✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳
(పదిహేడవ భాగము)
2⃣8⃣ *యోసేపు యొక్క భార్య ఆసెనతు*
యోసేపు అనగా “ఫలించెడి కొమ్మ “ అని అర్థము. ఇతడు మన అది పితరుడైన యకోబుకు రాహేలు ద్వారా కలిగిన ప్రధమ పుత్రుడు. రాహేలుకు వరపుత్రుడైన యోసేపును తండ్రి తన మిగిలిన కుమారులకన్నా అధికముగా ప్రేమించేవాడు. అందుకు గుర్తుగా రంగురంగుల నిలువుటంగీనీ ప్రత్యేకముగా కుట్టించాడు.
ఈ ప్రత్యేకతను సహించలేని అన్నలు అసూయతో నిండినవారై, బాల్యమునుండీ అతనిని ద్వేషింపసాగారు. యాకోబు జ్యేష్ఠ పుత్రుడైన రూబేనుకు తమ్ముళ్ళు అసూయ చెందడం ఏ మాత్రం అంగీకరంగా లేదు. అన్న లేని సమయం చూచుకొని మిద్యానీయులైన బీడారులకు ఇరువది తులముల వెండికి అమ్మివేశారు .
(ఆది 39)లో గమనిచండి.ఈ సంగతులన్నీ దైవచిత్తానుసారం గానే జరిగాయి (ఆది 37:28)
ఈజిప్టు దాస్యములో మ్రగ్గుతున్న యోసేపు సత్ ప్రవర్తన గలిగి దైవభక్తితో జీవించుచున్నాడు. ఇతని అందానికి భ్రమసి పోతిఫరు భార్య దుష్కార్యానికి ప్రేరేపించింది. ఎంత వేదించినా అతడు లొంగిపోలేదు గనుక వ్యతిరేకముగా నిందలు వేసి జైలు పాలుజేసింది.
యధార్థవాది, లోకవిరోధి అనే సంగతి రుజువైంది. ఇక పోతిఫరు అను మరో వ్యక్తి హెలియోపొలిలో *రే* అనే సూర్యదేవతకు పూజారి. ఇతడు ఓను పట్టణానికి చెందినవాడు. ఓను అనగా “సూర్యుడు లేక బలము” అని అర్థములు.
పోతిఫేరే అనగా సూర్య దేవత యొక్క దానము అని అర్థము. ఇతని కుటుంబీకులంతా ఆ దేవతనే పూజిస్తూ అన్యాచారములలో జీవిస్తుండేవారు. ఇతని ప్రియపుత్రిక పేరు ఆసెనతు. ఈ పేరు అన్యదేవతకు చెందినది.’నాతు’ అను ఈజిప్టు దేవతకు “ప్రియ శిష్యురాలు” అని ఈ పేరుకు అర్థము.
యాజకుని కుమార్తె అయినందున గొప్ప విగ్రహారాధికురాలు ఆసెనతు. యోసేపు మంచితనాన్ని గుర్తించిన ఫరో రాజు ఆసెనతుతో వివాహము జరిగించాడు. ఆమె కుటుంబము వారంతా దీనికి సమ్మతించారు. అన్యురాలైన స్త్రీకి దైవభక్తి గల పురుషునితో వివాహము జరగడమంటే ఇది దేవుని ఏర్పాటే కానీ మరొకటి కాదు.
ఆసెనతు యోసేపుకు తగిన ఇల్లాలు .తన భర్త ఐగుప్తులో గడిపిన దుర్బర జీవితము, పోతిఫరు భార్య వలన పొందిన నింద, జైలులో గడిపిన బాధాకరమైన దినములు ఇట్టే మర్చిపోయేలా చేయుటయే గాక ముచ్చటైన ఇద్దరు కుమారులను కూడా అందించింది .
అందుకే సొలోమోను రాజు “భార్య దొరికిన వానికి మేలు దొరకెను , గుణవతియైన భార్య ముత్యములకంటే అమూల్యమైనది “ అని తన గ్రంధములో వ్రాశాడు.
యోసేపు తన పెద్దకుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అనగా “మరచిపోవుట” అని అర్థము .తన తండ్రి ఇంటివారిచే అమ్మివేయబడి ఒంటరిగా జీవించడము ఐగుప్తు చేదు నిజాలన్నిటినీ మరచిపోయేలా చేశాడని అతనికానామకరణము చేశాడు.
రెండోవాడు ఎఫ్రాయిము. ఈ పేరుకు అర్థము “అభివృద్ధి” చెందుట. రిక్తునిగా వచ్చి దారుణ హింసలు అనుభవించిన ఐగుప్తు దేశములోనే దేవుడుreference హెచ్చుగా అభివృద్ధి పరచాడు.
గుణవతియైన భార్యను, గోత్రాన్ని నిలిపేందుకు చక్కని కొడుకులను ఇచ్చాడని సంతోషించాడు. క్రీస్తేసునందు జీవించేవారికి అన్ని విధాల అభివృద్ధి కలుగుతుంది.
బైబిలు గ్రంధములో ఎన్నో రకాలైన స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆసెనతు అన్యురాలైయుండి కూడా దైవభక్తుడైన భర్త సహచర్యంతో కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొని పిల్లల పిల్లలను చూచింది.
తన తల్లి మరణము వలన ఇస్సాకు మితిలేని దుఃఖాన్ని భార్య రిబ్కా సహచర్యములో మరచిపోగలిగాడు. కుటుంబాల పతనానికి కూడా దోహదకారులైన లోతు భార్య, యోబు భార్యలాంటి స్త్రీలు కూడా లేక పోలేదు.
పరిశుద్ద గ్రంధములో ఆసెనతు లాంటి మంచి భార్యలను ప్రతి స్త్రీ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి.
ఫలించు కొమ్మయైన యోసేపుతో ఆసెనతు ఎలా అంటుకట్టబడిందో స్త్రీలు కూడా భర్తలతో అంటు కట్టబడాలి. మన కుటుంబాలన్నీ క్రీస్తేసుతో కట్టబడాలి. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కదా ఫలించేది. అట్టి గొప్ప కృప స్త్రీలైన వారికి దేవుడు అనుగ్రహించును గాక !
2⃣9⃣ *కాలేబు కుమార్తె అక్సా*
(యెహోషువ 15:13-19 )
అరుదుగా వినిపించే ఈ స్త్రీ పేరు అక్సా. ఈ పేరునకు “కడియం” అని అర్థం ఈమె యెపున్నె కుమారుడైన కాలేబు పుత్రిక, కాలేబు అనాకీయుల దేశమును స్వాధీన పరచుకొనిన తరువాత దేబీరు నివాసుల మీదికి తన దృష్టిని సారించాడు. దానిని కొల్లగొట్టినవారికి తన కుమార్తెయైన అక్సాను యిచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటించాడు.
కాలేబు సహోదరుని కుమారుడైన ఒత్నీయేలు ఈ ప్రయత్నంలో నెగ్గినందున అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిగించాడు. దక్షిణ భూమిని పెండ్లి కానుకగా ఇచ్చాడు.
వివాహానంతరం అక్సా తన భర్తతో సంప్రదించి, తండ్రి యొద్దకు వచ్చి నీటి మడుగులను అడుగగా అతడు పల్లపు మడుగులను మెరకమడుగులను యిచ్చినట్లు వాక్యభాగములో మనము చూడగలము.
(యోహాను 15:18-19 ) అక్సా గాడిద దిగగానే తండ్రి నుండి దీవెనలు కోరుకుంది (యోహాను 15:18 ) తండ్రి యొక్క దీవెన తనను వర్ధిలజేస్తుందని ఆమె విశ్వసించింది. “నీవు దీర్ఘయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము” అనే దేవుని ఆజ్ఞను ఆమె అమలుపరిచింది తండ్రి కూడా ఆమె విధేయతకు ముగ్ధుడై ఆమె కోరిన విధముగా నీటి మడుగులను దయచేశాడు.
ఆమె బాలికగాను కన్యగాను ఉన్ననాటినుండి తన తండ్రి యొక్క గుణగణాలను అంచనా వేసుకుంది. తన తండ్రి అడిగినవి యిస్తాడని నమ్మింది. మడుగులను కోరి రెండింతలుగా ఫలితాన్ని సాధించింది.
“అడుగుడి మీకియ్యబడును” అని సెలవిచ్చిన మన పరమ తండ్రిని అడిగి మనము ఈవులను సంపాదించు కోగలుగూతున్నామా అని మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
బైబిల్ గ్రంథములో అక్సా పేరు పై అద్యాయములోను, మరియు (న్యాయా 1:12-15 ;1 దిన 2:49 ) లో మాత్రము చూడగలం. ఇంత తక్కువ ప్రాచుర్యముగల ఈ స్త్రీ కొరకు ఒత్నీయేలు తన ప్రాణాలకు సైతం తెగించి పోరాడాడంటే ఆమెలో అతనికి నచ్చిన ప్రత్యేకత ఏదో ఉండి ఉంటుంది. అక్సా శరీర సౌందర్యము కలిగి ఉండవచ్చును. కాని అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని బైబిల్ సెలవిస్తుంది.
యెహోవావయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని సామెతల గ్రంథకర్త వ్రాసినట్టుగా ఈమె దైవభక్తి అతనికి నచ్చియుండవచ్చు. యెహోవాయందు భయమే జ్ఞానమునకు మూలము గనుక ఈమె జ్ఞానవంతురాలై తన గృహనిర్వహణ జరిగి యుండవచ్చు.
ఆనాటి స్త్రీలకు నేటి స్త్రీలవలే ప్రాథాన్యత ఇవ్వబడలేదు. ఈ రోజుల్లాగ రిజేర్వేషనులు వగైరా అసలేలేవు.
కుటుంబ చరిత్రలో కూడా స్త్రీ ప్రస్తావన చాలా స్వల్పముగా కనిపిస్తుంది.
ఇశ్రాయేలీయులకు ప్రధానుడైన యాకోబుకు పన్నెండు మంది కొడుకులు కాగా ఒక్కతే కుమార్తె కలదు. అట్టి సమాజంలో జీవించిన అక్సా దైవభక్తి గలవారము అని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సంపూర్ణ విధేయతతో సత్ క్రియలు చేయుచూ, సంఘ కార్యకలాపములలో చాటుగావుండి భర్తను ప్రోత్సహించుచూ, బిడ్డలను దైవభక్తిలో పెంచి యుండవచ్చునని నమ్మాలి.
(ద్వితియోపదేశకాండము 11:18-19 ) వచనములలో తల్లులు తమ పిల్లలకు నేర్పవలసిన సంగతులను గూర్చి వ్రాయబడివుంది.
మనము మన పిల్లలకు ఏమీ నేర్పుతున్నాము! సమాజంలో ఘనత, విద్య, ర్యాంకులు, ఉద్యోగము వీటిచే మన పిల్లలను ప్రోత్సహించుటగాక ఆయన రాజ్యము నీతిని మొదట వెదికేలా చేయాలి.
నీ బాలురను శిక్షించుట మానకుము నీ కుమారుని శిక్షింఛిన యెడల అతడు నిన్ను సంతోషపరచును. (సామెతలు 19:18 ) పిల్లలను శిక్షించి పెంచాలని బైబిల్ తేట తెల్లముగా వెల్లడించుచున్నది.
మన పిల్లల యెడల మన కర్తవ్యమెలా వుందో అలోచించుకుందాం.
చివరిగా ఆలోచిస్తే ఊటలు లేనిదే పొలము ఫలించదనే సత్యాన్ని అక్సా గ్రహించింది. అందుకే కీర్తనాకారుడు మా ఊటలు నీయందె ఉన్నవని కీర్తనలు 87:7 లో వ్రాశాడు.
జీవపు ఊటలలో అక్సా తన జీవిత వేరులను, కుటుంబవేరులను పెంపుజేసుకున్నది, మేలు అనుభవించింది. బైబిల్ గ్రంథమును పరిశీలించినట్లయితే జీవపు ఊటలకై తపించిన స్త్రీలు మరికొందరు కనిపిస్తారు.
శారా దాసియైన హాగరు బెయెర్షబా అడవులలో ఎలుగెత్తి యేడ్చుట ద్వారా నీటి ఊటలను సంపాదించు కొనగలిగినది.
దప్పిగొనిన వారలారా నీళ్ళయొద్దకు రండి అని ప్రభువు పిలుచుచున్నాడు. ఆయన యిచ్చే ఊటలు సాక్షాత్తు ప్రభువు సిలువపై కార్చిన రక్తధారలేనని ప్రతివారు గ్రహించాలి.
అవి జీవింపేజేసే జీవపు ఊటలని గ్రహించలేక అపవిత్రమైన ఊటలను తృణీకరించి లోకసంబంధమైన తొట్టెలను మన కొరకు ఏర్పాటు చేసుకొనుచున్నాము.
ఈ విషయమై బైబిల్ ఇలా సెలవిస్తుంది “నా జనులు రెండు నేరములు చేయుచున్నారు. మొదటిగా జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు రెండవదిగా వారి కొరకు బ్రద్ధలై నీళ్ళు నిలవని తొట్టెను తొలిపించుకొని యున్నారు” అని మన ప్రభువు ఎంతో ఆవేదన చెందుతున్నాడు.
యిర్మియా 2:13
క్యాలండర్లో నూతన సంవత్సర సంఖ్యను చూచి పొంగిపోతున్న మనము అక్సావలే మన కుటుంబములను, నీటి ఊటల వద్దకు నడిపించాలి. రాబోవు తరములను నీటిబాటలో నడిపించవలసిన గొప్ప బాధ్యతను దేవుడు స్త్రీల మీద ఉంచాడు.
గనుక ప్రార్థించే తల్లులుగాను అయన రాకడకొరకు నమ్మకమైన సాక్షులు స్త్రీలు ఉండాలని ప్రభువు కోరుచున్నాడు.
3⃣0⃣ *ఫీబే*
రోమా 16:1 -2 కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు *ఫీబే* అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని, ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను.
క్రొత్తనిబంధన స్త్రీలలో ప్రత్యేక స్థానాన్ని పొందిన సహోదరీ ఫీబేను గూర్చి పౌలు ఘనంగా ఇక్కడ వ్రాస్తున్నాడు.
*ఉపోద్ఘాతము:* ఫీబే కేంక్రేయ వాస్తవ్యురాలు. కెంక్రేయ కొరింతుకు ఏడు మైళ్ళ దూరంలోని రేవుపట్టణం. భయంకరమైన అన్యాచారాలు గల పట్టణం. ఎక్కువగా చంద్రదేవతారాధన గలిగిన పట్టణం. అటువంటి అన్య జనులలోనుండి మార్చబడి ప్రభువును చేరకొని సహోదరిగా మారి ప్రభువు కొరకు గొప్ప సాక్షిగా జీవించిన స్త్రీ ఫీబే.
*1. ఫీబే అనగా అర్ధం చంద్ర కాంతి, వెలుగు, ప్రకాశించునది:* చంద్రునికి స్వతహాగా వెలుగు ఉండదు. సూర్యుని వెలుగే చంద్రుని ప్రకాశింపజేస్తుంది. అలాగే నీతి సూర్యుడైన యేసు యొక్క వెలుగు విశ్వాసిని వెలిగించును. అందునుబట్టి విశ్వాసి లోకమునకు వెలుగా మారుచున్నాడు.
అ. చంద్రకాంతి అందమైనది. - విశ్వాసులు అందము గలవారు. పరమగీతం 6:10
ఆ. చంద్రుడు : దిన దినాభివృద్ధి చెందును. విశ్వాసి దిన దినాభివృద్ధి చెందాలి.2 కోరి 3:18
ఇ. సూర్యుని మీద ఆధారపడిన చంద్రుడు యెషయ 26:3 నీతి సూర్యుడైన యేసుమీద అధారపడిన విశ్వాసి అందమైనవాడు.
ఈ. చంద్రుడు ఋతువులను కాలములను తెలుపును. కీర్తన 104: 19 విశ్వాసులు రాకడ కాలములను ప్రజలకు తెలుపువారు.
ఉ. చంద్రుడు తన స్వచ్చమైన వెన్నెల ద్వారా ఆనందమును ఇచ్చువాడు. విశ్వాసులు ఇతరులకు ఆనందమును ఇచ్చేవారు.
కీర్తన 81:3 ఫిలిప్పు 4:4
*2. ఫీబే అనేకులకు సహాయకురాలు (ఆతిధ్యము):* ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను. రోమా 16:2 రోమా 12:13.
విశ్వాసి అనేకులకు సహాయకరంగా ఉండాలి.
మంచి సమరయుడైన యేసు అందరికి సహాయకుడైనట్లు విశ్వాసికూడా అందరికి సహాయకరంగా ఉండాలి. ఫిలిప్పి 2:4
*3. ఫీబే సంఘ పరిచారకురాలు:* రోమా 16:1. కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే..
ఎన్ని అవాంతరాలు ఎదురైనా యేసు కొరకు ఘనమైన పరిచర్య చేసిన ఘనురాలు ఫీబే. మత్తయి 20:26. సంఘ పరిచర్యలో ఆసక్తి కలిగిన స్త్రీ. ఫిలిప్పి 2:4,21
*4. ఫీబే ధైర్యము మరియు సిద్ధపాటు గలిగిన స్త్రీ:* హెబ్రీ 10:35
రోమా ప్రభుత్వ భయకారణంగా పౌలుచే వ్రాయబడిన పత్రికను రోమాలో స్థాపించబడిన సంఘం వారికి అందించుటకు ఎవరు ముందుకురాని సమయంలో ఫీబే తాను ఒక స్త్రీయై యుండి కూడా ప్రభువు కొరకు ప్రాణాలకు తెగించి ధైర్యంగా సముద్ర ప్రయాణం చేసి ఆ పత్రికను రోమా సంఘానికి అందించగలిగింది. ఆమే లేనిచో ఈనాడు మనకు రోమా పత్రిక చదువుకునే భాగ్యం ఉండేది కాదు. యేసుకొరకు ప్రాణాలివ్వడానికైనా సిద్ధపడి ముందుకు సాగే ఫీబే లాంటి వారు కావాలి.
ప్రభువు కొరకు ప్రాణాలకు తెగించి పరిచర్య చేసిన మహిళామణులు- ప్రిస్కిల్ల రోమా 16:4, మిర్యాము, ఎస్తేరు, మగ్ధలీనా మరియ మొదలగువారు.
యెషయ 6:8 అప్పుడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను నన్ను పంపు మనగా...
*5. ఫీబే నమ్మకమైనది స్త్రీ:* పౌలు యొక్క సిఫారసు పొందుకొనినది. రోమా 16:2 ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను.
నమ్మకమైన వారినే మనం ఎవరికైనా సిఫారసు చేస్తాం. ఫీబే మాదిరిగా విశ్వాసులైన వారు మరణము వరకు ప్రభువుకు నమ్మకముగ ఉండాలి. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు మోషే.
*6. ఫీబే పరిశుద్ధులలో చేర్చబడిన స్త్రీ:* (పరిశుద్ధత) రోమా 16:2 ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా...
పేతురు 1:14-16.
నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని ప్రభువు చెప్పినట్లు విశ్వాసులందరు తమ పరిశుద్ధతను కాపాడుకోవాలి.
*7. సంఘ సహాయము పొందుకొనిన స్త్రీ ఫీబే* (రోమా 16:2 ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను..)
సంఘ సహాయము ద్వార ఘనంగా ఫీబేను ప్రభువు ఆశీర్వదించాడు. సామెతలు 31:30-31 యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.
ముగింపు: ఫిబే ఎంతో మాదిరికరమైన స్త్రీ. పరిశుద్ధాత్మ చేత ఘనంగా వాడబడిన స్త్రీ. దేవుని కొరకు ఘనంగా ప్రకాశించి జీవించిన స్త్రీ ఫిబే. అన్యాచారాలతో చేదైన తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించి తన జీవితాన్ని మధురంగా మార్చుకున్న గొప్ప ధన్యురాలు ఫీబే. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. కీర్తన 68:11
1కొరి 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
దేవుడు మిమ్ములను దీవించును గాక! ఆమెన్ !!
దైవాశ్శీసులు!!
From the desk of:-
Pastor Jyothi Benjamin
(Soli Deo Gloria)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి