ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్

⚡💫🌟✨ క్రిస్మస్ ⚡💫⚡
           (16వ భాగము) 

*తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి*.  మత్తయి 2:11

♻ *జ్ఞానులు సమర్పించిన కానుకలలో రెండవది 'సాంబ్రాణి'.*

సాంబ్రాణిని మండుచున్న నిప్పుల్లో వేస్తే, సువాసనను వెదజల్లుతుంది. అట్లానే, ఆయన మనకు పరిమళ వాసనగా ఉండుటకు శ్రమల కొలిమిలో ( సిలువలో) అర్పణముగాను, బలిగాను తన్నుతాను అర్పించు కున్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; (ఎఫెసి 5:2)

👉*సాంబ్రాణి ఆయన 'మానవత్వానికి' సాదృశ్యముగా వుంది. *

ఈ అర్పణము అర్పించడానికి శరీరధారిగా సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చాడు. ఆయన దేవుని స్థానంలో నుండి ఆ పని చెయ్యలేడా? సాధ్యం కాదు. దేవుడు ఆత్మ. ఆయనకు రక్తమాంసములు  లేవు. పరిశుద్ధుని రక్తం చిందించకపోతే మన పాపములకు పరిహారం లేదు. అందుకే, సంపూర్ణ దేవుడైయుండియూ, సంపూర్ణ మానవునిగా ఈలోకానికి ఏతెంచాడు. 

పాత నిబంధనా కాలంలో బలి అర్పణలో తప్పక సాంబ్రాణి వుండాలి. అనే నియమం వుంది. సాంబ్రాణి ఆరాధనకు కూడా సాదృశ్యముగా వుంది. అంటే? జ్ఞానులు సాంబ్రాణిని అర్పించడం ద్వారా, ఆయన మానవత్వంతో పాటు, ఆయన ఆరాధనీయుడు అనే విషయాన్ని లోకానికి చాటి చెబుతున్నారు. 

ఆయన ఆరాధనీయుడైతే? తప్పక దేవుడైయుండి తీరాలి. ఎందుకంటే? మనుష్యులు గాని, దేవదూతలు గాని ఆరాధనకు పాత్రులు కారు. అవును! 
ఆయన ఆరాధనీయుడు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. (యోహాను 4:24) ఇంతవరకూ, ఎట్లా ఆరాధించావో తెలియదు గాని, ఇకనుండైనా ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం! 


♻ *జ్ఞానులు సమర్పించిన కానుకలలో మూడవది 'బోళము'.*

ఇది ముండ్ల చెట్టు నుండి తీసిన జిగురు పదార్ధము. రుచికి చాలా చేదుగావుండి, సువాసనను వెదజల్లే పదార్ధం. బోళమునకు గోపరసము అనే మరొక పేరు కూడా వుంది. మన వ్యవహారిక భాషలో 'అత్తరు' (సెంటు) అని పిలుస్తారు.

👉 *బోళమును సువాసన కోసం వస్త్రములలో జల్లుతారు.*

నీ వస్త్రములెల్ల గోపరస వాసనే
                కీర్తనలు 45:8

👉 *సువాసనతో ఆహ్లాదం కలిగించడానికి పరుపు మీద జల్లుతారు.*

నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
             సామెతలు  7:7

👉*బాడీ స్ప్రే (Body spray) గా కూడా బోళమును ఉపయోగిస్తారు.*

నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడు.
             పరమ గీతము 1:13

👉 *శవములు కుళ్ళి వాసన రాకుండా కూడా బోళమును ఉపయోగిస్తారు.*

మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.

అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. (యోహాను 19:39,40)

బోళముతో నిల్వ చేసిన శవాలు వేల సంవత్సరాలపాటు చెడిపోకుండా వుంటాయి. బోళము యేసు ప్రభువు యొక్క శ్రమలకు, పునరుద్దానానికీ సూచనగా వుంది. అంటే? ఆయన మన నిమిత్తం శ్రమ పడి, మరణించి, మృత్యువును జయించి తిరిగి లేస్తాడు అనే విషయాన్ని ముందుగానే వారు అర్ధం చేసుకోగలిగారు. అందుకే ఆరాధించారు. 

జ్ఞానులు సమర్పించిన కానుకలలో  అంతటి జ్ఞానముంది. వారు జరుగక ముందే ఆరాధించారు. మనమైతే? జరిగి రెండువేల సంవత్సరాలు గతించిపోయినా అట్టి ఆరాధన నేటికీ చేయలేకపోతున్నాము. కనీసం ఇకనుండైనా, ఆ ఆరాధనీయుని ఆరాధిద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! 

కామెంట్‌లు