✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(10 వ భాగము )
*మనకు శిశువు పుట్టెను*
(యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను..)
700 వందల సంవత్సరాలకు ఈ వచనం నెరవేరింది. దేవుని ప్రవక్త భవిష్యత్తులో చూస్తూ ఆ రాబోయే సంఘటన అంతకు ముందు జరిగినట్టు యెషయ ప్రవక్త రాశాడు. యేసు జననానికి ఏడు శతాబ్దాల పూర్వం యెషయా ఆయన గురించి ఇలా ప్రవచించాడు: “ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును.” యెషయా 9:6
యేసు జననం, ఆ తర్వాత ఆయన వహించే పాత్ర ఎంతో విశేషమైనవై ఉంటాయని యెషయా ఎందుుకు సూచించాడు? ఎందుకంటే యేసు పరిపాలన “న్యాయము వలనను నీతివలనను” స్థిరపరచబడుతు౦ది.—యెషయా 9:7.
యేసు జన్మిస్తాడనే విషయాన్ని గబ్రియేలు దూత మరియకు చెప్పినప్పుడు, యెషయా ప్రకటననే ప్రతిధ్వనింప జేశాడు. “ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతము లేనిదై యుండును” అని ఆయన జరగబోయేదాన్ని ముందుగానే చెప్పాడు. (లూకా 1:32, 33)
కాబట్టి, యేసు జననంలోని విశేషత దేవుని రాజ్య నియమిత రాజుగా క్రీస్తు నెరవేర్చే పనికి సంబంధించినదనేది స్పష్టం. క్రీస్తు పరిపాలన సమస్త ప్రజలకు ప్రయోజనకరమై ఉంటుంది.
వాస్తవానికి, ఆయన జననం “దేవుని కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము” తీసుకొస్తుందని ఆ దేవదూతలు సూచించారు.—లూకా 2:14.
న్యాయం, సమాధానంగల ప్రపంచంలో నివసించాలని ఎవరు మాత్రం కోరుకోరు? అయితే క్రీస్తు పరిపాలన తీసుకువచ్చే సమాధానాన్ని అనుభవించడానికి, మనం దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉంటూ ఆయనతో మంచి సంబంధం కలిగివుండాలి. అలాంటి సంబంధానికి మొదటి మెట్టు క్రీస్తు గురించి తెలుసుకోవడమే. “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని ఆయన చెప్పాడు.—యోహాను 17:3.
యేసును గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానం మనకు లభించినప్పుడు, ఆయనను మనమెలా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాడో మనం ఆలోచించవలసిన అవసరం ఉండదు.
ఎవరు ఈ శిశువు?
*1. ఈ శిశువు మనలను బ్రతికించుటకు వచ్చిన వాడు:* ఎఫె. 2: 1,4 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. 4 అయినను దేవుడు కరుణా సంపన్నుడై యుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను.
*2. ఈ శిశువు, కుమారుడిగా వచ్చిన వాడు:* “కుమారుడు అనుగ్రహింప బడెను” యెషయా 9:6 యేసుప్రభువు యొక్క మానవత్వం ఇక్కడ కనిపిస్తున్నది. ఆయన మహా బలిష్ఠుడైన దేవుడు. అయినప్పటికీ చిన్న బాబుగా జన్మించాడు. దేవుడు మానవుడుగా జన్మించడం అన్ని అద్భుతాలోకెల్లా గొప్ప అద్భుతం.
ఫిలిప్పీయులకు 2:6,7,8 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు *మనుష్యుడుగా* కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
*3. ఈ శిశువు మనలను పాపము నుండి విమోచించుటకు (రక్షించుటకు) వచ్చిన వాడు:* కుమారుడు అనగా కు+మారః (చెడును హరించువాడు). సమస్త మానవుల పాపములను పరిహరించి పరలోక ప్రవేశాన్ని అనుగ్రహింప వచ్చిన శిశువు.
రోమీయులకు 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు *రక్షకుడు* మీ కొరకు పుట్టి యున్నాడు.
*4. ఈ శిశువు మనకు సంతోషాన్ని ఇచ్చుటకు వచ్చిన వాడు:* లూకా 2:10 అయితే ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు *మహా సంతోషకరమైన* సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను;
కుమారుడైన యేసుద్వారా పాపనిర్మూలన చేయబడి పరలోక ప్రవేశం అనుగ్రహింప బడినదనే సంతోషము మనకు కలుగు చున్నది. లూకా 1:48 నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు *ఆనందించెను.*
*5. ఈ శిశువు మనకు వెలుగును ఇచ్చుటకు వచ్చిన వాడు:* సాతాను అంధకార బంధకాలను తొలగించి నిజమైన వెలుగును మనకు ప్రకాశింపజేయుటకు వచ్చిన శిశువు. గలలీ ప్రాంతాల్లో ప్రకాశించనున్న గొప్ప కాంతిగా ఈ శిశువు ఉన్నాడు. యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు *గొప్ప వెలుగును* చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద వెలుగు ప్రకా శించును.
అంధకారములో ఉన్న గొర్రెల కాపరుల జీవితాలలో వెలుగు ప్రకాశించనట్లు పాపుల జీవితాలలో వెలుగు నింపుటకు వచ్చినవాడు ఈ శిశువు. లూకా 2:9 ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు *ప్రకాశించినందున*, వారు మిక్కిలి భయపడిరి.
(లూకా 2:30 అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు *వెలుగుగాను* నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను...)
*6. ఈ శిశువు రాజుగా ఏలుటకు వచ్చినవాడు:* యెషయా 9:6 ఆయన భుజము మీద రాజ్య భారముండును. మీకా 5:2 నా కొరకు ఇశ్రాయేలీయులను *ఏలబోవువాడు* నీలోనుండి వచ్చును;
ఆ పిల్లవాడు పెరిగి యూదుల రాజుగా, ప్రపంచానికే రారాజుగా ఉండడానికి పెరిగాడు (యిర్మీయా 23:5; మత్తయి 2:2; 27:11; 28:18; ప్రకటన 19:16).
యెషయా 9:7 ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను *రాజ్యమును* స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై *రాజ్య పరిపాలన* చేయును.
*7. ఈ శిశువు మనకు తోడుగా ఉండి చివరి వరకు నడిపించుటకు వచ్చినవాడు:* మత్తయి 1:22,23 ఇదిగో కన్యక గర్భవతియై *కుమారుని* కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు *తోడని* అర్థము.
కీర్తన 23:2,3 శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.... తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.
ఈ శిశువును గురించిన మరికొన్ని విషయాలు రేపు ధ్యానిద్దాం.
దైవాశ్శీసులు!
From the desk of...
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_
Immanuel Bible College
NIDUBROLU
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి