ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ సందేశాలు

✳ *క్రిస్మస్ సందేశాలు* ✳

(26 వ భాగము )

*యెష్షయి మొద్దు చిగురు – 1వ భాగం*


_(యెషయా 11:1 యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును)_

ప్రవక్తైన యెషయా మెస్సియాను గూర్చి ఈ విధంగా వివరాలను అందజేస్తున్నాడు. “యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును; వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును.” యెషయా 11:1

ఈ ప్రవచనంలో మనం రెండు భాగాలను గమనించగలం. 

👉 *1. యెష్షయి మొద్దు* 
👉 *2. చిగురు*

ఈ రెండింటిని గూర్చి విపులంగా ధ్యానించుదాం.

*1. యెష్షయి మొద్దు:* యెష్షయి మొద్దు గావించబడడం ఒక ప్రవచన నెరవేర్పు. మొద్దు అనగా నరికివేయబడిన తరువాత మిగిలేది. యెష్షయి దావీదుకు తండ్రి అని మనకు తెలుసు. ఆ యెష్షయి వంశం నరికి వేయబడి మోడైపోవునని ఆతరువాత అది చిగురించునని ప్రవచనం యొక్క భావం. ఈ ప్రవచనాలు ఎలా నేరవేరినవో చూద్దాం.

యెష్షయి వంశం నుండి దేవుడు దావీదును ఎన్నుకొని అభిషేకించి గొప్ప రాజుగా నియమించి దావీదు సింహాసం నిత్యము స్థిరమగునని అతని సంతానం శాశ్వతంగా ఉందురనే దేవుని గంభీర వాగ్ధానం యెష్షయి కుమారుడగు దావీదునకు ఇవ్వబడినది.  

(కీర్తన 132:11-12 నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియ మింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన యెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుస రించిన యెడల వారి కుమారులు కూడ నీ సింహాసనము మీద నిత్యము  కూర్చుందురని యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు.) 

అయితే యూదా రాజులు ఇశ్రాయేలు రాజులు చేసిన పాపమును బట్టి దేవుని శిక్ష వారి మీదకు వచ్చింది. దావీదు కుమారులు దేవునికి ఎంతో ఆయాసం కలిగించిరి. దేవునికి దూరస్తులై, నీతి న్యాయములు జరిగించక, అనాధలకు, విధవరాండ్రకు ఉపద్రవము కలిగించుచు, నిరపరాధుల రక్తం చిందించిరి. 

(యిర్మియా 22:3 యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయ కుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.) 

వారు చేసిన పాపమును బట్టి విశాలమైన దావీదు రాజ్యం ముక్కలై ఆ తరువాత అష్షూరు, బబులోను, రోమా వారి చేతుల్లో పడి నాశనమై పోయింది. కారణం దేవుడు యిర్మియా ద్వారా వారికిచ్చిన శాపం.  

యూదా చివరి రాజైన యెహోయాకీము మరియు అతని కుమారుడైన కొన్యా చేసిన బహు భయంకరమైన పాప కార్యాలకు ఫలితంగా దేవుని శాపం వారి మీదకు వచ్చింది. 

(యిర్మియా 22:25-26 నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో నీవెవరికి భయపడు చున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబు కద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించు చున్నాను. నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మ భూమి కాని పరదేశము లోనికి విసరివేసెదను, మీరు అక్కడనే చచ్చెదరు.) 

కొన్యా సంతాన హీనుడై బబులోను చెరకు వెళ్ళినందున ఇకమీదట ఎవరును రాజుగా ఉండరు అన్న దేవుని శాపం నెరవేరినది. (యిర్మియా 22:30 యెహోవా ఈలాగు సెల  విచ్చుచున్నాడు సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో *ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.*) 

అంత గొప్ప చెట్టు నరికి వేయబడినది కేవలం వేరు మాత్రం మిగిలింది. (యెషయా 10:33 ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును)

దీనిని బట్టి దావీదు సింహాసమును అధిష్టించుటకు ఎవరును లేని పరిస్థితి ఏర్పడినది. కారణం వారి యొక్క పాపం మరియు దేవుని యెడల అవిధేయత. ఈ విధంగా యూదా రాజ్యం నరకబడి మోడై పోయినది. యెష్షయి వంశం మొద్దుగా మారినది. రాజ్యం ఎండిపోయినది. యూదులకు ఇక రాజులేడు. ఈ విధంగా యెష్షయి వంశం మొద్దై పోవుననే దేవుని ప్రవచనం పూర్తిగా నెరవేరినది. 

మరి దావీదుకు దేవుడు ఇచ్చిన మాట, దావీదు సింహాసనం శాశ్వతంగా నిలుచునని దేవుడు చేసిన వాగ్దానం ఏమగును? సూర్యుడు ఉన్నంతకాలం చంద్రుడు ఉన్నంతకాలం దావీదు సింహసనము నిలుచునని దేవుడు చెప్పిన మాట ఏమగును?

(కీర్తన 89:34-37 నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండ బయలు వెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచ బడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను)

దేవుడు మాట మార్చువాడు కాదు కదా! దేవుడు అబద్ధమాడువాడు కాదు కదా! దేవుని మాటలు ఎన్నడైనా నిరర్ధకమగునా? మన దేవుడు ఇచ్చిన మాట తప్పువాడు కాదు. భూమి ఆకాశములు గతించినా గతించును గాని దేవుని మాటలు గతించవు. 

(మత్తయి 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.) 

ఆయనకు అసాధ్యమైనది ఏదైనా గలదా? దేవుడు వాగ్దానం చేసినదానిని నెరవేర్చుటకు సమర్ధుడు. (మత్తయి 19:26 యేసు వారిని చూచిఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను, లూకా 1:37 దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థ కము కానేరదని  ఆమెతో చెప్పెను, రోమా 4:21  ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడు. యిర్మియా 32:17 యెహోవా, ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలము చేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు)

ఇటువంటి పరిస్థితులలో దేవుడు దావీదుకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు. దావీదు సింహాసనం శాశ్వతంగా నిలుచునని దేవుడు దావీదుకు ఇచ్చిన వాగ్దానం తన కుమారుడైన యేసు ద్వార ఎలా నేరవేర్చాడో తదుపరి పాఠంలో చూద్దాం. 
(To be continued..)

 దైవాశ్శీసులు!

- పాస్టర్ జ్యోతిరాజు వేముల
ప్రిన్సిపాల్
ఇమ్మానుయేల్ బైబిల్ కాలేజి 
నిడుబ్రోలు 

కామెంట్‌లు