——— సామెతలు ———
క్లుప్త ధ్యానములు ( Part: 11)
యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.
సామెతలు 2: 6-8
జ్ఞానము ఎక్కడ దొరుకుతుందో అక్కడే వెదకాలి. దేవుళ్ళని చెప్పుకొనేవారు అనేకమందిగా వుండొచ్చుగాని, జీవముగలిగి, జ్ఞానమిచ్చుదేవుడు ఒక్కడే.
♻️ యెహోవాయే జ్ఞానమిచ్చువాడు
👉 జ్ఞానశౌర్యములు ఆయనయొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. యోబు 12:13
👉 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.
కొలస్సి 2:3
♻️ ఆయన అనుగ్రహించే జ్ఞానము:
🔹పవిత్రమైనది
🔹సమాధానకరమైనది,
🔹మృదువైనది,
🔹సులభముగా లోబడునది,
🔹కనికరము తోను
🔹మంచి ఫలములతోను నిండుకొనినది
యాకోబు 3:17
♻️ మోసకరమైన జ్ఞానము చేత చెరపట్టబడకుండా జాగ్రత్తగా చూచుకోవాలి:
లోకసంబంధమైమ మూలపాఠముల వలన, మన పూర్వీకుల ద్వారా సంక్రమించినది జ్ఞానం కాదు. యెహోవాయందు భయభక్తులు నిలపడం ద్వారా మాత్రమే జ్ఞానం లభిస్తుంది.
ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది; కొలస్సి 2:8,9
♻️ ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు
ఆయనే కేడెముగా వుంటే, సాతాను సంధించే ఎట్లాంటి అగ్ని బాణమైనను ఆయనను దాటుకొని, మనమీదకు రాలేదు.
👉 యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.
ఆది 15:1
👉 ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము. ద్వితి 33:29
👉 యెహోవా, నీవే నాకు కేడెముగానునీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. కీర్తనలు 3:3
♻️ తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.
న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఆయన కనిపెట్టకుంటే, న్యాయాన్ని తప్పిపోతాము. ఆయన కాయకపోతే. మన ప్రవర్తనే చెడిపోతుంది.
👉 యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును. కీర్తనలు 97:10
ఇవన్నీ ఎవరికి సాధ్యమంటే? యెహోవాయందు భయభక్తులు గలిగి, తత్ ఫలితంగా జ్ఞానాన్ని పొందుకున్నవారికి మాత్రమే. వారిలో మనమునూ వుండి, ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి