ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(9 వ భాగము )

*ఆయనకు ఇష్టులైన మనుష్యులు*

_లూకా సువార్త  2:14 *ఆయన కిష్టులైన మనుష్యులకు* భూమిమీద సమాధానమును కలుగునుగాక_

నిన్నటి ధ్యానంలో యేసు పుట్టుక దేవునికి గొప్ప మహిమను చేకూర్చిందని మనం గమనించాము. దేవదూతలు ప్రకటిస్తున్న విషయంలో ఉన్న క్రమాన్ని కూడా మనం గమనించండి. ఎప్పుడైతే దేవునికి మహిమ కలుగుతుందో అప్పుడే భూమి మీద మనుష్యులకు సమాధానం కలుగుతుంది. (లూకా 2:14  సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక) 

ముందు దేవునికి మహిమ, తరువాత మనుషులకు సమాధానం. మనుషులకు సమాధానం తేవడానికే యేసు ఈ లోకంలో జన్మించాడు. దేవుని కుమారుడైన యేసును ఎవరైతే ప్రభువుగా రక్షకుడుగా స్వీకరిస్తారో, వారికి దేవుని అనుగ్రహం, పాపవిముక్తి కలిగి దేవుని సమాధానం వారు అనుభవించగలరు.. 

దేవుని అధ్బుతమైన సమాధానం మనకు కలగాలంటే మనం ముందు దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడో ఎటువంటి లక్షణాలు గలిగినవారిని ఇష్టపడుచున్నాడో మనం ఈ క్రింద చూద్దాం.
 
*1. యదార్ధముగా ప్రవర్తించు వారు ఆయనకు ఇష్టులు:* (సామెతలు 11:20, మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.) దావీదు యొక్క యధార్ధతను బట్టి దేవుడు దావీడును ఇష్టపడ్డాడు. 

(అపో. 13:22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా *యిష్టానుసారుడైన* మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.) 

దావీదును దేవుడు ఇష్టపడ్డాడు కనుకనే అనేక ప్రమాదముల నుండి అనేక క్లిష్టమైన పరిస్థితుల నుండి దేవుడు దావీదును తప్పించాడు. (కీర్తన  18:19 విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెనునేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్నుతప్పించెను.) 

తన యధార్ధతను గూర్చి దావీదు సాక్ష్యం చూడండి. 1దిన 29:17  నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు *యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని* నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించు చున్నాను.

*2. సత్య వర్తనులు ఆయనకు ఇష్టులు:* (సామెతలు 12:22 అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.) సత్యవర్తనులు అనగా సత్యమును అనుసరించువారు అనగా వాక్యమును అనుసరించువారు. 

దేవుని వాక్యమే సత్యము. (యోహాను 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.) ప్రభువైన యేసు క్రీస్తే సత్యమై యున్నాడు. (యోహాను 14:6   యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.) 

దేవుని వాక్యమై యున్న సత్యమును అనుసరించక అసత్యమార్గమును అనుసరించిన అననియ సప్పీరాలు తీవ్రమైన శిక్షను పొందుకున్నారు. అపో 5:1 ( అననీయ సపీర) అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. 4  అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. 5  అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారి కందరికిని మిగుల భయము కలిగెను.) 

సత్యమును అనుసరించిక అసత్యమార్గములో వెళ్ళుచున్న అబద్దీకులందరూ మండుచున్న అగ్ని గుండములో పదవేయ బడుదురు అని వాక్యం సెలవిస్తున్నది. 

(ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును,  అబద్ధికులందరును  అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.) 

సామెతలు 23:23 సత్యమును అమ్మివేయక దాని కొనియుంచు కొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచు  కొనుము.

*3. విశ్వాసము కలిగినవారు ఆయనకు ఇష్టులు:*  (హెబ్రీ 11:6 విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.) 

అవిశ్వాసం అనేది భయంకరమైన పాపం. దేవుడు చూచీ చూడనట్టు ఊరుకునే చిన్న పొరపాటో, దురదృష్టకరమైన సంగతో కాదు ఈ అవిశ్వాసం. అది దేవునికీ మనిషికీ మధ్య ఉండవలసిన సంబంధాన్ని సమూలంగా నాశనం చేసే భయంకరమైన పాపం ఈ అవిశ్వాసం. మానవుని దేవునికి అయిష్టునిగా చేస్తున్న అవిశ్వాసం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునిపై విశ్వాసము ఉంచుటకు బదులు ఈనాడు మనిషి తన మనసులో దేవునికీ బదులు పాపాన్నీ చీకటినీ కోరుకోవడమే అవిశ్వాసం. మనలను రక్షించుటకు తన ప్రాణాలను సిలువలో అర్పించిన ఆ రక్షకుని యందు విశ్వాసముంచని వారిని దేవుడు ఎలాగు ఇష్టపడగలడు.

*4. దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు దేవునికి ఇష్టులు:* (రోమా 14:18  ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు *దేవునికి ఇష్టుడును*  మనుష్యుల  దృష్టికి  యోగ్యుడునై యున్నాడు) 

దాసుడు తన యజమానికి సంతోషాన్ని కలుగ జేస్తాడు. అదేవిధంగా మనం క్రీస్తుకు దాసులుగా ఉండి ప్రభువుకు సంతోషాన్ని కలిగించాలిగాని మన సంతోషాన్ని గురించి ఆలోచించగూడదు. ప్రతి విశ్వాసీ ఇతరుల మేలుకోసమే గాని తనను సంతోష పెట్టుకోవడం కోసం జీవించకూడదు. ఇతరులకు దుఃఖం కలిగిస్తే దేవునికి దుఃఖము కలిగించడమే. అందునుబట్టి ఇది స్వల్ప విషయం కాదు. మనం చేసేది ఇతర విశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో గమనించకుండా మనకిష్టమైనదే చేసుకుంటూ పోవాలని పట్టుదలగా ఉండకూడదు. 

యేసు క్రీస్తు మన తోటి విశ్వాసులకోసం కూడా చనిపోయాడు గదా. వారి నమ్మకానికి హాని చేసే అలవాటు మనకేదన్నా ఉంటే ఆ అలవాటును మానుకొనుటకు శ్రద్ధ మనం చూపాలి. ఆప్పుడే మనతోటి విశ్వాసులకు కూడా మనం యోగ్యంగా కనబడగలం.

*5. దేవునికొరకు కార్యములు చేయువారు ఆయనకు ఇష్టులు:* (యోహాను 8:29  నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; *ఆయన కిష్టమైన కార్యము* నేనెల్లప్పుడును చేయుదును.) 

అందరూ ఎవరి విషయాలు వారు చూచుకొంటున్నారు గాని, క్రీస్తు యేసు విషయాలు చూడడం లేదు. దేవుని కొరకు పని చేసేవారు వేగంగా తగ్గిపోతున్న రోజులు ఇవి. ఈ అంత్య దినాలలో అందరు కూడా తమ స్వంత కార్యాలు చూసుకుంటున్నారు గాని ప్రభువు కార్యముల యందు శ్రద్ధలేని వారుగా ఉంటున్నారు. లోకం పరిస్థితీ, తరచుగా క్రైస్తవుల పరిస్థితి కూడా ఇదే. 

(ఫిలిప్పి 2:21  అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు.) అందువలనే మనం దేవుని అనుగ్రహాన్ని పొందుకొన లేకపోవు చున్నాము. 

మనం దేవునికి ఇష్టులముగా ఉండాలంటే, దేవుని సేవలోగాని ఆయన కార్యాల యందుగాని ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభువు విషయాలలో స్థిరంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనలను ఇష్టపడతాడు. (1కొరి 15:58  కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.) 

దేవుని కొరకు మనం పడే ప్రయాస వ్యర్థం కాదని తెలిసి ఎప్పుడూ ప్రభుసేవ అధికంగా చేస్తూ ఉండాలి. మన ప్రయాస వ్యర్థం కావడమంటూ ఎప్పుడూ జరగదు. ఎందుకంటే చనిపోయినా భవిష్యత్తులో సజీవంగా లేవడం అనేది ఉంటుంది. అప్పుడు ప్రతి వ్యక్తికీ తన ప్రయాసకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. “భళా నమ్మకమైన మంచి దాసుడా అను ప్రభువు యొక్క మెప్పు పొందుకోగలం.

*6. భక్తులైన వారు ఆయనకు ఇష్టులు:* (కీర్తన 16:3  నేనీలాగందును భూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు.) విశ్వాసులైన తన భక్తులను క్రీస్తు ఎంతో ప్రేమిస్తున్నాడు. వారికోసం తన్ను తానే అర్పించు కున్నాడు. వారిని మాత్రమే ఈ భూమిపై మహనీయులుగా ఎంచుతున్నాడు. 

ధనవంతుల విషయంలో గానీ లౌకికమైన జ్ఞానమున్న వారి విషయంలో గానీ, అధికారం ఉన్న వారి విషయంలో గానీ, ఆయనకు సంతోషం లేదు గాని తన విశ్వాసుల *భక్తి* విషయంలోనే ఆయనకు ఆనందం. ఆయన దృష్టిలో ఆయన విశ్వాసులే ఈ భూలోకంలో గొప్పవారు. వారు ఆయనకు ప్రత్యేకమైన సొత్తు. కారణం విశ్వాసులకు ఆయనయందు గల భక్తి. 

మనకిష్టమైన వారికే మనం మేలు చేస్తాం. అదేవిధంగా దేవుడు తన భక్తులకే ఎంతో మేలు చేస్తాడు. (కీర్తన 31:19 నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి  యుంచిన మేలు యెంతో గొప్పది. 33:19 యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులు గలవారి  మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారి మీదను నిలుచు చున్నది.)

*7. విరిగి నలిగిన హృదయం గలవారు ఆయనకు ఇష్టులు:* (కీర్తన 51:17  విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.) దేవునికి ఇష్టమైన బలులు విరిగిన మనసు అనగా చేసిన పాపం నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం. దుఃఖం కలిగితే ఆ పాపిని దేవుడు క్షమిస్తాడు, స్వీకరిస్తాడు. పశ్చాత్తాపం లేకుండా ఏ విధమైన బలి అర్పణా ఆయనకు ఉపయోగం లేదు. మత్తయి 5:3  ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.

సర్వ సృష్టి దేవుని కిష్టమైన రీతిగా జీవిస్తున్నది. ఈ లోకంలో దేవుని యొక్క అద్భుతమైన సమాధానం మనం పొందుకోవాలంటే మనం కూడా ఆయనకు లోబడి మన శిరమును ఆయన ఎదుట వంచి ఈ భూమి మీద ఆయన కిష్టులుగా జీవించాలి. అప్పుడే మన హృదయాలకు నిజమైన సంతోషం మరియు సమాధానం. 

మనం ఇష్టప్రకారం కాక దేవుని ఇష్టప్రకారం జీవించి సమాధానం పొందుకొనుటకు పైన చెప్పబడిన లక్షణాలు గలిగి దేవునిలో ముందుకు సాగిపోవడానికి ప్రభువు కృప మనకు ఎల్లవేళలా మనకు తోడుగా ఉండునుగాక! ఆమెన్!

దైవాశ్శీసులు

From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_

Immanuel Bible College 
NIDUBROLU   

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...