ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సామెతలు

◻️——— సామెతలు ——— ◻️
      క్లుప్త ధ్యానములు ( Part: 6)

పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును. సామెతలు 1 : 16-19

బోయవాడు పక్షులను వేటాడడంలో ఎంతటి ప్రావీణ్యుడైనప్పటికీ, అతడు వలపన్నే సమయంలో పక్షులు చూసాయంటే ఎగిరిపోతాయి. అతని ప్రావిణ్యం ఏమి పనిచేయదు. అట్లానే, మనము ఎవరితో స్నేహం చేస్తున్నామో, వారి దుర్మార్గత విషయంలో అప్రమత్తముగా ఉండగలిగితే , వాని వలలో చిక్కకుండా, పక్షివలే తప్పించుకొని ఎగిరిపోగలము. వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము. (సామెతలు 6:5) అదెట్లా సాధ్యం? అట్టి జ్ఞానమును అనుగ్రహించగలిగే, జ్ఞానమైయున్న దేవునిపైన ఆధారపడగలిగినప్పుడు, “వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును”.  కీర్తనలు 91:3

దుర్మార్గ క్రియలు జరిగించే వారి జీవితాలు ఎట్లా వుంటాయంటే? వేరొకరు వారిని నాశనం చెయ్యాల్సిన అవసరం లేదు. వారికివారే నాశనాన్ని సమకూర్చుకుంటారు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు.

🔹వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను. కీర్తనలు 7:15

🔹నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో  తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక. (కీర్తనలు 35 :7,8)

🔹గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును.(సామె 26:27) తాను త్రవ్విన గుంటలో తానే పడువాడు, తాను పన్నిన వలలో, తానే చిక్కుకొనువాడు, పక్షులకున్న జ్ఞానం కూడా లేనివాడిని అర్ధమవుతుంది. అందుకే, భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము. సామెతలు 4:14,15

🔹 దుష్ట క్రియల అంతిమ ఫలితం మరణమే.

యథార్థమైన నీతి జీవదాయకము  దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే  చేయును. (సామెతలు 11:19) దుష్ట క్రియలు చేసేవారితో చేరకుండా, యదార్ధమైన నీతిగలిగిన జీవితం జీవించగలగాలి. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!  ఆమెన్!  ఆమెన్!

కామెంట్‌లు