✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(12 వ భాగము )
*ఎవరీ శిశువు – ఆలోచనకర్త*
యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను - *ఆలోచనకర్త.*
యెషయా ప్రవక్త కాలంలో శత్రువుల దాడివలన ఏర్పడిన కష్టాలకు దిక్కు తోచని ప్రజలు సలహా కొరకు *ఆలోచన* కొరకు కర్ణపిశాచిగలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును మరియు సజీవులపక్షముగా చచ్చినవారి యొద్దకును వెళ్లి విచారించుచున్నపుడు, *ఆలోచన* కొరకు దేవుని యొద్ద విచారణ చేయకుండా దుష్ట శక్తుల యొద్దకు వెళ్లి ఆలోచన చేయడం ఇది మీకు తగునా అని బాధపడిన యెషయా ప్రవక్త, ఈ సమస్య గురించి దేవునికి ప్రార్ధించగా ప్రభువు ఆ ప్రార్ధన ఆలకించి వారికి చక్కని ఆలోచన చెప్పి నడిపించే *ఆలోచన కర్త* అను పేరుగల రక్షకుని కుమారునిగా ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు.
అవును సాతాను ప్రభావం వలన దుష్ట శక్తుల వలన సర్వమానవులు నరకమునకు నడిపించ బడుచుండగా వారికి సరైన ఆలోచన కలిగించి తన బిడ్డలను సరైన మార్గమునకు నడిపించే *ఆలోచన కర్తగా ఆ కుమారుడు* ఈ లోకంలో జన్మించాడు.
కుమారుడైన యేసు ద్వారా మాత్రమే గొప్ప ఆలోచనలు గొప్పవైన గంభీరమైన సంగతులు మనకు అనుగ్రహించబడును. యిర్మీయా 32:19 *ఆలోచన* విషయములో నీవే గొప్పవాడవు, కీర్తన 92:5 యెహోవా, నీ *ఆలోచనలు* అతిగంభీరములు.
*1.కుమారుడు మనకు ఆలోచన నేర్పువాడు:* మత్తయి 11:29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
*2. కుమారుడు తనకు ప్రార్ధించువారికి ఆలోచనలు ఇచ్చువాడు:* -యిర్మియా 33:3 నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.
*3. కుమారుడు తన మాటల ద్వారా అనగా వాక్యము ద్వారా ఆలోచనలను ఇచ్చువాడు:* అనగా దేవుని యొక్క వాక్యమే మనకు ఆలోచన కర్తగా పని చేయును. కీర్తన 119:24 నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు *ఆలోచనకర్తలై యున్నవి*.
హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను *ఆలోచనలను* శోధించుచున్నది.
*4. కుమారుని ఆలోచన సదా కాలము నిలుచును:* – కీర్తన 33:11 యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.
*5. కుమారుని ఆలోచన మనలను ఫలింప జేయును:* – కీర్తన 1:1-3 దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.
*6. కుమారుడు తన ఆలోచనచేత మనలను నడిపించువాడు:* సాతాను ఆలోచన అశాంతికి మరణమునకు నడిపితే, కుమారుని ఆలోచన జీవమును శాంతి సమాధానములను మనకు అనుగ్రహించును. సాతాను ఆలోచన చేత నడిపించబడిన ఆదాము హవ్వ భయంకరమైన చిక్కుల్లో పడ్డారు.
కీర్తన 73:24 నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. కీర్తన 23:2 పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు.
*7 . కుమారుడు దైవజనుల ద్వార మనకు ఆలోచన అనుగ్రహించువాడు:* ఆలోచన కర్తలైన దైవజనులను మనకు ఇచ్చువాడు ఆయనే. యెషయా 1:26 ఆదిలోనుండినట్లు నీకు *ఆలోచనకర్తలను* మరల నియమించెదను.
ఈ దినాలలో దేవుని ఆలోచనకర్తలు ఆయనచేత అభిషేకించబడిన దైవజనులే.
దైవజనుల ఆలోచన మనకు ఎంతో రక్షణకరం. వారి ఆలోచన మనకు శ్రమ తగ్గించునది. దుష్టుల ఆలోచన మనకు కీడు కలిగించునదైతే దైవజనుల ఆలోచన మనకు సంతోష కారణమగును. సామెతలు 12:20 కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు.
పెద్దలైన దైవజనుల ఆలోచన చొప్పున నడిచి మేలు పొందినవారిని గురించి ఈ క్రింది ఉదాహరణలలో చూడగలం.
ఉదా1 – యిత్రో ఆలోచన మోషే యొక్క శ్రమను తగ్గించింది. నిర్గమ 18:13,19 కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను.
ఉదా2 – హూషై ఆలోచన దావీదుని రక్షించింది 2 సమూ 17:14 అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పినదానికంటె యుక్తమని యొప్పు కొనిరి;
దైవజనుల ఆలోచన కాదని లోకస్తుల ఆలోచన ప్రకారం మనం నడిస్తే సమస్తం వ్యర్ధం కాగలదు. పనికిమాలినవారి ఆలోచనలను అనుసరించిన వారిస్థితి పతనానికి దారి తీస్తుంది. కీర్తన 94:11 నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది సామెతలు 10:20 భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.
ఉదా1. యరోబాము బంగారు దూడలు ఆలోచన రాజ్య పతనానికి దారితీసింది. 1 రాజు 12:27 యరొ బాము తన హృదయమందు తలంచి ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;
ఉదా 2 – రేహాబాము పెద్దల ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవ్వనస్తుల ఆలోచన అనుసరించి నాశానమయ్యాడు - 1 రాజులు 12:8 అయితే అతడు పెద్దలు పన్నులు తగ్గించమని తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టెను. 1 రాజులు 12:13 అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ¸యవనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను.
సాతాను ఆలోచన నరకమునకు నడిపించునదైతే కుమారుడైన యేసు *ఆలోచన* పరలోకమునకు మనలను నడిపించునదని గ్రహించుదాం.
దివ్యమైన ఈ క్రిస్మస్ దినాలలో *ఆలోచనలో గొప్పవాడైన* ఆ కుమారుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుటకును ఆ కుమారుని ఆరాధించుటకును ఆ పరిశుద్ధాత్ముడు మనకు ఎల్లవేళలా సహాయం చేయునుగాక ఆమెన్!
దైవాశ్శీసులు!
From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_
Immanuel Bible College
NIDUBROLU
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి