✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(15 వ భాగము )
*ఎవరీ శిశువు – నిత్యుడగు తండ్రి*
(యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింప బడెను - *నిత్యుడగు తండ్రి*)
➡ *A. నిత్యుడగు తండ్రి ఎవరు:* ఈ పేరులో తండ్రి అనే మాట వచ్చింది కాబట్టి చాలమంది *నిత్యుడగు తండ్రి* అంటే యెహోవా దేవుడని భావిస్తారు. కాని ఇక్కడ నిత్యుడగు తండ్రి అనే పేరు కుమారునికి ఇవ్వబడినది. నిత్యుడగు తండ్రి అనే మాట తండ్రియైన యెహోవా దేవునికి చెందినది కాదు. కారణం కుమారుడైన యేసుప్రభువు తరచుగా తండ్రికి వేరుగా తనను చెప్పుకొన్నాడు (మత్తయి 11:27).
➡ *B. తండ్రి క్రమశిక్షణ పిల్లలకు అవసరం:* మరి పుట్టిన శిశువునకు నిత్యుడగు తండ్రి అని ఎలా పేరు పెట్టబడినది? దీనికి కారణం ఆ శిశువు మీద ఉంచబడిన బాధ్యతను బట్టి. యెషయా కాలంలోని ప్రజలు క్రమశిక్షణ తప్పిన స్థితిలో ఉన్నారు. వారిని సరైన దారిలోనికి తీసుకురావాలంటే *ప్రేమతో కూడిన క్రమశిక్షణ* వారికి అవసరమైనది. ఉపాధ్యాయులు పిల్లలను క్రమశిక్షణలో పెట్టగలరు గాని అందులో ప్రేమ ఉండదు. తల్లి అయితే బిడ్డలకు కావలసినంత ప్రేమను ఇవ్వగలదు గాని ఖచ్చితమైన క్రమశిక్షణను ఇవ్వలేదు. *ప్రేమతో కూడిన క్రమశిక్షణ* ఇవ్వగలిగినవాడు కేవలం “నాన్న” మాత్రమే.
తల్లి ప్రేమ అద్భుతమే కాని నాన్న ప్రేమ క్రమశిక్షణతో కూడి ఉంటుంది గనుక తండ్రి ప్రేమ మహాద్భుతం. అందుకే తండ్రి యొక్క ప్రేమతో కూడిన క్రమశిక్షణ పిల్లలకెంతో ముఖ్యం. అది వారి భవిష్యత్తుకు బంగారుబాట వేస్తుంది. నిత్యుడగు తండ్రి యేసు యొక్క ప్రేమతో కూడిన క్రమశిక్షణ వలన పిల్లలమైన మనము మానసికంగా యేసుకు ఎంతో దగ్గరవుతాము.
➡ *C. నిత్యుడగు తండ్రి బాధ్యత:* ఒక తండ్రి పిల్లల యొక్క అభిప్రాయాలనూ పంచుకోవడానికి… మంచీచెడూ నిర్ణయించుకోవడానికీ ముందు పిల్లలకు దగ్గరై వారితో కలసిపోవాలి. పిల్లల సమస్యలు ఈ దగ్గరితనం వలన తండ్రి తెలుసుకోగలడు. ఎల్లపుడు తండ్రి ఒక స్నేహితుని మాదిరిగా పిల్లలకు అందుబాటులో ఉన్నట్లుగా *నిత్యుడగు తండ్రిగా యేసు* పిల్లలమైన మనకు దగ్గరగుటకు ఈలోకంలో పుట్టాడు. తండ్రి బాధ్యత పిల్లలకు రక్షణగా ఉడుట. అదే పని యేసు చేశాడు.
తండ్రివలే మనకు కావలసిన ముందు జాగ్రత్తలు అన్నీ వాక్యం ద్వార చెపుతాడు. ఈలోక జీవిత చదువులో మనకు కావలసిన సలహాలిస్తాడు. సమాజంలో జరగుతున్న మార్పులను మనకు విశదీకరిస్తాడు.
ఆత్మ జ్ఞానంతోబాటుగా ఈ లోకంలో జీవించుటకు కావలసిన వ్యవహారజ్ఞానం కూడా పెంచుతాడు. ఆపదకాలంలో వెన్నంటి నిలుస్తాడు. సమస్య వచ్చిందంటే బాసటగా నిలుస్తాడు. మన యొక్క ఆత్మీయ వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ అనుబంధంతో కూడిన నిత్యుడగు తండ్రి యేను యొక్క మార్గదర్శకత్వం అవసరం.
ముఖ్యంగా నూతనంగా సంఘంలో చేరి ఆత్మీయంగా ఎదుగుచున్న బిడ్డలకు తండ్రి అండాదండా ఎంతో అవసరం. ఆయన పిల్లలమైన మనము మనలో రేకెత్తే భావోద్వేగాలను, అనుమానాలను మనలోనే అణచుకోకుండా పంచుకోవడానికి తండ్రిని మించిన తోడు లేదు.
తల్లి నవమాసాలే మోస్తుంది. కానీ తండ్రి బిడ్డకో దారి చూపించేవరకూ వారి బరువు బాధ్యతలను పిల్లలు బ్రతికినంత కాలం తండ్రి మోసినట్లుగా నిత్యుడగు తండ్రి అనబడిన యేసుకూడా పక్షిరాజు తన పిల్లలను రెక్కలపై మోయునట్లు మనలను మోయుటకు ఈలోకంలో జన్మించాడు.
పిల్లలు ఎదిగేకొద్ది తల్లికి దూరం అవుతూ తండ్రికి దగ్గరవుతారు గనుక తండ్రే అన్నీ తానై, పిల్లలను ఎంతో బాధ్యతతో, ప్రేమతో పెంచుతాడు. అదే విధంగా మనం ఆత్మీయంగా ఎదిగేకొద్ది లోక జీవితానికి దూరమై నిత్యుడగు తండ్రికి దగ్గరకావాలి. అప్పుడు మనకు ఎన్ని కష్టాలొచ్చినా, ధైర్యంగా ఎదుర్కొంటూ యేసు ద్వారా ముందుకు నడవగలం. అందుకు ఎదురైన కష్టనష్టాలను ఆనందంగా నిత్యుడగు తండ్రిగా యేసు భరిస్తాడు. అదే తండ్రి బాధ్యత.
➡ *D. నిత్యుడగు తండ్రి ప్రేమ:* పిల్లల పెంపకాన్ని, ప్రేమనూ పంచుకోవడంలో… బంధాలను పటిష్ట పరచుకోవడంలో… నమ్మకాన్ని, విలువలనూ పెంపొందించు కోవడంలో *తండ్రి ప్రేమ* గొప్పది. పిల్లందరూ మురిసిపోదగ్గది. అందుకే యేసును నిత్యుడగు తండ్రిగా స్వీకరించిన వారి ధన్యత ఎంతో గొప్పది మురిసిపోదగ్గది.
పిల్లలను ప్రేమించి వారి అభివృద్ధి కోసం శ్రమించే ఈ లోకపు తండ్రులు కేవలం కొద్ది కాలం మాత్రమే ఉంటారు. కాని తన పిల్లల ఆత్మీయ అభివృద్ధి కోసం అనుక్షణం వారిని ప్రేమిస్తూ శ్రమిస్తూ మనం పరలోక రాజ్యం చేరేవరకు మనతో శాశ్వత కాలం ఉండే తండ్రివలే యేసు ఈ లోకానికి అవసరమైనాడు.
అందుకే కుమారుడుగా జన్మించిన యేసు ఒక తండ్రి మాదిరిగా తన ప్రేమను క్రమశిక్షణను మనకు నిత్యము ఇచ్చుటకు “నిత్యుడగు తండ్రి” అనే పేరుతో ఈ లోకంలో జన్మించాడు. ఇటివంటి గొప్ప భాత్యతను నిర్వహించడానికే ఆ కుమారుడు మన తండ్రిగా నిత్యం ఉండుటకు వచ్చాడు గనుక ఈ కోణంలో నుండి చూస్తే పుట్టిన శిశువుకు “నిత్యుడగు తండ్రి” అనుపేరు చక్కగా సరిపోయినది.
హీబ్రూ భాషలో దీని అర్థం నిత్యత్వం గలవాడు. అంటే పుట్టిన శిశువైన యేసు, మనకు *తండ్రిలాంటి ప్రేమను* పంచడానికి అనాదినుండి సిద్ధంగా ఉన్నవాడు. అంటే నిత్యుడగు తండ్రి అను పేరుకు అర్ధమేమనగా మనకొరకు పుట్టిన శిశువైన యేసు, మానవుల కొరకైన ఉనికిలో శాశ్వతకాలం ఉండువాడు అని అర్ధం.
మీకా 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.
➡ *E. నిత్యుడగు తండ్రి అను పేరుతో వచ్చిన యేసు మన కొరకు చేయు నిత్యమైన కార్యములు:*
👉 *1. నిత్యమైన జీవము ఇచ్చును:* నిత్యుడగు తండ్రి అను పేరుకు భావం మన కొరకు పుట్టిన ఆ ఆశిశువు అనంత యుగాలకు కూడా మన యెడల ఆ యేసు తండ్రిలాంటి ప్రేమను గలిగి నిత్య జీవాన్ని మనుషులకు ఇచ్చేవాడు అని అర్ధం. (యోహాను 17:2 నీవు నీ కుమారుని కిచ్చిన వారికందరికిని ఆయన *నిత్యజీవము* అనుగ్రహించునట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి.)
👉 *2. నిత్యమైన కృప ఇచ్చును:* యెషయా 54:8 *నిత్యమైన కృపతో* నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు
👉 *3. నిత్యమైన సంతోషం ఇచ్చును:* యెషయా 51:11 యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు *నిత్యసంతోషము* వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును
👉 *4. నిత్యమైన రక్షణ ఇచ్చును:* యెషయా 45:17 యెహోవావలన ఇశ్రాయేలు *నిత్యమైన రక్షణ* పొంది యున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొంద కయు నుందురు.
👉 *5. నిత్యమైన విమోచన ఇచ్చును:* హెబ్రీ 9:11 అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే *నిత్యమైన విమోచన* సంపాదించి
👉 *6. నిత్యమైన ఆదరణ ఇచ్చును:* 2 ధేస్స 2:16 మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత *నిత్యమైన ఆదరణయు*, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును...
👉 *7.నిత్యమైన మహిమ ఇచ్చును:* 2 తిమోతి 2:10 అందుచేత ఏర్పరచబడినవారు *నిత్యమైన మహిమతో* కూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొను చున్నాను
👉 *8. నిత్యమైన వెలుగు ఇచ్చును:* యెషయా 60:19 యెహోవాయే నీకు *నిత్యమైన వెలుగవును* నీ దేవుడు నీకు భూషణముగా ఉండును
👉 *9.నిత్యమైన శక్తి ఇచ్చును:* రోమా 1:20 ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన *నిత్యశక్తియు* దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.
👉 *10. నిత్యమైన స్వాస్థ్యము ఇచ్చును:* హెబ్రీ 9:15 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు *నిత్యమైన స్వాస్థ్యమును* గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు. 2 కొరి 5:1 భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమై పోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు *నిత్యమైనదియునైన నివాసము* పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
➡ *F. నిత్యుడగు తండ్రి ఆయిన యేసును నిరాకరించిన వారి స్థితి:* నిత్యుడగు తండ్రి
అను పేరుతో వచ్చి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టిన యేసు యొక్క ప్రేమను నిరాకరించువారి పరిస్థితి భయంకరముగా ఈ క్రింద చెప్పబడిన విధంగా ఉండును.
👉 *1. నిత్యమైన నాశనం:* కీర్త 92:7 *నిత్యనాశనము* నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు
👉 *2. నిత్యమైన తీర్పు:* హెబ్రీ 6:2 దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరు త్థానమును, *నిత్యమైనతీర్పును* అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము.
👉 *3. నిత్యమైన అపవాదం:* యిర్మీయా 23:40 ఎన్నడును మరువబడని *నిత్యాపవాదమును* నిత్యావమానమును మీమీదికి రప్పిం చెదను.
👉 *4. నిత్యమైన అవమానం:* యిర్మియా 20:11 వారెన్నడును మరువబడని *నిత్యావమానము* పొందుదురు.
👉 *5. నిత్యమైన అగ్ని దండన:* యూదా 1:7 ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణ ములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున *నిత్యాగ్నిదండన* అనుభవించుచు దృష్టాంత ముగా ఉంచబడెను
👉 *6. నిత్యమైన శిక్ష:* 1 సమూ 3:13 తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొను చున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి *నిత్యమైన శిక్ష* విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.
👉 *7. నిత్యమైన హేయము:* దాని 12:2 మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును *నిత్యముగా హేయులగుటకును* మేలుకొందురు.
కనుక ప్రియ మిత్రులారా! ఆ నిత్యుడగు తండ్రి అను పేరు గలిగిన యేసు ఆన్నిటికి మూలమని గ్రహించి ఆ ప్రభువుయొక్క నిత్యమైన కట్టడలను అనుసరించి ఆయన యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశించి నిత్యానందం పొందుకునేందుకు దేవుని కృప నిత్యము మనకు తోడుగా ఉండునుగాక! ఆమెన్!
దైవాశ్శీసులు!
From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి