: *✳ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును✳*
(ప్రభువు గొప్పవాడు 1వ భాగం)
(క్రిస్మస్ సందేశాలు - 1)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(లూకా 1:30-32 దూత మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన *గొప్పవాడై* సర్వోన్నతుని కుమారుడనబడును.)_
*ఉపోద్ఘాతం:* ప్రభువు గొప్పవాడు. ఆయన భూమి మీద *గొప్పవాడుగా* జన్మించుటకు గల కారణమేమి?
ఈ భూమి మీద అనేకమైన గొప్పవి కలవు. భూమి మీద అన్నిటికన్నా ఏది గొప్పది.
*✳1.భూమి మీద ఉన్న మానవుల దోషం (పాపం) భరించలేనంత గొప్పది:* – మానవుల పాపం భరింపలేనంత గొప్పది. ఆదికాండం 4:13 అందుకు కయీను నా దోషశిక్ష నేను భరింపలేనంత *గొప్పది.*
అవును. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన జీతం మరణం. పాప శిక్ష బహు భయంకరం. దేవుడు చెప్పిన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటినీ ప్రకారం ప్రవర్తించకుండా ఉంటే, శాపాలన్నీ తగులుతాయి ద్వితీయ 28: 15 నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.
పాపంవల్ల కలిగే *గొప్ప శిక్ష* ఏమంటే దేవుని సన్నిధి నుండి ఎడబాటు, ఒంటరితనం, భయం, నిరుత్సాహం, జీవితాంతం ఉండే శాపం.
తన ప్రజలను శపించాలని దేవునికిష్టం లేదు. శాపాలన్నవి మనిషి చేసే పాపాలు, చూపే అవిధేయత, తిరుగుబాటు మూలంగా కలిగే ఫలితాలు. అవి దేవుని న్యాయవిధి అమలు జరిగే విధానాలు.
*✳2. భూమి మీద నరుల చెడుతనం గొప్పది:* మనలో కూడా శరీర స్వభావ రీత్యా చెడుతనం ఉన్నది. (ఆది కాండం 6:5 నరుల చెడు తనము భూమిమీద *గొప్పదనియు*, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి..... )
ఆదాము చేసిన ఆ ఒక్క పాపం ఫలితం భూమి విస్తరించిన గొప్ప చెడుతనం. పాపం అంతరంగంలో ఆరంభం కావడం గమనించండి. ఇది హృదయంలోని చెడుతనం. ఇక మనిషిని అతడి చెడు స్వభావానికే వదిలి వేస్తే దేవునికి మంచి అనిపించే ఒక్క తలంపు కూడా ఉండకపోవడం గమనించండి.
*✳3. భూమి మీద ఉన్న మరణం గొప్పది:* మానవుడు చేసిన పాపం, చెడుతనం మరియు దోషం భూమి మీద గొప్పది కనుక దానికి ప్రతిఫలముగా భూమి మీదకు గొప్ప మరణం వచ్చింది. రోమ 6:23 ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము... 2కొరి 1:10 ఆయన అట్టి *గొప్ప మరణమునుండి* మమ్మును తప్పించెను.
ఇటువంటి గొప్ప పాపం నుండి, గొప్ప చెడుతనం నుండి గొప్ప మరణం నుండి మనలను రక్షించుటకు *అందరికంటే గొప్పవాడు* ఈ లోకంలో పుట్టవలసి యున్నది. అందుకే యేసు గొప్పవానిగా ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది.
*✳4. అందరికంటే గొప్పవాడు ప్రభువైన యేసు క్రీస్తు:* అందరికంటే గొప్పవాడు ప్రభువైన యేసు క్రీస్తు కారణం ఆయన మరణాన్ని జయించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరణాన్ని జయించినవాడే గొప్పవాడు. ఈ లోకంలో ఆన్నిటికన్నా గొప్ప బలం ఉన్న మరణాన్ని ప్రభువు ఓడించాడు. ఆ విజయాన్ని మనకు ఇచ్చి మనలను కూడా గొప్పవాళ్ళనుగా చేశాడు.
గొప్ప మరణము నుండి ఆయన మనలను తప్పించుటకు సమర్ధుడు. కారణం మన ప్రభువు మరణం కంటే గొప్పవాడు. (అపో.కా 2:24 మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.)
గొప్ప దేవుడైన యేసుప్రభువును మరణం బంధించివుంచడం ఎందుకు అసాధ్యం అంటే తండ్రి అయిన దేవుడు మరణం మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. ఆయనే మనకొరకు తన ప్రాణం ధారపోశాడు గాని ఆయనను మరణం బంధించలేక పోయింది. ఆయన అనుమతిస్తేనే తప్ప ఎవరూ ఆయన ప్రాణం తీసుకోలేకపోయారు, మరణించి తిరిగి సజీవంగా లేవకుండా ఆయన్నెవరూ ఆపలేకపోయారు. ఈ రెండూ కూడా ఆయన విషయంలో దేవుని సంకల్పమే. యేసుకు ఈ రెంటిమీద అధికారం ఉంది.
(యోహాను10:17 నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు., 18 ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.).
సమస్త మానవాళి కొరకు క్రీస్తు ప్రాణత్యాగం చేయడం ఇదే ఆయన గొప్పదనం. ఇదే తండ్రి ఆయన్ను ప్రేమించడానికి గల ప్రత్యేక కారణం. ఈ కారణాన్ని బట్టే తండ్రి యేసును అత్యున్నతంగా ఘనపరిచాడు
*✳5. ఆయనను నమ్ముకున్నవారిని గొప్పవారిగా చేస్తాడు:* ప్రభువు గొప్పవాడు గనుక ఆయనను నమ్ముకున్న వారిని గొప్పవారినిగా చేస్తాడు. అయన మనలను సాతాను బంధకాల నుండి విడిపించి, బలపరచి, మనలను గొప్పవారిని గా చేయుటకు ఈ లోకంలో జన్మించి యున్నాడు. అబ్రహాము దేవుని నమ్మినాడు గనుక గొప్పవాడిగా మారాడు. (ఆదికాండం 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.)
అవును ప్రభువు చెప్పినట్లే గోప్పదేవుని నమ్మిన అబ్రహాము ఈ గొప్పగా దీవించబడ్డాడు. అబ్రాహాము సంతతిలోనుంచి అనేకమంది రాజులు వచ్చారు. ఇస్రాయేల్, ఇతర ప్రజల పాలకులు ఇందులో ఉన్నారు. రారాజు యేసుప్రభువు కూడా తన మానవావతారంలో అబ్రాహాము సంతానమే (ఆది 17:5 మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అన బడును.)
అవును ప్రియ దేవుని బిడ్డలారా! దేవుని నమ్ముకున్నవారు ఈలోకంలో ప్రభువును బట్టి గొప్పవారుగా ఉండగలరు. వారికి దేవుని బిడ్డలని పేరు.
*✳6. గొప్ప దేవుని నమ్మిన బిడ్డల విశ్వాసం గొప్పది:* (మత్తయి 15:28 అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.)
ప్రభువు నమ్మిన ఒక అన్యుడైన శాతాధిపతి విశ్వాసంలో గొప్పవాడు అని ప్రభువుచే మెప్పు పొందాడు. (మత్త 8:10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రా యేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.)
*✳7. గొప్ప యేసు ఏర్పాటు చేసిన సంఘం గొప్పది:* చేతి సహాయం లేకుండా తీయబడిన చిన్న రాయి అనగా పురుషుని సహాయం లేకుండా ఈ లోకంలో పుట్టిన యేసు బాలుడు (చిన్న రాయి) సర్వ భూతలమంత మహా *గొప్ప* పర్వతంగా మారినాడు. ఈ లోకంలో క్రీస్తు సంఘమే గొప్పది. దీనికే గొప్ప సాక్షి సమూహం అని పేరు. (హెబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున 2 మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము
*✳ముగింపు:* ఆయనే గొర్రెల గొప్ప కాపరి. (హెబ్రీ 13:20 గొఱ్ఱల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు...కీర్తన 48:1 యెహోవా *గొప్పవాడును* బహు కీర్తనీయుడునై యున్నాడు. )
గొఱ్ఱల *గొప్ప కాపరియైన* యేసు అను మన ప్రభువును...
అందుకే ఒక భక్తుడు ఇలా పాడి దేవుని స్తుతించాడు.
"ప్రభువు గొప్పవాడును
అధిక శక్తి సంపన్నుడు,
జ్ఞానమునకు ఆయనే
మితియు లేనివాడని,
దేవునికి స్తోత్రము గానము
చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము
చేయుటయే మంచిది."
కీర్తన 147:5 మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.
అటువంటి గొప్ప వాడైన యేసును ఈ ఆడ్వెంట్ క్రిస్మస్ నెల సమయంలో ఆరాధించి ధన్యుల మవుదాం.
దైవాశ్శీసులు
(To be continued...)
-
*✝యేసు అందరికంటే గొప్పవాడుగా పుట్టాడు🛐*
(ప్రభువు గొప్పవాడు – 2)
(క్రిస్మస్ సందేశాలు - 2)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(మత్త 12:42 ఇదిగో సొలొమోను కంటె *గొప్పవాడు* ఇక్కడ ఉన్నాడు.)_
*🏵ఉపోద్ఘాతం:* తండ్రి అందరికంటే గొప్పవాడు అని వ్రాయబడి యున్నది. (యోహాను 10:29 వాటిని నాకిచ్చిన నా తండ్రి *అందరికంటె గొప్పవాడు*.) తండ్రి మరియు కుమారుడు ఏకమై యున్నారు గనుక కుమారుడు కూడా అందరికంటే గొప్పవాడుగా ఈ లోకంలో జన్మించాడు. (యోహాను 10:30 నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.)
కనుక మన ప్రభువైన యేసు అందరికంటే గొప్పవాడిగా ఈ లోకంలో పుట్టాడు. మన ప్రభువు ఎవరికంటే గొప్పవాడు? ఈ భూమి గొప్పవారు అనేకులు ఉన్నా మన ప్రభువు వారి అందరికంటే గొప్పవాడు. అయితే ప్రభువు ఎవరికంటే గొప్పవాడు ఈ క్రింది ఉదాహరణల ద్వారా పరిశీలిద్దాం.
*🏵1. అబ్రహాము కంటే గొప్పవాడు:* యూదులైనవారు చనిపోయిన మా తండ్రి అబ్రాహాము కంటే గొప్పవాడివా అని ప్రభువును ప్రశ్నించారు. (యోహాను 8:53 మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతని కంటె గొప్పవాడవా యోహాను 8:58 యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.)
యూదుల గొప్ప పూర్వీకుడు అబ్రాహాముకంటే ముందుగా తాను ఉన్నానని ప్రభువు చెప్పుచున్నాడు. క్రీస్తు వచ్చే రోజును గురించి అబ్రాహాము సంతోషించాడు. మరి యూదులైతే క్రీస్తును చంపజూశారు. రాబోయే వాగ్దానసంతానం కోసం అనగా క్రీస్తు కోసం అబ్రాహాము ఆనందంతో ఎదురుచూశాడు నిజానికి యేసు వయసు దాదాపు ౩౩ ఏళ్లు మాత్రమే అయినా ఖచ్చితంగా తాను అబ్రాహాముకు ముందు జీవించానని గంబీరమైన, ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభువు ఇక్కడ చెప్పాడు.
నేను యుగయుగాలలో “నేను ఉన్నవాడను” ఆయన ఆరంభంలో ప్రకటించిన సత్యాన్నే మరల యేసుప్రభువు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. కనుక ప్రభువు అబ్రహాము కంటే గొప్పవాడుగా ఉన్నాడు.
*🏵2. యాకోబు కంటే గొప్పవాడు:* నేవు మా తండ్రియైన యాకోబు కంటే గొప్పవాడివా అని సమరయ స్త్రీ అడిగిన ప్రశ్నకు యేసు అవునని చెప్పాడు. యాకోబు బావి కేవలం శరీర దాహం తీర్చుటకు మాత్రమే నీరు ఇవ్వగలదని కాని యేసు అనబడిన బావిలోని నీళ్లు నిత్యజీవమునకై ఊరెడి నీళ్ళుగా ఉండునని ఆమెతో చెప్పెను. (యోహాను 4:12 తానును తన కుమాళ్లును, పశువులును, యీబావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? యోహాను 4:13-14 అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.)
*🏵౩: సోలోమోను కంటే గొప్పవాడు:* ప్రపంచలోనే అత్యంత గొప్ప జ్ఞానవంతుడు సోలోమోను. అయితే యేసు సర్వ జ్ఞాని. ఈ లోకంలో జ్ఞానులైనవారి కంటే గొప్ప జ్ఞానిగా ప్రభువు ఈ లోకంలో పుట్టాడు. అందుకే ఆయనకు ఆలోచన కర్త అని పేరు. – మత్త 12:42 విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంత ములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె *గొప్పవాడు* ఇక్కడ ఉన్నాడు.
*🏵4. యోనా కంటే గొప్పవాడు:* మూడు రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్న యోనాకంటే కూడా గొప్పవాడినని ప్రభువు తానే స్వయంగా చెప్పుచున్నాడు – మత్త 12:40 యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును మత్త 12:41 నీనెవెవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటె *గొప్పవాడు* ఇక్కడ ఉన్నాడు.
*🏵5. రాజుల కంటే గొప్పవాడు:* ప్రక 19:16 రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడి యున్నది.
ఉదా 1. బబులోను రాజు నేబుకద్నేజరు – దాని 3:15 బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు? దాని 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు
ఉదా2 అష్షూరు రాజైన సన్హెరీబు - . 2 రాజు 18:19 అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెనుఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు మహా రాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగానీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? 2 రాజు 18:33 ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలోనుండి విడిపించెనా? 2 రాజు 19:10 యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి యెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని యున్న నీ దేవునిచేత మోసపోకుము. 2 రాజు 19:35 ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి
ఉదా ౩. ఐగుప్తు రాజు ఫరో – నిర్గ 5:2 ఫరోనేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయ ననెను. నిర్గ 12:31 ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించివారితో మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహో వాను సేవించుడి. నిర్గ 12:32 మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను నిర్గ 7:1 కాగా యెహోవా మోషేతో ఇట్లనెనుఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని
*🏵6. మాంత్రికుల కంటే గొప్పవాడు:* ఉదా 1 శకునగాండ్రు – నిర్గ 7:12 వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెనుగాని అహ రోను కఱ్ఱ వారి కఱ్ఱలను మింగివేయగా నిర్గ 8:18 శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. నిర్గ 8:19 శకునగాండ్రుఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. నిర్గ 9:11 ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువ లేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయు లందరికిని పుట్టెను
ఉదా 2: గారడివాడు - ఎలుమ- అపో 13:11 ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.
*🏵7. సమస్త దేవతల కంటే విగ్రహాలకంటే గొప్పవాడు:* నిర్గ 18:11 ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్య మునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను
ఉదా 1 : నెబుకద్నెజరు బంగారు ప్రతిమ –దాని 3:1 రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను మైదాన ములో దాని నిలువబెట్టించెను. అది అరువదిమూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై యుండెను. దాని 3:18 రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టిం చిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. దాని 2:34 మరియు చేతిసహా యము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కన బడెను
ఉదా 2 – దాగోను దేవత - 1 సమూ 5:3 అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను 1 సమూ 5:4 ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి యుండెను.
ఉదా ౩ : బయలు దేవత – 1 రాజు 18:24 తరువాత మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరునుఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి 1రాజు 18:38 అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. 1 రాజు 18:39 అంతట జనులందరును దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.
*🏵ముగింపు:* యేసు అందరికంటే అనగా మానవులు కంటే, రాజుల కంటే, మాంత్రికుల కంటే ఈ లోక సమస్త దేవతల కంటే గొప్పవాడిగా ఈ లోకంలో జన్మించాడు గొప్ప కార్యాలు చేశాడు. ఆయనను నమ్మినవారిని కూడా ప్రభువు గొప్పవారినిగా చేస్తాడు. ప్రభువు చేస్తున్న కార్యాలు ఆయనను నమ్మిన వారుకూడా చేస్తారని, వీటికి మించిన గొప్ప కార్యాలు చేస్తారని ప్రభువు చెప్పుచున్నాడు. (యోహాను 14:12 నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి *గొప్పవియు* అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.)
దీని అర్ధాన్ని చాలమంది వేరేవిధంగా తీసుకొని ఆయన శిష్యులు అయన మమ్మినవారు ప్రభువు కంటే గొప్ప కార్యాలు చేస్తారని అంటున్నారు. దీని అర్ధం అది కాదు. మనం యేసు కంటే గొప్ప అద్భుతాలు, సూచిక క్రియలు ఎటువంటి పరిస్థితులలో చేయలేము. మనం యేసు కంటే గొప్ప క్రియలు మనం చేస్తామని ప్రభువు చెప్పిన మాటలకు సరైన అర్ధం ఏమంటే యేసునందు విశ్వాసముంచు వారు అనగా ఆయన శిష్యులు ఆయన కంటే ఎక్కువ ప్రాంతాలు దేశాలు ఖండాలు తిరిగి సువార్త సేవ చేస్తారని భావం.
ప్రభువు చెప్పినట్లుగానే ఆయన శిష్యులు, ఖండాలు తిరిగి, ప్రపంచ వ్యాప్తంగా సువార్తను గొప్పగా ప్రకటిస్తున్నారు. ఈన్నాడు మిషనరీలు ప్రపంచంలో వెళ్ళలేని స్థలమే లేదు. ఈ అంత్యదినాలలో దేవుడు సువార్తకు అనేక దారులు తెరిచాడు గనుక అనేక అనేక ప్రాంతాలు వేగంగా తిరగడానికి ప్రయాణ సౌకర్యాలు దేవుడు ఏర్పాటు చేశాదు. టెక్నాలజీని వాడుకొని అనేక నూతన మార్గాల్లో సువార్తను చాటడానికి దేవుడు కృపను చూపుచున్నాడు. గనుక మనం అనేక గొప్ప రీతుల్లో సువార్త ప్రకటించ గలుగుతున్నాం. ఇంకా అనేక క్రొత్త దారుల్లో క్రొత్త విధాలుగా గొప్పగా సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకు తన కృపను సమృద్ధిగా అనుగ్రహించునుగాక! ఆమేన్!!! (To be continued..)
-
*✝యేసు రూపంలో పుట్టిన దేవుని గొప్పప్రేమ* 💟
(ప్రభువు గొప్పవాడు – 3)
(క్రిస్మస్ సందేశాలు- 3)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(యోహాను 4:9 మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన *ప్రేమ ప్రత్యక్షపరచబడెను.*)_
*🏵ఉపోద్ఘాతం:* దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమయై యున్నాడు, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమ యున్నది.
*🏵1. యేసు ప్రేమయై యున్నాడు:* ఈ లోకంలో జన్మించుటకుగల కారణం దేవుని గొప్ప ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ దేవుని స్వభావం. ఆయన మనలను ప్రేమించకుండా ఉండలేడు. ప్రభువు తానే *ప్రేమ* రూపంలో మానవ అవతారం ఎత్తి, ఈలోకంలోనికి వచ్చి బహుదీనుడుగా పశువులశాలలో జన్మించుటకు కారణం, మానవుల యెడల ఆయనకున్న గొప్ప ప్రేమయే”
ఈలోకంలో అన్ని ప్రేమలకంటే తల్లి ప్రేమ గొప్పది అంటారు. అయితే దేవుని ప్రేమ తల్లి ప్రేమకంటె ఎంతో గొప్పది. దేవుని వాక్యము చెప్పునదేమనగా, "స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను". (యెషయా 49:15).
*🏵2. సర్వ మానవుల యెడల ఆయనకున్న ప్రేమ గొప్పది:* దేవుడు తనప్రేమను చూపుటకును తనతో సహవాసము కలిగి యుండుటకును మానవుని సృష్టించెను.
దేవుడు మానవుని సృష్టించి నప్పుడు శరీరము మాత్రమే గాక, ప్రాణము, ఆత్మను కూడా యిచ్చెను. తన స్వరూపం, తన పోలిక, తన ఆత్మ ప్రభువు మనకిచ్చుట అనునది మానవుల యెడల ఆయన కున్న ప్రేమను తెలియజేయు చున్నది. ఆయన ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
"నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనై యుందును; మీరు నాకు ప్రజలై యుందురు" లేవి. కాం. 26:12. అటువంటి ప్రియమైన మానవుడు పాపంలో పడిపోతే, సర్వ సృష్టిని ఒక్క నోటిమాట చేత సృజించిన దేవుడు ఒక్క నోటిమాట చేత ఈ లోకములోని పాపులందరిని రక్షించలేడా? అవసరమైతే తన వేవేల దూతలను పంపి పాపులందరిని రక్షించగలడు. అయితే దేవుడే స్వయంగా రక్షించుటకు ఎందుకు దిగి వచ్చాడు?
*🏵3. గొప్ప తండ్రి గొప్ప ప్రేమ:* ఒక రాజు తన కుమారునితో కలసి నదిలో ఓడ మీద షికారుకు వెళ్ళెనట. రాజకుమారుడు కాలుజారి నదిలో పడెనట. ఆ రాజకుమారుని రక్షించుటకు ఓడలో అనేకమంది పరివారమున్ననూ ఆగలేక ఆ రాజుగారే స్వయంగా నదిలోనికి దూకి తన కుమారుని రక్షించాడు. దీనికి కారణం *తండ్రి ప్రేమ.*
సర్వశక్తిగల దేవుడు ఒక్క మాటచేత ఈ పాపులందరినీ రక్షింప సమర్ధుడైయుండియూ అట్లు రక్షింపక తానే మానవ అవతారం ఎత్తి, ఈలోకంలోనికి స్వయంగా వచ్చి బహుదీనుడుగా పశువులశాలలో జన్మించుటకు కారణం, మానవుల యెడల ఆయనకున్న *గొప్ప ప్రేమయే”*
*🏵4. వెల్లడిపరచబడిన దేవుని గొప్ప ప్రేమ:* క్రీస్తు ఈలోకంలో జన్మించి మన స్థానంలో మరణించి మన పాపాలను తొలగించి వేశాడు. మనం ఆయన్ను నమ్మినప్పుడు క్రీస్తురక్తం మూలంగా మనలను నిర్దోషులుగా లెక్కించాడు; మనలను తన స్నేహితులుగా చేసుకున్నాడు. మన అనుభవాన్ని దృక్పథాన్ని మొత్తంగా మార్చేశాడు. తనఆత్మను మనలో ఉంచి మనల్ని నూతన సృష్టిగా చేశాడు. క్రీస్తు సిలువదగ్గర వెల్లడి అయిన దేవుని ప్రేమ మనకు నేర్పుతున్న దేమిటంటే, మనము పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. దీనిని మనం నమ్మినప్పుడు మనలను నిర్దోషులుగా ఎంచి తన స్నేహితులుగా చేసుకుంటాడు. ఇది తిరుగులేని దేవుని ప్రేమ.
రోమా 5:7-8 నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
*🏵5. ప్రేమ శ్రేష్టమైనది:* ప్రేమ శ్రేష్టమైనది అని పౌలు చెప్పుచున్నాడు. అటువంటి దివ్య ప్రేమకు మూలాధారం దేవుడే, మానవుడు కాదు. దేవుడు మనకు నేర్పించకపోతే అదేమిటో మనకు తెలియదు. ఆయన మనల్ని ప్రేమించకపోతే, తన ప్రేమను మన హృదయాల్లో ఉంచకపోతే మనం ఆయన్ను ప్రేమించగలిగే వాళ్ళం కాదు. (1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.)
దేవుణ్ణి గురించి తమకున్న జ్ఞానం, తెలివి విషయంలో మనుషులు గర్వపడవచ్చు. కానీ దేవుని ప్రేమ వారిలో లేకపోతే తమను తాము మోసగించుకొంటున్నారు. వారికి రకరకాల నిగూఢ అనుభవాలు, ఆత్మ తృప్తి కలిగించే ఉద్రేకాలు ఉండవచ్చు. కానీ అవి కూడా వారిని క్రీస్తులోని విశ్వాసులపట్ల ప్రేమ చూపేలా చేయకపోతే అన్నీ వ్యర్థమే, నిరుపయోగమే.
(1 యోహాను 4:16 మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాని నమ్ముకొని యున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, 1 యోహాను 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. 1కొరి 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.)
*🏵6. స్వార్ధం ఎరుగని ప్రేమ - ఆగాపే:* విశ్వాసులు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి ప్రేమించడంలో దేవుని లాగానే వారుండాలి. ఇక్కడ యోహాను చెప్తున్నది దివ్య ప్రేమ అనగా స్వార్ధం ఎరుగని ప్రేమ. (“ఆగాపే” – 1 కొరింతు 13:1మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును )
ప్రేమలన్నిటికంటే ఒక ఉన్నత స్థాయి ప్రేమను ఈ పదం “ఆగాపే” తెలియజేస్తున్నది. ఇది దేవుని ప్రేమ, క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి ఆయన ఇచ్చే ప్రేమ (యోహాను 17:26 నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను).
లోకంలో మరెవరిలోనూ ఇది లేదు. దేవుని ప్రేమనూ, విశ్వాసులు ఒకరిపట్ల ఒకరు పరస్పరం, దేవునిపట్ల కూడా చూపవలసిన ప్రేమనూ సూచించేందుకు ఈ మాటను వాడారు. ఇది స్వార్థం లేని ప్రేమ, ఎప్పుడూ ఇతరుల మేలు కోరే ప్రేమ. కామం, స్వార్థపరమైన కోరికలు, స్త్రీ పురుష సంబంధాల్లో ఉండే ప్రేమతో దీనికి ఎలాంటి సంబంధమూ లేదు. లోకంలో మనుషులకు తమ స్నేహితులపట్ల, కుటుంబాలపట్ల ఉండే సహజ ప్రేమ కంటే మించినది ఇది. లైంగిక ప్రేమతో గానీ మోహంతో గానీ లోకమంతటా కనిపించే భావోద్రేక పూరితమైన ప్రేమతో గానీ దీనికి సంబంధమే లేదు.
ఇది స్వార్థం లేని ప్రేమ. సేవ చేస్తూ, ఇతరులకు దీవెనలు తేవాలని చూచే ప్రేమ. ఇతరుల ఆధ్యాత్మిక మేలును ఆశించే ప్రేమ. మన కోసం చనిపోయేందుకు దేవుడు తన కుమారుణ్ణి పంపడంలో ఇది చక్కగా కనిపించింది.
*🏵7. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి:* అనగా మనము ఒకరి నొకరు ప్రేమించు కోవాలి. దేవుడు మనలను ప్రేమించి మన కొరకై ఈ లోకములో జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములకై సిలువలో చనిపోయి, పాతిపెట్టబడి, తిరిగిలేచెనని, మనము విశ్వసించి, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన యెడల నశింపక నిత్యజీవము పొందెదము (యోహాను 3:16).
దేవుడు మనలో ఉంటే ప్రేమ మనలో ఉంటుంది. ప్రేమ (ఆగాపే) మనలో ఉంటే దేవుడు మనలో ఉంటాడు. ఆయన గొప్ప ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి అనగా దేవుని ప్రజలు ఒకరినొకరు ప్రేమించడం వల్లే దేవుని ప్రేమ ఈ భూమిపై నెరవేరుతుంది.
*🏵ముగింపు:* ప్రేమమూర్తియైన దేవుడు తమ కుమారుని ఈ లోకంలో జన్మింప జేసి ఆయన సిలువ మరణం ద్వారా మనపట్ల తన ప్రేమను నిరూపించాడు. ఒక మనిషి ఆధ్యాత్మికంగా జన్మించిన తరువాత అతడు దేవుణ్ణి ఎరిగినవాడు అనడానికి ఉన్న ఖాయమైన రుజువు ఏమిటంటే అతని హృదయంలో దేవుని ప్రేమ ఉండడమే. కాబట్టి ఆ గొప్ప దేవుని బిడ్డలముగా మనం కూడా ప్రేమించాలి. ఆ గొప్ప ప్రేమను ఇతరులకు చూపాలి. ఇతరులపట్ల మన ప్రేమను మాటల్లో చేతల్లో చూపాలి.
అట్టి గొప్ప ప్రేమను ప్రభువు మన హృదయంలో సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆమెన్!
దైవాశ్శీసులు!!!
(To be continued..)
-
*✝"యేసు అను పేరు పెట్టుదువు"✝*
(ప్రభువు గొప్పవాడు –4)
(క్రిస్మస్ సందేశాలు - 4)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(కీర్తనలు 76:1 యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన *నామము గొప్పది*.)_
*🏵ఉపోద్ఘాతం:* దేవదూత మరియకు ప్రత్యక్షమై "ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు" అని చెప్పి యున్నాడు. కారణం "యేసు" అను *గొప్ప నామము* ద్వారా దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు చేయడానికి ఉద్దేశించాడు.
(ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు లూకా 1:31) దేవుని గొప్ప నామము అనగా ఎక్కువమంది ఎరిగిన నామము. (యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన *నామము గొప్పది* కీర్తన 76:1)
*యేసు నామం* అన్ని నామములకన్న ఘనమైన నామం. కారణం యేసు నిజమైన దేవుడు. నిజ దేవుణ్ణి ఎరిగి ఉండడమే ఒక వ్యక్తికి ఉండగలిగిన అతి శ్రేష్ఠమైన ధన్యత. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల ధన్యత ఇదే. ఇప్పుడు ఈ ఏకైక నిజ దేవుడు యేసు నామం ద్వారా లోకమంతా వ్యాపించి ఉన్నాడు. యేసు అను నామము ఇప్పుడు భూలోకంమంతా కోటాను కోట్ల విశ్వాసులందరికీ తెలిసిన నామం గనుక యేసు నామము గొప్ప నామము.
యేసు నామం గొప్పది కారణం యేసు తనను తగ్గించుకున్నంత దీన స్థితికి ఎవరూ తగ్గించు కోలేదు. ఆయన హెచ్చించబడినంత ఉన్నత స్థితికి ఎవరినీ హెచ్చించడం జరగలేదు. ఆయన మాత్రమే దానికి అర్హుడు కాబట్టి యేసు *నామమునకు* ఎంతో ఎత్తయిన స్థానం ఉంది.
ఫిలిప్పి 2:9-11 అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును *యేసు నామమున* వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొననట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
అటువంటి *గొప్పనామము* కలిగిన యేసును ఎరుగుటయే నిత్యజీవమును పొందుకొనుట. (యోహాను 17:3 అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.)
దేవుని నామము అంటే ఆయన స్వభావం. ఆయన పేరును కీర్తించడమంటే ఆయన పేర్లలో ఒకదాన్ని పదేపదే వల్లించడం కాదు. ఆయన స్వభావాన్ని, గుణశీలాలను ఆనంద పూర్వకంగా గుర్తించి తలచుకోవడం ద్వార జరగాలి అనగా యేసు నామమునకు మాత్రమే స్తుతులు చెల్లించాలి. (కీర్తనలు 113:2 ఇది మొదలుకొని యెల్లకాలము *యెహోవా నామము* సన్నుతింప బడునుగాక.)
ఈ క్రింది కారణాల వలన *యేసు నామం గొప్పది.*
*🏵1. యేసు నామం ద్వారా రక్షణ:* మత్తయి 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. అపో 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
*🏵2. యేసు నామం ద్వారా పాప క్షమాపణ:* అపో 10:43 ఆయనయందు విశ్వాసము ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్త లందరు ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నారనెను
*🏵3. యేసు నామం ద్వారా ప్రార్ధన:* మనం “యేసు నామములో" మాత్రమే ప్రార్ధన చేయవలసి యున్నది. ఆయనలోని సమస్తాన్ని, ఆయన స్వభావాన్ని, లక్షణాన్ని, అధికారాన్ని, సంకల్పాన్ని సూచిస్తున్నది.(యోహాను 14:13-14 మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.)
ఈ లోకంలో మనం ఎటువంటి ఆందోళన చెందకూడదు. కారణం మనం *యేసు నామంలో ప్రార్ధన* అనే గొప్ప ఆయుధం మనకు దేవుడు ఇచ్చాడు. సఫలమైన ప్రార్థన క్రీస్తు *పేరట* చేసేదే. ఏ ఇతర నామం, ఏ ఇతర మధ్యవర్తీ అవసరం లేదు. ఆయన పేర చేసే ఎలాంటి ప్రార్థనకైనా ఆయన తానే జవాబిస్తాడు కాబట్టి మన ప్రార్థనలకు జవాబు కోసం పరలోకంలో గానీ భూమిపై గానీ మరెవరి సహాయమూ మనకు అవసరం లేదన్నది స్పష్టమే.
*🏵4. యేసు నామం ద్వారా బోధించుట:* అపో 9:29 ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, అపో 4:18 అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి యెంత మాత్రమును మాటలాడ కూడదు, బోధింపను కూడదని వారికాజ్ఞాపించిరి అపో 5:28 ప్రధానయాజకుడు వారిని చూచిమీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? 29 అందుకు పేతురును అపొస్తలులు నుమనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.
*🏵5. యేసు నామం ద్వారా ఆజ్ఞాపించుట:* 2 థెస్స 3:6 సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించు చున్నాము.
*🏵6. యేసు నామం ద్వారా అధ్బుతాలు:* అపో 3:6 అంతట పేతురు వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు *క్రీస్తు నామమున నడువుమని* చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
*🏵7. యేసు నామం ద్వారా స్వస్థత:* అపో 4:10 మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువ వేసినట్టియు, మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన *యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది* మీ యెదుట నిలుచుచున్నాడు.
*🏵8. యేసు నామం ద్వారా దయ్యపు శక్తుల నుండి విడుదల:* అపో 16:18 ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగినీవు ఈమెను *వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున* ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలి పోయెను. లూకా 10:17 ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా, *దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని* చెప్పగా...
*🏵9. యేసు నామం ద్వారా బాప్తిస్మము:* అపో 2:38 పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు *యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము* పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అపో 8:16 అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండ లేదు, వారు ప్రభువైన *యేసు నామమున బాప్తిస్మము* మాత్రము పొందియుండిరి. అపో 10:48 *యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని* ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి
*🏵10. యేసు నామం ద్వారా శ్రమలు అవమానం ఎదుర్కొనుట:* అపో 5:41 ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి... అపో 9:16 ఇతడు *నా నామము కొరకు ఎన్ని శ్రమలను* అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.
*🏵11. యేసు నామం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట:* 1కొరి 6:11 మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు *క్రీస్తు నామమునను* మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధ పరచబడిన వారై *నీతిమంతులుగా తీర్చబడితిరి*
*🏵12. యేసు నామం ద్వారా కృతజ్ఞతాస్తుతులు:* ఎఫెస్సి 5:20 మన ప్రభువైన *యేసుక్రీస్తు పేరట* సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును *కృతజ్ఞతా స్తుతులు* చెల్లించుచు... కొలస్సి 3:17 మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన *యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,* సమస్తమును ఆయన పేరట చేయుడి.
*🏵13. యేసు నామం ద్వారా ఐక్యత:* 1కొరి 1:10 సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యము తోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన *యేసుక్రీస్తు పేరట* మిమ్మును వేడుకొనుచున్నాను
*🏵14. యేసు నామం ద్వారా చూపిన ప్రేమను దేవుడు మరువడు:* హెబ్రీ 6:10 మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుట చేత *తన నామమును బట్టి* చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు
*🏵15. ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండు యేసు నామం:* కీర్తనలు 113:3 సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. కీర్తన 25:5 నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.
ప్రభువు తన యొక్క ఘనమైన నామము ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేయును గాక. ఆమెన్!
(To be continued..)
దైవాశ్శీసులు!!!
-
*✝సమస్త మనుష్యులకు రక్షణార్ధంగా యేసు రూపంలో పుట్టిన దేవుని గొప్ప కృప🛐*
(ప్రభువు గొప్పవాడు – 5)
(క్రిస్మస్ సందేశాలు - 5)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(తీతు 2:11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన *దేవుని కృప* ప్రత్యక్షమై...)_
*🏵ఉపోద్ఘాతం:* మానవుడు పాపం చేసి దేవుని కృపను కోల్పోయిన పరిస్థితిలో ఉండగా దేవుని యొక్క గొప్ప కృపయే యేసుగా ఈ లోకంలో పుట్టినది. దేవుని కృప అనేది ఒక వియుక్త భావన లేదా ఒక లక్షణం కాదు. దేవుని కృప అనేది ఒక వ్యక్తి. యేసు క్రీస్తు దేవుని కృప యొక్క వ్యక్తిత్వం. వాక్యం దేవుడై యుండెను, ఆ వాక్యమే వాక్యము శరీరధారిగా *కృపా*సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు ఈలోకంలో *జన్మించెను.*
ఏదెను వనంలో ఆదాము చేసిన పాపం వల్ల వారూ చనిపోవడం నిశ్చయం అయినది. అయితే దేవుని కృప మానవాళి అంతటికీ ప్రవహించడం అనేది అంతకంటే మరెక్కువగా నిశ్చయం.
దేవుని కృప అందరికీ యేసు రూపంలో అందుబాటులోకి వచ్చింది. క్రీస్తులో నమ్మకం ఉంచితే అందరూ విముక్తి, రక్షణ పొందుతారని అర్థం. (యోహాను 1:14) సర్వ మానవ పాప పరిహారార్ధం ఈ లోకానికి వచ్చిన కుమారుడు సంపూర్ణమైన కృపతో అనగా *దేవుని యొక్క గొప్ప కృప* అనే వ్యక్తిగా ఈ లోకంలో జన్మించినాడు గనుక ఆయనకు *కృపా* సత్య సంపూర్ణుడు అని పిలువబడ్డాడు.
*🏵1. సమస్త మనుష్యులకు రక్షణార్ధమైన దేవుని కృప:* (తీతు 2:11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై..) ఈ లోకంలో ప్రత్యక్షమైన యేసు అనే కృప ద్వారా మాత్రమే పాపవిముక్తి. కృప ద్వారా వచ్చు రక్షణ అన్ని రకాల మనుషుల కోసం ఉన్నది. పేదల కోసం, ధనవంతుల కోసం, వృద్ధుల కోసం, పడుచువారి కోసం, స్త్రీలకోసం, పురుషుల కోసం ప్రత్యక్షమైంది. కేవలం యూదుల కోసమే కాక లోకంలో ఉన్న ప్రజలందరి కోసం, అంతటా ఉన్న మనుషులందరి కోసమూ ప్రత్యక్షమైంది.
కీర్తన 119:64 యెహోవా, భూమి నీ కృపతో నిండి యున్నది. యెషయా 6:3 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. అవును మనం కేవలం కృప ద్వారా మాత్రమే అనగా యేసు నందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే రక్షించ బడగలం. ఎఫెస్సి 2:8 మీరు విశ్వాసముద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
రక్షణ విషయములో మానవునికి భాగము కొంచెమైనను లేదు. అది దేవుని ద్వారానే మనకు అనుగ్రహించ బడినది. అది కేవలము దేవుని వరమే. (తీతు 3:6 మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,)
*🏵2. కృప వెంబడి కృప:* (యోహాను 1:16 ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు) పాప విముక్తిద్వారా మనుష్యులను రక్షించిన కృప వారిని విడిచి పెట్టునది కాదు. వారిలో ఉండి వారిని బలపరచునది.
కృప వెంబడి కృప అనే పదాల యొక్క గ్రీకు భావం మనం చూస్తే, అస్తమానం ప్రవహించే నది ఈ కృపను సూచిస్తూ ఉంది.
సముద్రం అలల్లాగా ఒక కృప చర్య తరువాత మరో కృప చర్య వస్తూ ఉండడం. ఈ కృప ప్రవహించే మార్గం యేసు క్రీస్తు. యేసు అనబడిన ఆ కృప నీలో ఉదయిస్తే, కృపతో నీ గిన్నె నీ జీవితం నింపబడడమే గాక పొంగి పొర్లుతూ అనేకుల జీవితాలలోనికి నీ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అదే క్రైస్తవ సంపూర్ణత. యేసు ద్వార ఈ కృప అనేకులకు విస్తరించు చున్నది.
రోమా 5:15 ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన యెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను.
*🏵3. కృపయే రక్షణ సువార్త:* ఆనాడు దేవుడు మహిమ స్వరూపుడుగా ప్రత్యక్షగుడారం లోనికి దిగివచ్చాడు. ఇశ్రాయేలీయుల మధ్య మహిమగా నివసించాడు. అదేవిధంగా యేసు కృపాస్వరూపుడుగా మానవులను రక్షించుటకు ఈ లోకంలో జన్మించినాడు.
కృపా వాక్యంగా మన మధ్య నివసిస్తునాడు. ఆనాడు మహిమ దేవుడు మానవ నిర్మిత గుడారంలో నివసించాడు. ఈనాడు కృపామయుడు దేవునిచేత నిర్మితమైన మన దేహమనే దేవాలయంలో నివసిస్తున్నాడు. ఆ కృపయే దేవుని వాక్యంగా సువార్తగా మారి ఈనాడు లోకంలో అనేకులను రక్షించుచున్నది.
మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడిన నాడు మూడు వేలమంది చనిపోయారు. కారణం ధర్మశాస్త్రము మనలను రక్షించలేదు. (నిర్గమ 32:28 లేవీయులు మోషే మాటచొప్పున చేయగా, ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేలమంది కూలిరి)
యేసు క్రీస్తు కృప సువార్తగా ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వార అందించబడినప్పుడు మూడు వేలమంది రక్షించబడ్డారు. (అపో 2:41 కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.)
*🏵4. కృప మనకు బోధించునది:* దేవుని కృప తెలివిగల ఉపదేశకుని వంటిది. ఇది విశ్వాసులకు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అని నేర్పిస్తుంది. “నేను నీకు రక్షణ ఇచ్చాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు” అని కృప చెప్పదు.
(రోమా 6:1 ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాప మందు నిలిచియుందుమా? 6:15 అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్న టికిని కూడదు.)
ఈ కృప అనబడిన యేసు మనకు నేర్పించేది ఏమంటే, పాపానికీ స్వార్థానికీ సైతానుకూ “వద్దు” అని చెప్పడం, దేవునికీ భయభక్తులకూ మంచితనానికీ “అవును” అని చెప్పడం నేర్పిస్తుంది. కృప మనకు ఇంకా నేర్పుతున్నది ఏమంటే, మనం భక్తిహీనతనూ లోక సంబంధమైన ఇచ్ఛలనూ విసర్జించి ఈ భయంకరమైన అంత్య దినాలలో మనసును అదుపులో ఉంచుకొంటూ ఉండాలి. నీతిన్యాయాలతో, భక్తితో బ్రతుకుతూ ఉండాలి. ఎలా జీవించాలో కృపద్వారా నేర్చుకోవడమే క్రీస్తులో మనకు ఆధ్యాత్మిక జీవితం ఉంది అనడానికి రుజువు.
*🏵5. ఆయన చూపు కృప ఎంతో గొప్పది:* (కీర్తనలు 86:13 ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది.) మనం కేవలం కృప ద్వార మాత్రమే రక్షించ బడితిమి. "అర్హత లేనివాడు అర్హునిగా ఎంచ బడడమే కృప యొక్క నిర్వచనం. మనకు అర్హత లేకపోయినా యేసు తన కృప ద్వారా మనలను రక్షించుటకు కృపా స్వరూపుడుగా ఈ లోకంలో జన్మించినాడు. ప్రభువా అని పిలువడానికి కూడా అర్హతలేని మనకు తండ్రీ అని పిలిచే యోగ్యత నిచ్చింది ఆయన కృప.
*🏵6. ఆయన కృప మనకు చాలును:* (2 కొరింది 12:9 అందుకునా కృప నీకు చాలును,) ఎటువంటి వ్యక్తిగత, కుటుంబ, మానసిక, ఆర్ధిక, సామాజిక సమస్యలైనా సరే భయపడవద్దు. దిగులు చెందవద్దు. నీ ప్రియ రక్షకుడు నీకిస్తున్న వాగ్దానం 'నా కృప (యేసు) నీకు చాలు' కారణం ఆయన మన యెడల చూపు కృప గొప్పది.
అవును! అవి ఎట్లాంటి పరిస్థితులైనాసరే. చివరకు అది అగ్నిగుండమైనా సరే. ఆయన కృప నీకు తోడుగా వుండబోతుంది.
పౌలు అడిగినదాని కన్నా శ్రేష్ఠమైన దాన్ని ప్రభువు ఇచ్చాడు. గొప్ప వాగ్దానాన్నీ ప్రభువు మనందరకూ ఇచ్చాడు. మనం క్రీస్తు మూలంగా ఆధ్యాత్మికంగా బలపడాలనుకుంటే మనం మన బలహీనతలను గ్రహించాలి. అప్పుడు ఆయన కృప మనకు చాలు. తన వారందరికీ, అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని తరాల్లోనూ ఆయన కృప చాలు.
పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు యెషయా 54:10
*🏵7. మనమేమై యున్నామో అది దేవుని కృప:* పౌలు " నేనేమైయున్నానో, అది దేవుని కృపవలననే అయి యున్నాను" అని 1 కొరింది 15:10 లో చెప్పుచున్నాడు. కొంతమంది కొరింతీయులు అతని విద్య, నాగరికత, తదితర అర్హతలను బట్టి అతడు గొప్ప అపొస్తలుడయ్యెనని అన్నారు. పౌలయితే తానేమైయున్నాడో అది కేవలము దేవుని కృప వలననే అని మిక్కిలి స్పష్టముగా చెప్పుచున్నాడు.
అవును అది ప్రతి దైవ సేవకుల విషయములో కూడా వాస్తవం. మనము ఏమైయున్నామో అది మన విద్యార్హతలు, ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు, తెలివితేటలు బట్టి అయి ఉన్నామని మనము గర్విస్తాం. కాని ఇదంతా దేవుని కృప అని గ్రహించినప్పుడే మనము ఆయన సేవకులముగా ఉండి, అనేక విధములుగా ఆయన సేవ చేయగలుగుదుము.
*🏵ముగింపు:* మనము చేయునదంతయు ఆయన కృపను బట్టియేగాని, మనము సాధించిన దేనిని బట్టి కూడా ఆయన సేవ చేయలేమని దేవుని వాక్యంలో మనము స్పష్టముగా చూచుచున్నాము. కీర్తనలు 103:11 భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.
అట్టి గొప్ప కృపను నిర్లక్ష్యం చెయ్యొద్దు. చులకన చెయ్యొద్దు. ప్రభువు తన గొప్ప కృపను మన హృదయాలలో సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆమెన్!
(To be continued..)
దైవాశ్శీసులు
-
*✝యేసు ఇచ్చు రక్షణ గొప్పది🛐*
(ప్రభువు గొప్పవాడు – 6)
(క్రిస్మస్ సందేశాలు - 6)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(1 సమూ 19:5 అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల కందరికి *గొప్ప రక్షణ* కలుగజేసెను.)_
*🏵ఉపోద్ఘాతం:* ఇప్పటి వరకు, గొప్ప దేవుడు, గొప్ప ప్రేమ, గొప్ప నామము, గొప్ప కృప అను అంశములను ధ్యానించాము. ఈ దినం గొప్ప దేవుని యొక్క *గొప్ప రక్షణ* గూర్చి ధ్యానిద్దాం.
అలనాడు దావీదు తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయవాణ్ణి చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరికీ *గొప్ప రక్షణ* చేకూర్చాడు. ప్రాణాలకు తెగించి పోరాడడం అంటే, ప్రాణం మీద ఆశ వదలి పోరాడడం. ఇశ్రాయేలు శిబిరంలో ఉన్న ఎవ్వరూ ఇదేవిధంగా ప్రాణాలను త్యాగం చేసి పోరాడడానికి ముందుకు రానప్పుడు దావీదు అత్యంత ప్రమాదకరమైన ఈ పోరాటానికి తనకు తానుగా సిద్ధపడ్డాడు.
సర్వ మానవాళిని రక్షించుటకు ఎవరులేని పరిస్థితులలో ఆ గొప్ప దేవుడే *ఈ లోకంలో యేసుక్రీస్తుగా జన్మించి* శత్రువుతో పోరాడి సమస్త జనులకు *గొప్పరక్షణ* కలుగజేసెను.
ఇశ్రాయేలీయుల రక్షణకు దావీదు ఎలా సిద్ధమైనాడో అదే విధంగా మానవజాతి యొక్క రక్షణ కొరకు యేసు భూమ్మీదకు మానవుడిగా పుట్టడం మరియు పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుతూ దేవుని ధర్మ శాస్త్రం నెరవేర్చి, ప్రపంచంలోని సమస్త పాపాలకు పరిపూర్ణ బలిగా మరణించి సాతానును ఓడించి సర్వ మానవులకు *గొప్ప రక్షణను* అనుగ్రహించాడు. ఆయనే మన రక్షకుడు. యేసు అనగా రక్షకుడు.
క్రీస్తు ద్వారా పాపపు మానవాళికి రక్షణ ప్రణాళికను దేవుడు తన అనంత కనికరముచొప్పున ముందుగానే నిర్ణయించాడు (1 పేతురు 1:20 ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియ మింపబడెను).
మానవజాతిని రక్షించడానికి “జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱపిల్ల” అని యేసు ప్రకటించబడ్డాడు (ప్రకటన 13: 8 జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱపిల్ల).
యేసు ద్వారా మాత్రమే గొప్ప రక్షణ కలుగ గలదు. కీర్తన 18:50 నీవు నియమించిన రాజునకు *గొప్ప రక్షణ* కలుగ జేయువాడవు. 1తెస్సా 5:9 ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను 1సమూ 19:5 (దావీదు) - అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల కందరికి *గొప్ప రక్షణ* కలుగజేసెను;
అటువంటి అద్భుతమైన రీతిగా ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు యొక్క గొప్ప రక్షణను మనం ఈ క్రింద విధంగా పొందుకొనగలం.
*🏵1. సువార్త ద్వారా రక్షణ:* రోమా 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ *రక్షణ* కలుగ జేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
*🏵2. మారుమనస్సు (పశ్చాత్తాపం) ద్వారా రక్షణ:* 2కొరి 7:10 దైవచిత్తాను సారమైన దుఃఖము *రక్షణార్థమైన* మారు మనస్సును కలుగజేయును మత్తయి 12:41 నీనెవెవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి
*🏵౩. బాప్తీస్మం ద్వారా రక్షణ:* మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు *రక్షింపబడును*; నమ్మని వానికి శిక్ష విధింపబడును. 1 పేతురు 3:20ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.
*🏵4. విశ్వాసము ద్వారా రక్షణ:* అపో 16:30 వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అపో 16:31 అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును *రక్షణ* పొందుదురు. లూకా 7:50 అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.
*🏵5. కృప ద్వారా రక్షణ:* తనకు అర్హత లేకపోయినా జక్కయ్య కేవలం దేవుని కృప ద్వారా రక్షింప బడ్డాడు. లూకా 19:9 నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. తీతు 2:11 ఏలయనగా సమస్త మనుష్యులకు *రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై* ..... ఎఫేస్సి 2:8 మీరు విశ్వాసముద్వారా *కృపచేతనే రక్షింపబడి* యున్నారు ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
*🏵6. యేసు రక్తము ద్వారా రక్షణ:* హెబ్రీ 9:12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను. ప్రక 1:6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావ మును యుగయుగములు కలుగునుగాక, హెబ్రి 13:12 కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను. నిర్గ 12:13 మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ *రక్తమును చూచి మిమ్మును నశింపచేయక* దాటిపోయెదను.
*🏵7. ప్రార్ధన ద్వారా రక్షణ:* హెబ్రీ 5:7 శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి హెబ్రీ 7:25 ఈయన తనద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా *రక్షించుటకు* శక్తిమంతుడై యున్నాడు.
చివరి క్షణాలలో ఆ దొంగ ప్రార్ధించి రక్షణ పొందుకొనెను. లూక 23:42 ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.
*🏵ముగింపు:* నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని వాక్యం చెప్పుచున్నది. క్రీస్తు తన ప్రశస్తమైన రక్తం ద్వారా సాధించిన గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని రక్షణ అన్నది నిశ్చయత విషయంలోనూ, రక్షించగలిగిన బలప్రభావాల విషయంలోనూ, అందులో వెల్లడైన ప్రేమ, కృప విషయంలోనూ, దాని ఫలితాల విషయంలోనూ ఎంతో గొప్పది.
రక్షణ శుభవార్త విని కూడా దాన్ని తేలికగా తీసుకునేవారు నిరాకరించేవారు శిక్షనుంచి తప్పించుకోగలరని కాదు గాని నిజానికి వారికి వచ్చే శిక్ష మరింత ఖాయం, మరింత భయంకరం.
ఎందుకంటే వారు తేలికగా తీసుకున్న రక్షణ అన్నిటి కంటే కూడా గొప్పది. దేవుని న్యాయమైన శిక్షను ఎదుర్కోవాలంటే మనిషి తీవ్రంగా ఎదురు తిరిగి రక్షణ శుభవార్తను వ్యతిరేకించ నవసరం లేదు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకుండా ఊరుకుంటే చాలు. అదే తీవ్రమైన శిక్ష రాగలదు. దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసినవారు తప్పించుకోలేక పోయారు.
క్రీస్తు రక్షణ శుభవార్తను నిర్లక్ష్యం చేసేవారి గతి కూడా ఇంతే. రక్షణ శుభవార్తలో దేవుని ప్రేమ, కృప వెల్లడి అయ్యాయి గనుక ఇదే మనుషులకు రక్షణ మార్గం. రక్షణ యొక్క గొప్ప ప్రాముఖ్యతను నొక్కి రచయిత ఇలా చెప్తున్నాడు. హెబ్రీ 2:3 ఇంత *గొప్ప రక్షణను* మనము నిర్ల క్ష్యము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందుము?
ప్రభువు అట్టి గొప్ప రక్షణను సమస్త మానవాళి హృదయాలలో సమృద్ధిగా కుమ్మరింప జేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను చూపును గాక! ఆమెన్!!
దైవాశ్శీసులు!!!
- :
*✝యేసు పుట్టుట ద్వారా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ🧚♂*
(క్రిస్మస్ సందేశాలు - 7)
Immanuel Bible College
NIDUBROLU
మిత్రులందరికీ పరిశుద్ధదిన శుభవందనాలు!
_(లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో *దేవునికి మహిమ..*)_
*🏵ఉపోద్ఘాతం:* యేసు ఈ లోకంలో జన్మించుటకు గల మరొక ఉద్దేశ్యం గురించి పైవాక్యంలో స్పష్టంగా వివరించ బడింది. యేసు పుట్టుక *దేవునికి గొప్ప మహిమను* చేకూర్చేదని మనం గమనించాలి. యేసు ఈ లోకంలో పుట్టుట ద్వారా ఈ ఉద్దేశం కూడా నెరవేర్చబడింది. (యోహాను 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద *నిన్ను మహిమ పరచితిని*).
మానవరూపుడిగా పుట్టిన యేసు ద్వారా కలిగిన పాపపరిహారం ద్వారా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగింది. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు.
దేవునికి రావలసిన మహిమ సాతాను తనకు అపాదించుకొంటూ సర్వమానవులను రకరకాల విగ్రహారాధనతో మోసం చేస్తున్నాడు. (యెషయా 42:8 యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని *నా మహిమను నేనిచ్చువాడను కాను* నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.)
కనుక యేసు ఈ లోకానికి వచ్చి తన సిలువ యాగం ద్వారా అద్భుతమైన రీతిగా *దేవునికి మహిమను* కలిగించాడు.
క్రీస్తు ఏవిధంగా అయితే తన పుట్టుక ద్వారా తన పరిశుద్ధ జీవితం ద్వారా దేవునికి మహిమ కలిగించాడో అదే విధంగా, దేవుని బిడ్డలమైన మనం కూడా ఏ పని చేసినా దాని యొక్క అత్యున్నతమైన ఉద్దేశం *దేవునికి మహిమ* కలగడమేనని గ్రహించాలి. విశ్వాసి ప్రవర్తన అంతటినీ ఏలవలసిన గొప్ప నియమం ఇది.
విశ్వాసులు ఏమి చేసినా *దేవునికి మహిమ* కలిగించడానికే అన్నీ చేయాలని పౌలు భక్తుడు స్పష్టంగా చెప్పుచున్నాడు. (1కొరి10:31 కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును *దేవుని మహిమ* కొరకు చేయుడి.)
విశ్వాసులంతా *దేవునికి మహిమ* కలుగు రీతిగా జీవిస్తే సంఘాల్లో గొడవలు, చీలికలు, గుంపులు ఉండవు. విశ్వాసుల్లో అవినీతి ఉండదు, ఇతర విశ్వాసులను విమర్శించడం ఉండదు. ఇతరుల్ని అనాలోచితంగా బాధపెట్టే పనులు ఉండవు. మన చర్యలన్నిటినీ ఈ వాక్యపు వెలుగులో పరీక్షిస్తూ చూసుకుంటే, ఫర్వాలేదులే అనుకున్న అనేకమైన వాటిని మనం మానుకుంటాం. తద్వారా దేవునికి మన జీవితాల ద్వారా అద్భుతమైన *మహిమను* కలిగించిన వారమవుతాం.
మనమందరం దేవునిని మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. అసలు మనం సృజించబడినది *దేవుని మహిమ నిమిత్తమే.* (యెషయా 43:7 *నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని* నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించిన వాడను నేనే.)
సర్వసృష్టి *దేవుని మహిమ* పరచుచుండగా ఆయన బిడ్డలమైన మనం దేవునికి మహిమకరంగా జీవించలేక పోవడం విచారకరం. (కీర్తన 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచుర పరచుచున్నది; 29:2 యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిల పడుడి. ప్రకటన 4:11 ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు.)
దేవుని ఎలాగు మనం మన ఆత్మీయ జీవితాల ద్వారా మహిమ పర్చగలం.
*🏵1. వాక్యపు వెలుగులో మన జీవితాలను కాచుకుంటే దేవునికి మహిమ:* అలనాడు గొల్లలు తనం మందలను అనగా తన ఆత్మీయ జీవితాలను కాచుకుంటూ ఉండగా వారిచుట్టూ *దేవుని మహిమ* ప్రకాశించింది. (లూకా 2:8-9 ఆ దేశములో కొందరు గొఱ్ఱల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; *ప్రభువు మహిమ* వారిచుట్టు ప్రకాశించినందున..)
మన ఆత్మీయ జీవితాలు ప్రభువునకు మహిమకరంగా ఉన్నాయా? పరీక్షించుకుందాం.
*🏵2. దేవుని సేవ సంపూర్ణంగా చేయుట ద్వారా దేవునికి మహిమ:* అలనాడు మోషే ప్రత్యక్ష గుడారమునకు సంబంధించిన పనులన్నీ సంపూర్తి చేయగా దేవుని మహిమ గుడారములోనికి దిగివచ్చెను. (నిర్గ40:33 .. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా *యెహోవా తేజస్సు మందిరమును* నింపెను.)
మన సేవ దేవునికి మహిమకరంగా ఉందా? పరీక్షించుకుందాం.
*🏵3. దేవునికి మన హృదయాలు బలిగా అర్పించుట ద్వార దేవునికి మహిమ రాగలదు:* అలనాడు సోలోమోను మందిరం ముందర నిలువబడి లెక్కింప శక్యంగాని బలులు అర్పించగా (1రాజు 8:5) దేవుని మహిమతో మందిరం నిండెను. (1రాజు 8:10-11 యాజకులు పరిశుద్ధ స్థలములోనుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిర ములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజ కులు సేవచేయుటకు నిలువలేక పోయిరి.)
మన హృదయాలు దేవునికి మహిమకరంగా బలి అర్పించబడినవా? పరీక్షించుకుందాం.
*🏵4. ప్రభువుయందు మనము నిలిచియుండి ఫలించుట ద్వార దేవునికి మహిమ:* యేసులో మనం నిలువబడినప్పుడు మనం జీవితాలు ఫలించడమే కాకుండా దేవునికి మహిమ కలుగగలదు. (యోహాను 15:7-8 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి *మహిమ పరచబడును*.)
మనం ప్రభువులో నిలబడి ఫలించి దేవునికి మహిమకరంగా ఉన్నామా? పరీక్షించుకుందాం.
*🏵5. శ్రమలతో కూడిన జీవితం ద్వారా దేవునికి మహిమ రాగలదు:* క్రీస్తు శ్రమలతో కూడిన తన జీవితం ద్వారా దేవునికి మహిమ కలిగించాడు. మనం కూడా క్రీస్తుతోపాటు మహిమ పొందేందుకు ఆయనతోపాటు బాధలు అనుభవించే వారమైతే మనం దేవుని మహిమను పొందగలం. (రోమా 8:17 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ *మహిమ పొందుటకు* ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.)
శ్రమలలో వెరువకుండా మన జీవితం దేవునికి మహిమకరంగా ఉందా? పరీక్షించుకుందాం.
*🏵6. రూఢియైన విశ్వాసం ద్వారా దేవునిని మహిమ పరచగలం:* అలనాడు అబ్రహాం తన రూఢియైన విశ్వాసం ద్వారా దేవుని మహిమమ పరచాడు తద్వారా విశ్వాసమువలన బలము పొందుకున్నాడు. (రోమా 4:21 *దేవుని మహిమపరచి*, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలము నొందెను.)
రూఢియైన విశ్వాసం ద్వారా మన జీవితం దేవునికి మహిమకరంగా ఉందా? పరీక్షించుకుందాం.
*🏵7. ప్రార్ధన ద్వారా దేవుని మహిమ పరచగలం:* క్రీస్తును పోలి క్రీస్తువలె శ్రమనొంది క్రీస్తువలె శత్రువులకై ఆత్మ పూర్వకంగా ప్రార్ధించిన స్తెఫను *దేవుని మహిమను* చూడగలిగాడు. (అపో 7:55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తేరిచూచి, *దేవుని మహిమను* యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి..)
మన ప్రార్ధనా జీవితం దేవునికి మహిమకరంగా ఉందా? పరీక్షించుకుందాం
*🏵ముగింపు:* ప్రభువు ఈలోకంలో జన్మించినప్పుడు పరలోక మహిమ దిగివచ్చినది. దూత గణము ఎంతో మధురమైన గీతములతో *సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ* అని ఆరాధించినారు. కారణం ఆయన మహిమ స్వరూపుడు.
ఆయన జనన వార్త మహిమ సువార్త. ఈ మహిమ సువార్తను ప్రజలందరికి చాటి గొల్లలు ధన్యులయ్యారు. ప్రభువు యొక్క మహిమను అనుభవించారు. ప్రభువును మహిమ పరచేటి ధన్యకరమైన జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక! ఆమెన్!!
దైవాశ్శీసులు
-
*✝ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము🕊*
(క్రిస్మస్ సందేశాలు - 8)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(లూకా సువార్త 2:14 *ఆయన కిష్టులైన మనుష్యులకు* భూమిమీద సమాధానమును కలుగునుగాక)_
*🏵ఉపోద్ఘాతం:* నిన్నటి ధ్యానంలో యేసు ఈ లోకంలో జన్మించి మానవుడు కోల్పోయిన మహిమను తిరిగి మానవునికి తన సువార్త ద్వారా అందునట్లు చేసి తద్వారా దేవునికి గొప్ప మహిమను చేకూర్చాడు. ఎప్పుడైతే దేవునికి మహిమ కలుగుతుందో అప్పుడే భూమి మీద మనుష్యులకు సమాధానం కలుగుతుంది. దేవదూతలు ప్రకటిస్తున్న విషయంలో ఉన్న క్రమాన్ని కూడా మనం గమనించాలి.
(లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక.)
ముందు దేవునికి మహిమ, తరువాత మనుషులకు సమాధానం. మనుషులకు సమాధానం తేవడానికి యేసు ఈ లోకంలో జన్మించాడు. దేవుని కుమారుడైన యేసును ఎవరైతే ప్రభువుగా రక్షకుడుగా స్వీకరిస్తారో, వారికి దేవుని అనుగ్రహం, పాపవిముక్తి కలిగి దేవుని సమాధానం వారు అనుభవించగలరు.
దేవుని అధ్బుతమైన సమాధానం మనకు కలగాలంటే మనం ముందు దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడో ఎటువంటి లక్షణాలు గలిగినవారిని ఇష్టపడుచున్నాడో మనం ఈ క్రింద చూద్దాం.
*🏵1. యధార్ధముగా ప్రవర్తించు వారు ఆయనకు ఇష్టులు:* (సామెతలు 11:20, మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.)
దావీదు యొక్క యధార్ధతను బట్టి దేవుడు దావీదును ఇష్టపడ్డాడు. (అపో. 13:22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా *యిష్టానుసారుడైన* మనుష్యుడు, అతడు నాఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.)
దావీదును దేవుడు ఇష్టపడ్డాడు కనుకనే అనేక ప్రమాదముల నుండి అనేక క్లిష్టమైన పరిస్థితుల నుండి దేవుడు దావీదును తప్పించాడు. (కీర్తన 18:19)
*🏵2. సత్య వర్తనులు ఆయనకు ఇష్టులు:* (సామెతలు 12:22 అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.) సత్యవర్తనులు అనగా సత్యమును అనుసరించువారు అనగా వాక్యమును అనుసరించువారు.
దేవుని వాక్యమే సత్యము. (యోహాను 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.) ప్రభువైన యేసు క్రీస్తే సత్యమై యున్నాడు. (యోహాను 14:6)
దేవుని వాక్యమై యున్న సత్యమును అనుసరించక అసత్యమార్గమును అనుసరించిన అననియ సప్పీరాలు తీవ్రమైన శిక్షను పొందుకున్నారు.
సత్యమును అనుసరించిక అసత్యమార్గములో వెళ్ళుచున్న అబద్దీకులందరూ మండుచున్న అగ్ని గుండములో పదవేయ బడుదురు అని వాక్యం సెలవిస్తున్నది. (ప్రకటన 21:8)
*🏵3. విశ్వాసము కలిగినవారు ఆయనకు ఇష్టులు:* (హెబ్రీ 11:6 విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా.)
అవిశ్వాసం అనేది భయంకరమైన పాపం. దేవుడు చూచీ చూడనట్టు ఊరుకునే చిన్న పొరపాటో, దురదృష్టకరమైన సంగతో కాదు ఈ అవిశ్వాసం. అది దేవునికీ మనిషికీ మధ్య ఉండవలసిన సంబంధాన్ని సమూలంగా నాశనం చేసే భయంకరమైన పాపం ఈ అవిశ్వాసం.
మానవుని దేవునికి అయిష్టునిగా చేస్తున్న అవిశ్వాసం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునిపై విశ్వాసము ఉంచుటకు బదులు ఈనాడు మనిషి తన మనసులో దేవునికీ బదులు పాపాన్నీ చీకటినీ కోరుకోవడమే అవిశ్వాసం. మనలను రక్షించుటకు తన ప్రాణాలను సిలువలో అర్పించిన ఆ రక్షకుని యందు విశ్వాసముంచని వారిని దేవుడు ఎలాగు ఇష్టపడగలడు.
*🏵4. దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు దేవునికి ఇష్టులు:* (రోమా 14:18 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైనవాడు *దేవునికి ఇష్టుడును* మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు)
దాసుడు తన యజమానికి సంతోషాన్ని కలుగ జేస్తాడు. అదేవిధంగా మనం క్రీస్తుకు దాసులుగా ఉండి ప్రభువుకు సంతోషాన్ని కలిగించాలిగాని మన సంతోషాన్ని గురించి ఆలోచించగూడదు. ప్రతి విశ్వాసీ ఇతరుల మేలుకోసమే గాని తనను సంతోష పెట్టుకోవడం కోసం జీవించకూడదు. ఇతరులకు దుఃఖం కలిగిస్తే దేవునికి దుఃఖము కలిగించడమే. అందునుబట్టి ఇది స్వల్ప విషయం కాదు. మనం చేసేది ఇతర విశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో గమనించకుండా మనకిష్టమైనదే చేసుకుంటూ పోవాలని పట్టుదలగా ఉండకూడదు.
యేసు క్రీస్తు మన తోటి విశ్వాసులకోసం కూడా చనిపోయాడు గదా. వారి నమ్మకానికి హాని చేసే అలవాటు మనకేదన్నా ఉంటే ఆ అలవాటును మానుకొనుటకు శ్రద్ధ మనం చూపాలి. ఆప్పుడే మనతోటి విశ్వాసులకు కూడా మనం యోగ్యంగా కనబడగలం.
*🏵5. దేవునికొరకు కార్యములు చేయువారు ఆయనకు ఇష్టులు:* (యోహాను 8:29 నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; *ఆయన కిష్టమైన కార్యము* నేనెల్లప్పుడును చేయుదును.)
అందరూ ఎవరి విషయాలు వారు చూచుకొంటున్నారు గాని, క్రీస్తు యేసు విషయాలు చూడడం లేదు. దేవుని కొరకు పని చేసేవారు వేగంగా తగ్గిపోతున్న రోజులు ఇవి. ఈ అంత్య దినాలలో అందరు కూడా తమ స్వంత కార్యాలు చూసుకుంటున్నారు గాని ప్రభువు కార్యముల యందు శ్రద్ధలేని వారుగా ఉంటున్నారు. లోకం పరిస్థితీ, తరచుగా క్రైస్తవుల పరిస్థితి కూడా ఇదే.
(ఫిలిప్పి 2:21 అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు.) అందువలనే మనం దేవుని అనుగ్రహాన్ని పొందుకొన లేకపోవుచున్నాము.
మనం దేవునికి ఇష్టులముగా ఉండాలంటే, దేవుని సేవలోగాని ఆయన కార్యాల యందుగాని ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభువు విషయాలలో స్థిరంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనలను ఇష్టపడతాడు. (1కొరి 15:58)
దేవుని కొరకు మనం పడే ప్రయాస వ్యర్థం కాదని తెలిసి ఎప్పుడూ ప్రభుసేవ అధికంగా చేస్తూ ఉండాలి. మన ప్రయాస వ్యర్థం కావడమంటూ ఎప్పుడూ జరగదు. ఎందుకంటే చనిపోయినా భవిష్యత్తులో సజీవంగా లేవడం అనేది ఉంటుంది. అప్పుడు ప్రతి వ్యక్తికీ తన ప్రయాసకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. “భళా నమ్మకమైన మంచి దాసుడా అను ప్రభువు యొక్క మెప్పు పొందుకోగలం.
*🏵6. భక్తులైన వారు ఆయనకు ఇష్టులు:* (కీర్తన 16:3 నేనీలాగందును భూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు.) విశ్వాసులైన తన భక్తులను క్రీస్తు ఎంతో ప్రేమిస్తున్నాడు. వారికోసం తన్ను తానే అర్పించు కున్నాడు. వారిని మాత్రమే ఈ భూమిపై మహనీయులుగా ఎంచుతున్నాడు.
ధనవంతుల విషయంలో గానీ లౌకికమైన జ్ఞానమున్న వారి విషయంలో గానీ, అధికారం ఉన్న వారి విషయంలో గానీ, ఆయనకు సంతోషం లేదు గాని తన విశ్వాసుల *భక్తి* విషయంలోనే ఆయనకు ఆనందం. ఆయన దృష్టిలో ఆయన విశ్వాసులే ఈ భూలోకంలో గొప్పవారు. వారు ఆయనకు ప్రత్యేకమైన సొత్తు. కారణం విశ్వాసులకు ఆయనయందు గల భక్తి.
మనకిష్టమైన వారికే మనం మేలు చేస్తాం. అదేవిధంగా దేవుడు తన భక్తులకే ఎంతో మేలు చేస్తాడు. (కీర్తన 31:19)
*🏵7. విరిగి నలిగిన హృదయం గలవారు ఆయనకు ఇష్టులు:* (కీర్తన 51:17 విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.) దేవునికి ఇష్టమైన బలులు విరిగిన మనసు అనగా చేసిన పాపం నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం. దుఃఖం కలిగితే ఆ పాపిని దేవుడు క్షమిస్తాడు, స్వీకరిస్తాడు. పశ్చాత్తాపం లేకుండా ఏ విధమైన బలి అర్పణా ఆయనకు ఉపయోగం లేదు. మత్తయి 5:3 ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
*🏵ముగింపు:* సర్వ సృష్టి దేవుని కిష్టమైన రీతిగా జీవిస్తున్నది. ఈ లోకంలో దేవుని యొక్క అద్భుతమైన సమాధానం మనం పొందుకోవాలంటే మనం కూడా ఆయనకు లోబడి మన శిరమును ఆయన ఎదుట వంచి ఈ భూమి మీద ఆయన కిష్టులుగా జీవించాలి. అప్పుడే మన హృదయాలకు నిజమైన సంతోషం మరియు సమాధానం.
మనం ఇష్టప్రకారం కాక దేవుని ఇష్టప్రకారం జీవించి సమాధానం పొందుకొనుటకు పైన చెప్పబడిన లక్షణాలు గలిగి దేవునిలో ముందుకు సాగిపోవడానికి ప్రభువు కృప మనకు ఎల్లవేళలా మనకు తోడుగా ఉండునుగాక! ఆమెన్!
దైవాశ్శీసులు!!
- :
*✝మనకు శిశువు పుట్టెను🚼*
(క్రిస్మస్ సందేశాలు - 9)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను..)_
*🏵ఉపోద్ఘాతం:* క్రీస్తు పూర్వం 700 వందల సంవత్సరాల క్రితం యెషయా ద్వార చెప్పబడిన ఈ ప్రవచనం యేసు పుట్టుట ద్వారా నెరవేరింది. దేవుని ప్రవక్త భవిష్యత్తులో చూస్తూ ఆ రాబోయే సంఘటన అంతకు ముందే జరిగినట్టు యెషయ ప్రవక్త రాశాడు. యేసు జననానికి ఏడు శతాబ్దాల పూర్వం యెషయా ఆయన గురించి ఇలా “పుట్టెను” అని ప్రవచించాడు గాని “పుట్టబోతున్నాడు” అని ప్రవచించలేదు.
(“ఏలయనగా మనకు శిశువు *పుట్టెను* మనకు కుమారుడు అనుగ్రహింప బడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును.” యెషయా 9:6)
యేసును నమ్మిన వారి హృదయాలలో ఆయన ఎప్పుడో జన్మించాడు. పాతనిబంధన భక్తులు దేవుని నమ్మినారు అది వారికి నీతిగా ఎంచబడినది. అనగా వారు ఎప్పుడైతే దేవుడే తమను విమోచించే విమోచకుడుగా రాబోతున్నాడని నమ్మినారో అప్పుడే ప్రభువు వారి హృదయాలలో జన్మించినాడు.
యేసు జననం, ఆ తర్వాత ఆయన వహించే పాత్ర ఎంతో విశేషమైనవై ఉంటాయని యెషయా ఎందుకు సూచించాడు? ఎందుకంటే యేసు పరిపాలన “న్యాయము వలనను నీతివలనను” స్థిరపరచ బడుతుంది. (యెషయా 9:7)
యేసు జన్మిస్తాడనే విషయాన్ని గబ్రియేలు దూత మరియకు చెప్పినప్పుడు, యెషయా ప్రకటననే తన మాటలలో గబ్రియేలు ప్రతిధ్వనింప జేశాడు. “ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతము లేనిదై యుండును” అని ఆయన జరగబోయేదాన్ని ముందుగానే చెప్పాడు. (లూకా 1:32, 33)
కాబట్టి, యేసు జననంలోని విశేషత దేవుని రాజ్య నియమిత రాజుగా క్రీస్తు నెరవేర్చే పనికి సంబంధించినదనేది స్పష్టం. క్రీస్తు పరిపాలన సమస్త ప్రజలకు ప్రయోజనకరమై ఉంటుంది. వాస్తవానికి, ఆయన జననం “దేవుని కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము” తీసుకొస్తుందని ఆ దేవదూతలు సూచించారు.—లూకా 2:14.
న్యాయం, సమాధానంగల ప్రపంచంలో నివసించాలని ఎవరు మాత్రం కోరుకోరు? అయితే క్రీస్తు పరిపాలన తీసుకువచ్చే సమాధానాన్ని అనుభవించడానికి, మనం దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉంటూ ఆయనతో మంచి సంబంధం కలిగివుండాలి. అలాంటి సంబంధానికి మొదటి మెట్టు క్రీస్తు గురించి తెలుసుకోవడమే. “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని ఆయన చెప్పాడు.—యోహాను 17:3.
యేసును గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానం మనకు లభించినప్పుడు, ఆయనను మనమెలా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాడో మనం ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఆ శిశువు ఎవరో ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించాడో పరిశుద్ధ గ్రంధం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది.
ఎవరు ఈ శిశువు?
*🏵1. ఈ శిశువు మనలను బ్రతికించుటకు వచ్చినవాడు:* ఆది తల్లిదండ్రులు పాపము చేయుట ద్వారా మరణం మనందరకూ ప్రాప్తించినది. దేవుని నుండి దూరమైనవారెవరికి జీవంలేదు. గనుక ప్రతి ఒక్కరూ వారికి క్రీస్తు ద్వారా బ్రతికింపబడేంత వరకు ఆత్మ సంబంధంగా చచ్చినవారుగా ఉన్నారు. మరణమంటే దేవుని జీవం నుంచీ సహవాసం నుంచీ దూరమై ఉండడమే.
(ఎఫె. 2:1,4 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. 4 అయినను దేవుడు కరుణా సంపన్నుడై యుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రతికించెను.)
*🏵2. ఈ శిశువు, కుమారుడిగా వచ్చినవాడు:* మనం మన అతిక్రమాలలో చచ్చినవారమై ఉన్నప్పుడు కూడా ఆయన మహా ప్రేమనుబట్టి మనలను తిరిగి బ్రతికించుటకు తన కుమారుడైన యేసును ఈ లోకంలోనికి జన్మింపజేసినాడు. (“కుమారుడు అనుగ్రహింప బడెను” యెషయా 9:6) యేసుప్రభువు యొక్క మానవత్వం ఇక్కడ కనిపిస్తున్నది. ఆయన మహా బలిష్ఠుడైన దేవుడు. అయినప్పటికీ చిన్న బాబుగా జన్మించాడు. దేవుడు మానవుడుగా జన్మించడం అన్ని అద్భుతాలోకెల్లా గొప్ప అద్భుతం.
ఫిలిప్పీయులకు 2:6,7,8 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు *మనుష్యుడుగా* కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
*🏵3. ఈ శిశువు మనలను పాపము నుండి విమోచించుటకు (రక్షించుటకు) వచ్చిన వాడు:* కుమారుడు అనగా కు+మారః (చెడును హరించువాడు). సమస్త మానవుల పాపములను పరిహరించి పరలోక ప్రవేశాన్ని అనుగ్రహింప వచ్చిన శిశువు.
రోమీయులకు 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు. లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు *రక్షకుడు* మీ కొరకు పుట్టి యున్నాడు.
*🏵4. ఈ శిశువు మనకు సంతోషాన్ని ఇచ్చుటకు వచ్చిన వాడు:* సాతాను ద్వార ఎంతో వేదనకు గురైన మన జీవితాలలో సంతోషాన్ని అందించుటకు ఈ శిశువు వచ్చాడు. లూకా 2:10 అయితే ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు *మహా సంతోషకరమైన* సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను;
కుమారుడైన యేసుద్వారా పాపనిర్మూలన చేయబడి పరలోక ప్రవేశం అనుగ్రహింప బడినదనే సంతోషము మనకు కలుగు చున్నది. లూకా 1:48 నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు *ఆనందించెను.*
*🏵5. ఈ శిశువు మనకు వెలుగును ఇచ్చుటకు వచ్చిన వాడు:* సాతాను అంధకార బంధకాలను తొలగించి నిజమైన వెలుగును మనకు ప్రకాశింపజేయుటకు వచ్చిన శిశువు. గలలీ ప్రాంతాల్లో ప్రకాశించనున్న గొప్ప కాంతిగా ఈ శిశువు ఉన్నాడు. యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు *గొప్ప వెలుగును* చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద వెలుగు ప్రకా శించును.
అంధకారములో ఉన్న గొర్రెల కాపరుల జీవితాలలో వెలుగు ప్రకాశించనట్లు పాపుల జీవితాలలో వెలుగు నింపుటకు వచ్చినవాడు ఈ శిశువు. లూకా 2:9 ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు *ప్రకాశించినందున*, వారు మిక్కిలి భయపడిరి. (లూకా 2:30 అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు *వెలుగుగాను* నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను...)
*🏵6. ఈ శిశువు రాజుగా ఏలుటకు వచ్చినవాడు:* యెషయా 9:6 ఆయన భుజము మీద రాజ్య భారముండును. మీకా 5:2 నా కొరకు ఇశ్రాయేలీయులను *ఏలబోవువాడు* నీలోనుండి వచ్చును; ఆ పిల్లవాడు పెరిగి యూదుల రాజుగా, ప్రపంచానికే రారాజుగా ఉండడానికి పెరిగాడు (యిర్మీయా 23:5; మత్తయి 2:2; 27:11; 28:18; ప్రకటన 19:16).
యెషయా 9:7 ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను *రాజ్యమును* స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై *రాజ్య పరిపాలన* చేయును.
*🏵7. ఈ శిశువు మనకు తోడుగా ఉండి చివరి వరకు నడిపించుటకు వచ్చినవాడు:* మత్తయి 1:22,23 ఇదిగో కన్యక గర్భవతియై *కుమారుని* కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు *తోడని* అర్థము.
కీర్తన 23:2,3 శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.... తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.
*🏵ముగింపు:* కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన యేసు తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఎవరైతే తమ పాపముల యందు పశ్చాత్తాపపడి ఆ కుమారుని యందు నమ్మకం ఉంచుతారో వారికి పాప క్షమాపణ ఇచ్చి పరలోక రాజ్య ప్రవేశాన్ని అనుగ్రహిస్తాడు.. అయితే మనకు రావలసిన శిక్షను కుమారునిగా పుట్టిన క్రీస్తు అనుభవించడం న్యాయసమ్మతమేనా? అవును. ఎందుకంటే క్రీస్తు దేవుడు. ఆయన తన ఇష్ట పూర్వకంగా మనకోసం బాధలు అనుభవించి మరణించాడు (యోహాను 10:17 నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను;,18 ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను).
క్రీస్తు తనంతట తానే మనుషుల పాపాలను తనపైనే వేసుకుని వారికోసం బలి అయి బాధలను అనుభవించాడు. ఇప్పుడు మన పాపం కోసం తాను బలిగా మారి మనలను రక్షించి తన న్యాయాన్ని సంపూర్ణంగా కనపరిచాడు.
తన అద్వితీయ కుమారునిగా, ఏకైక కుమారునిగా ఈ లోకంలో జన్మించే శిశువుకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి* అని పేరు పెట్టాలని యెషయా ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. పుట్టిన శిశువుకు దేవుడు ఎందుకు ఈ పేరు పెట్టాలని ఉద్దేశించాడో దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలను రేపు ధ్యానిద్దాం.
దైవాశ్శీసులు!!
-
*✝శిశువుకు పెట్టబడిన పేరు🧚♂*
(క్రిస్మస్ సందేశాలు - 10)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(యెషయా 9:6 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి *పేరు* పెట్టబడును)_
*🏵ఉపోద్ఘాతం:* ఈ శిశువు ఎవరో ఆయనకు పెట్టబడిన పేరు ద్వారా మనకు తెలియజేయ బడుచున్నది. ఈ శిశువు పేరు మనం గమనించిన అది ఎంతో విచిత్రంగా సుదీర్ఘంగా ఐదు పదాలతో ఉన్నది. ఎందుకు ఈ శిశువుకు *ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రిసమాధానకర్తయగు అధిపతి* అని ఇంత పెద్దపేరు పెట్టుటకు దేవుడు నిర్ణయించినాడు? దీని వెనుక ఉన్న కారణాలు మనం చూద్దాం.
ఈ లోకంలో పుట్టిన మొదటి శిశువు ఎవరు? మొదటి మానవ శిశువు దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం ఆదాము హవ్వల ద్వార జన్మించింది. ఆ శిశువు పేరు కయీను.
కయీను అనబడిన ఆ శిశువు యొక్క జననం చాలా ప్రత్యేకమైనది. తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు గాని, దేవదూతలుగానీ, చివరికి సృష్టికర్త కూడా మునుపెన్నడూ ఒక మానవ శిశువును చూడలేదు. అటువంటి ఈ ప్రత్యేక నవజాత శిశువైన కయీను, పాపం ద్వారా మరణ శిక్షకు లోనైన సర్వ మానవాళికి రక్షణను తీసుకువస్తాడని అందరు ఆశించారు కానీ కయీను అనబడిన ఆ శిశువు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక హంతకునిగా మారినప్పుడు అందరికి ఎంతో నిరాశ కలిగినాడు. (1 యోహాను 3:12 మనము కయీను వంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను)
*🏵1. ఈ లోకంలో పుట్టిన మొదటి ప్రత్యేక శిశువు:* మొదటి మానవ శిశువైన కయీను సంతానం ద్వారా ఏర్పడిన ఈ భయంకరమైన పాపం, చెడుతనం సమాధానం లేని స్థితిని మార్చుటకు దేవుడు మరియొక శిశువు ద్వారా తన ప్రణాళికను అమలుపరచాడు.
మొదటి మానవ శిశువైన కయీను జన్మించిన దాదాపు నాలుగు వేల సంవత్సరాల తర్వాత, మరో ప్రత్యేక శిశువు జన్మించింది. ఆ శిశువు జననం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. ఆ శిశువు పరిశుద్ధాత్మ శక్తితో కన్యకకు జన్మించాడు. చరిత్రంతటిలో అలాంటి జననం అది ఒక్కటే. ఆ శిశువు జనన సమయంలో, ఆనందభరితులైన వేవేల దూతల సమూహం దేవునికి ఇలా స్తుతిగీతాలు పాడింది: “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగును గాక.” (లూకా 2:13, 14)
అలనాడు మొదటి శిశువైన కయీను హంతకుడిగా మారినా యేసు మాత్రం ఆ విధంగా కాకుండా దేవుని ప్రణాళిక ప్రకారం తానే హతమై, మానవులు దేవునితో సమాధానంగా ఉండడానికి, నిత్యజీవాన్ని పొందడానికి మార్గం తెరిచాడు. (1 కొరింథీయులు 15:55 ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?)
*🏵2. సుదీర్ఘమైన పేరు:* నిత్యజీవాన్ని పొందడానికి మార్గం ఏర్పాటు చేయుటకు ఈ లోకంలోనికి వచ్చిన ఆ శిశువుకు *ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి* అనే సుదీర్ఘమైన పేరు పెట్టబడినది. (*ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి* అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6) పై వాక్యంలో మనం చూస్తే ఐదు పేర్లు కనపడుచున్నవి.
ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, *పేరు* అని వ్రాయబడినది గాని పేరులు అని వ్రాయబడలేదు. సాధారణంగా పిల్లలకు పేరులు పెట్టువారు ఒక పదమో లేదా రెండు పదాలు గలిగిన పేరు పెడతారు. కాని ఇక్కడ ఈ శిశువుకు పెట్టబడిన నామము ఐదు పదాలు గలిగిన సుదీర్ఘమైన ఒకే పేరుగా ఉన్నది. ఏమిటి దీని భావం? ఈ శిశువు ఈ లోకంలో చేయవలసిన కార్యములను ఈ పేరు తెలియజేయుచున్నది.
తల్లిదండ్రులు పిల్లలకు ఎంతో చక్కని పేరులు పెడతారు. పేరు అనేది లక్షణాన్ని తెలియజేయును.. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ కుమార్తెకు “కరుణ” అని పేరు పెట్టారంటే దాని అర్ధం ఆ బిడ్డ తన జీవితంలో దేవుని యొక్క కరుణ గలిగి అందరి యెడల ఆ దేవుని కరుణ చూపుతూ జీవించాలని ఆ తల్లిదండ్రుల భావం. ఆ పేరులోని భావం ఆ బిడ్డ యొక్క లక్షణంగా ఉండాలని తల్లిదండ్రుల ఉద్దేశ్యం. అదే విధంగా తన అద్వితీయ కుమారునిగా, ఏకైక కుమారునిగా ఈ లోకంలో జన్మించే శిశువుకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి* అని పేరు పెట్టాలని యెషయా ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. అనగా ఈ పేరులోని ఐదు లక్షణాలు గలిగి ఆ శిశువు జన్మించాలని దేవుని ఉద్దేశ్యమై యున్నది. ఎందుకు ఈ ఐదు లక్షణాలతో ఆ శిశువు జన్మించాలి? దీనికి ఉన్న కారణం గురించి పరిశీలన చేద్దాం.
*🏵౩. ఆశ్చర్యకరుడు:* యెషయా తన ప్రవచనం ద్వార ఆ శిశువునకు ఇచ్చిన పేరులో ఒక భాగం *ఆశ్చర్యకరుడు.* యెషయా కాలంలో యూదాను ఆహాజు రాజు పరిపాలించుండగా యూదా దేశం మీదకు సిరియా మొదలగు శత్రువుల దండెత్తినప్పుడు, యూదా దేశం మీద మరణచ్చాయలు అలుముకున్నాయి. “మరణచ్చాయలు గల దేశం” అని వాక్యంలో వ్రాయబడినది.
భూలోకాన్ని చుట్టుముట్టిన మరణం ఆగాలంటే ఎదో ఒక అద్భుతం జరగాలి. ఆ మరణచ్చాయలు తొలగింపజేయడం ఏ మానవునివల్ల కూడా కాని పని అని కేవలం ఏదైనా ఒక అధ్బుతమైన ఆశ్చర్యకార్యం జరిగితేగాని ఆ మరణచ్చాయలు వీడవని ప్రజలు భావిస్తున్న సమయంలో వారుకోరినట్లుగా *ఆశ్చర్యకరుడు* అను పేరుగల రక్షకుని దేవుడు వారికి వాగ్దానం చేశాడు.
*🏵4. ఆలోచన కర్త:* యెషయా ప్రవక్త కాలంలో శత్రువుల దాడివలన ఏర్పడిన కష్టాలకు దిక్కు తోచని ప్రజలు సలహా కొరకు *ఆలోచన* కొరకు కర్ణపిశాచిగలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును మరియు సజీవులపక్షముగా చచ్చినవారి యొద్దకును వెళ్లి విచారించుచున్నపుడు, *ఆలోచన* కొరకు దేవుని యొద్ద విచారణ చేయకుండా దుష్ట శక్తుల యొద్దకు వెళ్లి ఆలోచన చేయడం ఇది మీకు తగునా అని బాధపడిన యెషయా ప్రవక్త, ఈ సమస్య గురించి దేవునికి ప్రార్ధించగా ప్రభువు ఆ ప్రార్ధన ఆలకించి వారికి చక్కని ఆలోచన చెప్పి నడిపించే *ఆలోచన కర్త* అను పేరుగల రక్షకుని కుమారునిగా ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు.
*🏵5. బలవంతుడైన దేవుడు:* యెషయా కాలం నాటి పరిస్థితులు చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలిగి ప్రజలు ఎంతో బలహీనులై పోయారు. ప్రజలందరూ గాఢాంధకారము లోనికి తోలివేయబడి ప్రజల మెడ మీద కట్టుకర్ర వేయబడి, బరువైన కష్టాలనే కాడి మోయుచూ, వారిని తోలువాని కొరడా దెబ్బలు తింటూ ఎంతో సొమ్మసిల్లి ఏమి చేయలేని స్థితిలో ప్రజలు ఉన్నారు.
ఇటివంటి బలహీన స్థితిలో ఉన్న తన ప్రజలను విడిపించి తోలువాని కొరడాలు విరిచి ప్రజల మెడల మీద ఉన్న సాతాను కాడిని తొలగించుటకు కొరకు *“బలవంతుడైన దేవుడుగా”* కుమారుడు ఈలోకంలో జన్మించవలసి యున్నది.
*🏵6. నిత్యుడగు తండ్రి :*హీబ్రూ భాషలో దీని అర్థం నిత్యత్వం గలవాడు. అంటే పుట్టిన శిశువైన యేసు, మనకు *తండ్రిలాంటి ప్రేమను* పంచడానికి అనాదినుండి సిద్ధంగా ఉన్నవాడు. అంటే నిత్యుడగు తండ్రి అను పేరుకు అర్ధమేమనగా మనకొరకు పుట్టిన శిశువైన యేసు, మానవుల కొరకైన ఉనికిలో మనకు తండ్రిలాంటి ప్రేమను అందిస్తూ శాశ్వతకాలం ఉండువాడు అని అర్ధం.
మీకా 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.
*🏵7. సమాధాన కర్త:* యూదా దేశం సమాధానం కోసం అర్రులు చాస్తున్నది. Peace is what the world is most desperate for today. కుటుంబాల్లో, సమాజంలో, దేశాలలో ఎక్కడ చూసిన ప్రజలంతా సమాధానం లేక అల్లాడి పోవుచున్నారు. ఎక్కడ చూసిన ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ సన్నాహాలు మరియు తుపాకి కాల్పుల శబ్దాలు వినబడుచున్నాయి.
మానవజాతి లెక్కలేనన్ని హత్యలను చూసింది. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నారు. ఇదే పరిస్థితి ఆనాటి యెషయా కాలములో కూడా ఉన్నది. యూదా దేశంలో ఎక్కడ కూడా సమాధానంలేని పరిస్థితులు ఏర్పడినాయి. కారణం శత్రువులు యుద్ధపంక్తులు తీరి యూదా దేశాన్ని చుట్టుముట్టారు.
తప్పుచేయడానికి మొగ్గుచూపే మానవులు ఒకరితో ఒకరు సమాధానంగా లేరు, దేవునితోనూ సమాధానంగా లేరు. భూమి యందంతట భయంకరమైన పాపం, చెడుతనం సమాధానం లేని స్థితి ఏర్పడింది. అందుకే సమాధాన కర్తగా శిశువు జన్మించవలసి వచ్చినది. (ఆదికాండము 6:5 నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు...; యెషయా 48:22 దుష్టులకు నెమ్మదియుండదని...).
*ముగింపు:* ఈ శిశువుకు పెట్టబడిన పేరులో ఉన్న ఐదు లక్షణాల గురించిన వివరాలను వాటిలోని ఆత్మీయ సత్యాలను తదుపరి సందేశాలలో వరుసగా ధ్యానం చేద్దాం.
దైవాశ్శీసులు!
-
*✝ఆశ్చర్యకరుడైన యేసు బాలుడు🧚♂*
(క్రిస్మస్ సందేశాలు - 11)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను - *ఆశ్చర్యకరుడు.*)_
*🏵ఉపోద్ఘాతం: యెషయా తన ప్రవచనం ద్వార ఆ శిశువునకు ఇచ్చిన పేరులో మొదటి పదం *ఆశ్చర్యకరుడు.* యెషయా కాలంలో యూదాను ఆహాజు రాజు పరిపాలించుండగా యూదా దేశం మీదకు సిరియా మొదలగు శత్రువుల దండెత్తినప్పుడు, యూదా దేశం మీద మరణచ్చాయలు అలుముకున్నాయి. “మరణచ్చాయలు గల దేశం” అని వాక్యంలో వ్రాయబడినది. (యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును.)
ఈ నాడు కూడ అనేకులు సాతానుచే చుట్టుముట్టబడి అత్యాధ్మిక అంధకారంలో మ్రగ్గుతూ నిత్యమరణానికి దగ్గరవుతున్నారు. ఆ భయంకరమైన మరణచ్చాయలు తొలగింప జేయడం ఏ మానవునివల్ల కూడా కాని పని అని కేవలం ఏదైనా ఒక అధ్బుతమైన ఆశ్చర్యకార్యం జరిగితేగాని ఆ మరణచ్చాయలు వీడవని ప్రజలు భావిస్తున్న సమయంలో వారుకోరినట్లుగా *ఆశ్చర్యకరుడు* అను పేరుగల రక్షకుని దేవుడు వారికి వాగ్దానం చేశాడు.
సాతాను చేత భయంకరమైన మరణం ఈ లోకాన్ని కమ్ముకుంటూ ఉండగా సర్వమానవులు ఆ సాతాను యొక్క మరణచ్చాయల నుండి విడిపించుకోలేని పరిస్థితులలో ఉండగా ఆశ్చర్యకరంగా ఆ దేవుడు *ఆశ్చర్యకరుడుగా* ఈ లోకానికి వచ్చాడు.
*ఆ కుమారుని జీవితమే ఆశ్చర్యకరం.*
ఆయన జీవితమంతా ఆశ్చర్యకరమైన కార్యములతో నిండి యున్నది.
👉యేసుప్రభువు తన స్వభావంలో ఆశ్చర్యకరుడు,
👉తన గుణాల్లో ఆశ్చర్యకరుడు,
👉కన్యకు జన్మించడంలో ఆశ్చర్యకరుడు,
👉ఈ భూమిపై ఆయన మచ్చలేని పవిత్ర జీవితం జీవించడంలో ఆశ్చర్యకరుడు,
👉పాపులకోసం ఆయన మరణించడంలో ఆశ్చర్యకరుడు,
👉ఆయన మరణంనుంచి సజీవంగా లేవడంలో ఆశ్చర్యకరుడు,
👉పరలోకానికి ఆరోహణ అవడంలో ఆశ్చర్యకరుడు, అన్ని విధాలుగా, ఎప్పటికీ ఆశ్చర్యకరుడు.
ఆశ్చర్యకరమైన ఆయన జీవితంలో పేరుకు తగ్గట్లుగా ఆయన ఆశ్చర్యకరుడుగా ఎలా ఉన్నాడో పరిశీలన చేద్దాం.
*🏵1. ఆయన జననం ఆశ్చర్యం:* పురుషుని ఎరుగకుండా స్త్రీ గర్భం ధరించడం ఏ శాస్త్రానికి అందని ఆశ్చర్యం. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మరియ గర్భంలో ప్రవేశించడం ఆశ్చర్యం. (లూకా 1:34-35 అందుకు మరియ నేను పురుషుని ఎరుగని దాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.)
గొడ్రాలుగా ఉన్న తొంభై సంవత్సరాల వృద్ధ స్త్రీ శారా యైనా గానీ ఒక పెండ్లికాని కన్య మరియా యైనా గానీ గర్భం దాల్చి పిల్లల్ని కనేలా చేయడం దేవునికి అసాధ్యం ఏమీ కాదు. ఇటువంటి ఆశ్చర్య కార్యాలు మనుషులకు అద్భుతాలు అనిపించవచ్చునేమో గాని మహోన్నతుడైన దేవునికి ఆయన చేసే పనులన్నిటి మాదిరిగానే ఎంతో సులభమైనవి, సహజమైనవి (ఆది18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.; యిర్మియా 32:27 నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?)
దేవుడు తాను కోరుకున్న ఏ పథకాన్నైనా ఏర్పాటైనా మానవుల ఊహకు కూడా అందని విధంగా ఆశ్చర్యకరంగా అమలు జరపగలడు “ప్రభువు సమస్తమైన క్రియలు చేయగలడని ఆయన తలంచిన ఉద్దేశాలన్ని నిష్ఫలం కావని భక్తుడైన యోబు చెప్పుచున్నాడు.. యోబు 42:2 నీవు సమస్తక్రియలను చేయగలవనియునీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియునేనిప్పుడు తెలిసికొంటిని.)
*🏵2. యేసు మాటలు ఆశ్చర్య క్రియలు చేయును:* యేసు జీవితమంతా గొప్ప అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలతో నిండి ఉన్నది. దీనికి కారణం యేసు నోట నుండి వాచ్చు ప్రతి శక్తివంతమైన మాట ఆశ్చర్యక్రియలను చేయునది. అనగా వాక్యంలో ఉన్న శక్తి ఆశ్చర్యక్రియలను చేయునది. (కీర్తన 77:11 యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును.
ఆయన మాటల ద్వారా అనగా ఆయన నోటివెంట వచ్చిన వాక్యం ద్వారా నీరు ద్రాక్షరసంగా మార్చడం ఆశ్చర్యం కాదా! ఐదు రొట్టెలు రెండు చేపలు వేలవేల మందికి ఆహారంగా మారడం ఆశ్చర్యం కాదా! తుఫాను సమయంలో సముద్రం మీద నడచుకుంటూ రావడం తుపానును గద్దించగా అది ఆగిపోవడం ఆశ్చర్యం కాదా! ఒకటా రెండా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆకుమారుని జీవితంలో ఉన్నవి. ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి పక్షవాత రోగంతో పడిపోయిన వానిని బాగుచేసి వానిని వాని పరుపుతో సహా పరుగులెత్తించడం ఆశ్చర్యం కాదా?
ప్రియ దేవుని బిడ్డా! ఎటువంటి అటువంటి ఆశలేని నీ జీవితంలో కూడా యేసు కనివిని ఎరుగని ఆశ్చర్య క్రియలు చేయగలడు. అయితే నీవు దావీదు మాదిరిగా “నీ వాక్యాన్ని నేను గైకొనుచున్నాను” అని చెప్పవలసి యున్నది. (కీర్తన 119:129 నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను)
కొంతమంది దేవుని వాక్యాన్ని ఎదో నామకార్ధంగా చదువుతారు గాని మనోనేత్రాలతో చదవరు. దేవుని వాక్యాన్ని మీ మనోనేత్రాలు తెరచి లోతుగా చదవండి నమ్మండి. వాక్యంతో నీ హృదయం ఏకీభవించకపోతే నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగవు. (కీర్తన 119:18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము.)
*🏵3. యేసు బాప్తీస్మం ఒక ఆశ్చర్యం:* యేసు బాప్తిస్మం సందర్భంగా మూడు ఆశ్చర్య క్రియలు జరిగినవి. 1. ఆశ్చర్యకరంగా ఆకాశం తెరవబడుట, 2. ఆత్మ పావురమువలె దిగి వచ్చుట ఒక ఆశ్చర్యం. ౩. తండ్రియైన దేవుడు తన కుమారుని గురించి “ఈయన నా ప్రియకుమారుడని” సాక్ష్యమిచ్చుట ఆశ్చర్యం. (మార్కు 1:10 వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.11 మరియునీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.)
ప్రియులారా! దేవాదిదేవుడైన యేసుకు బాప్తిస్మం అవసరమా? మరి యేసు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు? యేసు బాప్తీస్మ సందర్భంగా దేవుడు ఎందుకు ఇటువంటి ఆశ్చర్యమైన కార్యం జరిగించాడు? కారణం ప్రభువు మనకు మాదిరికరం మరియు బాప్తిస్మం ద్వారా జీవితాలు ఆశ్చర్యకరంగా మార్పు చెందును కనుక. నామకార్ధ బాప్తిస్మం కేవలం నిష్ప్రయోజనం. నమ్మి బాప్తిస్మం తీసుకున్నపుడు అది మనకు కనిపించని ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో జరిగించుటకు ద్వారాలు తెరుస్తుంది. మీ జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరుగుటకు బాప్తిస్మం తాళం తీస్తుంది. జీవితంలో కోల్పోయినవన్ని ఆశీర్వాదాలు అన్ని ఆశ్చర్యకరంగా మీరు పొందుకుంటానికి బాప్తిస్మం ఒక మార్గం. ఒక్క మాటలో చెప్పాలంటే కోల్పోయిన మీ జీవితమంతా మళ్లీ స్వాధీనం చేసుకోవడానికి బాప్తిస్మం దేవుడు నీకిచ్చిన తాజా వనరుగా ఉన్నది. ప్రియుడా! ఇకనైనా ఆశ్చర్యక్రియలు జరిగించు యేసును నీ రక్షకునిగా స్వీకరించి బాప్తిస్మం కొరకు త్వరపడు.
*🏵4. యేసు సిలువ ద్వారా మరణం పొందడం ఒక ఆశ్చర్యం:* నేరం చేసినవారు, పాపులైనవారు మరణశిక్ష పొందుకొనుట సర్వ సాధారణం. కాని ఏ నేరము చేయకుండా, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపులలో చేరకయున్నవాడు, పరిశుద్దుడైన ఆ కుమారుడు, భయంకరమైన క్రూరమైన నీచమైన హీనమైన శిలువ మరణం పొందడం ఆశ్చర్యం కాదా! సర్వ మానవుల స్థానంలో దేవుని కుమారుడు శిలువ మరణం పొందడం జీవితంలో ఊహించలేని ఆశ్చర్యం. అటువంటి సిలువ వేయబడిన యేసు తప్ప మన జీవితంలో మరి ఏది కూడా మనకు అవసరం లేదు. (1కొరి 2:2 నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చ యించుకొంటిని.)
ప్రియ దేవుని బిడ్డా! సిలువ నీ జీవితంలో ఆశ్చర్య క్రియలు చేయునది. సిలువ రోగములను దయ్యములను ఆశ్చర్యకరంగా వెళ్ళగొట్టునది. నీ జీవితంలో ప్రతి దినం కూడా సిలువ ఉండాలి. (లూకా 9:23 మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.)
*🏵5. యేసు సమాధి కార్యం ఒక ఆశ్చర్యం:* సాధారణంగా శిలువ మరణం పొందినవారు ఖననం చేయబడరు అనగా సిలువ వేయబడిన వారికి సమాధి కార్యక్రమం ఉండదు. వారి శవాలు సిలువమీద ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ, సిలువమీదే కుళ్ళిపోయి ఎముకలుగా గూళ్ళుగా మారి రాలి పోవలసిందే. దీనికి కారణం ఏమంటే సిలువపై కుళ్లిపోయి వ్రేలాడుతూ ఉన్న శవాలను చూచి భయపడి ఎవరూ కూడా తమపై తిరుగుబాటు చేయకుండా ఉంటారనేది రోమా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాని ఎక్కడా కనివిని ఎరుగని రీతిగా సిలువ మరణం పొందిన వ్యక్తి మొదటిసారిగా సమాధి చేయబడడం దేవుడు చేసిన మహా అద్భుతాలలో ఒక అద్భుతమే. సిలువపై ఉన్న యేసు పార్దీవ శరీరం అలానే విడిచి పెట్టడమనేదాని నుండి ఎలా తప్పించబడింది?
పస్కా పండుగ రావడం, యూదుల మతాధికారులు యేసును గురించి రాబోయే ప్రజా తిరుగుబాటుకు భయపడడం, అరిమత్తయి యోసేపు అడిగినవెంటనే రోమా గవర్నరు పిలాతు మనస్సు మార్చబడి చట్ట వ్యతిరేకంగా యేసును సమాధి చేయుటకు అనుమతి నివ్వడం ఇవన్ని కూడా దేవుని ఆశ్చర్యకార్యాలే.
నక్కలకు బొరియలుండెను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండెను కాని తల వాల్చుకొనుటకైనను ఒక్కింత స్థలం కూడా లేని ఆ మనుష్యు కుమారుని పార్దీవ శరీరం ఒక ధనవంతుని క్రొత్త రాతి సమాధిలో ఉంచబడడం ఇంకా మహా ఆశ్చర్యం. (లూకా 23:53 దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు.
*🏵6. యేసు పునరుత్థానం ఒక ఆశ్చర్యం:* చరిత్రలో మొట్టమొదటిసారి మరణాన్ని జయించి తిరిగి లేవడం ఆశ్చర్యం. యాయీరు కుమార్తె, లాజరు లాంటి వారు మరణించి బ్రతికారు కాని వారు మరల మరణించారు. అనేక మంది దేవుళ్ళు వచ్చారు చనిపోయారు కాని ఒక్కరు కూడా తిరిగి లేవలేదు.
ప్రపంచ చరిత్రలో *ఈ కుమారుడు* మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే ఆయన ఆశ్చర్యకరమైన నిజ దేవుడు మరియు *ఆది సంభూతుడు* అని పేరుగాంచాడు.
చాల మంది “ఆది సంభూతుడు” అను మాటకు అర్ధం ఆదిలో సంభవించినవాడు అనగా పుట్టినవాడు అని, కాబట్టి త్రిత్వంలోని రెండవ వ్యక్తియైన యేసు ఆదిలో తండ్రియైన దేవుని చేత సృష్టించ బడినవాడు కాబట్టి యేసు, యెహోవా కంటే తక్కువ అని వాదిస్తూ ఉన్నారు. కాని వాస్తవ అర్ధం ఏమంటే *ఆది సంభూతుడు* గ లేచినవాడు అనగా మరణించి తిరిగి లేచినవారిలో మొట్టమొదటి వాడు అని భావం
*🏵7. యేసు ఆరోహణం ఒక ఆశ్చర్యం:* యేసు ఆరోహణమై దేవుని కుడి పార్శ్వమున కూర్చుండుట ఒక మహాద్భుతం. The ascension of Christ was a most significant event. యేసు జన్మించక పూర్వం వేల సంవత్సరాల క్రితం దీని గురించి ప్రవచనం చెప్పబడినది. (కీర్తన 110:1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. మార్కు 16:19 ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.)
ఆరోహణ సందర్భంగా వాక్యంలో ἀναλαμβάνω - *అనలంబానో* అను గ్రీకు మాట వ్రాయబడెను. దీని అర్ధం పైకెత్తబడడం, ఆరోహణం చేయబడడం (to take up, lift up, bring up). యేసు తనంతట తానుగా కాకండా ఎవరి ద్వారానో ఆరోహణం చేయబడ్డాడని దీని భావం. అనగా తండ్రియైన దేవుడు తన కుమారుని ఏరీతిగా ఈ లోకంలోనికి పంపాడో అదే రీతిగా కుమారుని తన దగ్గరకు ఆరోహణం అయ్యేలా చేశాడు. అందుకే విజయుడైన యేసును తన యొద్దకు తీసుకొని వచ్చుటకు తండ్రియైన దేవుడు “మేఘాన్ని” పంపాడు. దీనిని స్పష్టం చేస్తూ ఆయన ఆరోహణం గురించి క్రియా శీలకంగా (passive voice) ఐదు సార్లు వాక్యంలో “పరమునకు చేర్చుకొనబడెను” అని వ్రాయబడినది. (మార్కు. 16:19; అ.కా 1:2, 11, 22; 1 తిమో. 3:16).
ప్రియులారా! గమనించండి. యేసు “ఆరోహణుడాయెను” అని గాకుండా “ఆరోహణం చేయబడెను” అనుట ద్వారా ఇది దేవుని కార్యం అని మనందరం కూడా అదే రీతిగా దేవుని యొద్దకు ఆయన ద్వారా వెళ్ళబోతున్నామనేది స్పష్టం చేయబడినది.
జరిగిన సిలువ మరణ సంఘటనల ద్వారా కలత చెందియున్న శిష్యుల మనస్సులను ఈ ఆశ్చర్యకరమైన ఆరోహణ కార్యం ఎంతో సేద దీర్చినది. మేఘం ఆయనను కొని పోవడం ఒక ఆశ్చర్యం. అదే మేఘం మీద తిరిగి రాబోవడం ఆశ్చర్యం. అందుకే ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు. (లూకా 24:51 వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. కీర్త 136:4 ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు.
*🏵ముగింపు:* ఆయన మన జీవితాలను కూడా ఆశ్చర్యకరంగా మారుస్తాడు. వేల దయ్యాలు పట్టి మరణకరమైన పరిస్థితులలో ఉన్న సేన అను వ్యక్తి యేసు వలన ఆశ్చర్యకరంగా మార్చబడి, దెకపొలిలో ప్రకటింపగా అందరూ అది చూచి *ఆశ్చర్యపోయారు*. (మార్కు 5:20 వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి నిర్గ 34:10 అందుకు ఆయనఇదిగో నేను ఒక నిబంధన చేయు చున్నాను; భూమిమీద ఎక్కడనైనను ఏజనములో నైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి యెదుట చేసెదను. కీర్తన 105:2 ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి.)
పామరులైన జాలరులు ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసి రాజులముందు కూడా ఆశ్చర్యకరంగా సువార్త ప్రకటింప గలిగారు. (1సమూ 12:24 ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.)
ప్రియమైన వారలారా! ఇవన్ని ప్రభువు మన కొరకు చేసిన ఆశ్చర్య కార్యాలు. కీర్తన 111:2 యెహోవా క్రియలు గొప్పవి. యోబు 9:10 ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు. ఎఫేస్సి 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.
అదేరీతిగా మనం కూడా ఆ ఆశ్చర్యకరుడైన కుమారుని నమ్ముకొనుట వలన మన జీవితంలో కూడా ఆ యేసు ప్రభువు ద్వార అద్భుత క్రియలు మరియు ఆశ్చర్యక్రియలు చూడగలం. అందుకు దేవుని కృప ఎల్లవేళలా మనకు తోడుగా ఉండునుగాక! ఆమెన్!
దైవాశ్శీసులు!
-
*✝ఆలోచనకర్తగా యేసు బాలుడు🧚*
(క్రిస్మస్ సందేశాలు - 12)
Immanuel Bible College
NIDUBROLU
మిత్రులందరికీ శుభవందనాలు!
_(యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను - *ఆలోచనకర్త.*)_
*🏵ఉపోద్ఘాతం:* యెషయా ప్రవక్త కాలంలో శత్రువుల దాడివలన ఏర్పడిన కష్టాలకు దిక్కు తోచని ప్రజలు సలహా కొరకు *ఆలోచన* కొరకు కర్ణపిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును మరియు సజీవులపక్షముగా చచ్చినవారి యొద్దకును వెళ్లి సంప్రదిస్తూ ఉన్నారు. (యెషయా 8:19 వారు మిమ్మును చూచి కర్ణపిశాచిగలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్లి విచారించు డని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్ల దగునా?)
ప్రియ దేవుని బిడ్డలారా! ఈ దినాలలో కూడా అనేకులు మరి ముఖ్యంగా క్రైస్తవులైన వారు కూడా ఆలోచనల కొరకు సోదేచెప్పువారి దగ్గరకు వెళ్ళడం జ్యోతిష్కులను సంప్రదించడం చేస్తూ ఉన్నారు. అది ఎంతమాత్రం మంచిదికాదు. సమస్యలు అనేవి మంత్రాలకు లొంగవు.
పైగా మంత్రాలు చదివేవారు ఎప్పుడు చూసిన కిచ కిచమంటూ గుసగుస మంటూ లోలోపల గొణుగుతూ ఉంటారు గాని ఎదుటివారికి అర్ధం అయ్యేరీతిగా వారు ఎప్పుడు పైకి గట్టిగా చదవరు. కాని దేవుని వాక్యం అలాకాదు. స్పష్టంగా అందరికి అర్ధం అయ్యే రీతిగా వాక్యం ఉంటుంది. గుసగుసలకూ నోట్లో లోలోపల వారు చేసే మంత్రాల వల్లింపులకూ, దేవుని వాక్కు అనే పవిత్రమైన మాటలకూ మధ్యగల తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మంత్రాలు చెప్పేవారికి ఆత్మ సంబంధమైన వివేచన, గ్రహింపు ఉండవు. వాళ్ళు చెప్పేది వారికే అర్ధం కానప్పుడు ఎదుటివారి సమస్యల కొరకు వారు ఏమి ఆలోచన చెప్పగలరు? ఆలోచించండి ప్రియులారా!
*ఆలోచన* కొరకు దేవుని యొద్ద విచారణ చేయకుండా దుష్ట శక్తుల యొద్దకు వెళ్లి ఆలోచన చేయడం ఇది మీకు తగునా అని బాధపడిన యెషయా ప్రవక్త, ఈ సమస్య గురించి దేవునికి ప్రార్ధించగా ప్రభువు ఆ ప్రార్ధన ఆలకించి వారికి చక్కని ఆలోచన చెప్పి నడిపించే *ఆలోచనకర్త* అను పేరుగల రక్షకుని కుమారునిగా ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు.
అవును! సాతాను ప్రభావం వలన దుష్ట శక్తుల వలన సర్వమానవులు నరకమునకు నడిపించ బడుచుండగా వారికి సరైన ఆలోచన కలిగించి తన బిడ్డలను సరైన మార్గమునకు నడిపించే *ఆలోచనకర్తగా ఆ కుమారుడు* ఈ లోకంలో జన్మించాడు. మనం తెలుసుకోవలసినవి, చెయ్యవలసినవి ఏ విషయంలోనైనా సరే, సర్వజ్ఞాని అయిన యేసుప్రభువు ఆలోచన చెప్పగలవాడు. కారణం ఆయన జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ గలవాడు. (యెషయా 11:2)
*🏵1.కుమారుడు మనకు ఆలోచన నేర్పువాడు:* మత్తయి 11:29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
దేవునితో మనకున్న అద్భుతమైన సంబంధం ఏమంటే, మన జీవితాలలో ఏవైనా సమస్యలు ఉన్నా లేదా సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా సలహాల కోసం మనకు ఎల్లప్పుడూ సహాయం చేయు ప్రభువు వైపు మరలవచ్చు. యేసుక్రీస్తు మన అద్భుతమైన సలహాదారు ఆలోచన కర్త అని దేవుడు మనకు యెషయా ద్వారా హామీ ఇస్తున్నాడు.
అయితే కొంతమంది కేవలం సమస్యలు వచ్చినప్పుడే ఆయన ఆలోచనను కోరుతున్నారు. అలాకాకుండా మనం తీసుకొనే ప్రతి నిర్ణయంలో ప్రభువు సలహా మరియు ఆలోచన తీసుకోవాలి. లేకపోతే జీవితంలో చాల నష్టపోవలసి వస్తుంది. చాలమంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోక ఎంతో సమయం మరియు డబ్బు నష్టపోతుంటారు. కారణం వారికి సరైన ఆలోచన చెప్పి నడిపించేవారు లేకపోవడమే.
కుమారుడైన యేసు ద్వారా మాత్రమే గొప్ప ఆలోచనలు గొప్పవైన గంభీరమైన సంగతులు మనకు అనుగ్రహిస్తాడు. యిర్మీయా 32:19 *ఆలోచన* విషయములో నీవే గొప్పవాడవు, కీర్తన 92:5 యెహోవా, నీ *ఆలోచనలు* అతిగంభీరములు.
*🏵2. కుమారుడు తనకు ప్రార్ధించువారికి ఆలోచనలు ఇచ్చువాడు:* చాలామంది ఏదైనా ఒక సమస్య వచ్చినపుడు దేవునికి ప్రార్ధన చేయకుండా అనగా ఆయన మీద ఆధారపడకుండా తమ స్వంత తెలివితేటల మీద అధారపడతారు. అది మంచిది కాదు. (యిర్మియా 33:3 నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.)
సమస్యల సుడిగుండాలలో నీ మార్గం సరాళం కావాలంటే ప్రభువుకు లోబడి ఆయనకు ప్రార్ధన చేయాలి. ఆయన అధికారానికి లోబడి ఆయనను అడగాలి. (మత్తయి 7:7 అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును 8 అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును.)
ఆలోచన కొరకు ప్రార్ధన చేయుట అనే దానిలో నీవు దేవుని అధికారానికి లోబడుచున్నావని అర్ధం. (సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము 6 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.)
*🏵3. కుమారుడు తన మాటల ద్వారా అనగా వాక్యము ద్వారా ఆలోచనలను ఇచ్చువాడు:* అనగా దేవుని యొక్క వాక్యమే మనకు ఆలోచన కర్తగా పని చేయును. (కీర్తన 119:24 నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు *ఆలోచనకర్తలై యున్నవి*.) దేవుని ద్వారా వినబడిన వాక్యం ప్రకారం నడిచిన అబ్రహాం ఎంతో దీవించబడ్డాడు.
హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను *ఆలోచనలను* శోధించుచున్నది.
*🏵4. కుమారుని ఆలోచన స్థిరమైనదై సదా కాలము నిలుచును:* మానవుడు అనేకమైన ఆలోచనలు చేస్తాడు గాని అవి అన్ని పనికిమాలినవి. (సామెతలు 10:20 భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.)
మానవుని ఆలోచనకు దేవుని ఆలోచనకు ఉన్న తేడా ఇదే. మానవుని కేవలం తాత్కాలికం అస్తిరం. కాని దేవుని ఆలోచన సదాకాలం నిలుచునది. (సామెతలు 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కీర్తన 33:11 యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.)
మనం ఎన్నో ప్రణాళికలు వేస్తాం కానీ దేవుని ప్రణాళికలు దూరదృష్టి కలిగినవి. మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు మాత్రం ఈ భూమిపై తన ఆలోచనలను ఉద్దేశాలను నెరవేర్చుకొంటూనే ఉంటాడు. తన సంకల్పం నెరవేర్చడానికి ఆయన వారి ప్రయత్నాలనే తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు, లేక వాటిని తలక్రిందులు చేస్తాడు. (యెషయా 14:24 సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వ కముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.)
*🏵5. కుమారుని ఆలోచన మనలను ఫలింప జేయును:* మానవుడు ఎల్లపుడు ఫలింపు గలిగిన జీవితం జీవించాలని ప్రభువు ఆలోచన గలిగి యున్నాడు. అందుకే ఆదాము హవ్వలను ఫలించమని దీవించాడు. (ఆది కా 1:28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి;)
సాతాను ఆలోచన అనగా దుష్టుల ఆలోచన నష్టానికి దారి తీస్తుంది. (కీర్తన 1:1-3 దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.)
*🏵6. కుమారుడు తన ఆలోచనచేత మనలను నడిపించువాడు:* సాతాను ఆలోచన అశాంతికి మరణమునకు నడిపితే, కుమారుని ఆలోచన జీవమును శాంతి సమాధానములను మనకు అనుగ్రహించును. సాతాను ఆలోచన చేత నడిపించబడిన ఆదాము హవ్వ భయంకరమైన చిక్కుల్లో పడ్డారు.
కీర్తన 73:24 నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. కీర్తన 23:2 పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు చున్నాడు.
*🏵7 . కుమారుడు దైవజనుల ద్వార మనకు ఆలోచన అనుగ్రహించువాడు:* ఆలోచనకర్తలైన దైవజనులను సంఘ పెద్దలను మనకు ఇచ్చువాడు ఆయనే. (యెషయా 1:26 ఆదిలోనుండినట్లు నీకు *ఆలోచనకర్తలను* మరల నియమించెదను.)
ఈ దినాలలో దేవుని ఆలోచనకర్తలు ఆయనచేత అభిషేకించబడిన సంఘపెద్దలు మరియు దైవజనులే. దైవజనుల ఆలోచన మనకు ఎంతో రక్షణకరం. వారి ఆలోచన మనకు శ్రమ తగ్గించునది. దుష్టుల ఆలోచన మనకు కీడు కలిగించునదైతే దైవజనుల ఆలోచన మనకు సంతోష కారణమగును. సామెతలు 12:20 కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు.
దైవజనులు మరియు పెద్దలైనవారి ఆలోచన చొప్పున నడిచి మేలు పొందినవారిని గురించి ఈ క్రింది ఉదాహరణలలో చూడగలం.
ఉదా1 – యిత్రో ఆలోచన మోషే యొక్క శ్రమను తగ్గించింది. నిర్గమ 18:13,19 కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను.
ఉదా2 – హూషై ఆలోచన దావీదుని రక్షించింది 2 సమూ 17:14 అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పినదానికంటె యుక్తమని యొప్పు కొనిరి;
దైవజనుల ఆలోచన కాదని లోకస్తుల ఆలోచన ప్రకారం మనం నడిస్తే సమస్తం వ్యర్ధం కాగలదు. పనికిమాలినవారి ఆలోచనలను అనుసరించిన వారిస్థితి పతనానికి దారి తీస్తుంది. కీర్తన 94:11 నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.
ఉదా1. యరోబాము బంగారు దూడలు ఆలోచన రాజ్య పతనానికి దారితీసింది. 1 రాజు 12:27 యరోబాము తన హృదయమందు తలంచి ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;
ఉదా 2 – రెహాబాము పెద్దల ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవ్వనస్తుల ఆలోచన అనుసరించి నాశనమయ్యాడు - 1 రాజులు 12:8 అయితే అతడు పెద్దలు పన్నులు తగ్గించమని తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టెను. 1 రాజులు 12:13 అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను.
*🏵ముగింపు:* ప్రియ దేవుని బిడ్డలారా! సాతాను ఆలోచన నరకమునకు నడిపించునదైతే కుమారుడైన యేసు *ఆలోచన* పరలోకమునకు మనలను నడిపించునదని గ్రహించుదాం. దేవుడు సర్వజ్ఞాని. ఆయనకు తెలియని విషయం అంటూ ఏదిలేదు. ఆయన ముందు దుమ్ములాంటి వారం మనం జ్ఞానం ఎంత? ఆయన ఆలోచన మన ఊహకు అందనిది. (కీర్తన 139:6 ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.)
మనం అనేకమైన భూసంబంధమైన అనేక ఆలోచనలు చేస్తాము కానీ ప్రభువు యొక్క కన్ను ఆయనకు భయపడుతున్నవారిపై ఉంది. అటువంటివారి ప్రణాళికలు మరియు ఆలోచనలు విజయవంతం కావాలని యేసు నిర్ణయిస్తాడు. దివ్యమైన ఈ క్రిస్మస్ దినాలలో *ఆలోచనలో గొప్పవాడైన* ఆ కుమారుని యొక్క ఆలోచనలకు లోబడదాం. ఆయన ఆలోచన ప్రకారం నడుచుటకును ఆ కుమారుని ఆరాధించుటకును ఆ పరిశుద్ధాత్ముడు మనకు ఎల్లవేళలా సహాయం చేయునుగాక ఆమెన్!
దైవాశ్శీసులు!
-
*✝బలవంతుడైన దేవుడుగా జన్మించిన యేసు బాలుడు🧚*
(క్రిస్మస్ సందేశాలు - 13)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను - *బలవంతుడైన దేవుడు.*)_
*🏵ఉపోద్ఘాతం:* ఈ లోకంలో ఏ మనిషి చేయలేని క్రియలను దేవుడు చేయగలడు. కారణం ఆయన అధికబలము గలిగిన బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. (యిర్మియా 32:17 యెహోవా, ప్రభువా సైన్య ములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ *యధికబలము* చేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు యెషయా 51:9 యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము.)
*➡A. ఎందుకు ఈశిశువు బలవంతుడైన దేవుడుగా ఈ లోకంలో పుట్టాడు:* యెషయా కాలం నాటి పరిస్థితులు చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలిగి ప్రజలు ఎంతో బలహీనులై పోయారు.
ప్రజలందరూ గాఢాంధకారము లోనికి తోలివేయబడి ప్రజల మెడ మీద కట్టుకర్ర వేయబడి, బరువైన కష్టాలనే కాడి మోయుచూ, వారిని తోలువాని కొరడా దెబ్బలు తింటూ ఎంతో సొమ్మసిల్లి ఏమి చేయలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. ఏ రాజు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. (కీర్తన 33:16 ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు. )
ఇటివంటి బలహీన స్థితిలో ఉన్న తన ప్రజలను విడిపించి తోలువాని కొరడాలు విరిచి ప్రజల మెడల మీద ఉన్న సాతాను కాడిని తొలగించుటకు కొరకు *“బలవంతుడైన దేవుడుగా”* కుమారుడు ఈలోకంలో జన్మించవలసి యున్నది. (యెషయా 9:4 మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.)
సాతాను భయకరమైన *మరణబలం* గలవాడు గనుక ఏ మానవుడు కూడా ఆ మరణ బలమును ఎదిరించలేని పరిస్థితి గనుక దేవుడు స్వయంగా దిగివచ్చి ఆ మరణబలమును నశింపజేసి ప్రజలకు విడుదల నిచ్చాడు గనుక ఆయన పేరు *‘బలవంతుడైన దేవుడు”* అని పెట్టబడింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, మరణ బలం గలిగిన దుష్ట శక్తిని సంహరించాలంటే ఆ దుష్టుని చెరలోనుండి బయటకు రప్పించుటకు బలవంతుడైన దేవుడు అవసరం. అందునుబట్టి యేసు *బలవంతుడైన దేవుడు* అను పేరుగలిగి ఈలోకానికి వచ్చి ఎన్నో బలమైన కార్యాలు చేసి మరణబలం గల అపవాదిని నశింపజేశాడు.
*➡B. బలవంతుడైన దేవుడు అను పేరు ఎందుకు:*
*1. యేసువంటి బలాఢ్యుడైన దేవుడు ఇంకొకరు లేరు:* కీర్తన 89:8 యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు?
*2. కుమారుని నోటిమాటలో బలం:* ఎంతో బలమైన తుఫానును కూడా ఆయన ఒక్క మాటతో (వాక్యం ద్వారా) ఆపివేయగల బలాఢ్యుడు యేసు. మార్కు 4:39 అందుకాయన లేచి గాలిని గద్దించినిశ్శబ్దమై ఊరకుండు మని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను.
*3. కుమారుని వస్త్రంలో బలం:* పండ్రెండు సంవత్సరాల నుండి రోగముతో బలహీన పడిన స్త్రీని ఆయన వస్త్రం బలపరిచినది. లూకా 8:43 ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.
*4. కుమారుని స్పర్శలో బలం:* లూకా 13:11 పదునెనిమిది ఏండ్లనుండి *బలహీన పరచు దయ్యము* పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. 13 ఆమెమీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.
*5. కుమారుని బాహువు బలమైనది:* నిర్గ 13:3 యెహోవా తన బాహు బలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను.
*6. కుమారుని నామము బలమైనది:* సామెతలు 18:10 *యెహోవా నామము బలమైన దుర్గము.* నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును
*7. కుమారుని వివేచన శక్తి బలమైనది:* యోబు 36:5 ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది
*➡C. ఆయన తన బలాన్ని మనకు ఇచ్చుటకే ఈలోకంలో జన్మించాడు:* ఆయన బలాన్ని మనకు ఇచ్చి మనలను బలపరుస్తాడు. (యెషయా 41:10 దిగులుపడకుము నేను నిన్ను బలపరతును.)
దేవుని వలన మాత్రమే మనకు బలమని ఆయన బలాన్ని పొందుకున్న భక్తులు యెషయ సమూయేలు దావీదు పౌలు మొదలగువారు ఈ క్రిందివిధంగా సాక్ష్యం చెప్పుచున్నారు.
1 తిమోతి 1:13 నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. 1 దిన 16:27 బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.
బలము ధరింప జేయువాడు ఆయనే అని దావీదు కీర్తిస్తున్నాడు. కీర్తన 18:32 నాకు బలము ధరింప జేయువాడు ఆయనే.
2సమూ 22:33 దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు కీర్తన 68:28 నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి యున్నాడు. 1దిన 29:12 బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.
కీర్తన 68:35 ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమముల ననుగ్రహించుచున్నాడు. కీర్తన 29:11 యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును.
*➡D. కుమారుడైన యేసు యొక్క బలాన్ని మనం ఎలా పొందుకుంటాం:*
*🏵1.విశ్వాసము వలన బలము* – అబ్రాహాము వయసు దాదాపు నూరేళ్ళు. శారా తొంభై ఏళ్ళ వయసు గలది. వారు ఎంతో వృద్దులై ఎంతో బలహీనమైన స్థితిలో ఉన్నారు. అబ్రాహాము తన బలం, తన శక్తి సామర్థ్యాలపై గాక దేవునిపైనే నమ్మకం పెట్టుకున్నాడు. అబ్రాహాము *విశ్వసించి దేవుని వలన బలం* పొందుకున్నాడు. (రోమా 4:21 దేవుని మహిమ పరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి *విశ్వాసము వలన బలము నొందెను.* జెకర్యా 12:5 అప్పుడు యెరూషలేము లోని అధికారులు యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను *నమ్ముకొనుట వలన మాకు బలము* కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పు కొందురు.)
*🏵2. యధార్ధవంతులకు బలము* - 2 దిన 16:9 తనయెడల యథార్థ హృదయముగలవారిని *బలపరచుటకై* యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది;
*🏵3. సేవకులకు బలము* - కీర్తన 86:16 నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ *బలము* అనుగ్రహింపుము.
*🏵4. దేవుని ప్రేమించు వారికి బలము* - కీర్తన 18:1 యెహోవా నా *బలమా*, నేను నిన్ను ప్రేమించు చున్నాను.
*🏵5. దేవుని కృప పొందిన వారికి బలము* - కీర్తన 94:18 నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను *బలపరచుచున్నది*.
*🏵6. పరిశుద్దాత్మ పొందిన వారికి బలము* - ఎఫేస్సి 3:15 మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన *ఆత్మ వలన బలపరచబడునట్లుగాను..*
*🏵7. దేవునియందు ఆనందించు వారికి బలం* - నేహేమ్యా 8:10 యెహోవా యందు *ఆనందించుట వలన మీరు బలమొందుదురు.*
*🏵ముగింపు:* దేవుడు మనకిచ్చిన ఆత్మ బలాన్ని సాతానుడు మాయజేసి తొలగించువాడు కనుక ప్రార్ధనతో మెలుకువ కలిగి జాగ్రత్తగా ఉండాలి. కారణం పాపము దోషము మన బలమును తొలగింప జేయును. (కీర్తన 31:10 నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చు చున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించు చున్నవి నా *దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది* నా యెముకలు క్షీణించుచున్నవి.)
ఉదా: సంసోను న్యాయా 16:5 ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతోనీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము. న్యాయా 16:6 కాబట్టి దెలీలానీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుము.
ప్రియ స్నేహితుడా! సాతాను వలన నీ బలం పోయిందా? బలహీనమై పోయావా? ఇకనైనా నీకొరకు జన్మించిన యేసు బాలుని యొద్దకు రా! ప్రభువు తన కృప చేత తిరిగి నిన్ను బలవంతునిగా చేయగలడు. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై యుందాము. (ఎఫెస్సి 6:10) దేవుని బలాన్ని పొందుకున్న మనం సమస్తం చేయగలం. (ఫిలిప్పీ 4:13) మనలను బలపరచువాని ద్వారా సమస్తం చేయుటకు ప్రభువు తన కృపను మనకు సమృధ్ధిగ అనుగ్రహించును గాక! ఆమెన్!!
దైవాశ్శీసులు!
-
*✝నిత్యుడగు తండ్రిగా యేసు బాలుడు💟*
(క్రిస్మస్ సందేశాలు - 14)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
(యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను - *నిత్యుడగు తండ్రి.*)
*🏵ఉపోద్ఘాతం:*
*➡ A. నిత్యుడగు తండ్రి ఎవరు:* ఈ పేరులో తండ్రి అనే మాట వచ్చింది కాబట్టి చాలమంది నిత్యుడగు తండ్రి అంటే యెహోవా దేవుడని భావిస్తారు. కాని ఇక్కడ నిత్యుడగు తండ్రి అనే పేరు కుమారునికి ఇవ్వబడినది. నిత్యుడగు తండ్రి అనే మాట తండ్రియైన యెహోవా దేవునికి చెందినది కాదు. కారణం కుమారుడైన యేసుప్రభువు తరచుగా తండ్రికి వేరుగా తనను చెప్పుకొన్నాడు (మత్తయి 11:27 సమస్తమును నాతండ్రిచేత నాకప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడుగాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.).
*➡ B. తండ్రి బాధ్యత పిల్లలకు ప్రేమను పంచడం:* పుట్టిన శిశువునకు *నిత్యుడగు తండ్రి* అని ఎలా పేరు పెట్టబడినది? దీనికి కారణం ఆ శిశువు మీద ఉంచబడిన బాధ్యతను బట్టి. యెషయా కాలంలోని ప్రజలు ప్రేమ రాహిత్యంతో క్రమశిక్షణ తప్పిన స్థితిలో ఉన్నారు. వారిని సరైన దారిలోనికి తీసుకురావాలంటే ప్రేమతో కూడిన క్రమశిక్షణ వారికి అవసరమైనది.
ఉపాధ్యాయులు పిల్లలను క్రమశిక్షణలో పెట్టగలరు గాని అందులో ప్రేమ ఉండదు. తల్లి అయితే బిడ్డలకు కావలసినంత ప్రేమను ఇవ్వగలదు గాని ఖచ్చితమైన క్రమశిక్షణను ఇవ్వలేదు. *ప్రేమతో కూడిన క్రమశిక్షణ* ఇవ్వగలిగినవాడు కేవలం “తండ్రి” మాత్రమే.
తల్లి ప్రేమ అద్భుతమే కాని తండ్రి ప్రేమ క్రమశిక్షణతో కూడి ఉంటుంది. అందువలన బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి రాగలరు. గనుక తండ్రి ప్రేమ మహాద్భుతం. అందుకే తండ్రి యొక్క ప్రేమతో కూడిన క్రమశిక్షణ పిల్లలకెంతో ముఖ్యం. అది వారి భవిష్యత్తుకు బంగారుబాట వేస్తుంది.
నిత్యుడగు తండ్రి యేసు యొక్క ప్రేమతో కూడిన క్రమశిక్షణ వలన దేవుని పిల్లలముగా మనము మానసికంగా యేసుకు ఎంతో దగ్గరవుతాము. తండ్రిలాంటి యేసు దేవుని భయంతో తప్పు చేయము.
*➡ C. నిత్యుడగు తండ్రి బాధ్యత:* ఒక తండ్రి పిల్లల యొక్క అభిప్రాయాలనూ పంచుకోవడానికి… మంచీచెడూ నిర్ణయించుకోవడానికీ ముందు పిల్లలకు దగ్గరై వారితో కలసిపోవాలి. ఈ దగ్గరితనం వలన పిల్లల సమస్యలను తండ్రి తెలుసుకోగలడు. ఎల్లపుడు తండ్రి ఒక స్నేహితుని మాదిరిగా పిల్లలకు అందుబాటులో ఉన్నట్లుగా నిత్యుడగు తండ్రిగా యేసు పిల్లలమైన మనకు దగ్గరగుటకు ఈలోకంలో పుట్టాడు. తండ్రి బాధ్యత పిల్లలకు రక్షణగా ఉండుట. అదే పని యేసు చేశాడు.
తండ్రివలే యేసు మనకు కావలసిన ముందు జాగ్రత్తలు అన్నీ వాక్యం ద్వార చెపుతాడు. ఈలోక జీవిత చదువులో మనకు కావలసిన సలహాలిస్తాడు. సమాజంలో జరగుతున్న మార్పులను మనకు విశదీకరిస్తాడు.
ఆత్మ జ్ఞానంతోబాటుగా ఈ లోకంలో జీవించుటకు కావలసిన వ్యవహారజ్ఞానం కూడా పెంచుతాడు. ఆపదకాలంలో వెన్నంటి నిలుస్తాడు. సమస్య వచ్చిందంటే బాసటగా నిలుస్తాడు. మన యొక్క ఆత్మీయ వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ అనుబంధంతో కూడిన *నిత్యుడగు తండ్రి యేను* యొక్క మార్గదర్శకత్వం అవసరం.
ముఖ్యంగా నూతనంగా సంఘంలో చేరి ఆత్మీయంగా ఎదుగుచున్న బిడ్డలకు తండ్రి అండాదండా ఎంతో అవసరం. ఆయన పిల్లలమైన మనము మనలో రేకెత్తే భావోద్వేగాలను, అనుమానాలను మనలోనే అణచుకోకుండా పంచుకోవడానికి తండ్రిని మించిన తోడు లేదు.
తల్లి నవమాసాలే మోస్తుంది. కానీ తండ్రి బిడ్డకో దారి చూపించేవరకూ వారి బరువు బాధ్యతలను పిల్లలు బ్రతికినంత కాలం తండ్రి మోసినట్లుగా నిత్యుడగు తండ్రి అనబడిన యేసుకూడా పక్షిరాజు తన పిల్లలను రెక్కలపై మోయునట్లు మనలను మోయుటకు ఈలోకంలో జన్మించాడు.
పిల్లలు ఎదిగేకొద్ది తల్లికి దూరం అవుతూ తండ్రికి దగ్గరవుతారు గనుక తండ్రే అన్నీ తానై, పిల్లలను ఎంతో బాధ్యతతో, ప్రేమతో పెంచుతాడు. అదే విధంగా మనం ఆత్మీయంగా ఎదిగేకొద్ది లోక జీవితానికి దూరమై నిత్యుడగు తండ్రికి దగ్గరకావాలి. అప్పుడు మనకు ఎన్ని కష్టాలొచ్చినా, ధైర్యంగా ఎదుర్కొంటూ యేసు ద్వారా ముందుకు నడవగలం. అందుకు ఎదురైన కష్టనష్టాలను ఆనందంగా నిత్యుడగు తండ్రిగా యేసు భరిస్తాడు. అదే తండ్రి బాధ్యత.
*➡ D. నిత్యుడగు తండ్రి ప్రేమ:* పిల్లల పెంపకాన్ని, ప్రేమనూ పంచుకోవడంలో… బంధాలను పటిష్ట పరచుకోవడంలో… నమ్మకాన్ని, విలువలనూ పెంపొందించు కోవడంలో తండ్రి ప్రేమ గొప్పది. పిల్లందరూ మురిసిపోదగ్గది. అందుకే యేసును నిత్యుడగు తండ్రిగా స్వీకరించిన వారి ధన్యత ఎంతో గొప్పది.
పిల్లలను ప్రేమించి వారి అభివృద్ధి కోసం శ్రమించే ఈ లోకపు తండ్రులు కేవలం కొద్ది కాలం మాత్రమే ఉంటారు. కాని తన పిల్లల ఆత్మీయ అభివృద్ధి కోసం అనుక్షణం వారిని ప్రేమిస్తూ శ్రమిస్తూ మనం పరలోక రాజ్యం చేరేవరకు మనతో శాశ్వత కాలం ఉండే తండ్రివలే యేసు ఈ లోకానికి అవసరమైనాడు.
అందుకే కుమారుడుగా జన్మించిన యేసు ఒక తండ్రి మాదిరిగా తన ప్రేమను క్రమశిక్షణను మనకు నిత్యము ఇచ్చుటకు “నిత్యుడగు తండ్రి” అనే పేరుతో ఈ లోకంలో జన్మించాడు. ఇటివంటి గొప్ప భాత్యతను నిర్వహించడానికే యేసు మన తండ్రిగా నిత్యం ఉండుటకు వచ్చాడు గనుక ఈ కోణంలో నుండి చూస్తే పుట్టిన శిశువుకు “నిత్యుడగు తండ్రి” అనుపేరు చక్కగా సరిపోయినది.
హీబ్రూ భాషలో దీని అర్థం నిత్యత్వం గలవాడు. అంటే పుట్టిన శిశువైన యేసు, మనకు తండ్రిలాంటి ప్రేమను పంచడానికి అనాదినుండి సిద్ధంగా ఉన్నవాడు. అంటే నిత్యుడగు తండ్రి అను పేరుకు అర్ధమేమనగా మనకొరకు పుట్టిన శిశువైన యేసు, మానవుల కొరకైన ఉనికిలో *శాశ్వతకాలం ఉండువాడు* అని అర్ధం. (మీకా 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని *శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.*)
*ముగింపు:* నిత్యుడగు తండ్రి కార్యములు ఏమిటి మరియు నిత్యుడగు తండ్రిని నిరాకరించిన వారికి ఏమి జరుగుతుంది మొదలైన విషయాలు రేపటి దినం ధ్యానం చేద్దాం. దేవుని నిత్యకృప మనకు తోడుగా ఉండునుగాక! ఆమెన్!
(To be continued..)
దైవాశ్శీసులు!
-
*✝నిత్యుడగు తండ్రిగా యేసుచేయు కార్యములు💟*
(నిత్యుడగు తండ్రి -2)
(క్రిస్మస్ సందేశాలు - 15)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(యోహాను 17:2 నీవు నీ కుమారుని కిచ్చిన వారికందరికిని ఆయన *నిత్యజీవము* అనుగ్రహించునట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి.)_
*➡ E. నిత్యుడగు తండ్రి అను పేరుతో వచ్చిన యేసు మన కొరకు చేయు నిత్యమైన కార్యములు:*
*🏵1. నిత్యమైన జీవము ఇచ్చును:* నిత్యుడగు తండ్రి అను పేరుకు భావం మన కొరకు పుట్టిన ఆ ఆశిశువు అనంత యుగాలకు కూడా మన యెడల ఆ యేసు తండ్రిలాంటి ప్రేమను గలిగి నిత్య జీవాన్ని మనుషులకు ఇచ్చేవాడు అని అర్ధం. (యోహాను 17:2 నీవు నీ కుమారుని కిచ్చిన వారికందరికిని ఆయన *నిత్యజీవము* అనుగ్రహించునట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి.)
*🏵2. నిత్యమైన కృప ఇచ్చును:* యెషయా 54:8 *నిత్యమైన కృపతో* నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు
*🏵3. నిత్యమైన సంతోషం ఇచ్చును:* యెషయా 51:11 యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు *నిత్యసంతోషము* వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును
*🏵4. నిత్యమైన రక్షణ ఇచ్చును:* యెషయా 45:17 యెహోవావలన ఇశ్రాయేలు *నిత్యమైన రక్షణ* పొంది యున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొంద కయు నుందురు.
*🏵5. నిత్యమైన విమోచన ఇచ్చును:* హెబ్రీ 9:11 అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే *నిత్యమైన విమోచన* సంపాదించి....
*🏵6. నిత్యమైన ఆదరణ ఇచ్చును:* 2 ధేస్స 2:16 మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత *నిత్యమైన ఆదరణయు,* శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును...
*🏵7.నిత్యమైన మహిమ ఇచ్చును:* 2 తిమోతి 2:10 అందుచేత ఏర్పరచబడినవారు *నిత్యమైన మహిమతో* కూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొను చున్నాను.
*🏵8. నిత్యమైన వెలుగు ఇచ్చును:* యెషయా 60:19 యెహోవాయే నీకు *నిత్యమైన వెలుగవును* నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.
*🏵9. నిత్యమైన శక్తి ఇచ్చును:* రోమా 1:20 ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన *నిత్యశక్తియు* దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.
*🏵10. నిత్యమైన స్వాస్థ్యము ఇచ్చును:* హెబ్రీ 9:15 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు *నిత్యమైన స్వాస్థ్యమును* గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు. 2 కొరి 5:1 భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమై పోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు *నిత్యమైనదియునైన* నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
*➡ F. నిత్యుడగు తండ్రి ఆయిన యేసును నిరాకరించిన వారి స్థితి:* నిత్యుడగు తండ్రి అను పేరుతో వచ్చి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టిన యేసు యొక్క ప్రేమను నిరాకరించువారి పరిస్థితి భయంకరముగా ఈ క్రింద చెప్పబడిన విధంగా ఉండును.
👉 *1. నిత్యమైన నాశనం:* కీర్త 92:7 నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు
👉 *2. నిత్యమైన తీర్పు:* హెబ్రీ 6:2 దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరు త్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము.
👉 *3. నిత్యమైన అపవాదం:* యిర్మీయా 23:40 ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పిం చెదను.
👉 *4. నిత్యమైన అవమానం:* యిర్మియా 20:11 వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు.
👉 *5. నిత్యమైన అగ్ని దండన:* యూదా 1:7 ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణ ములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంత ముగా ఉంచబడెను.
👉 *6. నిత్యమైన శిక్ష:* 1 సమూ 3:13 తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొను చున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.
👉 *7. నిత్యమైన హేయము:* దాని 12:2 మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.
*🏵ముగింపు:* కనుక ప్రియ మిత్రులారా! ఆ నిత్యుడగు తండ్రి అను పేరు గలిగిన యేసు ఆన్నిటికి మూలమని గ్రహించి ఆ ప్రభువుయొక్క నిత్యమైన కట్టడలను అనుసరించి ఆయన యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశించి నిత్యానందం పొందుకునేందుకు దేవుని నిత్యకృప మనకు తోడుగా ఉండునుగాక! ఆమెన్!
దైవాశ్శీసులు!
-
*✝సమాధానకర్తయగు అధిపతిగా యేసు బాలుడు🌟*
(క్రిస్మస్ సందేశాలు - 16)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!!
_(యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను - *సమాధానకర్తయగు అధిపతి.*)_
*🌟ఉపోద్ఘాతం:* నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు మనిషికి దేవునితోనూ, తోటి మానవునితోనూ సమాధానం అవసరం. అయితే సాతాను వలన భూమి మీద సమాధానమే లేని పరిస్థితి ఉన్నది.
➡ *A. సమాధానం లేని స్థితి:* పుట్టిన శిశువుకు సమాధానకర్తయగు అధిపతి అని ఎందుకు పేరు పెట్టబడెను? పరిశీలన చేద్దాం.
నేటి ప్రపంచం సమాధానం కోసం అర్రులు చాస్తున్నది. Peace is what the world is most desperate for today. కుటుంబాల్లో, సమాజంలో, దేశాలలో ఎక్కడ చూసిన ప్రజలంతా సమాధానం లేక అల్లాడి పోవుచున్నారు. ఎక్కడ చూసిన ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ సన్నాహాలు మరియు తుపాకి కాల్పుల శబ్దాలు వినబడుచున్నాయి. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నారు.
ఇదే పరిస్థితి ఆనాటి యెషయా కాలములో కూడా ఉన్నది. యూదా దేశంలో ఎక్కడ కూడా సమాధానంలేని పరిస్థితులు ఏర్పడినాయి. కారణం శత్రువులు యుద్ధపంక్తులు తీరి యూదా దేశాన్ని చుట్టుముట్టారు. (యెషయా 9:5 యుద్ధపు సందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును.)
అదేవిధంగా సాతాను ప్రభావంవలన ప్రపంచమంతా నేరాలతో పాపాలతో నిండిపోయింది. ఆదాము కుమారుడు కయూను హంతకునిగా మారినప్పటి నుండి మానవజాతి లెక్కలేనన్ని హత్యలను చూసింది. తప్పుచేయడానికి మొగ్గుచూపే మానవులు ఒకరితో ఒకరు సమాధానంగా లేరు, దేవునితోనూ సమాధానంగా లేరు. యుద్ధమేఘాలు అలుముకుని ప్రపంచంలో కూడా ఎక్కడ సమాధానం లేకుండా పోయింది. అటువంటి పరిస్థితులలో తిరిగి ఈ లోకంలో సమాధానం స్థాపించుట కొరకు కుమారుడైన యేసు సమాధానకర్తయగు అధిపతిగా ఈ లోకానికి వచ్చాడు.
➡ *B. దేవుని సమాధానం భూమి మీదకు వచ్చు విధానం:* ఆ కుమారుని బలియాగం ద్వార ఈ లోకంలో సమాధానం స్థాపించాలని దేవుని సంకల్పం. (కొలస్సయి 1:20 ఆయన సిలువరక్తము చేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో *సమాధానపరచు కొనవలెననియు* తండ్రి అభీష్టమాయెను.)
పుట్టిన శిశువు పాప క్షమాపణను సాధ్యం చేస్తూ మానవజాతి కోసం తన జీవాన్ని అర్పించాడు. ఎందుకంటె, మన సమాధానం రావడం కోసం ఆయన తనపై శిక్షను వేసుకున్నాడు. (యెషయా 53:5 మన యతిక్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్ట బడెను మన *సమాధానార్థమైన శిక్ష* అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.)
తన యొక్క శిలువ మరణం ద్వారా ఈ లోకంలో సమాధానం స్థాపించాడు. దేవునికీ, మనుషులకూ మధ్య మహా ఘనుడైన శాంతి దూత క్రీస్తు. (ఎఫెసు 2:14 ఆయన మన *సమాధానమైయుండి* మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.)
➡ *C. యేసు ద్వారా మాత్రమే నిజమైన శాంతి:* మనసులో, హృదయంలో శాంతిని ఇచ్చేవాడు ఆయనే. (యోహాను 14:27 శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీకనుగ్రహించు చున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడ నియ్యకుడి, వెరవనియ్యకుడి.)
అందుకే యేసు “సమాధానకర్తయగు అధిపతి” అని పిలువబడతాడని యెషయా ప్రవచించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో సమాధానం, పాపాలకు క్షమాపణ సాధ్యమవుతాయి. కానీ అలాంటి ఆశీర్వాదాలు వాటంతటవే రావు. దేవుని యొద్దకు రావాలి. (కొలస్సి 1:22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును *సమాధానపరచెను.*
➡ *D. ప్రభువు ఇచ్చు సమాధానం ఈ క్రింది విధానాల ద్వారా మనం పొందుకొనగలము.*
*🌟1. సువార్త ద్వారా సమాధానం:* దేవుని సువార్త వాక్యం మనకు సమాధానం ఇవ్వగలదు. అపొ కా 10:36 యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు *సమాధానకరమైన సువార్తను* ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఎఫెస్సి 2:17 మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
*🌟2. ప్రభువుకు ఇష్టులైన వారికి సమాధానం:* మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండుట వలన ఆయన సమాధానం పొందుకొనగలం. లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద *సమాధానమును* కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను;
*⭐3. విశ్వాసం ద్వారా సమాధానం:* రోమ 5:1 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.
*🌟4. ఏకమనస్సు వలన సమాధానం:* 2కొరి 13:11 తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సు గలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధాన ములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
*🌟5. పరిశుద్దాత్మతో కూడిన మనస్సు వలన సమాధానం:* ఆత్మ ఫలములో సమాధానము కూడా ఉన్నది కాబట్టి ఆత్మ ద్వార సమాధానం కలుగును. శరీరానుసారమైన మనసు మరణమైతే ఆత్మానుసారమైన మనస్సు సమాధానమని పౌలు భక్తుడు చెప్పుచున్నాడు. రోమా 8:6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును *సమాధానమునై* యున్నది.
*🌟6. నీతి వలన సమాధానం:* యెషయా 32:17 నీతి సమాధానము కలుగజేయును. కీర్తన 85:10 నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.
*🌟7. దేవుని సహవాసం వలన సమాధానం:* యోబు 22:21 ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును.
*🌟E. కుమారుని సమాధానం శాశ్వతమైనది:* ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. (యెషయా 9:7)
ప్రపంచానికి శాంతి ప్రబోధం కొరకు ఐక్యరాజ్యసమితి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఉపయోగం లేకుండా పోతోంది. కుమారుడు భూమిపై ప్రపంచవ్యాప్త, సుస్థాపిత, *శాశ్వత సమాధానాన్ని* నెలకొల్పుటకే ఈలోకానికి వచ్చాడు. కేవలం కుమారుని ద్వారా అనగా ఆయన ఇచ్చిన సువార్త ద్వారా మాత్రమే ప్రపంచానికి నిజమైన శాంతి సమాధానం దొరుకును.
ఒక్కసారి దేవుని సమాధానం పొందుకున్నామంటే, యుద్ధాలు చేయు కత్తులతో గాని ఈటెలతో గాని ఇక పని లేదు అనగా యుద్ధం అనేది ఇక రాదు. యుద్ధాలకు ఉపయోగించు కత్తులను, ఈటెలను వ్యవసాయ పనిముట్లు నాగటి నక్కులు గాను మచ్చుకత్తులు గాను మార్చబడును. (యెషయా 2:4 వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులు గాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.)
*🌟ముగిపు:* దేవుని సమాధానం కలిగినవారు రాజకీయ, ప్రాంతీయ, జాతిపరమైన లేక ఆర్థికపరమైన తేడాల మూలంగా ద్వేషాన్ని పెంచుకోవడం అనేది ఇక జరుగదు. వారు సంఘం లోపలా వెలుపలా తమ పొరుగువారితో సమాధానకరమైన సంబంధాలు కలిగివుండడానికి కృషి చేస్తారు.
పాపాత్మురాలైన స్త్రీ ప్రభువు పాదాల యొద్ద ప్రార్ధించి సమాధానం పొందుకున్నట్లుగా ఈ క్రిస్మస్ పర్వ దినాలలో కుమారునికి ప్రార్ధన చేద్దాం సమాధానం కలిగి ఉందాం. సమస్త జ్ఞానమునకు మించిన *దేవుని సమాధానము* ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలి యుండును గాక! ఆమెన్!
దైవాశ్శీసులు!
-
*✝చీకటిలోనడుచు జనులు గొప్పవెలుగును చూచిరి💥*
(క్రిస్మస్ సందేశాలు - 17)
Immanuel Bible College
NIDUBROLU, Guntur dt.
శుభోదయం!
_(యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు *గొప్ప వెలుగును* చూచుచున్నారు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద *వెలుగు* ప్రకాశించును.)_
*💥ఉపోద్ఘాతం:* యెషయా కాలంనాటి ప్రజలు భయంకరమైన అష్షూరు సైన్యాల చేతిలో బాధలు పడుచు మరణమనే చీకటిలో మ్రగ్గుచుండగా *గొప్ప వెలుగుగా* శిశువు అనుగ్రహింప బడుచున్నాడని ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయు చున్నాడు.
మరణపు చీకటిలో నడిచే ప్రజకు గొప్ప కాంతిగా మరణపునీడ ఉన్న దేశంలో నివసించేవారిమీద వెలుగుగా యేసు జన్మించాడు. కుమారుని రూపంలో *వెలుగు* ఈ లోకంలోకి వచ్చింది. (యోహాను 8:12 మరల యేసు నేను లోకమునకు *వెలుగును.*)
*కుమారుడు* లోకంలోని అన్ని జాతులను కూడా వెలిగించేందుకు వచ్చాడనేది స్పష్టం. యెషయా 42:7 *అన్య జనులకు వెలుగుగాను* నిన్ను నియమించి యున్నాను. సిమియోను ప్రవక్త కూడా ఇదే ప్రవచనాన్ని ఎత్తి పలికాడు. లూకా 2:30-31 అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు *వెలుగుగాను* నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
కాని *వెలుగైయున్న కుమారుని* నిరాకరించి అనేకులు చీకటి జీవితాలనే కోరుకోవడం విచారకరం. అది తీర్పునకు శిక్షకు దారి తీస్తున్నది. (యోహాను 1:5 ఆ *వెలుగు* చీకటిలో ప్రకాశించు చున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను).
వెలుగైన యేసును నిరాకరించి చీకటిలో జీవిస్తున్న వారికొరకు ఇప్పటికే ఈ తీర్పు సిద్ధంగా ఉన్నది. (యోహాను 3:19 ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు *వెలుగును* ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. యోహాను 3:18 విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.)
పాపవిముక్తి గురించిన అద్భుతమైన సత్యాలను *వెలుగైన యున్న కుమారుడు* ఈ లోకంలోకి తెచ్చాడు. కానీ మనుషులు ఆయన్ను గానీ ఆయన తెచ్చిన సత్యాన్ని గానీ ఇష్టపడలేదు. వారికి వేరొకటి ప్రీతిపాత్రంగా ఉంది. అదే పాపపు చీకటి.
చీకటి పాపానికి దాపరికానికీ కపటానికీ అజ్ఞానానికీ అసత్యానికీ దుర్మార్గతకూ సూచన. అలాంటి చీకటిని అంటే ఇష్టమున్న వారికి *వెలుగు* అంటే ఏమాత్రం పడదు. వారి స్థితిని ఉన్నదున్నట్టుగా ఆ వెలుగు బయటపెడుతుంది. అంతేగాక వారు చేయడానికి ఇష్టపడే చెడు కార్యాల్లో మునిగి తేలుతూ ఉండకుండా వెలుగు అడ్డుపడుతుంది.
అందువల్ల వెలుగంటే వారికి ద్వేషం. అంటే వారు క్రీస్తునూ, ఆయన సత్యాన్నీ ద్వేషిస్తున్నారు. యేసు అనేకసార్లు చెప్పిన గంబీర సత్యమిది. యోహాను 7:7; 15:18,23–25).
మనుషులలోని అపనమ్మకానికి కారణమైన వారి పాపం, చీకటి కారణంగానే వారు యేసుని నమ్మరు. అందువలన ఈలోకానికి వెలుగు యొక్క ప్రాముఖ్యత తెలియాలి. వారు నరకానికి పాత్రులైన పాపులనీ, క్రీస్తు మాత్రమే వారిని మరణపు చీకటి నుంచి తప్పించగలడని వారికి మనమే తెలియజేయాలి. అది ఎలాగు?
*కుమారుడు* అనబడిన వెలుగును స్వీకరించి వెలిగించబడిన హృదయాలు గలిగిన మనము ఆ వెలుగును మనలోనే దాచుకోకుండా *మనుష్యులందరి యెదుట ప్రకాశింప జేయాలి*. సువార్త వెలుగును అనేకులకు చాటాలి.
దానికి సాదృశ్యంగానే దేవుని బిడ్డలైన వారు క్రీస్తు తమ హృదయాల్లోనూ తమ జీవితాల్లోనూ వెలుగుగా ఉన్నాడని ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ రోజున మన ఇండ్లను మందిరాలను వెలుగుతోను నక్షత్రాల వెలుగుతోను సంఘంలో క్రొవొత్తుల వెలుగుతోను *అన్య జనుల ఎదుట ప్రకాశింప జేస్తాము.* ఇదే క్రిస్మస్ లైట్ల వెనుక ఉన్న ఆత్మీయ భావం. దీనిని కేవలం ఆత్మీయంగా తీసుకోవాలిగాని ఇది ఒక అన్యజనుల ఆచారంగా భావించకూడదు.
వెలుగు యొక్క ఆత్మీయ భావాన్ని గురించి మరికొన్ని విషయాలు పరిశీలిద్దాం.
*💥1. వెలుగు సత్క్రియలను తెలియజేస్తున్నది:* మత్తయి 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట *మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.*
క్రైస్తవులైనవారు తమలోని క్రీస్తు వెలుగును ఆత్మీయంగా ప్రకాశింపజేసి అనేకులను తమ సత్క్రియల ద్వారా ప్రభువు వైపునకు అనగా సంఘం లోనికి నడిపించాలి. వెలిగింపబడిన జక్కయ్య సత్క్రియలు చేశాడు.
*💥2. వెలుగు సంతోషాన్ని తెలియజేస్తున్నది:* ఇది ప్రజలందరికి కలుగు మహా *సంతోషకరమైన* సువర్తమానం అని దూత పలికింది. మనసుకు *సంతోషాన్ని* సమాధానాన్ని ప్రశాంతతను వెలుగు ఇస్తుంది. అనేకులకు క్రిస్మస్ సంతోషాన్ని పంచాలి.
లూకా 2:9-10 ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; యెషయా 60:1 నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను
*💥౩. వెలుగు సత్యాన్ని తెలియజేస్తున్నది:* చీకటిలో సరైన వాస్తవం తెలియక మార్గం తెలియక పాపాంధకారంలో కొట్టుమిట్టాడుతూ మ్రగ్గుతున్న సర్వమానవుల కొరకు పరలోక మహిమ అయిన కుమారుడు ఈలోకానికి నిజమైన వెలుగుగా దిగివచ్చాడనే విషయం మనం తెలియజేస్తున్నాము. కీర్తన 43:3 నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును.
ఈలోకంలో అనేక వెలుగులు ఉన్నాయి కాని నిజమైన వెలుగు యేసే. ఆయన మాటలే సత్యం. కీర్తన 119:105 నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. యెషయా 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును
*💥4. వెలుగు నీతిని పరిశుద్దతను తెలియజేస్తుంది:* (సామెతలు 13:9 నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును. సామెతలు 4:18 పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును)
చీకటిని వెలుగు పారద్రోలినట్లు మనలో ఉన్న పాపాన్ని క్రీస్తు తన వెలుగు ద్వారా పారద్రోలినప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి క్రీస్తు పరిశుద్ధతతో మన హృదయం నింపబడుతుంది.
*💥5. వెలుగు మనోహరమైనది గనుక అనేకులను ఆకర్షించునది:* వెలుగు అనేకులను ఆకర్షించును. ఇది క్రైస్తవ ప్రేమను తెలియజేయు చున్నది. (ప్రసంగి 11:7 వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగా నున్నది.) నీతి సూర్యుడైన కుమారుడు మనోహరమైన వాడు. ఆయన తన వెలుగు అనే ప్రేమ ద్వారా అనేకులను ఆకర్షిస్తున్నాడు. అయితే త్వరలోనే చీకటిదినాలు కారు మేఘాలు కమ్ముకోబోతున్నాయి, (వచనం 8). దేవుని తీర్పు వస్తుంది. కృపాకాలం అంతరించ బోతోంది.
క్రైస్తవులైన వారు తమ మనోహరమైన క్రైస్తవ ప్రేమ ద్వారా అనేకులను ప్రభువు దగ్గరకు ఆకర్షించాలి. 1 యోహాను 2:10 తన సహోదరుని *ప్రేమించువాడు వెలుగులో* ఉన్నవాడు; మత్తయి 5:14 మీరు లోకమునకు వెలుగైయున్నారు.
*💥6. వెలుగు జీవమై యున్నది:* అనగా వెలుగు బ్రతికించునది. వెలుగు లేక పోతే సర్వసృష్టికి మరణమే. క్రైస్తవుల కుటుంబాలు, సంఘాలు *జీవముతో* నింపబడియున్నవి. (యోహాను 8:12 మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగి యుండునని వారితో చెప్పెను.)
కుమారుడైన యేసు ద్వారానే మనుషులు జీవాన్ని పొందగలరు. దేవుని జీవాన్ని వెలుగును రూపంలో మనుష్యులకు తెచ్చినది కుమారుడైన యేసు ప్రభువే. నీ వాక్యం నన్ను బ్రతికించునది అని కీర్తనాకారుడు అంటున్నాడు కదా! (యోహాను 1:4 ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.)
*💥7. వెలుగు అక్షయత భాగ్యాన్ని తెలియ జేస్తున్నది:* వెలుగు అక్షయతను చూపుచున్నది. (2 తిమోతి 1:10 ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును *అక్షయతను సువార్తవలన వెలుగులోనికి* తెచ్చెను)
అంతేకాకుండా దేవుడు ఎలా మానవుడయ్యాడో ఎలా పాప పరిహారం చేసి సర్వ మానవులకు పరలోక నిత్యజీవం అనే భాగ్యాన్ని కలుగజేయుటకు సృష్టికర్త ఎలా బాలుడు అయ్యాడు, ఎలా ఆయన ధనవంతుడు అయినప్పటికిని, మన కోసం ఆయన ఎలా దరిద్రుడయ్యాడో, ఆయన పేదరికము ద్వారా మనం ఎలా ధనవంతులుగా అవడానికి ఆయన ఈలోకంలో జన్మించాడు.
ఈ వెలుగులోనికి వచ్చిన వారందరూ, పరలోక అక్షయతను పొందుకుంటారు. (2 కొరి 8:9)
*💥ముగింపు:* యేసు జన్మించినప్పుడు పుట్టిన నక్షత్రం, ప్రకాశించు యేసు మహిమకు అది జ్ఞాపకంగా ఉన్నది. కుమారుడైన యేసు ఎవరి హృదయాలలో జన్మించాడో వారు నిజంగానే వెలుగుతో కూడిన భాగ్యవంతులు.
క్రైస్తవ జీవితాల్లోని వెలుగు పరలోక మహిమను పోలి ఉండాలి. క్రిస్మస్ వెలుగుల ద్వారా ఆత్మీయ ప్రేరణ పొంది పూర్ణ హృదయంతో సంతోషంగా యేసు దేవునికి క్రిస్మస్ ఆరాధన చేయాలి. వెలిగింపబడిన వారముగా అనేకులను మన సంఘాల్లోకి వెలుగులోనికి నడిపించాలి. అటువంటి కృపను ప్రభువు మనకు సమృద్ధిగా ఈ క్రిస్మస్ దినాలలో దయచేయును గాక! ఆమెన్!!
దైవాశ్శీసులు!
-
*✝దయాప్రాప్తురాలా! నీకు శుభము🧚♂*
(క్రిస్మస్ సందేశాలు - 18)
Immanuel Bible College
NIDUBROLU, Guntur dt.
శుభోదయం!
_(లూకా 1:28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి *దయాప్రాప్తురాలా* నీకు శుభము)_
*⭐ఉపోద్ఘాతం:* దేవదూత అయిన గబ్రియేలు మరియ దగ్గరకు వచ్చి అప్పటివరకు ఎవరూ సంబోధించని విధంగా సంబోధిస్తూ ఇలా అన్నాడు: *‘దయాప్రాప్తురాలా, నీకు శుభము.* ప్రభువు నీకు తోడైయున్నాడు.’
ఆయన మరియను “దయాప్రాప్తురాలా” అని సంబోధించినప్పుడు, ఆమె “బహుగా తొందరపడి” ఈ కొత్త సంబోధన ఏమిటా అని ఆశ్చర్యపోయింది. (లూకా 1:29, 30) ఇంతకీ ఆమె ఎవరి దయను పొందింది? మనుషుల దయనైతే ఆమె ఆశించలేదు. నిజానికి, దేవదూత మాట్లాడింది దేవుని దయ గురించి. మరియ దేవుని దయను పొందాలని కోరుకుంది. దేవుని దయను పొందిన మరియ దేవదేవునికే తల్లిగా మారే గొప్ప భాగ్యం పొందింది.
దేవుడు ఎవరిమీద తన దయను చూపుతాడు. దేవుని దయను పొందుకోవడానికి మరియకున్న కొన్ని అర్హతలు గురించి ధ్యానం చేద్దాం.
*🧚♂1. మరియ దీనురాలుగా ఉన్నది:* (లూకా1:47 ఆయన తన దాసురాలి *దీనస్థితిని* కటాక్షించెను. దీనురాలు అనగా వినయ విధేయతలు గల స్త్రీ అని అర్ధం. ఆమె ప్రభువు మాటలకు విధేయత చూపినది కనుక ఆమె దేవుని దయను పొందుకున్నది. ఆమెకున్న వినయాన్ని బట్టే దేవుని చేత బహుగా హెచ్చించబడినది. (సామెతలు 18:12 ఘనతకు ముందు వినయముండును.)
కోటానుకోట్ల మంది స్త్రీలలో ఎవరికీ దక్కని భాగ్యం, దేవుని దయ మరియకు దక్కింది. మరియ స్థానంలో వేరొకరు ఉంటే తప్పక గర్వించేవారు. కాని తన మీద దేవుని దయ ఉందని తెలిసికూడా మరియ గర్వించలేదు. మనం కూడా దేవుని దయ కోసం కృషిచేయాలి కానీ, అది మనమీద ఉందని తెలిసికొనినప్పుడు గర్వించకూడదు అని మరియ ఉదాహరణ మనకు నేర్పిస్తోంది.
దేవుడు గర్విష్ఠులను లేదా అహంకారులను దూరంగా ఉంచుతాడు. దీనులను, వినయస్థులను ప్రేమిస్తాడు, వాళ్లకు సహాయం చేస్తాడు. (యాకో 4:6 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును. లూకా 1:52 సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి *దీనుల* నెక్కించెను)
*🏵2. మరియ పరిశుద్ధురాలు:* (లూకా 1:34 అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే.) మరియ దేవుని దయను పొందుకోవడానికి గల రెండవ కారణం ఆమె యొక్క పరిశుద్ధమైన జీవితం.
మన ప్రభువు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడ బడుచున్నవాడు. కనుక పరిశుద్ధత లేకుండా ఎవరుకూడా ప్రభువును చూడలేరని పౌలు భక్తుడు చెప్పుచున్నాడు. (హెబ్రీ 12:14 పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు.)
ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉన్నపుడే దేవుని దయను పొందుకొనగలం. 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది 16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి.)
*🏵3. మరియ ప్రభువును ఘనపరచినది:* మరియ ఎల్లవేళలా ప్రభువును స్తుతించి ఘనపరచే స్త్రీగా ఉన్నది. (లూకా 1:46 నా ప్రాణము ప్రభువును *ఘనపరచుచున్నది.*)
ఎవరైతే ప్రభువును ఎల్లవేళలా స్తుతించి కీర్తించి ఘనపరుస్తారో వారు దేవుని దయను పొందుకుంటారు. మరియ దేవుని ఎంతో అద్భుతంగా ఘనపరచినది.
లూకా 1:46-55 భాగాన్ని *మరియ కీర్తన* అని అంటారు. (మాగ్నిఫికాట్ -The Magnificat - known as the Song of Mary)
ఎంతో రమ్యమైన చక్కని కావ్య భాషలో మరియ పలికిన మాటలు దేవుని గురించి ఆమెకున్న జ్ఞానాన్నీ, ప్రేమనూ, ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించే ఆమె యొక్క సామర్థ్యాన్ని వెల్లడి చేస్తాయి. అందువల్లే ఆమె దేవుని దయను పొందుకుని రక్షకునికే తల్లి అయ్యే భాగ్యం పొందుకున్నది.
దేవుని దయను పొందుకోవాలంటే హృదయపూర్వకంగా ప్రభువును ఘనపరచాలి. కొంతమంది కేవలం పైపైనే పెదవులతో ఘనపరుస్తారు గాని వారి హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి.
అందుకే విచారకరంగా మనలో అనేకులు దేవుని దయను పొందుకోలేక పోతున్నారు. (యెషయా 29:13 ప్రభువు ఈలాగు సెలవిచ్చి యున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు.)
*🏵4. మరియ వాక్యానికి లోబడినది:* (లూకా 1:38 నీ *మాట చొప్పున* నాకు జరుగును గాక అనెను.) తన పట్ల దేవుని సంకల్పానికి మరియ పూర్తిగా తల వంచింది. అనగా దేవుని వాక్యానికి పూర్తిగా లోబడినది.
ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో వారు దేవుని దయను పొందుకుంటారు. “నీమాట చొప్పున వలలు వేస్తున్నాము అని దేవుని మాటకు లోబడి వలలు వేసిన శిష్యులు వలలు పిగులునట్లు దేవుని దయను పొందుకున్నారు.
దేవుని మాటకు లోబడి రాతి బానల్లో అంచులు మటుకు నీరు నింపిన కానా పెండ్లివారు దేవుని దయను పొందుకొని వారి జీవితాలలో దేవుని *మధురమైన* అధ్బుత కార్యాన్ని అనుభవించ గలిగారు.
*🏵5. మరియ ప్రభువుకు దాసురాలుగా ఉన్నది:* (లూకా 1:38 అందుకు మరియ ఇదిగో ప్రభువు *దాసురాలను*) దాసురాలు అనగా బానిస. ప్రభువును తన యజమానిగా భావించినది.
అవును! ప్రభువు మన యజమాని. ప్రభువుకు దాసులము అని ఎవరైతే భావిస్తారో వారు మాత్రమే దేవుని దయను పొందుకుంటారు.
అందుకే పౌలు ఎప్పుడు తనను తాను క్రీస్తు దాసుడను అని తన పత్రికల్లో వ్రాసుకున్నాడు గనుక పౌలు దేవుని దయను పొందుకొని గొప్ప అపోస్తలుడుగా మారి అద్భుతమైన సేవ చేయ గలిగాడు. (రోమా 1:1 యేసు క్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును...)
ప్రభవు చిత్తం లేనిదే ఏది కూడా మనం చేయకూడదు. అప్పుడే మనం దేవుని దయను మరియ మాదిరిగా పొందుకొనగలం.
*🏵6. ప్రభువును రక్షకునిగా స్వీకరించినది:* (లూకా 1:48 నా ఆత్మ *నా రక్షకుడైన* దేవుని యందు ఆనందించెను.) తాను పాపినని తన జీవితానికి రక్షకుడు అవసరమని ఆమె గ్రహించినది. అందువలనే ఆమె దేవుని దయను పొందుకున్నది.
ఎవరైతే తమ పాపములకు పశ్చాతాపపడి యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే దేవుని దయను పొందుకొనగలరు.
*🏵7. మరియ దేవుని కార్యాలపై సాక్ష్యం చెప్పినది:* (లూకా 1:49 సర్వశక్తిమంతుడు నాకు *గొప్పకార్యములు* చేసెను) దేవుడు చేసినది గొప్ప కార్యమని ధృఢముగా నమ్మినది కనుకనే సాక్ష్యం చెప్పగలిగింది. గొప్ప కార్యాలను మరియ తన జీవితంలో చూడగలిగినది.
నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని వాక్యం చెప్పుచున్నది. మరియ మాదిరిగా ఎవరైతే ప్రభువు యెడల ధృడమైన నమ్మకముంచి దేవునికి సాక్షులుగా ఉంటారో వారే దేవుని దయను పొందుకుంటారు.
ఈ దినాల్లో దేవుని మేలులు పొందుకునే వారు ఉన్నారు కాని ఆయన చేసిన కార్యాల గురించి సాక్ష్యాలు చెప్పేవారుగాని సాక్షులుగా జీవించేవారుగాని లేకుండా పోతున్నారు.
*🏵ముగింపు:* బైబిల్లో మరియ గురించి ఎక్కువ వివరాలు లేక పోవడం, ఆమె నేపథ్యం గురించి, వ్యక్తిత్వం గురించి బైబిలు అంతగా ఏమీ చెప్పక పోవడం, ఆమె రూపం గురించైతే అసలేమీ మాట్లాక పోవడం ఎంతో ఆశ్చర్యకరం. కాని ఆమె దేవుని కృప పొందుకుని స్త్రీలలో ఆశీర్వదింపబడినదిగా కనబడుచున్నది. (లూకా 1:30 దూత మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి లూకా 1:42 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు.)
ప్రపంచ వ్యాప్తంగా ఆమె పేరు ఆశీర్వదించబడినది. కోట్లమంది స్త్రీలు “మరియమ్మ” అని, మేరీ అని పేరు గలిగి దీవించబడ్డారు. ఈ పేరుకు అంత ఘనత రావడానికి కారణం యేసు తల్లి మరియ.
ప్రభువు మరియను ఒక గొప్ప సాధనంగా వాడుకొని ఆమెను ధన్యురాలను చేశాడు. ఆమె జీవితం స్త్రీలైన వారికి ఎంతో ఆదర్శం. ఆమెవలె మనమందరం దేవుని ప్రియబిడ్డలగా ఉండి దేవుని అపారమైన దయ పొందుకొనే కృపను ఆత్మదేవుడు మనకు సమృద్ధిగా దయచేయును! ఆమెన్!
దైవాశ్శీసులు!
-
*✝మరియ ధైర్యం ఓర్పు🧚♂*
(మరియ – 2వ భాగం)
(క్రిస్మస్ సందేశాలు – 19)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(మత్త 1:18 మరియ యోసేపుకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.)_
*🔯ఉపోద్ఘాతం:* దేవుని దయను పొందుకోవడానికి మరియకున్న అర్హతలు మనం ధ్యానిస్తున్నాం. నిన్నటి దినం మరియ దీనురాలని, పరిశుద్దురాలని, మరియ ప్రభువును ఘనపరచినదని, మరియ వాక్యానికి లోబడినదని, మరియ ప్రభువుకు దాసురాలుగా ఉన్నదని, మరియ ప్రభువును రక్షకునిగా నమ్మినదని మరియు దేవుని కార్యాలపైన సాక్ష్యం చెప్పినదాని నేర్చుకున్నాం. మరియ గురించిన మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం.
*🔯8. మరియ ధైర్యం:* (మత్త 1:18 మరియ యోసేపుకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.) మరియ గురించి తెలిస్తే యోసేపు ఏమంటాడు? తాను గర్భవతి ఉండడం సమాజపరంగా మరియకు కూడా బాధగా ఇది దేవుని విషయం కనుక ఆమె ధైర్యంగా ముందుకు వెళ్ళింది.
మరియ తాను గర్భవతనే విషయం నలుగురికీ తెలిసేదే అయినా ధైర్యంగా ఉన్నది. ముఖ్యంగా యోసేపుకు ఈ విషయం తప్పక తెలియవలసి యున్నది. అయినా మరియ ఎంతో ధైర్యంగా తన గురించి యోసేపు ఏమనుకున్నా ఫర్వాలేదని ధైర్యంగా ఉన్నది.
అయితే మర్యాదస్థుడు, భక్తిపరుడు అయిన యోసేపు చాలా కలవరపడ్డాడు. ఆయన స్థానంలో ఎవరున్నా అలాగే స్పందిస్తారు. ఆమె తనను మోసం చేసిందేమోనని మనసులో ఎక్కడో సందేహం. యోసేపు ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఆ కాలంలో పెళ్లి నిశ్చయమైతే దాదాపు పెళ్లి అయిపోయినట్లే పరిగణించేవాళ్లు. మరియ నలుగురిలో నవ్వులపాలు కావడం, ఆమెకు మచ్చరావడం యోసేపుకు ఇష్టంలేదు, అందుకే గుట్టుచప్పుడు కాకుండా ఆమెను వదిలేయాలని అనుకున్నాడు. (మత్త 1:19 ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచ నొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను)
*🔯9. దైవ సహాయం కొరకు మరియ ప్రార్ధన:* కష్ట సమయంలో ప్రార్ధన చేస్తే దేవుడు సహాయం చేయువాడని మరియకు తెలుసు. ఈ విషయం మరియ మాటల్లోనే మనం వినగలం. (లూకా 1:55 54-55. అబ్రాహాముకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు *సహాయము చేసెను.*)
మరియను విడిచిపెట్టకుండా యోసేపు సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభువు సహాయం చేశాడు. దేవుని దూత ఆయనకు కలలో కనిపించి మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని చెప్పాడు.
మరియ ఎప్పుడూ ప్రభువు నిర్దేశానికే కట్టుబడింది, ఇప్పుడు యోసేపు కూడా మరియ బాటలోనే నడిచాడు. ఆయన ఆమెను భార్యగా స్వీకరించాడు, దేవుని కుమారుని గురించిన శ్రద్ధ తీసుకునే అతి ప్రత్యేకమైన బాధ్యతను చేపట్టడానికి సిద్ధపడ్డాడు.—మత్త. 1:20-24.
*🔯10. మరియ ఓర్పు:* తన గర్భం గురించి మరియ యోసేపుకు చెప్పిన విషయాల్ని మొదట్లో అర్థం చేసుకోవడం యోసేపుకు కష్టమైంది.
అయినా, యోసేపు తనకు కాబోయే భర్త కాబట్టి ఆయన సరైన నిర్ణయం తీసుకునేంతవరకు మరియ ఎంతో సహనంతో ఓపిగ్గా వేచివుంది.
జీవితంలో క్లిష్టమైన సమయంలో అలా ఓపిక చూపించడం ఎంత అవసరమో మరియను బట్టి మనం నేర్చుకోవాలి. నేటి క్రైస్తవ స్త్రీలకు కూడా ఇది ఒక మంచి పాఠం. (రోమీయులకు12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.)
*🔯11. ప్రభుత్వ ఆజ్ఞకు లోబడిన మరియ:* కైసరు ప్రభుత్వం జారీచేసిన ఆజ్ఞ ప్రకారం యోసేపు, మరియలు కాకుండా దేశంలోని ప్రజలందరూ తమ సొంతూళ్లకు వెళ్లి, పేర్లు నమోదు చేయించుకోవాలని పరిస్థితి ఏర్పడింది. తాను నిండు గర్భిణిగా ఉన్నాగానీ ప్రభుత్వ ఆజ్ఞకు మరియ లోబడినది.
యోసేపు మరియలు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవారు గనుక గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లాలి. కైసరు ఆ సమయంలో ఆ ఆజ్ఞను జారీచేయడం అనుకోకుండా జరిగింది కాదు. ఇది ఒక ప్రవచనం నెరవేర్పు.
మెస్సీయ బేత్లెహేములో పుడతాడని దాదాపు ఏడువందల సంవత్సరాల ముందే బైబిలు చెప్పింది. నజరేతుకు కేవలం 11 కి.మీ. దూరంలో ఒక బేత్లెహేము పట్టణం ఉంది. కానీ, మెస్సీయ “బేత్లెహేము ఎఫ్రాతా” అనే గ్రామం
లో పుడతాడని ప్రవచనం స్పష్టంగా చెప్పింది. (మీకా 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. )
*🔯12. భర్త శిరస్సత్వానికి లోబడిన మరియ:* కైసరు జారీచేసిన ఆజ్ఞను పాటించాలని భర్త తీసుకున్న నిర్ణయానికి మరియ మద్దతు ఇచ్చింది. మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు యోసేపు వెళ్లాడని బైబిలు చెబుతోంది. (లూకా 2:4,5 యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను.)
యోసేపు భార్య అయ్యాక మరియ తీసుకున్న నిర్ణయాల్లో పెద్ద మార్పు వచ్చింది. ఆమె తన భర్త శిరస్సత్వానికి లోబడింది, ఆయన నిర్ణయాలను గౌరవిస్తూ మంచి సహకారి అనిపించుకుంది (ఎఫెసీ 5:23,24 క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.)
*🔯ముగింపు:* మరియ తన జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద విశ్వాస పరీక్ష గురించి ఇంకా మరియ గురించిన మరికొన్ని విషయాలు రేపటి దినం ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్!
(To be continued..)
దైవాశ్శీసులు!
-
*✝మరియ ఎదుర్కొన్న విశ్వాస పరీక్ష🧚♂*
(మరియ – 3వ భాగం)
(క్రిస్మస్ సందేశాలు – 20)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(లూకా 2:5,6 గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను..)_
*🔯ఉపోద్ఘాతం:* మరియ తన జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద విశ్వాస పరీక్ష గురించి ఇంకా మరియ గురించిన మరికొన్ని విషయాలు ఈ దినం ధ్యానం చేద్దాం.
*🔯13. ప్రభువు కొరకు గొప్ప విశ్వాసపరీక్షను ఎదుర్కొన్న మరియ:* ఈ ప్రయాణం మరియ విశ్వాసానికే పరీక్ష. నిండు గర్భిణిగా ఉండి బేత్లెహేముకు ప్రయాణించడం అంత సులువైనదేమీ కాదు. నజరేతు నుండి ఈ చిన్న గ్రామానికి చేరుకోవడానికి కొండలు దాటి, సమరయ మీదుగా దాదాపు 130 కి.మీ. ప్రయాణించాలి. యోసేపు మరియలు వెళ్లాల్సింది కూడా ఈ బేత్లెహేముకే. ఎందుకంటే ఇది దావీదు రాజు పూర్వీకుల సొంతూరు. యోసేపు, ఆయన భార్య కూడా దావీదు కుటుంబానికి చెందినవాళ్లే.లూకా 2:1-5.
జనాభా లెక్కల కొరకు మరియ బెత్లెహేముకు ప్రయాణం ఎంతో కష్టంగా ఉన్నగాని హృదయ పూర్వకంగా సిద్దపడినది. ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రయాణం చేయడం మామూలు విషయం కాదు. పైగా అది చలికాలం కాలం. అదీకాక ‘గలిలయ నుండి’ బేత్లెహేముకు వెళ్లాలంటే ఎన్నో రోజులపాటు చాలా కష్టపడి ప్రయాణించాలి, పైగా బేత్లెహేము 2,500 కన్నా ఎక్కువ అడుగుల ఎత్తులో ఉంది. మరియ నిండు గర్భిణి కాబట్టి ఎన్నోసార్లు ఆగి ఆగి ప్రయాణించాల్సి వస్తుంది. దానివల్ల, మామూలు కన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు.
*🔯14. ప్రసవదినాలు నిండినా లెక్కచేయని మరియ:* మరియకు నెలలు నిండాయి. మరియ పరిస్థితిని వర్ణిస్తూ ఆమె *‘నిండు గర్భిణి’* అని బైబిలు స్పష్టంగా చెబుతోంది. (లూకా 2:6 వారక్కడ ఉన్నప్పుడు ఆమె *ప్రసవదినములు నిండెను*)
మొదటిసారి గర్భం ధరించిన ఏ స్త్రీయైనా నెలలు నిండి, పురిటినొప్పులు మొదలయ్యే సమయానికి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటుంది. అక్కడైతే తనకు సహాయం చేయడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ దగ్గరుంటారు. కానీ అందరిని విడిచి ప్రసవ దినాలు నిండినా తన వెంట స్త్రీ సహాయకులు ఎవరు లేకున్నా వీటన్నిటిని లెక్కచేయక పోవడం చూస్తే, ఈ ప్రయాణానికి సిద్ధపడేందుకు మరియకు చాలా ధైర్యమే కావాలి.
మరియ భారంగా ఎన్నో గంటల కొలది గాడిద మీద కూర్చొని ప్రయాణం చేసింది. ఆమె సుదూరాన ఉన్న బేత్లెహేముకు వెళ్తోంది. భర్త యోసేపు దారి చూపిస్తూ ఆమె ముందు నిదానంగా నడుస్తున్నాడు. నెలలు నిండిన వారికి గర్భంలోని శిశువు కదులుతాడు. ఇది మరొక బాధ.
పొలాల వెంబడి వెళ్తున్న ఈ జంటను, పొలం పనులు చేసుకుంటున్న కొంతమంది రైతులు చూసి, ఇలాంటి స్థితిలో ఈమె ఎందుకు ప్రయాణం చేస్తుందా అని అనుకొనివుంటారు.
*🔯15. ప్రవచన నెరవేర్పు కొరకు సహాయపడిన మరియ:* మరియ తన సొంతూరు నజరేతు నుండి ఇంతదూరం ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది? యూదురాలైన ఈ యువతి కొన్ని నెలల క్రితం, మానవ చరిత్రంతటిలో ఎవ్వరూ పొందని ఒక ప్రత్యేకమైన బాధ్యతను పొందింది.
రాబోయే మెస్సీయకు అంటే దేవుని కుమారునికి సమస్త జనుల రక్షకునికి ఆమె జన్మనివ్వాల్సి వుంది. (లూకా 2:30,31,32 అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను 31.నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన 32.నీ *రక్షణ* నేను కన్నులార చూచితిని. )
నెలలు నిండే సమయానికి ఆమె ఇలా బయలుదేరాల్సి వచ్చింది. ఆ బాధ్యత నెరవేరుస్తున్నప్పుడు మరియ విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి దేవుని వాక్యం ఆమెకు సహాయం చేసింది. యోసేపుతో కలిసి బేత్లెహేముకు వెళ్లడానికి మరియను దేవుని వాక్యమే కదిలించింది.
*🔯16. వాక్యానికి విధేయత చూపడంలో మరియ ఆదర్శం:* మెస్సీయ బేత్లెహేములో పుడతాడని ప్రవచనం చెబుతున్నట్లు మరియకు తెలుసు. ఎందుకంటే అది అప్పటి ప్రధానయాజకులకు, శాస్త్రులకే కాదు సాధారణ ప్రజలకు కూడా తెలిసిన విషయమే. (మత్త. 2:1-7; యోహా. 7:40-42) పైగా, మరియకు లేఖనాలు బాగా తెలుసు. (లూకా 1:46-55)
👉తన భర్తకు లోబడి ప్రయాణించినా,
👉ప్రభుత్వాజ్ఞకు లోబడి ప్రయాణించినా,
👉 ప్రవచన నెరవేర్పు కోసం ప్రయాణించినా,
లేక ఈ మూడు కారణాలనుబట్టి ప్రయాణించినా ఆమె చక్కని ఆదర్శంగా నిలిచింది. వినయ విధేయతలు చూపించే స్త్రీపురుషులకు ప్రభువు చాలా విలువిస్తాడు. విధేయత అనే లక్షణాన్ని చాలా చిన్నచూపు చూసే ఈ రోజుల్లో, మరియ ఆదర్శం మనకు చక్కని ప్రోత్సాహాన్నిస్తుంది.
*🔯17. శ్రేష్టమైన దానిని ఆశించని మరియ:* దేవుని కుమారునికి జన్మనిస్తూ కూడా మరియ ఏ గొప్పవాటిని ఆశించలేదు. తమ పూర్వీకులు నివసించిన ఆ చిన్న గ్రామానికున్న గొప్ప చరిత్ర యోసేపు మరియలకు ప్రేరేపణగా నిలిచి నడిపించింది. కొండ ప్రాంతాల మీదుగా, ఒలీవ తోటల గుండా ప్రయాణిస్తూ మరియ, యోసేపులు తమ పూర్వీకుల చిన్న గ్రామం గురించిన ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకున్నారు.
మీకా ప్రవక్త చెప్పినట్లే యూదా పట్టణాల్లో అది అంత ప్రముఖమైనదేమీ కాదు. కానీ వెయ్యి కంటే ఎక్కువ సంవత్సరాలకు ముందు బోయజు, నయోమి, ఆ తర్వాత దావీదు అక్కడే పుట్టారు.
*🔯18. స్థలము దొరకని యోసేపు మరియలు:* మరియ, యోసేపులు అక్కడికి చేరుకుని గ్రామమంతా జనంతో క్రిక్కిరిసిపోయి వుండడం చూశారు. చాలామంది పేర్లు నమోదు చేసుకోవడానికి వీళ్లకంటే ముందే రావడంతో వీళ్లకు సత్రంలో స్థలం దొరకలేదు. (లూకా 2:7 తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, *సత్రములో వారికి స్థలము లేనందున* ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.)
ఆ రాత్రికి వాళ్లు ఉండడానికి ఎక్కడా స్థలం దొరకకపోవడంతో పశువుల పాకలో ఉండాల్సి వచ్చింది. తన భార్యకు కలిగిన అసౌకర్యాన్ని చూసి యోసేపు ఎంతో బాధపడుతూ ఉంటాడో ఒకసారి ఊహించండి. జీవితంలో ఇప్పటివరకు ఆమె అలాంటి బాధ ఎరుగదు. ఆమె ఇబ్బంది ఇంకాస్త ఎక్కువై, అనువుగానిచోట ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి.
*🔯19. తొలిచూలి కుమారునికై ప్రసవ వేదన పడిన మరియ:* మరియ పరిస్థితిని ఏ స్త్రీయైనా అర్థంచేసుకోగలదు. వారసత్వంగా వచ్చిన పాపాన్ని బట్టి, బిడ్డను కనే సమయంలో స్త్రీలందరూ ప్రసవవేదన పడతారని అప్పటికి దాదాపు 4,000 సంవత్సరాల పూర్వమే దేవుడు చెప్పాడు. (ఆది. 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు.)
మరియ ప్రసవవేదన పడలేదని అనడానికి ఎలాంటి ఆధారం లేదు. ఆమె పడిన వేదన గురించి లూకా చెప్పలేదు, కానీ ఆమె ‘తన తొలిచూలు కుమారుని కన్నది’ అని మాత్రమే చెప్పాడు. (లూకా 2:7) మరియకు పుట్టిన పిల్లలందరిలో ఈయన “తొలిచూలు” కుమారుడు. ఆ తర్వాత ఆమెకు కనీసం ఏడుగురు పిల్లలు పుట్టారు. (మార్కు 6:3) ఈ బిడ్డ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైనవాడే. ఈయన మరియకు మాత్రమే మొదటి కుమారుడు కాదు యెహోవా దేవుని “సర్వసృష్టికి ఆదిసంభూతుడు,” ఆయన అద్వితీయ కుమారుడు.—కొలొ. 1:15.
*ముగింపు:* మరియ గురించిన మరికొన్ని విషయాలు రేపటి దినం ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్!
దైవాశ్శీసులు!
-
*✝పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువు🛐*
(మరియ – 4వ భాగం)
(క్రిస్మస్ సందేశాలు – 21)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(లూకా 2:7 తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.)_
*🔯ఉపోద్ఘాతం:* పొత్తిగుడ్డలతో చుట్టబడిన దేవుని రక్షణ బహుమానం. పశువుల పాకలో ఉండగా మరియ ఒక మగ శిశువును ప్రసవించింది. ఈయన ఆమె మొదటి కుమారుడు. వాళ్ళకు సత్రంలో గది దొరకనందువల్ల ఆమె ఆ పసివాణ్ణి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో ఉంచింది.
పశువుల తొట్టి అంటే పశువులు తినడానికి మేతవేసే గోలెం. దేవుని నిమిత్తం మరియ కుటుంబం పశువుల పాకలో బసచేసింది. ఆనాడే గానీ, ఈనాడే గాని పశువుల పాక అంటే స్వచ్ఛమైన గాలి, శుచిశుభ్రత లేని స్థలమని మనం చెప్పాలి. మరో అవకాశం గనుక ఉంటే, ప్రసవానికి ఇలాంటి చోటును ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. మరియ గురించిన మరికొన్ని విషయాలు ఈ దినం ధ్యానం చేద్దాం.
*🔯20.తొలిచూలి కుమారుని విషయమై శ్రద్ధ చూపించిన మరియ:* సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు శ్రేష్ఠమైన దాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. అలాంటిది, దేవుని కుమారునిగా పుట్టిన తమ బిడ్డకు మరియ యోసేపులు శ్రేష్ఠమైనదాన్ని ఇవ్వాలని ఇంకెంత కోరుకొని వుంటారు? (లూకా 2:7 తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను)
తమ పరిమితులను బట్టి వాళ్లు నిరాశపడలేదు కానీ తమకున్నంతలో చేయగలిగినదంతా మరియ యోసేపులు చేశారు. ఉదాహరణకు, శిశువు విషయంలో మరియ ఎంతో శ్రద్ధతీసుకుంది.
బిడ్డను వెచ్చగా, సురక్షితంగా ఉంచడానికి శిశువును తన దగ్గర మిగిలిఉన్న పొత్తిగుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో జాగ్రత్తగా పడుకోబెట్టింది మరియ తానున్న పరిస్థితులను బట్టి ఎక్కువగా ఆందోళన పడకుండా తాను చేయగలిగినదంతా లోకరక్షకుడిగా పుట్టిన శిశువుకు చేసింది. తమ బిడ్డకు దేవుణ్ణి ప్రేమించడం నేర్పడమే తాము చేయగల వాటిలో ముఖ్యమైన పనని కూడా వాళ్లకు తెలుసు.
తల్లిదండ్రులైన వారు ఇటివంటి శ్రద్ధ తమ బిడ్డలపై చూపవలసి యున్నది. (ద్వితీయ 6:6-8 నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను. )
వేగవంతమైన టెక్నాలజీ ద్వారా సాతాను పిల్లలను చెడగొట్టుచున్న ఈనాటి కాలంలో, దేవునికి మరియు ప్రార్ధనకు విలువివ్వని నేటి లోకంలో తెలివైన తల్లిదండ్రులు మరియ, యోసేపులను ఆదర్శంగా తీసుకొని తమ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొని పిల్లలు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యమిచ్చేలా వాళ్లను పెంచాలి.
*🔯21. పొత్తిగుడ్డలలో చుట్టబడిన మరియ కుమారుడు:* యేసు బాలుడు ఈ లోకానికి వచ్చిన దేవుని అపురూపమైన బహుమానంగా ఉన్నాడు. ప్రపంచాన్ని శాసించే రాజాధిరాజు మన నిమిత్తమై పొత్తిగుడ్డలలో చుట్టబడి ఈలోకానికి వచ్చాడు. యేసు తన గొప్పదనం యొక్క ప్రదర్శన ఇవ్వడానికి ఈ లోకంలోనికి రాలేదు. పాప పరిహారం నిమిత్తమై పొత్తిగుడ్డలతో చుట్టబడిన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. (లూకా 2:7 తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి,..)
దేవునితో సమానుడిగా ఉన్న యేసు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఈలోకంలోనికి వచ్చుటకు ఇష్టపడ్డాడు. మానవుల యెడల యేసుకు ఉన్న ప్రేమను ఇది తెలియజేస్తుంది. పొత్తిగుడ్డలు ఈ లోకంలో ఉన్న పాపానికి సాదృశ్యంగా ఉన్నవి. మన క్రియలన్నీ మురికి గుడ్డలని యెషయా ప్రవక్త చెప్పుచున్నాడు.
*🔯22. పొత్తిగుడ్డలు అనేవి శిశువుకు రక్షణకరం:* నవజాత శిశువును వస్త్రపు ముక్కలతో చుట్టడం అనేది ఎంతో అవసరం. పిల్లల అవయవాలను రక్షించడానికి మరియు నిటారుగా ఉంచడానికి శిశువును ఈ విధంగా గుడ్డలతో చుట్టడం ఇప్పటికి కూడా కొందరు చేస్తూ ఉంటారు. ఇది ఒక రక్షణ కరమైన స్థితిని శిశువుకు ఇచ్చుటకు చేస్తూ ఉంటారు. నవజాత శిశువు యొక్క తల్లిదండ్రుల ఆదాయం లేదా ఆర్థిక స్థితిని బట్టి శిశువును చుట్టే వస్త్రాల ఖరీదు మారుతూ ఉంటుంది.
పాత నిబంధనలో కూడా ఇజ్రాయెల్ దేశంను దేవుడు ఒక శిశువుగా ఏర్పాటు చేసి రక్షణ వస్త్రంతో చుట్టడం గురించిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. (యెహెజ్కేలు16:4 నీ జననవిధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము కోయ బడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి *బట్టచుట్టక పోయిరి*. 5 ఈ పనులలో ఒక టైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు, నీయందు జాలిపడినవాడొకడును లేక పోయెను; నీవు పుట్టిననాడే బయటనేలను పారవేయబడి, చూడ అసహ్యముగా ఉంటివి. 6 అయితే నేను నీ యొద్దకు వచ్చి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్త ములో పొర్లియున్న నీవు బ్రదుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని నీతో చెప్పితిని.)
ఇశ్రాయేలు వారు ఎక్కడినుండి వచ్చారో, వారు ఎక్కడ పాపంలో ఉన్నారో దేవుడు గుర్తుచేస్తాడు, ఎందుకంటే ఆయన వారి వెంటవచ్చి ఇతరులందరికీ భిన్నంగా తన ప్రజలను తన రక్షణ వస్త్రాలతో చుట్టి గొప్ప చేశాడు. కొత్తగా పుట్టిన తన బిడ్డ కోసం ఒక తల్లి ఏమి చేస్తుందో వర్ణనను దేవుడు ఇక్కడ ఉపయోగించాడు. అవాంఛితంగా అవసరం లేదని అవతలకు విసిరివేయబడినట్లు ఉన్న ఇశ్రాయేలీయులను ఒక తల్లి కొత్తగా పుట్టిన శిశువుకు, బొడ్డు త్రాడును కత్తిరించి, ఉప్పుతో కడిగి, పొత్తి గుడ్డలు వారికి చుట్టినట్లుగా, దేవుడు వారి గురించి శ్రద్ధ తీసుకుని పెంచి పోషించి అభివృద్ధి చేశాడు.
ప్రియ దేవుని బిడ్డలారా ఒకప్పటి మన స్థితికూడా ఇదే. బయట పారవేయబడిన మన జీవితాలను చూచి దేవుడు ఎంతో ప్రేమించి, మనలను రక్షించి తన రక్షణ వస్త్రాలతో చుట్టి ఆదరించాడు. ప్రేమ కారణంగా ఆయన మనల్ని తన చేతుల్లోకి తీసుకొని తన కుమారుని రక్తంలో కడిగి, మరియు మనల్ని దత్తత తీసుకొని తన కుటుంబంలో ఒక భాగంగా చేసుకున్నాడు మరియు తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపి ఇప్పటికి తన వాక్యం ద్వారా పోషిస్తూ ఉన్నాడు. హల్లేలూయా!
విలువైన రాజ వస్త్రాలలో చుట్టబడవలసిన దేవుని కుమారుడు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. దీనుడిగా పొత్తిగుడ్డలతో చుట్టబడి ఈలోకానికి వచ్చిన ఈ శిశువే ప్రపంచాన్ని జయించాడు. ప్రియ దేవుని బిడ్డా! నీ పరిస్థితి ఎటువంటి దీనమైన స్థితిలో ఉన్నా దేవుడు నీకొరకు గొప్ప ప్రణాళికలు కలిగి యున్నాడని గ్రహించు.
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదే బెత్లెహేము ప్రాంతంలో ఒక సారి సమూయేలు యెష్షయి కుమారులలో ఒకనిని రాజుగా అభిషేకించుటకు యెష్షయి ఇంటికి రాగా బలంగా ఉన్న తన పెద్దకుమారులలో ఒకరని యెష్షయి అనుకున్నాడు. అయితే దేవుడు ఊరి బయట పొలాల్లో దీనుడిగా తిరుగుతూ ఒక గొర్రెల కాపరి బాలుడిగా ఉన్న యెష్షయి చిన్న కుమారుడైన దావీదుపై తన దృష్టి పెట్టి అతనిని రాజుగా చేసి దావీదు ద్వార ఘనమైన కార్యాలు చేశాడు.
*🔯23. తన పొత్తిగుడ్డలే శిశువుకు బంధకాలు:* సర్వమానవుల పాపంతో చుట్టబడిన శిశువు, సిలువలో మేకులతో బంధింపబడిన యేసుకు పోలికగా ఉన్నాడు. తన పొత్తిగుడ్డలే తన కుమారునికి సమాధి వస్త్రాలుగా మారతాయని మరియ ఊహించలేదు. తన భర్త యైన యోసేపు తన కుమారుని పొత్తిగుడ్డలతో చుట్టుచుండగా మరియ చూసింది. ఇదే దృశ్యం మరల మరియ జీవితంలో పునరావృతం అయినది.
అయితే ఈసారి తన భర్త యైన యోసేపు స్థానంలో యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు పాప పరిహారార్ధం మరణించిన తన కుమారుని దేహాన్ని సమాధి వస్త్రాలతో చుట్టుచుండగా ఆక్కడే ఉన్న మరియ అది చూచి ఎంతో దుఃఖపడినది. సమాధి వస్త్రాలతో చుట్టబడిన యేసును చూస్తుంటే, పొత్తిగుడ్డలతో చుట్టబడిన తన బాలుడిగా ఆమెకు యేసు కనిపించాడు. (లూకా 23:52 అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడు ఉంచబడలేదు.)
పరిశుద్ధ గ్రంథంలోని ప్రతిదీ అర్ధవంతమైనది, అన్నీ సందర్భాలు కూడా ఆత్మీయ అర్ధాలతో కూడిన దేవుని వాక్యమే. పొత్తిగుడ్డలతో చుట్టబడుటకు యేసు అనుమతించాడు. దీని ఆత్మీయ అర్ధం చూస్తే, దేవాది దేవుడైన యేసు తనను తాను ముప్పై మూడు సంవత్సరాలు మనుష్యుల పాపంతో బంధించటానికి అనుమతించాడని, యేసు యొక్క అపరితమైన అత్యున్నమైన రక్షణ శక్తిని మానవులు మురికి గుడ్డల వంటి పాపముతో చుట్టుచూ బంధిస్తూ ఉంటే యేసు అనుమతించాడు.
ఒకసారి సంసోను ఫిలిష్తీయులకు తనను తాను అప్పగించు కొనుటకు తన సహోదరులైన యూదా మనుష్యుల వైపు చేతులు చాపగా వారు అతనిని తాళ్ళతో బంధించి, బందీ చేశారు. ఇక్కడ తాళ్ళతో కట్టబడుటకును ఫిలిష్తీయుల వద్దకు నడిపించడానికి సంసోను అనుమతించాడు. అయితే ఆ తాళ్ళు సంసోను శక్తిని ఆపలేక పోయినవి.
అక్కడ సంసోను తన గొప్ప విజయాలలో ఒకదాన్ని ఫిలిష్తీయులపై గెలుచుకున్నాడు. (న్యాయాధి 15:13 అందుకు వారుఆలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపముగాని నిన్ను గట్టిగా కట్టి వారిచేతికి మేము అప్పగించెదమని చెప్పి రెండు క్రొత్త తాళ్లచేత అతని కట్టి ఆ బండయొద్దనుండి అతని తీసికొనివచ్చిరి. 14 అతడు లేహీకి వచ్చువరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చినందున అతనిచేతులకు కట్టబడిన తాళ్లు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలె నాయెను; సంకెళ్లును అతని చేతులమీద నుండి విడిపోయెను.)
సమాధి వస్త్రాలు యేసు పునరుత్థాన శక్తిని ఆపలేక పోయినవి. పాపాన్ని బ్రద్దలు చేసే అణుబాంబు వంటి శక్తిని పాతగుడ్డలతో సమాధి వస్త్రాలతో బంధిస్తే, దాని శక్తి ఏమైనా తగ్గునా? సర్వ మానవులను రక్షించగలిగే నిజమైన శక్తి, స్వచ్ఛందంగా నిరోధించబడింది, దాచబడింది. పౌలు ఫిలిప్పీయులలో 2 చెప్పినట్లుగా దేవుడు పరిమితిలోకి ప్రవేశించాడు తనను తాను శిలువకు అప్పగించుకున్నాడు. అలనాడు దావీదు కీర్తనాకారుడు “బలిపశువును త్రాడులతో బలిపీఠానికి బంధించండి” అని అన్నాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడిన యేసును చూస్తుంటే, నిగ్రహించబడిన శక్తికి, దాచబడిన మహిమకు సాద్రుశ్యంగా ఉన్నాడు. స్పష్టమైన మానవ బలహీనతలతో వెల్లడైన దేవుని శక్తికి ఇది నిదర్శనం.
*🔯ముగింపు:* రక్షకుడైన మన దేవుడు మన విడుదల కొరకై, మనలను తన రక్షణ వస్త్రాలతో చుట్టుటకు తనను సిలువ యొక్క ఊదా వస్త్రానికి బంధించుకున్నాడు, మనుష్యులు పాపము నుండి విముక్తి పొందటానికి తనను తాను మనుష్యుల ద్వారా బంధించటానికి అనుమతించాడు! మరియ గురించిన మరికొన్ని విషయాలు రేపటి దినం ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్!
(To be continued…)
దైవాశ్శీసులు!
-
*✝హృదయములో భద్రము చేసికొన్న మరియ🔯*
(మరియ – 5వ భాగం)
(క్రిస్మస్ సందేశాలు – 22)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(లూకా 2:19 అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రం చేసికొనెను.)_
*🔯ఉపోద్ఘాతం:* అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న పశువుల పాక స్థలం ఒక్కసారిగా సందడి సందడిగా మారిపోయింది. ఆ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆ శిశువును చూడడానికి గొర్రెల కాపరులు పశువుల పాకలోకి పరుగుపరుగున వచ్చారు.
వాళ్లెంతో ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. పొలం ప్రాంతంలో తమ మందల్ని కాసుకుంటున్న వాళ్లల్లా గబగబ అక్కడికి వచ్చారు.
ఆశ్చర్యంగా తమకేసి చూస్తున్న ఆ తల్లిదండ్రులతో వాళ్లు కాసేపటి క్రితమే చూసిన అద్భుతం గురించి చెప్పారు. గొర్రెల కాపరులను ఖచ్చితంగా చిన్నచూపు చూసే ఆకాలంలో నమ్మకస్థులైన ఈ సామాన్యులకు ప్రభువు ఎంతో విలువిచ్చాడని స్పష్టంగా తెలుస్తోంది.
*🔯24. కుమారుని గురించి చెప్పబడిన మాటలను హృదయంలో తలపోసుకున్న మరియ:* (లూకా 2:19 అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు..) పొలంలో మందలు కాచుకుంటున్న తమకు ఆ రాత్రి అకస్మాత్తుగా ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడని, ప్రభువు మహిమ వాళ్ల చుట్టూ ప్రకాశించిందని ఇప్పుడే బేత్లెహేములో తమ కొరకు రక్షకుడు పుట్టాడని ఆ దూత చెప్పాడని, అక్కడికి వెళ్తే, పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టివున్న ఆ శిశువు మీకు కనిపిస్తాడని, ఆ తర్వాత అంతకన్నా ఆశ్చర్యకరమైనది ఒకటి జరిగిందని, దేవుణ్ణి స్తుతిస్తున్న దూతల సమూహం వాళ్లకు ప్రత్యక్షమైందని కాపరులు మరియ యోసేపులకు చెప్పారు. (లూకా 2:8-14.)
కాపరులు చెప్పిన మాటలన్నిటి గురించి మరియ తన హృదయంలో తలపోసింది. ఈ సామాన్య గొర్రెల కాపరులు బేత్లెహేముకు అంత పరుగు పరుగున వచ్చారంటే అందులో ఆశ్చర్యం లేదు. దూత వివరించినట్లు అప్పుడే పుట్టిన శిశువును చూసి వాళ్లు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యారు.
కాపరులు ఈ శుభవార్తను తమ దగ్గరే ఉంచుకోలేదు. “తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.”
*🔯25. హృదయములో భద్రము చేసికొన్న మరియ:* ( లూకా 2:19 అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు *భద్రము చేసికొనెను.*) తొలిచూలి ప్రసవం వల్ల అప్పటికే మరియ ఎంతో నీరసించిపోయి ఉన్నా, కాపరులు చెబుతున్న ప్రతీ మాటను ఎంతో శ్రద్ధగా వింది. వినడమే కాదు, ‘ఇవన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటి గురించి ఆలోచించింది. తన విశ్వాసాన్ని మరింత బలపరచు కున్నది.)
దేవుని పరిశుద్ద గ్రంధంలో ప్రభువు తన వాక్యాన్ని అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలతో నింపాడు. మనం ఈ సత్యాలపై మనసుపెడితేనే వాటి నుండి ప్రయోజనం పొందుతాం. దానికోసం మనం బైబిలును ఏదో పుస్తకంలా కాదుగానీ దేవుని ప్రేరేపిత వాక్యమని ఎంచి దాన్ని తలపోసుకుంటూ *భధ్రం* చేసుకోవాలి.
మరియ మాదిరిగా మనం కూడా దేవుని వాక్యం హృదయంలో తలపోస్తూ భద్రం చేసుకోవాలి అనగా మరల మరల జ్ఞాపకం చేసుకుంటూ క్రమంగా చదవాలి. (2 తిమో 3:16, 17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.)
*🔯26. ధర్మశాస్త్రాన్ని ఆచరించిన మరియ:* యేసు రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడు మరియ, యోసేపులు మోషే ధర్మశాస్త్రం చెప్పినట్టు చేశారు. ఆలయంలో వాళ్లు అర్పించిన అర్పణను బట్టి వాళ్ల ఆర్థిక స్థితి ఎలా ఉండేదని తెలుస్తోంది.
మరియ, యోసేపులు 8వ రోజున మోషే ధర్మశాస్త్రం ప్రకారం శిశువుకు సున్నతి చేయించి, తమకు అందిన నిర్దేశాన్ని బట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టారు. (లూకా 1:31)
శుద్ధీకరణ కోసం పేదవాళ్లు రెండు గువ్వలను గానీ, రెండు పావురాలను గానీ అర్పించవచ్చని ధర్మశాస్త్రం చెప్పింది. అందుకోసం వాళ్లు 40వ రోజున బేత్లెహేము నుండి దాదాపు 10 కి.మీ. దూరంలో ఉన్న యెరూషలేము దేవాలయానికి బిడ్డను తీసుకొని వెళ్లారు.
ఇతర తల్లిదండ్రుల్లా గొర్రెను అర్పించలేకపోతున్నందుకు కాస్త చిన్నతనంగా అనిపించినా, వాళ్లు తాము ఇవ్వగలిగింది ఇచ్చి ధర్మశాస్త్రాన్ని పాటించారు. ఏదేమైనా అక్కడ వాళ్లకు మంచి ప్రోత్సాహం దొరికింది.—లూకా 2:21-24. యెరూషలేములోని యెహోవా ఆలయంలో మరియ, యోసేపులు మంచి ప్రోత్సాహం పొందారు.
*🔯27. మరియ హృదయంలోకి ఖడ్గం:* వృద్ధుడైన సుమెయోను, వాళ్ల దగ్గరకు వచ్చి మరియ తన మనసులో ఉంచుకోవాల్సిన కొన్ని విలువైన విషయాలను చెప్పాడు. మెస్సీయను చూసేంతవరకు ఆయన చనిపోడని దేవుడు ఆయనకు మాటిచ్చాడు.
ఈ చిన్నారి యేసే వాగ్దత్త రక్షకుడని దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో సుమెయోను గ్రహించాడు. ఎంతో దుఃఖించే రోజు వస్తుందని కూడా సుమెయోను మరియకు చెప్పాడు. ఆమె హృదయంలోకి ఖడ్గం దూసుకుపోయినంత బాధ ఆమెకు కలుగుతుందని ఆయన అన్నాడు. (లూకా 2:25-35) ఆ మాటలు అప్పుడు ఆమెలో కలవరం రేపినా, మూడు దశాబ్దాల తర్వాత తన కుమారుడైన యేసు సిలువ మరణం సందర్భంగా ఎదురైన దుఃఖాన్ని తట్టుకునేందుకు ఆమెకు ఈమాటలు సహాయం చేసాయి.
సుమెయోను తర్వాత, ప్రవక్త్రియైన అన్న చిన్నారి యేసును చూసి, యెరూషలేము విడుదల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఆయన గురించి చెప్పింది.—లూకా 2:36-38
*🔯28. బిడ్డను ఆలయానికి అలవాటు చేసిన మరియ:* (లూకా సువార్త 2:41 పస్కా పండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్లుచుండువారు.) యేసును యెరూషలేములోని దేవాలయానికి తీసుకువెళ్లాలని యేసేపు మరియలు అనుకోవడం చక్కని నిర్ణయం.
తమ కుమారుడు జీవితాంతం క్రమంగా దేవుని ఆలయానికి వెళ్లేందుకు అది పునాది వేసింది. ఆ రోజు వాళ్లు తాము ఇవ్వగలిగిన దానిలో శ్రేష్ఠమైనదాన్ని ఇచ్చారు, మంచి ఉపదేశాన్ని, ప్రోత్సాహాన్ని పొందారు. ఆ రోజు మరియ విశ్వాసం తప్పకుండా బలపడివుంటుంది. అంతేకాదు ధ్యానించడానికి, ఇతరులకు చెప్పడానికి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాల్ని హృదయంలో పదిలంగా దాచుకొని ఆమె దేవాలయం నుండి ఇంటికి వచ్చింది.
నేటి తల్లిదండ్రులు ఆమెను ఆదర్శంగా తీసుకోవడం చూడముచ్చటైన విషయం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని మందిరాలకు, క్రైస్తవ కూటాలకు క్రమంగా తీసుకువెళ్ళాలి. అలాంటి తల్లిదండ్రులు తమ పిల్లలను తోటి విశ్వాసులను ప్రోత్సహించడానికి శాయశక్తులా కృషిచేస్తారు,
దృఢమైన విశ్వాసంతో, సంతోషంతో మందిరాల నుండి కూటాల నుండి ఇంటికి వెళ్తారు. అంతేకాదు, ఇతరులకు చెప్పడానికి ఎన్నో మంచి విషయాల్ని తమతోపాటు తీసుకువెళ్తారు. కూటాలకు వెళ్లినప్పుడు అలాంటి వాళ్లను కలుసుకోవడం ఎంత ఆనందాన్నిస్తుందో కదా! అలాచేస్తే మరియ విశ్వాసంలాగే మన విశ్వాసం కూడా అంతకంతకూ దృఢమౌతుంది.
*🔯ముగింపు:* మరియలాగే మనం కూడా ఆధ్యాత్మిక విషయాలను మన హృదయాల్లో పదిలం చేసుకొని భద్రపరచుకొని వాటి గురించి లోతుగా ఆలోచించాలి.
వాక్య ఉపదేశాల్ని మరింత చక్కగా పాటించడానికి ఇంకేమి చేయాలో ఆలోచిస్తూ, బైబిల్లో చదివిన విషయాలను మననం చేస్తే మన విశ్వాసం పటిష్ఠమౌతుంది. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్!
దైవాశ్శీసులు!
- :
*✝వాక్యము శరీరధారియగుట📖*
(1వ భాగము)
(క్రిస్మస్ సందేశాలు - 23)
Immanuel Bible College
NIDUBROLU Guntur dt.
శుభోదయం!
_(యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారియై..)_
*🔯ఉపోద్ఘాతం:* మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మానవ అవతారంపై ఒక నిశిత పరిశీలన కొన్ని వరుస సందేశాలలో చూద్దాం. – (A Close Look at the Incarnation of Our Savior, Jesus the Christ*)
యేసు, దేవుడు మరియు మానవుడు గాను ఉన్నాడు. అనగా ఒక వ్యక్తి, రెండు స్వభావాలు కలిగి యుండుట. (Jesus is God and Man: One Person, Two Natures) ఇది మానవ జ్ఞానానికి అందని విషయం. కొంతమంది యేసు దేవుడు కాదు అని వాదిస్తారు. యేసు దేవుడని బైబిల్ లో ఎక్కడ వున్నదని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా! యేసు మహాదేవుడని బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది.
*🔯1. యేసు నిజమైన దేవుడని బైబిలు మనకు చూపిస్తుంది:* ఆయనే నిజమైన దేవుడూ, శాశ్వత జీవమూ అని యోహాను భక్తుడు చెప్పుచున్నాడు. (1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే *నిజమైన దేవుడును* నిత్యజీవమునై యున్నాడు.)
యేసు క్రీస్తు నిజమైన దేవుడని స్పష్టంగా పై వాక్యంలో వ్రాయబడినది. ఆయన దేవుని స్వరూపం గలిగినవాడని, దేవునితో సమానం అని పౌలు భక్తుడుకూడా తన పత్రికలలో చెప్పుచున్నాడు. (ఫిలి 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు..)
పౌలు భక్తుడు తన తీతు పత్రికలో “మహా దేవుడు” అని వ్రాశాడు. ఆదిమ గ్రీకు బైబిల్ లో చూస్తే ఈ వచనంలో దేవుడు అను పదమునకు ముందు *“మెగా”* *μεγά* అను విశేషణాన్ని వాడడం జరిగింది. దీని యొక్క అర్ధం “మహా లేదా గొప్ప.” (తీతు 2:13 అనగా *మహా దేవుడును* మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు...)
అదే విధంగా పౌలు భక్తుడు తన రోమా పత్రికలో “సర్వాధికారియైన దేవుడు” అని వ్రాశాడు (రోమా 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన *సర్వాధికారియైన దేవుడై యుండి* నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్)
*🔯2. యేసు నిజమైన మానవుడని బైబిలు మనకు చూపిస్తుంది:* యేసు నిజమైన మానవునిగా కూడా ఈ లోకంలోనికి వచ్చాడు. కారణం. దేవునికి మానవునికి ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఉండాలంటే ఇద్దరి లక్షణాలు కలిగి యుండాలి. (యోహాను 1:14 ఆ వాక్యము *శరీరధారియై,* కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను.)
యేసు మానవుడు, దేవుడు రెండూ కాబట్టి మానవుణ్ణి, దేవుణ్ణి ఇద్దరినీ అర్థం చేసుకొని యోబు ఆశించిన విధంగా దేవునిమీద, మనిషి మీద చేయి ఉంచగల మధ్యవర్తి ఆయన తప్ప ఏ మనిషి గానీ ఏ “దేవుడు” గానీ ఏ పవిత్రుడుగానీ ఏ దేవదూత మనిషికి దేవునికి మధ్యవర్తి కాడు. యేసు పరిపూర్ణమైన మధ్యవర్తి కాబట్టి ఇంకెవ్వరూ అక్కరలేదు. (యోబు 9:32 ఆయన నావలె నరుడు కాడు నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలను, మేము కలిసి న్యాయవిమర్శకు పోలేము. 33 మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు.)
పౌలు భక్తుడు యేసును నరునిగా అనగా మానవునిగా తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో చెప్పుచున్నాడు. (1తిమో 2:5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన *క్రీస్తుయేసను నరుడు*)
హెబ్రీ 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై నందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును 17 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన *తన సహోదరుల వంటివాడు* కావలసివచ్చెను
యేసు తనను తాను "మనుష్యకుమారుని" అని పిలిచినప్పుడేల్లా తాను *నిజమైన మానవుడని* ప్రకటించాడు.
*🔯3. యేసు మనలాంటి మానవ స్వభావం కలిగి ఉన్నాడు ఒక్క మన పాపముతప్ప:* హెబ్రీ 2:17 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్య ములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.
(యెషయా 53:9 అతడు అన్యాయమేమియు చేయలేదు *అతని నోట ఏ కపటమును* లేదు. 2 కొరి 5:21 ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు *పాపమెరుగని ఆయనను* మనకోసము పాపముగాచేసెను 1పేతురు 2:22 *ఆయన పాపము చేయలేదు*; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. హెబ్రీ 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, *పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును* ఆకాశ మండలము కంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.)
మానవులకు అవసరమైన నిజమైన ఆహారం, పానీయం, విశ్రాంతి, నిద్ర మొదలైన అన్ని సార్వత్రిక మానవ బలహీనతలను యేసు స్వయంగా తనలోనికి తీసుకున్నాడు. దీనిని మనము సువార్తలలో చూడగలం. అయితే మానవులకు సామాన్యమైన సమస్యలుగా ఉన్న శారీరక వ్యాధులు, బలహీనతలు మొదలగునవి యేసు అనుభవించినట్లు మనకు ఆధారం లేదు. మనలను పాపము నుండి కాపాడటానికి యేసు ఈ ప్రత్యేక విషయాలను ఆయన తన లోనికి తీసుకోలేదు.
పైన చెప్పిన వాక్యాలు యేసు *రెండు స్వభావాలు* కలిగి ఉన్నట్లు మనకు తెలియ జేయుచున్నవి. దైవ స్వభావం మరియు మానవ స్వభావం ఈ రెండు స్వభావాలు ఒక వ్యక్తిగా బేత్లెహేములో జన్మించిన యేసులో ఐక్యమయ్యాయి.
*🔯4. అవతారం - The Incarnation:* దేవునిగా ఉన్న వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను. యేసు భూలోక అవతారంలో, దైవ స్వభావం చురుకుగా (active) ఉన్నది మరియు మానవ స్వభావం నిష్క్రియగా (passive) ఉంది.
దేవుడు మనుష్యుడయ్యాడు, కానీ మానవుడు దేవుడు కాలేదు. కొలస్సి 2:9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత *శరీరముగా క్రీస్తునందు* నివసించుచున్నది
(1తిమో 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను గల 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన *స్త్రీయందు పుట్టి* మనము దత్తాపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రము నకు లోబడినవాడాయెను.)
యేసు యొక్క దైవ స్వభావం ఎటువంటి పరిస్థితులలోను మారదు. వాక్యం దేవునిగా మారినప్పుడు ఆయన యొక్క దైవిక స్వభావంలో ఏ మార్పు చెందలేదు. దైవిక స్వభావం యొక్క వ్యక్తిత్వమే మానవ స్వభావంలో కొనసాగింది మరియు నివసించింది.
ఆయనలో ఉన్న రెండు స్వభావాల యొక్క *మూలం* భిన్నంగా ఉంటుంది. యేసు యొక్క దైవ స్వభావం నిత్యత్వం నుండి ఉన్నది అనగా అద్వితీయ కుమారునిగా యేసు జగదుత్పత్తి ముందే తండ్రితో బాటుగా నిత్యత్వంలో ఉన్నటువంటివాడు. (యోహాను 1:14, 18; 3:16).
అయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని సంకల్పం చొప్పున యేసు యొక్క *మానవ స్వభావం ప్రారంభమైనది.* (గలతీ 4:4).
*🔯5. దైవ మానవ స్వభావాల కలయిక:* దైవ మానవ స్వభావాల కలయిక ఒక అద్భుతమైన చర్యగా కన్య మరియ యొక్క గర్భంలో ప్రారంభమైనది. (లూకా 1:35, మత్తయి 1:20). యేసు శరీరంలో యేసు యొక్క దైవిక స్వభావం నివసించినదని మరియు యేసు యొక్క దైవ స్వభావం యేసు మానవ స్వభావంనకు వెలుపల లేదని కొలస్సి 2:9 మనకు చెప్పుచున్నది.
మానవులను విమోచించే పనిని సాధించేందుకు యేసు శిలువ యొక్క అవమానకరమైన సమయంలో ఉన్నపుడు, ఆయన మానవ స్వభావం ఆ పరిస్థితులకు మరియు ఆ సమయాలకు పరిమితమై ఉన్నది.
యేసు యొక్క విజయోత్సవ సమయంలో, ఆయన మానవ స్వభావం అనేది సమయం మరియు పరిస్థితుల యొక్క మానవ సంబంధాల పరిమితి నుండి పూర్తిగా ఎత్తివేయబడింది మరియు ఇకపై దేనికి మానవ స్వభావం పరిమితం కాదు అనగా అయనకు ఆటంకం కాదు.
(మత్తయి 28:18 అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను *నాకు సర్వాధి కారము* ఇయ్యబడి యున్నది. మత్తయి 28:20 నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి. వరకు *సదాకాలము మీతో* కూడ ఉన్నానని వారితో చెప్పెను.)
పరమ దేవుడైన యేసు దైవస్వభావంతో కూడిన మనుష్య రూపములో మనందరి పాప విమోచన కోసమే దిగివచ్చినాడు. అకారమే లేని *వాక్యం* మానవ శరీరమును ధరియించడం అది ఒక గొప్ప మర్మమై యున్నది. సర్వాధికారం కలిగిన *వాక్యం* తన అధికారం మరియు వైభవమును విడిచి దాసునిగా మారడం ద్వార దైవ ప్రణాళిక నెరవేర్చబడి రక్షణ భువిలోనికి తీసుకురాబడింది. అందువల్లనే దేవునికి మానవునికి మధ్య గోడ కూల్చబడి తిరిగి సమాధానం ఏర్పడింది. (To be continued..)
*వాక్యము శరీరధారి ఆయెను* అను ఈ అంశం గురించి మరికొన్ని విషయాలు రేపటి సందేశంలో ధ్యానం చేద్దాం.
దైవాశ్శీసులు!
-
*✝దైవ మానవ స్వభావాలను ఒకే వ్యక్తి పంచుకోవడం🚼*
(వాక్యము శరీరధారి -2వ భాగము)
(క్రిస్మస్ సందేశాలు 24)
Immanuel Bible College
NIDUBROLU Guntur dt
శుభోదయం!
_(రోమా 9:5 పితరులు వీరివారు; *శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను*. ఈయన సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్..)_
*🏵6. యేసు దైవ మానవ స్వభావాలను పంచుకోవడం:* (The Sharing of Attributes)
యేసు యొక్క వ్యక్తిత్వంలో, దైవ స్వభావం మరియు మానవ స్వభావం ఐక్య పరచబడినవి. ఈ ఐక్యత కారణంగా, యేసులో, దైవ స్వభావం మరియు మానవ స్వభావం తమ లక్షణాలను పరస్పరం పంచుకున్నవని పరిశుద్ధ గ్రంధం చూపిస్తుంది.
ఈ క్రింది వాక్య భాగాలలో యేసు యొక్క వ్యక్తిత్వం *దైవిక మరియు మానవ స్వభావ లక్షణాలను* కలిగి ఉన్నట్లు మనం చూడగలం.
యేసు మానవుడిగా యూదులలో పుట్టినాగానీ సర్వాధికారియగు దేవుడుగా ఉన్నాడు. (రోమా 9:5 పితరులు వీరివారు; శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్)
మానవుడిగా ఆయన ఆయన చంపబడ్డాడు. దేవునిగా సజీవమయ్యాడు. (1పేతురు 3:18 ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు19 ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.)
➡ *ఈ క్రింది వాక్య భాగాలలో, ఆయన దైవ స్వభావానికి మానవ లక్షణాలు జత జేయబడినవి:*
👉 (అపో 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.) పై వాక్యంలో “జీవాధిపతి” అను మాట దైవ స్వభావం తెలియజేయుచున్నది, “చంపబడుట” మానవ స్వభావం తెలియజేయుచున్నది.
👉 (1కొరి 2:8 అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.) ఈ వాక్యంలో “మహిమస్వరూపి” దైవస్వభావం తెలియజేయు చున్నది, “సిలువవేయబడుట” మానవ స్వభావం తెలియజేయుచున్నది.
👉 (రోమా 8:32 తన సొంతకుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?) ఈ వాక్యంలో “సొంతకుమారుడు” దైవస్వభావం తెలియజేయుచున్నది, “అప్పగింపబడుట” మానవ స్వభావం తెలియజేయు చున్నది.
👉 (గల 2:20 నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించు చున్నాను.) ఈ వాక్యంలో “దేవుని కుమారుడు” అను మాట దైవస్వభావంను తెలియజేయుచున్నది, “అప్పగించుకొనుట” మానవ స్వభావం తెలియజేయుచున్నది.
👉 (అపో 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.) ఈ వాక్యంలో “దేవుడు” అను మాట ఆయన దైవత్వంను తెలియజేయుచున్నది, “రక్తమిచ్చుట” మనవ స్వభావంను తెలియజేయుచున్నది.
➡ *ఈ క్రింది వాక్య భాగాలలో, ఆయన మానవ స్వభావానికి దైవిక లక్షణాలు జత చేయ బడ్డాయి:*
👉 (యోహా 6:62 ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?) ఈ వాక్యంలో “మనుష్యకుమారుడు” మానవ స్వభావంను తెలియజేయు చున్నది, “పరలోకంనకు ఎక్కుట” దైవస్వభావంను తెలియజేయు చున్నది.
👉 (యోహా 8:58 యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.) “యేసు” అను పదము మానవ స్వభావమును తెలియజేయు చున్నది, “అబ్రహాము పుట్టకమునుపు ఉండుట” దైవ స్వభావంను తెలియజేయు చున్నది.
👉 (1కొరి 15:47 మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు.) ఈ వాక్యంలో “మొదటి మనుష్యుడు” మానవ స్వభావంను తెలియజేయు చున్నది, “రెండవ మనుష్యుడు” దైవ స్వభావంను తెలియజేయు చున్నది.
*🏵7. రెండు స్వభావాలు మహాత్వమును ఔన్నత్యమును పంచుకొనుట - The Sharing of Majesty:* యేసునందు, దైవ స్వభావం మరియు మానవ స్వభావం రెండు కూడా ఒకే ఔన్నత్యమును అనగా మహత్వమును భాగస్వామ్యంగా కలిగి ఉన్నవని పరిశుద్ధ గ్రంధం మనకు తెలియజేస్తుంది. అనగా దైవిక అధికారం, శక్తి మరియు ఘనత మానవ స్వభావంకి ఇవ్వబడ్డాయి, ఎందుకంటే దైవ స్వభావం ఇప్పటికే ఈ విషయాలను కలిగి ఉంది.
➡ *యేసుయొక్క దైవస్వభావం, ఆయన మానవ స్వభావంతో పంచుకొన్న లక్షణాలు:*
👉 *a. యేసు అనబడిన మనుష్యుడు సర్వమైన దైవశక్తిని కలిగి ఉన్నాడు:* (Omnipotent - సర్వశక్తి గలవాడు)
శక్తి స్వభావం, సంకల్పబలం మొదలగు ఉద్దేశాలలో యేసు పరమ తండ్రితో ఎంతో ఐక్యంగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు చేసే శక్తిగల కార్యములన్ని యేసు చేస్తాడు. అనగా అత్యద్భుతమైన శక్తిసామర్థ్యాలు తండ్రియైన దేవునిలో లాగే కుమారుడైన యేసులో కూడా ఉన్నాయి. యేసు బలమైన దేవుడుగా ఉన్నాడు. యేసుకు దేవుని స్వభావంలో సంపూర్ణ భాగస్వామ్యం ఉందనీ, ఆయన దేవుని అవతారమనీ ఇందువల్ల మనకు స్పష్టంగా తెలుస్తున్నది.
(యోహా 5:19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును 21 తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును. మత్తయి 28:18 అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి యున్నది.)
👉 *b. యేసు సర్వజ్ఞానిగా ఉన్నాడు:* (Omniscient – సర్వజ్ఞాని) యేసు అందరిని ఎరిగినవాడు. ఆయన అందరి జీవితాలను ఆంతర్యాలను ఎరిగినవాడుగా ఉన్నాడు. యేసులో ఉన్న దైవిక లక్షణాలను బట్టి చూస్తే, ఆయన విశ్వాసుల విశ్వాసమును చూడగలడు, వారి ఆలోచనలు ఎరుగగలడు. ఆయన అందరిని ఎరిగినవాడు మరియు సమస్త మనుష్యుల అంతర్యాలను ఎరిగినవాడుగా ఉన్నాడు.
(మత్తయి 9:2 యేసు వారి విశ్వాసము *చూచి* ..., లూకా 5:22 యేసు వారి *ఆలోచన లెరిగి* ..., యోహాను 2:24 అయితే యేసు *అందరిని ఎరిగినవాడు* గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని *ఆంతర్యమును ఎరిగిన వాడు* 25 గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.)
*✳ఉదాహరణ - 1:* యేసు సమరయ స్త్రీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని సంపూర్ణంగా ఎరుగును. (యోహాను 4:18 నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు..)
*✳ఉదాహరణ - 2:* పేతురు మూడుసార్లు అబద్దమాడు సంగతిని యేసు ముందే ఎరిగినవాడుగా ఊన్నాడు. మత్తయి 26:34 యేసు అతని చూచిఈ రాత్రి కోడి కూయక మునుపే *నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని* నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
*✳ఉదాహరణ - 3:* యూదా ఇస్కారియోతు తనను అప్పగించు సంగతిని ముందే ఎరిగినవాడుగా యేసు ఊన్నాడు. లూకా 22:21 ఇదిగో *నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడ ఈ బల్లమీద ఉన్నది.*
👉 *c. యేసు ఒకే సమయంలో ప్రతిచోటా ఉన్నాడు:* (Omnipresent – సర్వవ్యాప్తి) అంటే అన్ని చోట్లా ఏకకాలంలో ఉండి పని చేసేందుకు కావలసిన ప్రభావం యేసులో ఉన్నది.
ఎక్కడ యేసు పేర ఇద్దరు ముగ్గురు సమకూడుతారో అక్కడ ప్రభువు వారి మధ్య ఉంటాడు. యేసు తాను ఒకే సమయంలో అనేక చోట్ల ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక స్థానిక సంఘాలు ఆయన పేరట ఒకే సమయంలో సమకూడుతూ ఉంటాయి. యేసు వాటన్నిటితోనూ ఉంటాడు. ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగలగడం అనేది దేవునికే సాధ్యం.
యేసు సర్వ వ్యాప్తిగా ఉన్నాడు. యేసు సదాకాలం చివరి వరకు అందరితో ఉండువాడు. ఆయన అన్నిచోట్ల అంతటా నిండి యున్నాడు.
(మత్తయి 18:20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. మత్తయి 28:20 ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను ఎఫెస్సి 1:23 ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది. ఎఫెస్సి 4:10 దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.)
దైవ స్వభావం మరియు మానవ స్వభావం ఈ రెండు స్వభావాలు యేసు యొక్క వ్యక్తిత్వంలో ఏకమయ్యాయి, కాబట్టి క్రీస్తు యొక్క మానవ స్వభావం దైవ స్వభావం అంతటా వ్యాపించి యున్నది. మనం దీనిని తరచు ఆయన సేవా పరిచర్యలో చూడక పోయినా కొన్ని ఉదాహరణలను మనం చూడగలం.
సముద్రం మీద నడుచుట, రాబోతున్న ప్రమాదం నుండి అద్భుతంగా తప్పించుకొనుట, పరలోకమునకు ఎక్కుట మొదలగునవి. (మత్తయి 14:25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. లూకా 4:30 అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను. యోహాను 8:59 కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను. యోహాను 3:13 మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.)
వాక్యము శరీరధారి ఆయెను అను ఈ అంశం గురించి మరికొన్ని విషయాలు రేపటి సందేశంలో ధ్యానం చేద్దాం. (To be continued...)
దైవాశ్శీసులు!
*✝రక్షణ కార్యాన్ని రెండు స్వభావాలు పంచుకోవడం🚼*
(వాక్యము శరీరధారి -3వ భాగము)
(క్రిస్మస్ సందేశాలు- 25)
Immanuel Bible College
NIDUBROLU Guntur dt
శుభోదయం!
_(లూకా 2:31-32 నీవు సకల ప్రజల యెదుట సిద్ధపరచిన *నీ రక్షణ* నేను కన్నులార చూచితిని.)_
*🌟8. యేసు యొక్క మానవ స్వభావానికి దైవ లక్షణాలు ఎప్పుడు వచ్చినవి?*
యేసు తనలోని దైవిక స్వభావాన్ని బట్టి...
👉సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు,
👉సర్వజ్ఞానిగా ఉన్నాడు,
👉సర్వంతర్యామిగా ఉన్నాడు,
👉నిత్యుడుగాను మరియు దైవిక ఘనతను కలిగి యున్నాడు.
అయితే మానవ స్వభావానికి సాధారణంగా ఈ లక్షణాలు ఏమి ఉండవు.
సాతానును ఓడించు ప్రణాళికలో భాగంగా పరిశుద్ధాత్మ ద్వార యేసు మరియ గర్భంలో ప్రవేశించినపుడు మానవ స్వభావంతో దైవ స్వభావం కలిసినప్పుడు ఈ దైవ లక్షణాలన్నిటిని మానవ స్వభావం స్వీకరించింది. (ఆది.కా 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. *అది నిన్ను తలమీద కొట్టును;* నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.)
యేసు యొక్క మానవ స్వభావంనకు ఈ దైవిక గుణాలు ఇవ్వబడుటను గూర్చి పౌలు యేసును *"దేవుని స్వరూపంలో"* ఉన్నట్లు తన పత్రికలో పిలుస్తాడు:
ఫిలిప్పి 2:6-8 *ఆయన దేవుని స్వరూపము* కలిగిన వాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, *ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,* మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
ఇక్కడ పౌలు యేసు యొక్క మానవ శరీరం గురించి మాట్లాడటం లేదు. శరీరధారి కాక ముందు “వాక్యం”గా ఉన్న యేసును గురించి కూడా పౌలు మాట్లాడటం లేదు. కానీ రెండింటి కలయిక అయిన *దైవమానవ స్వరూపం* గురించి మాట్లాడు చున్నాడు.
ఫిలిప్పీయులకు 2: 6-8లోని వాక్యం శరీరధారిగా మారిన స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నది. యేసు అను మనిషి, దేవుని రూపంలో ఉన్నాడు. మనుష్యకుమారుడు దైవిక శక్తులు కలిగి ఉన్నాడు. యేసు శరీరపరంగా దేవుని రూపంలో ఉన్నప్పటికీ, ఆయన ఎల్లప్పుడూ తన దైవిక శక్తులను ఉపయోగించలేదు.
బదులుగా యేసు ఒక సేవకుని స్థితిని తీసుకున్నాడు మరియు మన పాపాల కోసం సిలువపై చనిపోయే స్థితి వరకు తనను తానే తగ్గించుకుని రిక్తుడైనాడు.
*🌟9. విమోచన కార్యాన్ని దైవ మానవ స్వభావాలు పంచుకోవడం The Sharing of the Work of Redemption:* యేసు క్రీస్తులో, దైవ స్వభావం మరియు మానవ స్వభావం రెండు కూడా విమోచన కార్యాన్ని పంచుకుంటాయని బైబిలు మనకు చూపుతుంది.
1 కొరి 15:3-4 నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, *సమాధి చేయబడెను*(మానవ స్వభావం), 4 లేఖనముల ప్రకారము మూడవ దినమున *లేపబడెను.*
(దైవ స్వభావం).
గల 1:4 మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.
1 యోహా 3:8 అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే *దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.*
ఆది.కా 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. *అది నిన్ను తలమీద కొట్టును;* నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.
లూకా 19:10 నశించినదానిని వెదకి *రక్షించుటకు మనుష్య కుమారుడు* వచ్చెనని అతనితో చెప్పెను.
1తిమో 2:5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన *క్రీస్తుయేసను నరుడు.*
లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు *రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు,* ఈయన ప్రభువైన క్రీస్తు.
పై వాక్య భాగాలలో, వివరించబడిన రక్షణ కార్యం అనేది యేసును దేవుని కుమారుడిగా మరియు మనుష్యకుమారునిగా వర్ణిస్తుంది. ఈ రక్షణ కార్యంలో పాలుపొందుకొనే *రెండు స్వభావాలు కూడా ముఖ్యమైనవి.*
పాపులమైన మనము రక్షకుని యొక్క బలి ద్వార అనగా తీవ్రమైన శ్రమ మరియు శిలువ మరణం ద్వారా మాత్రమే రక్షింపబడగలం.
కానీ యేసు కేవలం దేవునిగా మాత్రమే ఈలోకానికి వచ్చి తనకు తానే శ్రమకులోనై మరణించడం అనేది సాధ్యంకాదు. కారణం దైవస్వభావం శ్రమకు లోనుకాదు. దేవుడిని ఎవరైనా శిలువ వేయగలరా? అది అసాధ్యం.
అదే విధంగా, యేసు కేవలం మానవుడిగా సర్వలోక పాప విముక్తి కొరకు సరిపోయిన పరిపూర్ణ బలిని అర్పించలేడు. కారణం మానవుడు మరణాన్ని జయించడం అసాధ్యం.
కాబట్టి పాపము మరియు మరణము నుండి మనలను కాపాడడానికి యేసు యొక్క వ్యక్తిత్వంలోని మానవ స్వభావం మరియు దైవిక స్వభావం రెండు కూడా అత్యవసరం.
*🌟10. యేసుకు దైవిక ఘనత ఉందని బైబిలు మనకు చూపిస్తుంది:* రక్షణ కార్యాన్ని దిగ్విజయంగా యేసు దైవ మానవ రూపంలో నెరవేర్చాడు గనుక యేసే నిజమైన దేవునిగా గొప్ప ఘనత పొందాడు. అంతేగాక తీర్పుతీర్చు ఆధికారం కుమారునికి అప్పగించుట ద్వార దేవుడే తన కుమారుడైన యేసును ఘనపరచాడు.
మనుషులందరి తీర్పు యేసుప్రభువు చేతిలోనే ఉంటుంది. తీర్పును యేసుప్రభువు చేతుల్లో పెట్టడంలో తండ్రి ఉద్దేశం చూడండి. తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరచినట్టుగానే మనుషులు యేసును ఘనపరచాలి. కుమారుడైన యేసునందు *దైవ తత్వం, దైవ స్వభావం* పరిపూర్ణంగా లేకపోతే తండ్రి ఎన్నడూ ఇలా కోరడు. దేవునికి మాత్రమే చెందే ఘనతను సృష్టించబడిన ఎవరికీ దేనికీ మనుషులు ఇవ్వరాదు.
మనుషులు దేవుని కుమారుణ్ణి దేవుడిగా ఘనపరచకపోతే వారు తండ్రి దేవుణ్ణి అసలు ఘనపరచరు.
యోహాను 5:22-23 తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా *అందరును కుమారుని ఘనపరచ వలెనని* తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు; *కుమారుని ఘనపరచనివాడు* ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
(ఫిలిప్పి 2:9-11 అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని, *ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును* ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.)
దేవుడైన యేసు మనిషిగా వచ్చి మరణం పాలై సాతానును ఓడించి విశ్వానికి మహా దేవుడైన యెహోవా అవతారం తానేననే అని ప్రపంచమంతటికీ చాటి చెప్పాడు.
నిజ దేవుడైన యేసు మానవుడుగా ఈలోకంలో పుట్టి ఆయన సాధించిన అద్భుతమైన రక్షణ కార్యాన్ని బట్టి భూమి మీద మరియు పరలోకంలో కూడా సర్వ అధికారమంతా ఉన్న మహా ప్రభువు యేసేనని ఇప్పుడు విశ్వాసులు సంతోషంగా ఒప్పుకుంటారు. ఇష్టమున్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ ఇలా ఒప్పుకోవలసి వస్తుంది.
అయితే సాతానుని ఓడించి విమోచన కార్యాన్ని నెరవేర్చి విజయుడై పునరుత్థానునిగా లేచిన తరువాత యేసులో దైవ స్వభావంతో బాటుగా మానవ స్వభావం కూడా ఉన్నదా?
అంటే ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసుదేవునిలో మానవ లక్షణాలు కూడా ఇంకా ఉన్నాయా? ఒకవేళ పునరుత్థానుడైన యేసులో దైవ స్వభావంతో బాటుగా మానవ లక్షణాలు కూడా ఇంకా ఉంటే అవి ఇప్పుడు ఏమైనాయో రేపు చూద్దాం.
(To be continued..)
దైవాశ్శీసులు!
*✝ప్రస్తుతం యేసు దేవునిలో ఇంకా మానవలక్షణాలు ఉన్నాయా?🚼*
(వాక్యము శరీరధారి - 4వ భాగము)
(క్రిస్మస్ సందేశాలు - 26)
Immanuel Bible College
NIDUBROLU
శుభోదయం!
_(తీతు 2:13 అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు...)_
*🏵ఉపోద్ఘాతం:* అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఏమనగా పాప పరిహార నిమిత్తం దేవుడు మానవ రూపం ధరించి అందరు చూడగలిగే రీతిగా సశరీరంతో ప్రత్యక్షం చేయబడి శిలువ మరణం పొంది పునరుత్తానుడుగా లేచుట. ఇదే సువార్త యొక్క మర్మం. అయితే ఈ శిలువ కార్యం నెరవేరిన తరువాత అనగా క్రీస్తు పునరుత్తానుడైన తరువాత ఆయనలోని మానవ స్వభావం ఏమైంది?
*🏵11. విజయుడైన యేసులోని మానవ లక్షణాలు ప్రస్తుతానికి అదృశ్యం చేయబడుట అనగా దాచబడుట:* యేసు తన ఆరోహణ సమయంలో ఆయనలోని అన్ని మానవ లక్షణాలు పూర్తిగా ఉపసంహరించబడినవి. అనగా దాచబడి ఆయనలోని పూర్తి దైవస్వభావం బయటకు వచ్చి ఆత్మ రూపునిగా మారినాడు. ఆయన శిష్యులతో బాటుగా వారి మధ్యలోనే ఉన్నా వారు ఆయనను చూడలేని పరిస్థితి. కారణం అనగా ఆయనలోని మానవలక్షణాలు దాచబడినవి. ఆసమయంలో ఆయనను చూడగల్గడం మానవ కంటికి అసాధ్యమైన విషయం.
ఆరోహణ సమయంలో, వాస్తవానికి జరిగినదేమంటే యేసు తన శిష్యుల (మన) కంటి దృష్టి పరిమితి నుండి యేసు అదృశ్యమయ్యాడు. ఆయన అక్కడే వారి ప్రక్కనే ఉన్నా శిష్యులు (మనం) చూడలేని పరిస్థితి. (అపో. కార్యములు 1:9-11). దీనినే మనం ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుప్రభువు అంతర్థానం అయ్యాడు. దీని అర్ధం ఏమంటే విశ్వాసులమైన మనం కూడా ఇక నుండి మానవ శరీర లక్షణాలను విడిచిపెట్టి ఆత్మ రూపుని లక్షణాలను కలిగి యుండడం నేర్చుకోవాలి అని ప్రభువు మనకు చెప్పుచున్నాడు.
ఇకనుండి మనం ప్రభువును చూడాల్సింది మానవ నేత్రాలతో కాదుగాని ఆత్మ నేత్రాలతో చూడాలి. అనగా విశ్వాసులు మనోనేత్రలతో యేసును చూచినప్పుడు ప్రభువు వారి ఎదుటనే నిలబడి యుంటాడు. కాబట్టి ప్రభువును మనం చూడాలంటే ఇకనుండి ఆయనను మానవ కనుదృష్టితో కాదుగాని, విశ్వాస నేత్రాలతో చూడవలసి యున్నది.
*🏵12. యేసు ఇంకా దేవునిగాను మానవునిగాను కొనసాగుతూనే యున్నాడు:* క్రొత్త నిబంధన నుండి నేటి వరకూ, క్రైస్తవ సంఘం పునరుత్తానుడైన యేసే నిరతంరం దేవుడని నమ్మి వేడుక జరుపుకుంటోంది. ఈ క్రమములో, క్రొత్త నిబంధనలో అపొస్తలులు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం జరుగుచున్న సంఘ చరిత్రలో నాటి నుండి నేటి వరకు యేసు పరలోకంలోనూ సంఘంలోనూ దేవునిగాను మానవునిగాను ఇంకా కొనసాగుతూనే యున్నాడు. అనగా యేసు ఇంకా దైవ మానవ అవతరంలోనే కొనసాగుతున్నాడు.
పునరుత్థానం తరువాత కూడా క్రీస్తు యొక్క మనవ శరీర స్వభావం ఒక జ్ఞాపకంగా మిగిలిపోలేదు. ప్రభువు ఈలోకంలో సంచరించి నపుడు ఎటువంటి రక్తమాంసాలతో కూడిన శరీరం కలిగి యున్నాడో పునరుత్థానం తరువాత కూడా యేసు మానవ శరీరాన్ని ఇప్పటికి కలిగి యున్నాడు.
ఈ విషయాన్నే కొంచెం లోతుగా మనం పరిశీలన చేద్దాం. పునరుత్తానికి ముందు యేసులో ఉన్న దైవస్వభావం దాచబడి మానవ స్వభావ పరిమితికి లోబడి జీవించాడు. యేసు మరణించి విజయుడై లేచినపుడు అనగా రక్షణ కార్యం ముగిసినపుడు యేసు యొక్క ఉనికిలో ఉన్న అన్ని మానవ పరిమితులు తొలగింపబడినవి అనగా విజయుడైన తరువాత ఆయనలోని మానవ లక్షణాలు దాచబడి పూర్తిగా దైవస్వభావం లోనికి వచ్చాడు.
అంటే ఆయనలోని మానవ స్వభావం బయటకు ఎక్కడికి పోలేదు గాని ఆయనలోనే దాచబడినది. అనగా ఇంకా మానవ లక్షణాలు అదృశ్యరూపంలో ఆయనలోనే ఉన్నవి. అవి అవసరమైనప్పుడు తిరిగి బయటకు రాగలవు. ఇంకా ఎందుకు యేసు తనలోని మానవ లక్షణాలను వదిలివేయకుండా ఇంకా తనలోనే దాచి యుంచాడు? అదృశ్యరూపంలో ఆయనలోనే దాచి యుంచబడిన మానవ లక్షణాలు తిరిగి ఎప్పటికైనా బయటకు రాగలవా? అవును ఒక ప్రత్యేక పని నిమిత్తం యేసు ఇప్పటికి ఇంకా మానవ స్వభావాన్ని తనలోనే దాచి యుంచాడు. ఏమిటి ఆ ప్రత్యేకమైన పని?
*🏵13. ప్రతి నేత్రము ఆయనను చూచును:* అయితే ఒకానొక సమయంలో తన సంఘంను తీసికొని వెళ్ళుటకు ఆయన తిరిగి ఈ లోకంలోనికి వచ్చినపుడు అనగా ఆయన యొక్క రెండవ రాకడ సమయంలో ఆయనలో దాచియుంచబడిన మానవ లక్షణాలు పూర్తిగా మరల బయటకు రాగలవు. అప్పుడు ప్రతి మానవ నేత్రం ఆయనను చూచును. యేసు రెండవ రాకడలో తిరిగి ఆయన మానవ లక్షణాలు బయల్పరచబడి ప్రతి నేత్రము చూచునట్లు తిరిగి మానవ శరీర ప్రత్యక్షతతో రాబోవు చున్నాడు. అంతే కాకుండా ఆయనలోని మానవ రూపంతో బాటుగా ఆయన దైవ స్వభావమైన మహిమ స్వరూపాన్ని కూడా ప్రతి నేత్రం చూడగలదు. దీనికి సంబంధించిన కొన్ని వాక్యభాగాలను పరిశీలన చేద్దాం.
(ప్రకటన 1:7 ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు..) ఆయన మేఘాలపై తిరిగి మానవ రూపంలో రెండవ రాక సందర్భంగా ప్రతి కన్నూ ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచినవారు కూడా ఆయనను చూస్తారు. భూజనాలన్నీ ఆయనను బట్టి గుండెలు బాదుకొంటారు. ఆయన మానవ రూపునిగా వస్తున్నాడు కాబట్టి ఆయనను ప్రతి నేత్రం చూడగలదు.
(తీతు 2:13 అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు...) ఇక్కడ పౌలు ఏమంటున్నాడో జాగ్రత్తగా గమనించండి. ఒక గొప్ప దివ్యమైన నిరీక్షణతో విశ్వాసులు ఎదురుచూస్తున్నది క్రీస్తు రహస్యమైన రీతిగా రావడం కోసం కాదు గానీ ప్రతి నేత్రం ఆయనను చూచునట్లుగాను మరియు మహిమ స్వరూపంతో ఆయన ప్రత్యక్షం కావడం కోసమే విశ్వాసులు అందరూ ఎదురు చూస్తున్నారు.
(2థెస్స 2:8 అప్పుడా ధర్మవిరోధి బయలుపరచ బడును. ప్రభువైన యేసు తన నోటియూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును...) అదే విధంగా అంత్య క్రీస్తు వెల్లడి చేయబడినప్పుడు ప్రభువు తన నోటి ఉపిరితో నాశనం చేస్తాడు, తన రాకడ దర్శన కాంతితో రూపుమాపుతాడు.
ఎత్తబడిన మనమందరం ఆతదుపరి యేసు పరిపాలనలో ఆయన ముఖ దర్శనం చేస్తూ ప్రభువుతో చిరకాలం ఉండగలం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా! ఇప్పుడు యేసు సర్వంతర్యామిగా ఉన్నాడని మనం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. ఆయన మనకు గనుక వాగ్దానం చేసినట్లుగా అదృశ్యరూపునిగా మనతో సదా ఉన్నాడు. అదే సమయంలో దేవుని కుడి పార్శ్యమున కూడా ఉన్నాడు.
*🏵14. సారాంశం:* “వాక్యం శరీరధారిఆయెను” అను ఈ అంశం యొక్క సారాంశాన్ని మరల ఒక సారి క్లుప్తంగా చూద్దాం. యేసు యొక్క మానవ అవతారం గొప్పమర్మం అని పౌలు తిమోతికి వ్రాశాడు.
1 తిమోతికి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై యున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
ఈ మర్మము అనగా ఒకే వ్యక్తిలో దైవ మానవ స్వభావాలు కలసి ఉండడం అనేది మనకు పూర్తిగా అర్థం అయ్యే విషయం కాదు; మనము కేవలం దీనిని విశ్వాసము ద్వారా మాత్రమే నమ్ముతాము. యేసు గురించి దేవుని వాక్యము ఏమైతే చెబుతుందో దానిని మాత్రమే మనము విశ్వసిస్తాము. వాక్యమైయున్న దేవుడు యేసుగా శరీర రూపం ధరించాడని బైబిల్లోని అనేక వాక్యాలను క్లుప్తంగా పరిశీలించాం.
ఈ వచనాలన్నీ యేసు, దేవుడు మరియు మానవుడని మనకు చూపుతాయి.
దైవిక స్వభావం మరియు మానవ స్వభావం ఒక వ్యక్తిగా యేసులో కలిసినందున మనము వాటిని నిజంగా వేరు చేయలేము అనే విషయాన్ని ప్రాముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి.
యేసులో ఉన్న దైవిక స్వభావం మరియు మానవ స్వభావం స్వతంత్రంగా పనిచేస్తాయని చెప్పడం సరికాదు. అనగా యేసు ఇపుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు మానవ లక్షణాలతో పనిలేదు కదాయని ఆయనలోని మానవ లక్షణాలు ఆయనను విడిచి పెట్టి వెళ్ళలేవు. కేవలం దాచబడ గలవు. ఆయన భూలోకంలో ఉన్నపుడు అవసరం లేదు కదాయని ఆయనలోని దైవలక్షణాలు ఆయనను విడిచి పెట్టలేవు. కేవలం ఆసమయంలో అవి కూడా దాచిపెట్టబడినవి.
మనం పైన చూసినట్లుగా, బైబిలు యేసు యొక్క రెండు స్వభావాలను వేరుచేయదు. బదులుగా యేసు తన యొక్క వ్యక్తిత్వంలో దైవిక మరియు మానవ లక్షణాలను కలిగి ఉన్నాడని బైబిలు వివరిస్తుంది.
దైవమానవునిగా ఆయన దైవిక ఘనతను కలిగి ఉన్నాడు, మరియు ఆ దైవమానవునిగా మాత్రమే యేసు మన రక్షణను పరిపూర్ణంగా సాధించాడు
*🏵ముగింపు:* వాక్యమైయున్న దైవస్వరూపుడు యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపి మనకు పరిపూర్ణుడైన రక్షకునిగా ఇచ్చినాడు. ఆయన తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనేలేదు.
మన విముక్తిని నెరవేర్చడానికి సాతానును శాశ్వతంగా ఓడించడానికి దైవ మానవ స్వభావాలు రెండూ కూడా అవసరమైనవి మరియు కలవవలసి యున్నవి. ఒకే వ్యక్తిత్వంగల దేవునిగా మరియు మనిషిగా యేసు, లోక పాపములను మోసికొని పోయిన దేవుని పరిపూర్ణమైన గొర్రె పిల్ల.
మనం జీవించలేని పరిపూర్ణమైన, పాపరహిత జీవితాన్ని దైవ మానవునిగా ఆయన గడిపాడు. మన పాపాలకు వెల చెల్లించి, వాటిని తీసివేయుటకు మన స్థానంలో ఆయన మరణించాడు. మన కొరకు మరణాన్ని ఓడించి విజయవీరుడై ఆయన మృతులలోని నుండి పునరుత్థానుడిగా తిరిగి లేచాడు.
యేసు మన దేవునిగా ఉండి, ఆయన జీవితం మరియు మరణం ద్వారా మన పాపాలకు మరియు సర్వలోకంలోని పాపాలకు వెల చెల్లించి అనంతమైన మేలు మనకు చేకూర్చాడు.
యేసు మన యొక్క మానవ స్వభావాన్ని పంచుకున్నందున, ఆయన ఇప్పుడు మనపై మనస్ఫూర్తిగా సానుభూతి ప్రదర్శించుటకు మన బాధలు శ్రమలు ఎరిగినవాడిగా మనకు సరిపోయిన దయగల ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలవాడు. (హెబ్రీయులకు 2: 17-18, 4:15)
మరియ యుగసమాప్తి వరకు సదాకాలము మనతో కూడ ఉండువాడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. హెబ్రీ 4:16.
ఆయనకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక! ఆమెన్!
("వాక్యం శరీరధారిఆయెను” అను ఈ అంశం సమాప్తం)
దైవాశ్శీసులు!
-
*✝యెష్షయి మొద్దు చిగురు – 1వ భాగం🌿*
(క్రిస్మస్ సందేశాలు - 27)
Immanuel Bible College
NIDUBROLU Guntur dt
శుభోదయం!
_(యెషయా 11:1 యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును)_
*🏵ఉపోద్ఘాతము:* ప్రవక్తైన యెషయా మెస్సియాను గూర్చి ఈ విధంగా వివరాలను అందజేస్తున్నాడు. “యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును; వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును.” యెషయా 11:1
ఈ ప్రవచనంలో మనం రెండు భాగాలను గమనించగలం.
*✳1. యెష్షయి మొద్దు*
*✳2. చిగురు*
ఈ రెండింటిని గూర్చి విపులంగా ధ్యానించుదాం.
*🏵1. యెష్షయి మొద్దు:* యెష్షయి మొద్దు గావించబడడం ఒక ప్రవచన నెరవేర్పు. మొద్దు అనగా నరికివేయబడిన తరువాత మిగిలేది. యెష్షయి దావీదుకు తండ్రి అని మనకు తెలుసు. ఆ యెష్షయి వంశం నరికి వేయబడి మోడైపోవునని ఆతరువాత అది చిగురించునని ప్రవచనం యొక్క భావం. ఈ ప్రవచనాలు ఎలా నేరవేరినవో చూద్దాం.
యెష్షయి వంశం నుండి దేవుడు దావీదును ఎన్నుకొని అభిషేకించి గొప్ప రాజుగా నియమించి దావీదు సింహాసం నిత్యము స్థిరమగునని అతని సంతానం శాశ్వతంగా ఉందురనే దేవుని గంభీర వాగ్ధానం యెష్షయి కుమారుడగు దావీదునకు ఇవ్వబడినది.
(కీర్తన 132:11-12 నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియ మింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన యెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుస రించిన యెడల వారి కుమారులు కూడ నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు.)
*🔯2. యెష్షయి వంశస్థులు చేసిన పాపము:* అయితే యూదా రాజులు ఇశ్రాయేలు రాజులు చేసిన పాపమును బట్టి దేవుని శిక్ష వారి మీదకు వచ్చింది. దావీదు కుమారులు దేవునికి ఎంతో ఆయాసం కలిగించిరి. దేవునికి దూరస్తులై, నీతి న్యాయములు జరిగించక, అనాధలకు, విధవరాండ్రకు ఉపద్రవము కలిగించుచు, నిరపరాధుల రక్తం చిందించిరి.
(యిర్మియా 22:3 యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడిన వానిని బాధపెట్టువాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశుల నైనను తండ్రిలేనివారి నైనను విధవరాండ్ర నైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయ కుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.)
వారు చేసిన పాపమును బట్టి విశాలమైన దావీదు రాజ్యం ముక్కలై ఆ తరువాత అష్షూరు, బబులోను, రోమా వారి చేతుల్లో పడి నాశనమై పోయింది. కారణం దేవుడు యిర్మియా ద్వారా వారికిచ్చిన శాపం.
యూదా చివరి రాజైన యెహోయాకీము మరియు అతని కుమారుడైన కొన్యా చేసిన బహు భయంకరమైన పాప కార్యాలకు ఫలితంగా దేవుని శాపం వారి మీదకు వచ్చింది.
(యిర్మియా 22:25-26 నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో నీవెవరికి భయపడు చున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబు కద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించు చున్నాను. నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మ భూమి కాని పరదేశము లోనికి విసరివేసెదను, మీరు అక్కడనే చచ్చెదరు.)
*🔯3. నెరవేరిన శాపం:* కొన్యా సంతాన హీనుడై బబులోను చెరకు వెళ్ళినందున ఇకమీదట ఎవరును రాజుగా ఉండరు అన్న దేవుని శాపం నెరవేరినది. (యిర్మియా 22:30 యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో *ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.*)
*🔯4. నరికివేయబడిన చెట్టు:* అంత గొప్ప చెట్టు నరికి వేయబడినది కేవలం వేరు మాత్రం మిగిలింది. (యెషయా 10:33 ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును)
దీనిని బట్టి దావీదు సింహాసమును అధిష్టించుటకు ఎవరును లేని పరిస్థితి ఏర్పడినది. కారణం వారి యొక్క పాపం మరియు దేవుని యెడల అవిధేయత. ఈ విధంగా యూదా రాజ్యం నరకబడి మోడై పోయినది. యెష్షయి వంశం మొద్దుగా మారినది. రాజ్యం ఎండిపోయినది. యూదులకు ఇక రాజులేడు. ఈ విధంగా యెష్షయి వంశం మొద్దై పోవుననే దేవుని ప్రవచనం పూర్తిగా నెరవేరినది.
*🔯5. దేవుడు చేసిన వాగ్దానం ఏమగును?:* మరి దావీదుకు దేవుడు ఇచ్చిన మాట, దావీదు సింహాసనం శాశ్వతంగా నిలుచునని దేవుడు చేసిన వాగ్దానం ఏమగును? సూర్యుడు ఉన్నంతకాలం చంద్రుడు ఉన్నంతకాలం దావీదు సింహసనము నిలుచునని దేవుడు చెప్పిన మాట ఏమగును?
(కీర్తన 89:34-37 నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండ బయలు వెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచ బడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను)
*🔯6. దేవుడు మాట మార్చువాడు కాదు:* దేవుడు అబద్ధమాడువాడు కాదు కదా! దేవుని మాటలు ఎన్నడైనా నిరర్ధకమగునా? మన దేవుడు ఇచ్చిన మాట తప్పువాడు కాదు. భూమి ఆకాశములు గతించినా గతించును గాని దేవుని మాటలు గతించవు.
(మత్తయి 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.)
*🔯7. దేవునికి అసాధ్యమైనది లేదు:* ఆయనకు అసాధ్యమైనది ఏదైనా గలదా? దేవుడు వాగ్దానం చేసినదానిని నెరవేర్చుటకు సమర్ధుడు. (మత్తయి 19:26 యేసు వారిని చూచిఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను, లూకా 1:37 దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని ఆమెతో చెప్పెను, రోమా 4:21 ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడు. యిర్మియా 32:17 యెహోవా, ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలము చేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు)
*🔯ముగింపు:* ఇటువంటి పరిస్థితులలో దేవుడు దావీదుకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. దావీదు సింహాసనం శాశ్వతంగా నిలుచునని దేవుడు దావీదుకు ఇచ్చిన వాగ్దానం తన కుమారుడైన యేసు ద్వార ఎలా నేరవేర్చాడో తదుపరి పాఠంలో చూద్దాం.
(To be continued..)
దైవాశ్శీసులు!
-
*✝దావీదురాజుకు చిగురుగా వచ్చిన యేసురాజు🌿*
(యెష్షయి మొద్దు చిగురు – 2వ భాగం)
(క్రిస్మస్ సందేశాలు 28)
Immanuel Bible College
NIDUBROLU Guntur dt
శుభోదయం!
_(ప్రకటన 22:16 నేను *దావీదు వేరు చిగురును సంతానమును,* ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.)_
*🏵ఉపోద్ఘాతము:* యెష్షయిలో నుండి వచ్చిన దావీదు వృక్షం ఏరీతిగా నరికివేయబడి మొద్దుగా మారినదో మొదటి భాగంలో చూశాం. అయితే దావీదు సింహాసనం శాశ్వతం అని దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చుట కొరకు యేసు యెష్షయి మొద్దులో నుండి చిగురుగా ఎలా అంకురించాడో పరిశీలన చేద్దాం.
(రోమా 15:12 యెష్షయిలో నుండి వేరు చిగురు, అనగా *అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును*; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.)
దావీదు సంతానంగా *యేసు యెష్షయి మొద్దులో నుండి చిగురుగా* ఈ లోకానికి వచ్చినాడు. యెష్షయి దావీదుకు తండ్రి. ఈ చిగురు పుట్టేది దావీదు వంశంనుండే. ఈ అంకురం లేక చిగురు ప్రభువైన యేసే. యెషయా 7:14లోనూ 9:6,7లోనూ ఉన్న అభిషిక్తుడు, కుమారుడు, శిశువు మరెవరో కాదు. దావీదుకు చిగురు అయిన యేసు.
ఇదే విషయాన్ని పౌలు భక్తుడు తన రోమా పత్రికలో వ్రాస్తూ యేసు తన శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా వచ్చాడని వ్రాశాడు. రోమా 1:5 యేసుక్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడై నందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.
ప్రకటన 22:16 నేను *దావీదు వేరు చిగురును సంతానమును,* ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.
దావీదు సింహాసం అధిష్టించుటకు ఎవరు కూడా అర్హులు లేని కారణంగా మరియు దావీదు సింహాసనం శాశ్వతం అని దేవుడిచ్చిన వాగ్దానం నేరవేర్పు కొరకు ఆ దేవాది దేవుడు తానే దావీదు కుమారునిగా జన్మించి తన వాగ్దానం నెరవేర్చెను. కన్య మరియతో దేవదూత చెప్పిన సారాంశం ఇదే.
ఏ గ్రామంలో దావీదు జన్మించేనో, ఏ స్థలంలో దావీదు గృహమున్నదో, ఏ స్థలంలో దావీదు పుట్టెనో అదే స్థలం యేసు జన్మించు కాలానికి పశువుల పాకగా ఉన్నదని బైబిల్ పండితుల అభిప్రాయం.
ఆవును, పాప ప్రభావం ద్వారా నరికివేయబడుచున్న సమస్త మానవాళిని రక్షించుటకును, మొద్దుగా మారిపోయిన దావీదు వంశమునకు చిగురుగా వచ్చిన యేసే *నిజమైన దావీదు కుమారుడనే* రహస్యాన్ని గ్రహించిన గ్రుడ్డివారు *దావీదు కుమారుడా* మమ్మును కరుణించుమని అయనను వేడుకొన్నారు.
గ్రుడ్డివాడిన బర్తిమయి కూడా ఇదే సత్యాన్ని గ్రహించి *దావీదు కుమారుడా* నన్ను కరుణించుము అని కేకలు పెట్టాడు. మార్కు 10:46-48
దావీదుకు చిగురుగా దావీదుకుమారునిగా యేసు ఒక చిన్న అంకురంగా పుట్టి ఎదిగి తన యొక్క దివ్యలక్షణాలతో యెష్షయి మొద్దును మహావృక్షంగా మార్చాడు. యెష్షయిల మొద్దులో నుండి వచ్చిన *చిగురు యొక్క కొన్ని లక్షణాలను* వరుసగా చూద్దాం.
*🏵1. రాజుగా ఏలుటకు వచ్చిన చిగురు:* (రోమా 15:12 మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలో నుండి *వేరు చిగురు, అనగా అన్యజనులను ఏలుటకు* లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.)
దావీదుకు చిగురుగా వచ్చిన యేసు ఆయన సర్వోన్నతుడైన దేవుని అవతారం, ప్రపంచాన్ని భావి కాలంలో పరిపాలించ బోతున్నవాడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యేసు క్రీస్తు.
(లూకా 1:32 -33 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును; ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను.)
అనేక మందికి ఆయన రాజుగా విచారణ చేయును. (“ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును, ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.” యెషయా 11:10)
చిగురు ఏలుబడిలో అంతా నెమ్మది మరియు రాజ్యము నిత్యము స్థిరపరచ బడును. (2సమూ 7:11-13 నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి యున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయున దేమనగా నేను నీకు సంతానము కలుగ జేయుదును. నీ దినములు సంపూర్ణములగు నప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను.)
*🏵2. చిగురు ఎదిగి ఫలించునది:* (యెషయా 11:1 యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి *అంకురము ఎదిగి ఫలించును*)
చిగురుగా పుట్టిన యేసు ఎదిగి రక్షణ ఫలాలను ఫలింప జేయువాడు. ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో, వారు సమృద్ధిగా ఫలిస్తారు. (యోహాను 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచి యుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును.)
క్రీస్తులో నుండి జీవం మనలోనికి సమృద్ధిగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే చిగురుగా పుట్టి మహావృక్షంగా ఎదిగిన క్రీస్తులో మనం నిలిచి యుండాలి. అప్పుడే మనలోనికి జీవం ప్రవహించ గలదు. యేసులో నిలిచి యుండుట అనగా ఆయన శరీరంలో అవయవాల్లాగా (1 కొరింతు 12:12,13), ఆయన ఆలయంలో రాళ్ళలాగా (ఎఫెసు 2:20-22), ఆయన కుటుంబంలో సభ్యుల్లాగా (హెబ్రీ 3:6), ద్రాక్షచెట్టయిన ఆయనలో కొమ్మల్లాగా నిలిచి ఉండాలి.
నిలిచి యుండాలి అనగా ఆయన వాక్యంలో నిలిచి యుండాలి. ఆయన సత్యాన్ని మనలో ఉండనివ్వాలి. ఆయన వెల్లడించిన సత్యాలను నమ్మడంలో మన జీవితాలు ముందుకు కొనసాగాలి. అప్పుడే మనం చిగురు ద్వారా సమృద్ధిగా ఫలించగలం.
మనం ఫలించడం అనేది మప గౌరవం కోసం కాదు గానీ, అది దేవుని మహిమ నిమిత్తమే. వేరే మాటల్లో చెప్పాలంటే విశ్వాసుల్లో తన పని ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది.
*🏵3. సేవకునిగా చిగురు:* ఆయన ఈ లోకమునకు పరిచారకుడుగా వచ్చెను. సేవకుని రూపం దాల్చెను. (జెకర్యా 3:8 ప్రధాన యాజకుడవైన యెహోషువా, నీయెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింప వలెను, ఏదనగా *చిగురు అను నా సేవకుని* నేను రప్పింపబోవు చున్నాను.)
సేవకుడుగా వచ్చినాడు గనుకనే రాజభవనంలో జన్మించక బెత్లేహేములోని పసుల పాకలో జన్మించాడు. (మత్తయి 20:28 ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును వచ్చెను.)
సేవకునిగా పుట్టిన యేసును గురించి ప్రవక్తలు ఎన్నో ప్రవచనాలు చెప్పారు. (యెషయా 42:1 ఇదిగో నేను ఆదుకొను *నా సేవకుడు* నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.)
చిగురు అను సేవకుడు జ్ఞానంతో చేసిన అద్భుతమైన సేవ వలన. దేవుడు చిగురుగా ఉన్న సేవకుని అత్యధికంగా హెచ్చించడం, ఉన్నత స్థితికి తేవడం, అధికంగా ఘనపరచడం జరుగుతుంది. (యెషయా 52:13 ఆలకించుడి, *నా సేవకుడు* వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును. 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన *నా సేవకుడు* జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.)
దేవుడు సృష్టించిన విశ్వమంతటి కంటే, దాని శక్తులు, ప్రభుత్వాలన్నిటి కంటే అత్యున్నతంగా చిగురైన సేవకుడు ఉన్నత స్థలానికి వెళ్ళి తన తండ్రి సింహాసనంపై కూర్చుంటాడు. ఏ మనిషి గానీ దేవదూత గానీ ఒకప్పుడు జీవించి ఉన్నవారూ ఇప్పుడు జీవిస్తున్నవారూ ఎవరూ కూడా బలప్రభావాలలో, అధికారంలో, మహిమలో, ఘనతలో యేసు కాలిగోటికి కూడా సాటిరారు. (ఎఫె 2:21-23.)
యేసు ఒక సేవకుడుగా తనను తగ్గించుకున్నంత హీన స్థితికి ఎవరూ తగ్గించుకోలేదు. అందువలన ఆయన హెచ్చించ బడినంత ఉన్నత స్థితికి ఎవరినీ హెచ్చించడం జరగలేదు. ఆయన మాత్రమే దానికి అర్హుడు కాబట్టి ఆయనకు ఎంతో ఎత్తయిన స్థానం ఉంది. (ఫిలిప్ఫీ 2:9-11)
దావీదు చిగురు యొక్క మరి కొన్ని లక్షణాలు రేపు చూద్దాం: (To be continued..)
దైవాశ్శీసులు!
- పాస్టర్ జ్యోతిరాజు బెంజమిన్ వేముల
ప్రిన్సిపాల్
ఇమ్మానుయేల్ బైబిల్ కాలేజి
నిడుబ్రోలు
=========================
For daily messages
WhatsApp no 9346945687
🧚🧚🔥🧚🧚🔥🧚🧚🔥🧚🧚
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి