✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(22 వ భాగము )
*రక్షణ కొరకైన ఆనవాలు*
లూకా 2:12 దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొని యుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను.
రక్షణ శుభవార్తను మొట్టమొదట అల్పులైన గొర్రెల కాపరులకు ప్రకటించినది దేవదూత. ఆ కాపరులు ఆ రక్షణను చేరుకోవడానికి *ఆనవాలుతో కూడిన మార్గదర్శకత్వం* వారికి ఇవ్వడం జరిగింది.
దేవుడు ప్రజలందరికిని ఏర్పాటు చేసిన మహా సంతోషకరమైన రక్షణను చేరు కోవాలంటే మనకు ఆనవాలుతో కూడిన మార్గదర్శకత్వం అవసరం.
ప్రభువు మనకు ఇచ్చు *ఆనవాలు* అద్భుతమైనది. ఆ ఆనవాలు ఏమనగా *పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు* ఒక తొట్టిలో పండుకొని యుండుట.
ఏమిటి దీని అర్ధం. పాప ప్రభావం వలన సర్వ మానవులు ఈ లోకంలో భయంకరమైన మరియు అసహ్యకరమైన స్థితిలో ఉన్నారు. పాప ప్రభావంతో మానవుల పరిస్థితి ఎలా ఉందంటే, *బట్టకూడా చుట్టబడని పుట్టిన శిశువు* మాదిరిగా ఉన్నారు. ప్రభువు వీరిని గురించి ఈ విధంగా మాట్లాడుచున్నాడు. యేహెజ్కేలు 16:4 నీ జననవిధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము కోయ బడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి *బట్ట చుట్టకపోయిరి*. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు, నీయందు జాలిపడిన వాడొకడును లేక పోయెను; నీవు పుట్టిననాడే బయట నేలను పారవేయబడి, చూడ అసహ్యముగా ఉంటివి.
పుట్టిన నాడే కనీసం చుట్టబడటానికి బట్టలుకూడా లేని మనస్ధితిని చూచిన దేవుడు మనలను కనికరించి ప్రేమించి తన రక్తంతో మనలను శుభ్రపరచి అద్భుతమైన రాజవస్త్రాలు మహిమ వస్త్రాలు ధరింపజేయుటకు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి మనకు *ఆనవాలుగా* ఈలోకానికి వచ్చాడు.
పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు అనగా రక్తపు వస్త్రాలతో చుట్టబడిన యేసు. *ఇది క్రీస్తు రక్తంతో కూడిన దేవుని వాక్యం.* సరైన ఆనవాలు లేకపోతే మనం దారి తప్పి నరకానికి పోతాం. పరలోకానికి నడిపించే ఈ ఆనవాలును (సువార్తను) మనం గుర్తించగలిగితే గొప్ప ధన్యకరమైన రక్షణను అందుకొనగలం. కారణం ఈ ఆనవాలు మన జీవితాలకు ఈ క్రింది విధాలుగా గొప్ప ధన్యకరంగా ఉన్నది..
*1. శుభకరమైన ఆనవాలు:* మనకు ఆనవాలుగా వచ్చిన యేసు మన జీవితాలకు శుభమునిచ్చువాడని దావీదు తెలియ జేయుచున్నాడు.
కీర్తన 86:17 యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించు చున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు *శుభకరమైన ఆనవాలు* నాకు కనుపరచుము
*2. నిజమైన ఆనవాలు:* యేసే నిజమైన ఆనవాలు. నేనే మార్గం సత్యమును జీవమును అని ప్రభువు తెలియ జేయుచున్నాడు. నిజమైన ఆనవాలును రాహాబుకు ఇచ్చి రక్షించిన యేసు మన జీవితాలకు కూడా నిజమైన ఆనవాలుగా ఉన్నాడు.
యెహోషువా 2:12 నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు *నిజమైన ఆనవాలును* ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించు నట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనెను.
*3. దేవుని కృపకు జ్ఞాపకార్ధనమైన ఆనవాలు:* యోర్దాను నదిలో తీయబడిన పండ్రెండు రాళ్ళు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్ధమైన ఆనవాలుగా ఉన్నవి. మహా భయంకరమైన మరణపు నదిని దాటించిన దేవుని గొప్ప కృపకు ఈ ఆనవాలు సాదృశ్యం. యేసే దేవుని గొప్ప కృపగా ఈలోకానికి వచ్చి పండ్రెండు రాళ్ళ అపోస్తలుల సంఘమును స్థాపించినాడు. క్రీస్తు సంఘమే నేడు మనకు *ఆనవాలు.*
యొహోషువా 4:7 అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును
*4. కాపాడే ఆనవాలు:* ఎండిన ఆహారోను కర్రను చిగురింప జేసి తానే *కాపాడు ఆనవాలునని* ప్రభువు తెలియ జేయుచున్నాడు.
సంఖ్యా 17:10 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనుతిరుగబడిన వారినిగూర్చి *ఆనవాలుగా కాపాడబడునట్లు*, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము.
*5. హెచ్చరిక ఆనవాలు:* కీడు మన మీదికి రాకుండా ఎల్లపుడు తన వాక్యపు ధ్వజముతో హెచ్చరిక చేయు ఆనవాలుగా ఉండుటకు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు.
యిర్మియా 6:1 బెన్యామీనీయులారా, యెరూషలేములోనుండి పారి పోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద *ఆనవాలుకై ధ్వజము* నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది
*6. జీవమునిచ్చు ఆనవాలు:* మరణంలో నుండి జీవములోనికి ఇశ్రాయేలీయులను నడిపించుటకు రక్తపు ఆనవాలుగా యేసు ఉన్నాడు.
నిర్గ 12:13 మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు *గురుతుగా(ఆనవాలుగా)* ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను
*7. ప్రతిష్టితమైన ఆనవాలు:* తన రక్తంతో కడిగి మనలను తనకు ప్రతిష్ట చేసుకొనుటకు ధూపార్తులతో చేయబడిన ఆనవాలుగా యేసు ఉన్నాడు. నిజమైన ధూపార్తులుగా మనం ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలసి ఉన్నది.
సంఖ్యా 16:38 పాపముచేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసికొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠిత మైనవి; అవి ఇశ్రాయేలీయులకు *ఆనవాలుగా* ఉండును.
ఆ నిజమైన ఆనవాలును గుర్తించడమే నిజమైన క్రిస్మస్ పండుగ. పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసు ఆనవాలుగా గొల్లలకు మార్గము తెలియజేశాడు. హేరోదు (సాతాను) మార్గములో ప్రమాదం వైపు ప్రయాణం చేయుచున్న జ్ఞానులను సరైన మార్గములో నడిపించిన ఆనవాలుగా యాకోబులో ఉదయించిన నక్షత్రం యేసు. పగలు మేఘ స్థంభం రాత్రి అగ్ని స్థంభం ద్వారా ఆనవాలుగా ఉండి ఇస్రాయేలీయులను నడిపించన నిజమైన ఆనవాలు. మనలను కూడా పరలోక గమ్యం వైపు నడిపించు ఆనవాలుగా యేసు ఉండును గాక! ఆమెన్ !!
దైవాశ్శీసులు!
From the desk of...
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి