ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(17 వ భాగము )

*దయాప్రాప్తురాలా! నీకు శుభము*

(లూకా 1:28  ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి *దయాప్రాప్తురాలా* నీకు శుభము)

మరియ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న వ్యక్తి సామాన్య మానవుడు కాదు, దేవదూత. ఆయన పేరు గబ్రియేలు. దేవుదూత అయిన గబ్రియేలు మరియను అప్పటివరకు ఎవరూ సంబోధించని విధంగా సంబోధిస్తూ ఇలా అన్నాడు: ‘దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడైయున్నాడు.’ 

ఆయన మరియను “దయాప్రాప్తురాలా” అని సంబోధించినప్పుడు, ఆమె “బహుగా తొందరపడి” ఈ కొత్త సంబోధన ఏమిటా అని ఆశ్చర్యపోయింది. (లూకా 1:29, 30)

ఇంతకీ ఆమె ఎవరి దయను పొందింది? మనుషుల దయనైతే ఆమె ఆశించలేదు. నిజానికి, దేవదూత మాట్లాడింది దేవుని దయ గురించి. మరియ దేవుని దయను పొందాలని కోరుకుంది. 

దేవుడు ఎవరిమీద తన దయను చూపుతాడు. దేవుని దయను పొందుకోవడానికి మరియకున్న అర్హతలేమిటి?

*1. మరియ దీనురాలుగా ఉన్నది:* (లూకా1:47  ఆయన తన దాసురాలి *దీనస్థితిని* కటాక్షించెను. దీనురాలు అనగా వినయ విధేయతలు గల స్త్రీ అని అర్ధం. ఆమె ప్రభువు మాటలకు విధేయత చూపినది కనుక ఆమె దేవుని దయను పొందుకున్నది. ఆమెకున్న వినయాన్ని బట్టే దేవుని చేత బహుగా హెచ్చించబడినది. (సామెతలు 18:12 ఘనతకు ముందు వినయముండును.) 

కోటానుకోట్ల మంది స్త్రీలలో ఎవరికీ దక్కని భాగ్యం, దేవుని దయ మరియకు దక్కింది. మరియ స్థానంలో వేరొకరు ఉంటే తప్పక గర్వించేవారు. కాని తన మీద దేవుని దయ ఉందని తెలిసికూడా మరియ గర్వించలేదు. మనం కూడా దేవుని దయ కోసం కృషిచేయాలి కానీ, అది మనమీద ఉందని తెలిసికొనినప్పుడు గర్వించకూడదు అని మరియ ఉదాహరణ మనకు నేర్పిస్తోంది. 

దేవుడు గర్విష్ఠులను లేదా అహంకారులను దూరంగా ఉంచుతాడు. దీనులను, వినయస్థులను ప్రేమిస్తాడు, వాళ్లకు సహాయం చేస్తాడు. (యాకో 4:6 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును. లూకా 1:52  సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను)

*2. మరియ పరిశుద్ధురాలు:* (లూకా 1:34  అందుకు మరియనేను పురుషుని ఎరుగనిదాననే.) మరియ దేవుని దయను పొందుకోవడానికి గల రెండవ కారణం ఆమె యొక్క పరిశుద్ధమైన జీవితం. 

మన ప్రభువు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నవాడు కనుక పరిశుద్ధత లేకుండా ఎవరుకూడా ప్రభువును చూడలేరని పౌలు భక్తుడు చెప్పుచున్నాడు. (హెబ్రీ 12:14 పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.) 

ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉన్నపుడే దేవుని దయను పొందుకొనగలం. 1 పేతురు 1:14  నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది 16  మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి.)

*3. మరియ ప్రభువును ఘనపరచినది:* మరియ ఎల్లవేళలా ప్రభువును స్తుతించి ఘనపరచే స్త్రీగా ఉన్నది. (లూకా 1:46  నా ప్రాణము ప్రభువును ఘనపరచు చున్నది.) 

ఎవరైతే ప్రభువును ఎల్లవేళలా స్తుతించి కీర్తించి ఘనపరుస్తారో వారు దేవుని దయను పొందుకుంటారు. మరియ దేవుని ఎంతో అద్భతంగా ఘనపరచినది. 

లూకా 1:46-55 భాగాన్ని *మరియ కీర్తన* అని అంటారు. (మాగ్నిఫికాట్ -The Magnificat -  known as the Song of Mary) 

ఎంతో రమ్యమైన చక్కని కావ్య భాషలో మరియ పలికిన మాటలు దేవుని గురించి ఆమెకున్న జ్ఞానాన్నీ, ప్రేమనూ, ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించే ఆమె యొక్క సామర్థ్యాన్ని వెల్లడి చేస్తాయి. అందువల్లే ఆమె దేవుని దయను పొందుకుని రక్షకునికే తల్లి అయ్యే భాగ్యం పొందుకున్నది.   

దేవుని దయను పొందుకోవాలంటే హృదయపూర్వకంగా ప్రభువును ఘనపరచాలి. కొంతమంది కేవలం పైపైనే పెదవులతో ఘనపరుస్తారు గాని వారి హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి. 

అందుకే విచారకరంగా మనలో అనేకులు దేవుని దయను పొందుకోలేక పోతున్నారు. (యెషయా  29:13  ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు.)

*4. మరియ వాక్యానికి లోబడినది:* (లూకా 1:38 నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను.) తన పట్ల దేవుని సంకల్పానికి మరియ పూర్తిగా తల వంచింది. అనగా దేవుని వాక్యానికి పూర్తిగా లోబడినది. 

ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో వారు దేవుని దయను పొందుకుంటారు. “నీమాట చొప్పున వలలు వేస్తున్నాము అని దేవుని మాటకు లోబడి వలలు వేసిన శిష్యులు వలలు పిగులునట్లు దేవుని దయను పొందుకున్నారు. 

దేవుని మాటకు లోబడి రాతి బానల్లో అంచులు మటుకు నీరు నింపిన కానా పెండ్లివారు దేవుని దయను పొందుకొని వారి జీవితాలలో దేవుని *మధురమైన* అధ్బుత కార్యాన్ని అనుభవించ గలిగారు.

*5. మరియ ప్రభువుకు దాసురాలుగా ఉన్నది:* (లూకా 1:38  అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను) దాసురాలు అనగా బానిస. ప్రభువును తన యజమానిగా భావించినది. 

అవును! ప్రభువు మన యజమాని. ప్రభువుకు దాసులము అని ఎవరైతే భావిస్తారో వారు మాత్రమే దేవుని దయను పొందుకుంటారు. 

అందుకే పౌలు ఎప్పుడు తనను తాను క్రీస్తు దాసుడను అని తన పత్రికల్లో వ్రాసుకున్నాడు గనుక పౌలు దేవుని దయను పొందుకొని గొప్ప అపోస్తలుడుగా మారి అద్భుతమైన సేవ చేయ గలిగాడు. (రోమా 1:1  యేసు క్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును...) 

ప్రభవు చిత్తం లేనిదే ఏది కూడా మనం చేయకూడదు. అప్పుడే మనం దేవుని దయను మరియ మాదిరిగా పొందుకొనగలం.

*6. ప్రభువును రక్షకునిగా స్వీకరించినది:* (లూకా 1:48  నా ఆత్మ *నా రక్షకుడైన* దేవునియందు ఆనందించెను.) తాను పాపినని తన జీవితానికి రక్షకుడు అవసరమని ఆమె గ్రహించినది. అందువలనే ఆమె దేవుని దయను పొందుకున్నది. ఎవరైతే తమ పాపములకు పశ్చాతాపపడి యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే దేవుని దయను పొందుకొనగలరు.

*7. మరియ  దేవుని కార్యాలపై సాక్ష్యం చెప్పినది:* (లూకా 1:49  సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను) దేవుడు చేసినది గొప్ప కార్యమని ధృఢముగా నమ్మినది కనుకనే సాక్ష్యం చెప్పగలిగి గొప్ప కార్యాలను మరియ తన జీవితంలో చూడ గలిగినది. అది కేవలం మంచిదే అని ఆమె దృఢంగా నమ్మింది. ఇందులో ఈమె మనకు ఆదర్శం. 

నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని వాక్యం చెప్పుచున్నది. మరియ మాదిరిగా ఎవరైతే ప్రభువు యెడల ధృడమైన నమ్మకముంచి దేవునికి సాక్షులుగా ఉంటారో వారే దేవుని దయను పొందుకుంటారు. 

ఈ దినాల్లో దేవుని మేలులు పొందుకునే వారు ఉన్నారు కాని ఆయన చేసిన కార్యాల గురించి సాక్ష్యాలు చెప్పేవారుగాని సాక్షులుగా జీవించేవారుగాని లేకుండా పోతున్నారు.

బైబిల్లో మరియ గురించి ఎక్కువ వివరాలు లేక పోవడం, ఆమె నేపథ్యం గురించి, వ్యక్తిత్వం గురించి బైబిలు అంతగా ఏమీ చెప్పక పోవడం, ఆమె రూపం గురించైతే అసలేమీ మాట్లాక పోవడం ఎంతో ఆశ్చర్యకరం. కాని ఆమె దేవుని కృప పొందుకుని స్త్రీలలో ఆశీర్వదింపబడినదిగా కనబడుచున్నది. (లూకా 1:30  దూత   మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి లూకా 1:42  స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు.) 

ప్రపంచ వ్యాప్తంగా ఆమె పేరు ఆశీర్వదించబడినది. కోట్లమంది స్త్రీలు “మరియమ్మ” అని, మేరీ అని పేరు గలిగి దీవించబడ్డారు. ఈ పేరుకు అంత ఘనత రావడానికి కారణం యేసు తల్లి మరియ. 

ప్రభువు మరియను ఒక గొప్ప సాధనంగా వాడుకొని ఆమెను ధన్యురాలను చేశాడు. ఆమె జీవితం స్త్రీలైన వారికి ఎంతో ఆదర్శం. ఆమెవలె మనమందరం దేవుని ప్రియబిడ్డలగా ఉండి దేవుని అపారమైన దయ పొందుకొనే కృపను ఆత్మదేవుడు మనకు సమృద్ధిగా దయచేయును! ఆమెన్!

దైవాశ్శీసులు!

From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_


కామెంట్‌లు