అనుగ్రహింప బడుచున్నాడని ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయు చున్నాడు. 

కుమారుని రూపంలో *వెలుగు* ఈ లోకంలోకి వచ్చింది. (యోహాను 8:12 మరల యేసు నేను లోకమునకు *వెలుగును.*)

*కుమారుడు* లోకంలోని అన్ని జాతులను కూడా వెలిగించేందుకు వచ్చాడనేది స్పష్టం. యెషయా 42:7  *అన్య జనులకు వెలుగుగాను* నిన్ను నియమించి యున్నాను. సిమియోను ప్రవక్త కూడా ఇదే ప్రవచనాన్ని ఎత్తి పలికాడు. లూకా 2:30-31 అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు  *వెలుగుగాను* నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.

కాని *వెలుగైయున్న కుమారుని* నిరాకరించి అనేకులు చీకటి జీవితాలనే కోరుకోవడం విచారకరం. అది తీర్పునకు శిక్షకు దారి తీస్తున్నది. (యోహాను 1:5 ఆ *వెలుగు* చీకటిలో ప్రకాశించు చున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను). వెలుగైన యేసును నిరాకరించి చీకటిలో జీవిస్తున్న వారికొరకు ఇప్పటికే  ఈ తీర్పు సిద్ధంగా ఉన్నది. (యోహాను 3:19 ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు *వెలుగును* ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. యోహాను  3:18 విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.)  

పాపవిముక్తి గురించిన అద్భుతమైన సత్యాలను *వెలుగైన యున్న కుమారుడు* ఈ లోకంలోకి తెచ్చాడు. కానీ మనుషులు ఆయన్ను గానీ ఆయన తెచ్చిన సత్యాన్ని గానీ ఇష్టపడలేదు. వారికి వేరొకటి ప్రీతిపాత్రంగా ఉంది. అదే పాపపు చీకటి. 

చీకటి పాపానికి దాపరికానికీ కపటానికీ అజ్ఞానానికీ అసత్యానికీ దుర్మార్గతకూ సూచన. అలాంటి చీకటిని అంటే ఇష్టమున్న వారికి *వెలుగు* అంటే ఏమాత్రం పడదు. వారు నరకానికి పాత్రులైన పాపులనీ, క్రీస్తు మాత్రమే వారిని దాని నుంచి తప్పించగలడు. వారి స్థితిని ఉన్నదున్నట్టుగా ఆ వెలుగు బయటపెడుతుంది. అంతేగాక వారు చేయడానికి ఇష్టపడే చెడు కార్యాల్లో మునిగి తేలుతూ ఉండకుండా వెలుగు అడ్డుపడుతుంది. అందువల్ల వెలుగంటే వారికి ద్వేషం. అంటే వారు క్రీస్తునూ, ఆయన సత్యాన్నీ ద్వేషిస్తున్నారు. యేసు అనేకసార్లు చెప్పిన గంబీర సత్యమిది. యోహాను 7:7; 15:18,23–25). 

దీన్ని బట్టి మనం గ్రహించవలసినది ఏమంటే, మనుషులలోని అపనమ్మకానికి కారణమైన వారి పాపం, చీకటి కారణంగానే వారు యేసుని నమ్మరు. అందువలన ఈలోకానికి వెలుగు యొక్క ప్రాముఖ్యత తెలియాలి.  

అందుకే *కుమారుడు* అనబడిన ఆ వెలుగును మనము మనుష్యులందరి యెదుట ప్రకాశింప జేయాలి. దానికి సాదృశ్యంగానే మనం క్రిస్మస్ రోజున మన ఇండ్లను మందిరాలను వెలుగుతోను సంఘంలో క్రొవొత్తుల వెలుగుతోను *అన్య జనుల ఎదుట ప్రకాశింప జేస్తాము.* ఇదే క్రిస్మస్ లైట్ల వెనుక ఉన్న ఆత్మీయ భావం.

ఈ క్రిస్మస్ లైట్ల అలంకరణ క్రొవొత్తుల వెలుగు యొక్క ఆత్మీయ భావాన్ని గురించి మరికొన్ని విషయాలు పరిశీలిద్దాం.

*1. వెలుగు సత్క్రియలను తెలియజేస్తున్నది:* మత్తయి 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట *మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.*

ఇండ్లను మందిరాలను దీపాలతో అలంకరించడంలో ఉన్న ఆత్మీయ ఉద్దేశ్యమేమంటే క్రైస్తవులైనవారు తమలోని క్రీస్తు వెలుగును ఆత్మీయంగా ప్రకాశింపజేసి అనేకులను తమ సత్క్రియల ద్వారా ప్రభువు వైపునకు అనగా  సంఘం లోనికి నడిపించాలి. 

కేవలం దీపాలు పెట్టినంత మాత్రాన సరిపోదు. మంచి మాటలు కాదు, మంచి ఉద్దేశాలు కాదు, మంచి పనులు చెయ్యాలి. వెలిగింపబడిన జక్కయ్య సత్క్రియలు చేశాడు. ఇతరుల యెడల దయ చూపించకుండా సహాయం చేయకుండా చాలామంది తమకేదో వెలుగు, జ్ఞానప్రకాశాలు కలిగినట్టు గొప్పలు చెప్పుకుంటారు. అదంతా వ్యర్థం. 
 
*2. వెలుగు సంతోషాన్ని తెలియజేస్తున్నది:* ఇది ప్రజలందరికి కలుగు మహా *సంతోషకరమైన* సువర్తమానం అని దూత పలికింది. మనసుకు *సంతోషాన్ని* సమాధానాన్ని ప్రశాంతతను ఇచ్చే సహజ క్రిస్మస్ దీపాలంకరణలను ఏర్పాటు చేసుకొని ప్రభువును ఆరాధించడం అందరికి సంతోషదాయకం. దీపాలంకరణ యొక్క ఆత్మీయ భావమేమంటే అనేకులకు క్రిస్మస్ సంతోషాన్ని పంచాలి.

లూకా 2:9-10 ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; యెషయా 60:1 నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను

*౩. వెలుగు సత్యాన్ని తెలియజేస్తున్నది:* అనగా నిజమైన మార్గాన్ని తెలియ జేయును. ఈ లైట్ల అలకరణల ద్వార మనం తెలియజేసే ఆత్మీయ సత్యం ఏమంటే, చీకటిలో సరైన వాస్తవం తెలియక మార్గం తెలియక పాపాంధకారంలో కొట్టుమిట్టాడుతూ మ్రగ్గుతున్న సర్వమానవుల కొరకు పరలోక మహిమ అయిన కుమారుడు ఈలోకానికి నిజమైన వెలుగుగా దిగివచ్చాడనే విషయం మనం తెలియజేస్తున్నాము. కీర్తన 43:3 నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును.  

ఈలోకంలో అనేక వెలుగులు ఉన్నాయి కాని నిజమైన వెలుగు యేసే. ఆయన మాటలే సత్యం. కీర్తన 119:105  నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును

*4. వెలుగు నీతిని పరిశుద్దతను తెలియజేస్తున్నది:* (సామెతలు 13:9 నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును. సామెతలు 4:18 పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును) 

చీకటిని వెలుగు పారద్రోలినట్లు మనలో ఉన్న పాపాన్ని క్రీస్తు తన  వెలుగు ద్వారా పారద్రోలినప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి క్రీస్తు పరిశుద్ధతతో మన హృదయం నింపబడుతుందని, మన హృదయంలో ఉన్న ఆ నీతిని పరిశుద్ధతను బహిరంగంగా వ్యక్తపరచి దాని ద్వార ఇతరులకు క్రీస్తును గురించిన ఆసక్తిని  కలుగజేయడమే ఈ దీపాల ఆత్మీయ ఉద్దేశ్యం.

*5. వెలుగు మనోహరమైనది గనుక అనేకులను ఆకర్షించునది:* వెలుగు అనేకులను ఆకర్షించును. ఇది క్రైస్తవ ప్రేమను తెలియజేయు చున్నది.  (ప్రసంగి 11:7 వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగా నున్నది.)  నీతి సూర్యుడైన కుమారుడు మనోహరమైన వాడు. ఆయన తన వెలుగు అనే ప్రేమ ద్వారా అనేకులను ఆకర్షిస్తున్నాడు. అయితే త్వరలోనే చీకటిదినాలు కారు మేఘాలు కమ్ముకోబోతున్నాయి, (వచనం 8). దేవుని తీర్పు వస్తుంది. కృపాకాలం అంతరించ బోతోంది. ఇప్పుడే ఈ దీపాల ద్వారా అనగా వెలుగుచున్న క్రైస్తవులు తమ వెలుగు అనబడిన ప్రేమ ద్వారా అనేకులను సంఘంలోనికి ఆకర్షించాలి. 

క్రైస్తవులైన వారు తమ మనోహరమైన క్రైస్తవ ప్రేమ ద్వారా అనేకులను ప్రభువు దగ్గరకు ఆకర్షించడమే ఈ దీపాల అలంకరణ యొక్క ఆత్మీయ ఉద్దేశ్యం. 1 యోహాను 2:10 తన సహోదరుని *ప్రేమించువాడు వెలుగులో* ఉన్నవాడు; మత్తయి 5:14 మీరు లోకమునకు వెలుగైయున్నారు.

*6. వెలుగు జీవమై యున్నది:* అనగా వెలుగు బ్రతికించునది. వెలుగు లేక పోతే సర్వసృష్టికి మరణమే. మన ఇండ్లను, మందిరాలను క్రిస్మస్ సందర్భంగా దీపాలతో అలంకరించుటలో ఉన్న మరియొక ఆత్మీయ వుద్దేశ్యమేమంటే క్రైస్తవుల కుటుంబాలు, సంఘాలు జీవముతో నింపబడియున్నవి అనే తెలియజేయుట (యోహాను 8:12 మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగి యుండునని వారితో చెప్పెను.) 

కుమారుడైన యేసు ద్వారానే మనుషులు జీవాన్ని పొందగలరు. దేవుని జీవాన్ని వెలుగును రూపంలో మనుష్యులకు తెచ్చినది కుమారుడైన యేసు ప్రభువే. నీ వాక్యం నన్ను బ్రతికించునది అని కీర్తనాకారుడు అంటున్నాడు కదా!  (యోహాను  1:4 ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.)

*7. వెలుగు అక్షయత భాగ్యాన్ని తెలియ జేస్తున్నది:* వెలుగు అక్షయతను చూపుచున్నది. (2 తిమోతి 1:10  ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును *అక్షయతను సువార్తవలన వెలుగులోనికి* తెచ్చెను) 

అంతేకాకుండా దేవుడు  ఎలా మానవుడయ్యాడో ఎలా పాప పరిహారం చేసి సర్వ మానవులకు పరలోక నిత్యజీవం అనే భాగ్యాన్ని కలుగజేయుటకు సృష్టికర్త ఎలా బాలుడు అయ్యాడు, ఎలా ఆయన ధనవంతుడు అయినప్పటికిని, మన కోసం ఆయన ఎలా దరిద్రుడయ్యాడో, ఆయన పేదరికము ద్వారా మనం ఎలా  ధనవంతులుగా అవడానికి ఆయన ఈలోకంలో  జన్మించాడో అనే విషయాన్ని  మనం లోకానికి ఈ దీపాలంకరణ ద్వార  తెలియజేస్తున్నాము. 

ఈ వెలుగులోనికి వచ్చిన వారందరూ, పరలోక అక్షయతను పొందుకుంటారని దీపాల అలంకరణ ద్వారా చెప్పుచున్నాము. (II కొరి 8:9)  

కుమారుడైన యేసు ఎవరి హృదయాలలో జన్మించాడో వారు నిజంగానే భాగ్యవంతులు. ఈ అద్భుత విషయాన్ని ప్రజలందరికి తెలియ పరచడమే ఈ అలంకరణ ముఖ్య ఉద్దేశ్యం అంతే కానీ ఇందులో వేరే భావం లేదు.

బైబిలు క్రిస్మస్ అలంకరణలను బహిష్కరించడం లేదు.  కొంతమంది దీనిని దీపావళి అలంకరణలతో పోల్చి క్రిస్మస్ లైట్ల అలంకరణ అన్యాచారమని ఈ విధంగా మనం చేయడం పాపమని అంటున్నారు. దీపావళి అలంకరణ వేరు క్రిస్మస్ అలంకరణ వేరు. దానికి దీనికి ఏమాత్రం సంబంధంలేదు.

ప్రోటేస్టెంట్ సంస్కర్త మార్టిన్ లూధర్ జీవిత చరిత్రనుండి చూస్తే ప్రకాశించే నక్షత్రాలను చూచి అతడు స్ఫూర్తిని పొంది, తన ఇంటిని క్రొవ్వత్తులతో అలంకరించాడు, యేసు జన్మించినప్పుడు పుట్టిన నక్షత్రానికి, ప్రకాశించిన మహిమకు అది జ్ఞాపకంగా ఆ గొప్ప దైవజనుడు భావించాడు.

ఒక మందిరాన్ని లేదా ఇంటిని క్రిస్మస్ సందర్భంగా చక్కగా దీపాలతో అలకరించుకోవడంలో, హాని ఏముంది! పండుగ సమయంలో ఇళ్ళను చూడ ముచ్చటగా అలంకరించు కోకూడదు అని, స్మారక దినాన సమాధులను పూలతో దీపాలతో అలంకరించకూడదు అని అంటే ఎలా?  లైట్లు వెలిగించడం క్రిస్మస్ పండుగ యొక్క ఆత్మీయ భావంతో కూడిన అలంకరణే గాని వేరొకటి గాదు. 

చర్చీలను లైట్లతో అలంకరించడం దుష్ట ఆరాధన అయితే, క్రిస్మస్ సమయంలో మన శరీరానికి మనం చేసే అలంకారం మాటేమిటి? మన శరీరం దేవునికి దేవాలయమై ఉండగా మన శరీరానికీ మనం చేసే అలంకరణ చూస్తే కళ్ళు తిరగాల్సిందే.  లక్షల ఖరీదు చేసే దుస్తులు, లక్షల ఖరీదుచేసే ఆభరణాలతో మన శరీరాలకు చేసే అలంకరణ ఆది శరీర ఆరాధన క్రిందకు రాదా? అలంకరించుకొనే ఖరీదైన ఆభరణాలకన్న, పట్టువస్త్రాల కన్న ఈ క్రిస్టమస్ లైట్ల అలంకరణ అంత పాప భూ ఇష్టమేమి కాదు.
 
కాని భయంకరమైన కళ్ళు మిరిమిట్లు గొలిపే లైటింగుతో కళ్ళకు హానికలిగించే రీతిగా లైట్లు పెట్టి వాక్య విరుద్ధంగా తోటి మానవులకు ఇబ్బందిని, అసంతృప్తిని కలుగజేసే లైటింగుతో డాన్సులు, అల్లరి, గోలతో కూడిన అసహజ క్రిస్మస్ సౌందర్య అలంకరణ చేస్తే అది మొదటికే మోసం వస్తుంది. అన్యులను ఆకర్షించడానికి బదులు మనమే నరకానికి వెళ్తాం.

దేవునికి మరియు తోటి మానవులకు సంతృప్తి కలుగజేసే  సహజ క్రిస్మస్ సౌందర్య అలంకరణ పట్ల మన దృష్టి పెట్టి తద్వార అందులోని క్రీస్తును గూర్చిన ఆత్మీయ భావాలను ప్రకటించడం  మంచిదని నా అభిప్రాయం.  
 
అయితే కొందరు నామకార్ధ క్రైస్తవులు, క్రిస్మస్ సందర్భంగా లక్షల ఖరీదు చేసే దీపాలంకరణచేసి, వేలకువేలు ఖర్చు చేసి నిర్మించే పెద్ద పెద్ద లైటింగ్ స్టార్ లకు, పెద్ద పెద్ద క్రిస్మస్ చెట్ల అలంకరణకు లక్షల రూపాయల దుబారా ఖర్చు పెట్టడం దురదృష్టకరం. 

ఒక చెట్టును లైట్లతో  అలంకరించి, చెవులు బ్రద్దలయ్యేలా మైకులు పెట్టి టపాసులు కాలుస్తూ దానిని ఒక దేవునిగా ఊరేగిస్తూ, త్రాగి దాని చుట్టూ గంతులు వేస్తూ అల్లరి చేయడం మంచిది కాదు. ఇది దేవుని నామమునకు అవమానకరం. దీనికి బదులుగా ఆ డబ్బుని పేదలైనవారికి, పేద దైవజనులకు వస్త్ర సహాయంగాని, పేదవారి  అవసరాలను తీర్చడంగాని చేస్తే మంచిది. అంతేకాకుండా ఆ డబ్బును సువార్తీకరణకు గాని శిధిలావస్ధలో ఉన్న పేద మందిరాల యొక్క రిపేర్లకు గానీ ఉపయోగించడం ఇంకా  మంచిదని నా అభిప్రాయం.

నేను చేసే మనవి ఏమంటే, చక్కని దీపాలంకరణ ద్వార కలుగు వెలుగు పరలోక మహిమను పోలి దాని ద్వారా ఆత్మీయ ప్రేరణ పొంది పూర్ణ హృదయంతో సంతోషంగా క్రీస్తు దేవునికి ఆరాధన చేయాలి. వెలిగింపబడిన వారముగా అనేకులను మన సంఘాల్లోకి నడిపించాలి. అటువంటి కృపను ప్రభువు మనకు సమృధ్ధిగ దయచేయునుగాక!  ఆమెన్!!

దైవాశ్శీసులు!

From the desk of...
Pastor Jyothi Raju Vemula 
_(Soli Deo Gloria)_

Immanuel Bible College 
NIDUBROLU   

కామెంట్‌లు