✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(7 వ భాగము )
*ప్రాయిశ్చిత్తమగుటకు ఆయన వచ్చెను*
యోహాను 4:10 మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను..
యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మానవకోటి అంతా పాపములో పడిపోయి అందరికీ మరణం సంప్రాప్తమైనది గనుక వారి పాపానికి *ప్రాయిశ్చిత్తం* చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. (రోమా 5:12 ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను).
రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగదని లేఖనం సెలవిస్తున్నది. పరిశుద్ధ రక్తం చిందనిదే అపరాధాలకు క్షమాపణ లేదు. (లేవీ 17:11 రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. హెబ్రీ 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.)
పాపం ప్రాయిశ్చిత్తమగుటకు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాప రహితుడై ఈలోకంలో పుట్టిన యేసు క్రీస్తు కార్చిన రక్తం ఆధారంగా మాత్రమే దేవుడు మనుషులను క్షమిస్తాడు. అందుకే దావీదు ఇలాగు అంటున్నాడు.(కీర్తన 65:3 నామీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు.)
దేవుడు తనే ముందుగా ప్రేమించి, మనకు బదులుగా ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను.
1 యోహాను 4:10 మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. దేవుడు ఏర్పరచుకొన్న ప్రాయిశ్చిత్త విధానం చాల గొప్పది. ఎంత గొప్పది అంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు సిలువకు అప్పగించాడు.
(రోమా 8:32 తన సొంత కుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు).
ఆయన ఈలోకంలో జన్మించింది పాప పరిహారార్ధ బలిగా అర్పింపబడి దాని ద్వారా మన పాపములను ప్రాయిశ్చిత్తం చేయుటకు. ఆయనే ప్రాయశ్చిత్తార్థమైన బలి పశువు. సంఖ్యా 28:22 మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థ బలిగా ఒక మేకను అర్పింపవలెను.
పాపముతో దూరమైన సర్వమానవాళికి ఆయన సన్నిధిలోకి యేసయ్య రక్తం ద్వారా జరిగిన ప్రాయిశ్చిత్తం మరల ప్రవేశం కల్పిస్తున్నది. అంతేకాకుండా ఈ *ప్రాయిశ్చిత్తం* వలన ప్రభువు అనేక మేలులను మనకు ఇస్తున్నాడు.
👉 *1. యేసు యొక్క ప్రాయిశ్చిత్తం వలన మనకు అపరాధములకు క్షమాపణ, విమోచన:* ఎఫెస్సి 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన *మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది*.
👉 *2. యేసు యొక్క ప్రాయిశ్చిత్తం వలన మహిమ:* యోహాను 17:23 - నీవు నేను ఏకమై ఉన్నట్లుగా నీవు నాకనుగ్రహించిన వారందరు ఏకమవ్వాలని నీవు నాకిచ్చిన *మహిమను వారికి ఇచ్చితిని*.
👉 *3. యేసు యొక్క ప్రాయిశ్చిత్తం వలన మనము ప్రభువు ఉండే చోట మనం ఉండగలం:* యోహాను 17:24 - నేను ఎక్కడ ఉంటానో నీవు నాకనుగ్రహించిన *వారందరు నాతో కూడ ఉండాలని*, నీవు ఇచ్చిన మహిమను చూడాలని ప్రార్థన చేశాడు.
👉 *4. యేసు యొక్క ప్రాయిశ్చిత్తం వలన మనకు పరలోకంలో స్థానం:* ఎఫెసీ 2:7 - క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టును.
👉 *5. యేసు యొక్క ప్రాయిశ్చిత్తం వలన మనకు సింహాసనం:* ప్రకటన 3:21 - నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండ నిచ్చెదను.
👉 *6. యేసు యొక్క ప్రాయిశ్చిత్తం వలన మనకు నిత్యజీవం:* యోహాను 17:3 - సర్వశరీరులకు నిత్యజీవమిచ్చుటకు.
👉 *7. యేసు యొక్క ప్రాయిశ్చిత్తం వలన మనకు కుమారత్వం:* ఎఫెస్సి 1:6 మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
👉 *8. యేసు యొక్క ప్రాయిశ్చిత్తం వలన మనం నీతిమంతులమయ్యాం:* రోమా 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.
👉 *9. యేసు యొక్క ప్రాయిశ్చిత్తం వలన మనకు సంపూర్ణత:* హెబ్రీ 10:14 ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.
👉 *10. యేసు యొక్క ప్రాయిశ్చిత్తం వలన మనకు స్వస్థత:* యెషయా 53:5 - ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత.
కేవలం ఆయన చేసిన ప్రాయిశ్చిత్తం వలన మాత్రమే తప్ప మనం చేసే పుణ్యకార్యాలు పరలోక ప్రవేశానికి ఏమాత్రం ఆధారం కావు. ఆయన సిలువలో చేసిన ప్రాయిశ్చిత్తం మాత్రమే మన ఇహలోక పరలోక ఆశీర్వాదములకు కారణం. అదే మనకు గొప్ప ధన్యత. (కీర్తన 32:1 తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు *ధన్యుడు*. రోమా 4:7 ఏలా గనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.)
ఆయన చేసిన అర్పణ ద్వారా అందరు రక్షణ పొందుకోవాలని ప్రభువు కోరుచున్నాడు. (1 తిమోతి 2:4-6 ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవ జ్ఞానము గలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను.)
యేసు తన ప్రాయిశ్చిత్తార్ధ రక్తం ద్వారా కడిగి మనలను *శుద్ధి చేసి* పరిశుద్ధులలో నడిపిస్తున్నాడు. పాప ప్రాయిశ్చిత్తార్ధమై ఈ లోకంలో జన్మించిన యేసును గూర్చి కీ.శే ND ఏబెల్ గారు ఈ విధంగా అద్భుతమైన పాట వ్రాశారు. *పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడుగుడు భాగ్యము మోక్ష భాగ్యము*.
అట్టి గొప్ప మోక్షభాగ్యాన్ని కేవలం మనకే కాక ప్రభువు సమస్త మానవాళికి సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్!
దైవాశ్శీసులు
From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_
Immanuel Bible College
NIDUBROLU
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి