ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ నందలి స్త్రీలు పదహరవ భాగము

✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳

  (పదహారవ భాగము)

 2⃣7⃣ *పునరుత్థాన ప్రధమ సాక్షి మగ్దలేనే...✍*
 

మార్కు 16:9  
*ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను "ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు" మొదట కనబడెను.*

ప్రభువు మరణించక ముందు చివరి దినాలలో, యేసు యొక్క అనుచరుల సంఖ్య వేలాదిగా ఉండేవారు అటువంటిది, చివరకు వ్రేళ్ళ మీద లెక్కించువారిగా తగ్గిపోయినా గాని ఒక గుంపు మాత్రం ఆయనను ఎల్లవేళలా అనుసరించినట్లు మనం చెప్పగలం. 

వారే ఆయనను విశ్వసించిన స్త్రీల గుంపు. వారు ఎన్ని శ్రమలకు గురైనప్పటికీ, ఎల్లప్పుడూ యేసుతోనే ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. క్రైస్తవ సంఘంలో జీవించేది పురుషులే కాదు స్త్రీలు కూడా ఉన్నారు. ప్రభువు కొరకు ప్రకటించుటకు, పరిచర్య చేయుటకును ప్రభువు అందరికి తగు స్వేచ్ఛ నిచ్చియున్నాడు. ఎక్కువగా స్త్రీలైనవారే దానిని సద్వినియోగం చేసుకొని ప్రభువు కొరకు ఎన్నో విధములైన పరిచర్యలు చేసిన జ్ఞానవంతురాండ్రుగా పరిశుద్ధ గ్రంధంలో కనబడుచున్నారు. స్త్రీలు చేసిన పరిచర్యలు కూడా ప్రభువుకు ఎంతో ఆమోదయోగ్యముగా వున్నవి. 

పరిశుద్ధ గ్రంధంలో స్త్రీలు చేసిన సువార్త పరిచర్య, సాక్ష్యపు జీవితం అనంతమైనది, ఎంతో అపారమైనది. అటువంటి వారిలో ప్రభువును వెంబడించిన స్త్రీలలో ఒకరైన మగ్దలేనే మరియ అను ఆమె ఆయనను ప్రతిచోటకు వెంబడించినట్లు మనం చూడగలం.  

మానవజాతిలోనే పునరుత్థానుని దర్శనం పొందుకొనిన మొట్టమొదటి “మనిషి” మగ్దలేనే మరియ. ప్రభు పునరుత్థాన సందర్భంగా ప్రతి సువార్తలోను వ్రాయబడిన ఒకే ఒక స్త్రీ మగ్దలేనే. జీవితంలో ఎన్నో కష్టాలు పడినాగాని, వినయ పూర్వకమైన, పవిత్రమైన భక్తి గలిగి ధన్యురాలైన మగ్దలేనే మరియ జీవితంనుండి మనం నేర్చుకోవలసిన కొన్ని సత్యాలు ఈ దినం ధ్యానిద్దాం.

*1. మగ్దాల గ్రామమునకు చెందిన స్త్రీ:* సువార్తలలో వ్రాయబడిన వివరాల ప్రకారం గలలియ సముద్ర తీరప్రాంతానికి పశ్చిమాన ఉన్న మగ్దాల అను గ్రామమునకు చెందిన స్త్రీగా ఈమె కనబడుచున్నది. ఈ మగ్దాల అను గ్రామము *మగదాను ప్రాంతము* అని *దల్మనూతా* అని కూడా పిలువబడినది. (మత్తయి 15:39  తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి *మగదాను* ప్రాంతములకు వచ్చెను. 

మార్కు 8:10  ఆయన తన శిష్యులతోకూడ దోనె యెక్కి *దల్మనూతా* ప్రాంతములకు వచ్చెను.) ఎంతో ఖరీదైన నీలిరంగు ఉత్పత్తి చేసే మొక్కలసాగుకు ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధి. ఎంతో అందమైన రంగులు ఉత్పత్తి చేసే ప్రాంతం కాబట్టి వ్యాపార కేంద్రం అని కూడా చెప్పవచ్చు. కనుక పాపానికి వ్యభిచారానికి దయ్యపు సంచారానికి కూడా ఈ ప్రాంతం కేంద్రంగా ఉన్నది. బహుశా ఈ అందమైన రంగులకు ఆకర్షితురాలై పాపపు ప్రపంచంలో జీవించి దయ్యముల ప్రభావంతో జీవితాన్ని సర్వనాశనం చేసుకొన్న స్త్రీ ఈ మగ్దలేనే మరియ. ఈనాడు కూడా అనేకులు లోకపు రంగులకు అందాలకు ఆకర్షితులై నాశనమై పోతున్నారు. (1 పేతురు 1:23  ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;)

*2. ఎంతో భయానకమైన జీవితం గలిగిన స్త్రీ:* ఏడు దయ్యములచే పట్టి పీడించబడిన స్త్రీ అని చెప్పబడినది. (మార్కు 16:9  ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను *ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు* మొదట కనబడెను.)

(ఎఫేస్సి 2:1  మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.)

తాను జీవించిన భయంకరమైన జీవితాన్ని బట్టి  దేవాలయం నుండి, సమాజం నుండి సంఘం నుండి వెలివేయబడిన స్త్రీగా రక్షణకు ఎటువంటి అవకాశం లేని స్థితిలో ఆమె ఉన్నది.  ఏడు దయ్యపు ఆత్మలు నియంత్రణలో ఉన్నందున, ఆమె తన జీవితాన్ని మార్చుకోలేనిదిగా ఉన్నది. 

దయ్యపు ఆత్మలకు బానిసగా మారి ఆరోగ్యం ఆనందం సమస్తమును పూర్తిగా కోల్పోయిన పరిస్థితిలో మగ్దలేనే చిక్కుకుంది. ఇక ఆమెకు మరణం మరియు నరకం తప్ప వేరే మార్గము లేని పరిస్థితి. క్రీస్తు నుంచి వేరుగా ఉన్నవారెవరికీ నిజమైన ఆధ్యాత్మిక జీవం లేదు. ఎందుకంటే అందరూ పాపులు (రోమా 3:23 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.; 5:12 మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను). 

గనుక ప్రతి ఒక్కరూ వారికి క్రీస్తు కొత్త జీవం ఇచ్చేంతవరకు ఆత్మ సంబంధంగా చచ్చినవారే.

ఈనాడు కూడా అనేకులు సాతానును దయ్యములను అనుసరిస్తూ ఇటువంటి దుర్భరమైన స్థితిలో ఉంటున్నారు గాని ప్రభువు సహాయం కొరకు రావడం లేదు. ప్రభువైన యేసు క్రీస్తుకు అవిధేయులుగా ఉన్నవారందరిలో సాతానుడు పని చేస్తున్నాడు. సాతానుడి ప్రభావంవలన వారు భవిష్యత్తులో ఎంటువంటి నిరీక్షణలేని వారై, చివరకు విషాదకరంగా నరకం యొక్క మంటలలో భయంకరమైన జీవితాలను గడపటానికి సిద్దంగా ఉన్నారు. 

(ఎఫేస్సి 2:2  మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.)

*3. విడుదల పొందుకొనిన స్త్రీ:* ప్రియమైన వారలారా! ఈ లోకంలో పూర్తిగా తప్పిపోయిన పాపికి సాదృశ్యంగా ఈ మగ్దలేనే జీవితం ఉన్నది. 

ఇటువంటి నిస్సహాయమైన స్థితిలో ఉన్న ఆమె యేసును గూర్చి విన్నది. యేసుప్రభు బోధలు విని పశ్చాత్తాపపడి ఆయనలో నమ్మకం ఉంచింది. యేసును దర్శించింది. కన్నీరు కార్చి ఆయన పాదాలు తడిపి, తల వెంట్రుకలతో పాదాలు తుడిచి, అత్తరుతో అభిషేకించింది. 

ఈ విధంగా ఆమె తన పశ్చాత్తాపం, నమ్మకం, మహిమగల ప్రభువు పట్ల తన నిర్మలమైన ప్రేమ కనపరచింది. (లూకా 7:37  ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను.)

ఏడు దయ్యములచే పీడించబడి ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్న ఈమెను, రక్షకుడైన యేసు అద్భుతంగా సాతాను భయంకరమైన బంధకాల నుండి విడిపించాడు. నూతన జీవితం ఆమెకు ప్రసాదించాడు. (ఎఫేస్సి 2:1  మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.)

మగ్దలేనే మరియకు పాపవిముక్తి కలిగించి శాంతిని ప్రసాదించినది దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ కాదు, లేదా క్రీస్తు పాదాల దగ్గర ఏడవడమూ కాదు. ఆమెకు పాపవిముక్తి కలిగించినది ఆమె నమ్మకమే. పాపవిముక్తి అంటే క్షమాపణ పొందడం, పాపభరితమైన జీవితంనుంచి విడుదల, దేవునితో సంబంధం సరి కావడం. 

క్రీస్తు మరణం ద్వారా పాపం నుంచి విడుదల కలిగింది. ఆయనతో చనిపోవడం మూలంగా మనం పాపంనుంచి విడుదల అయ్యాం. పాపంతో మన సంబంధం తెగిపోయింది. దేవుడు ఇకపై మన పాపాలను మనవిగా లెక్కించడు.

కాని ఒకసారి విడుదల పొందిన తరువాత మరల అనేకులు తిరిగి పాపపు జీవితంలోనికి వెళ్లి పోవుచున్నారు. ఎంత విచారకరం. మన శరీరంలో పాపప్రభావం లేకుండా పోవాలనీ మనం ఇకమీదట పాపానికి బానిసలుగా ఉండకూడదనీ మన పాత మానవ స్వభావం పూర్తిగా క్రీస్తుతో సిలువ మరణం పాలైందని మనకు తెలుసు. ఆత్మ సిద్దమే గాని శరీరం బలహీనం.  పాప శరీరం అంటే విశ్వాసుల శరీరాల్లోని భ్రష్ట స్వభావం పూర్తిగా పోవాలంటే మనం బ్రష్ట స్వభావం సిలువ వేయబడాలి.

తిరిగి ఎన్నడూ ఆమె మరల ఆ పాపపు జీవితానికి వెళ్ళకుండా యేసు ద్వారా ఆమె పాపపు జీవితం పూర్తిగా సిలువ వేయబడినది. 

(రోమా  6:6  ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువ వేయబడెనని యెరుగుదుము.)


లూకా 8:3  
*వీరును ఇతరులనేకులును, తమకు "కలిగిన ఆస్తితో" వారికి ఉపచారము చేయుచు వచ్చిరి.*

యోహాను 20: 15
*యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.*

యేసు యొక్క పరిచర్యలో పాల్గొన్న ప్రత్యేకమైన మహిళా సమూహంలో తనను తాను ప్రభువుకు అంకితం చేసుకొన్న స్త్రీగా మగ్దలేనే ఉన్నది. నిన్నటి దినం మగ్ధలేనే యొక్క ఊరు, ఆమె పాపపు జీవితం, యేసు ద్వార ఆమె పొందుకున్న విడుదలను ధ్యానించాం. ఆమెను గురించిన మరికొన్ని విషయాలు ఈ దినం ధ్యానం చేద్దాం.

దేనినిబట్టి మగ్దలేనే మరియ ప్రభువునందు అంత గొప్ప భక్తిని ప్రదర్శించింది?

*4. విడుదల పొందిన తరువాత ప్రభువుకు సమర్పించుకొనిన స్త్రీ:* ఎన్నో ఏండ్ల నుండి దయ్యములచే బహు ఘోరంగా పీడించబడి, ఒక్క క్షణంలో యేసు ద్వారా అద్భుతమైన విడుదల పొందుకొనిన మగ్దలేనే మరియ గొప్ప కృతజ్ఞతతో తనకు నూతన జీవితాన్ని ఇచ్చిన యేసుకు తన జీవితాన్ని అంకితం చేసుకొన్నది. (2కొరి 5:17  కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;) 

సాతాను శక్తికంటే ఎంతో ఉన్నతమైన ఆయన అద్భుతమైన శక్తిని ఆమె గ్రహించింది. యేసును ప్రేమించడం ప్రారంభించినది. అయితే దేవుని పట్ల ఆమెకున్న ప్రేమను బట్టి ఆమె క్షమాపణ పొందలేదు. తనకు క్షమాపణ దొరికింది కాబట్టి ఆమె దేవుణ్ణి ప్రేమించింది. 

క్రీస్తు విషయంలో తన ప్రవర్తన ద్వారా తాను క్షమించబడిన సంగతినీ, తాను దేవుణ్ణి ప్రేమిస్తున్న సంగతిని కూడా ఆమె వెల్లడి చేసింది. తనకు ఏమాత్రం అర్హతలేక పోయినా ఆయన యొక్క ఉచిత కృప ద్వారా మాత్రమే తాను రక్షించబడిన సంగతి ఆమె ఏనాడు మరువలేదు. (ఎఫేస్సి 2:4  అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండి నప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా  ప్రేమచేత మనలను క్రీసు కృపచేత మీరు రక్షింపబడి యున్నారు.)

*5. తనకున్న ఆస్తి అంతటితో పరిచర్య కొరకు సహాయం చేసిన స్త్రీ:* యేసుగాని ఆయన శిష్యులు గాని వారు సువార్త పరిచర్య నిమిత్తం మరియు తమ పోషణార్థం అద్భుతాలు చెయ్యలేదు మరియు వారు ఎక్కడా చందాలు పట్టినట్టు గానీ డబ్బుకోసం అడిగినట్టు గానీ మనం చూడము. 

మరి వారి పరిచర్యకు కావలసిన డబ్బు ఎక్కడనుండి వచ్చింది? యేసయ్య అంగీలో డబ్బులున్నట్లు ఎవరూ చెప్పలేదుగాని, విశ్వాసులే అన్ని సమాకుర్చునట్లు వ్రాయబడి వుంది. ఇచ్చేటప్పుడు మనచేయి పైకి లేస్తుంది. మిగతా సమయమంతా ప్రభువు చేయి మన తలపైనే వుంటుందనే సత్యాన్ని గ్రహించిన వారు ఇవ్వకుండా వుండలేరు. 

ఆయన సేవకై తమ ధనాన్ని, స్థలాన్ని, సమయాన్ని ఆనాడు వెచ్చించిన మహిళలు నిజంగా ధన్యులు. యేసు పరిచర్య కొరకు వీరు పూర్తి ఆర్ధిక మద్దతును సంపూర్ణ భక్తితో అందించారు. 

వాస్తవానికి మగ్దలేనే ఒక గొప్ప ధనవంతురాలుగా ఉన్నది. ఆమె మారిన తర్వాత తన ధనాన్ని యేసు మరియు ఆయన శిష్యుల యొక్క సువార్త పరిచర్యకు కొరకు హృదయ పూర్వకంగా వాడింది. కాని ఇది ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. తనకు కలిగిన విస్తారమైన ఆస్తితో మగ్దలేనే ప్రభువుకు ఉపచారం చేసింది. (లూకా 8:3  వీరును ఇతరులనేకులును, తమకు *కలిగిన ఆస్తితో* వారికి ఉపచారము చేయుచు వచ్చిరి.) 

తమకు కలిగిన ఆస్తితో ప్రభువు పరిచర్య కొరకు సహాయం చేసేవారు ఈ దినాలలో ఎంతమంది ఉన్నారు? ఈ విషయంలో మగ్దలేనే ఎంతో మాదిరికరం. మనకున్నదంతా ఆయన మనకు ఇచ్చినదే కదా! మరి అటువంటిది ప్రభువు పరిచర్య కొరకు మనం ఎంత ఇస్తున్నాం? 

మగ్దలేనే మాదిరిగా ప్రభువు పరిచర్య కొరకు ఇచ్చిన వారు దేవుని దృష్టియెదుట వారు ఎంతో ధన్యులు. పట్టజాలనంత దీవెనలకు వారి ఇల్లు నిలయం అవుతుంది. యిచ్చుటలోనున్న ఆశీర్వాదాలను గ్రహిస్తే, ఇవ్వకుండా వుండలేము. వెదజల్లి అభివృద్ధి చెందినవారు కలరు.  (మలాకీ 3:10  నా మందిరములో ఆహారము ఉండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.)

*6. ప్రభువును అన్నివేళలా వెంబడించిన స్త్రీ:* సువార్తల్లో యేసు యొక్క పరిచర్య చూస్తే దాదాపు అన్నిచోట్లా మగ్దలేనే మరియ అతనితో ఉన్నదని తెలుసుకుంటాము. అంతే కాకుండా యేసు ప్రతి పట్టణానికీ గ్రామ గ్రామానికి వెళ్తూ దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్త బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నపుడు ఆమె ఎల్లవేళలా తనలాంటి తోటి స్త్రీలతో కలసి యేసు ప్రభువును స్థిరంగా వెంబడించినది. 

అదే స్థితిలో ఉన్న స్త్రీలతో పాటు ఆన్ని చోట్ల వారికి ఆమె ఎంతో ఆర్ధిక సహాయంతో బాటుగా అందరికి ఎంతో ఉపచారం అందించింది. (లూకా 8: 1-3 పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదుయొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి.) 

సిలువ మరణం వరకు ఆమె యేసును వెంబడించింది. సిలువలో యేసు మరణించడం కళ్ళార చూసింది. (యోహాను 19:25  ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.)

ప్రభువు చనిపోయేంత వరకు ఆయనతోనే ఉన్నది, చివరకు మగ్దలేనే ఆయనను సమాధి చేసేంత వరకు ప్రభువును విడిచి పెట్టలేదు. ప్రభువును సమాధి చేసి అందరూ వెళ్ళిపోయినా మగ్దలేనే ఇంకా ప్రభువును మర్చిపోలేక భారమైన హృదయంతో సమాధి ఎదురుగానే కూర్చుండి పోయింది. (మత్తయి 27:61  మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి యుండిరి.)

*7. గొప్ప విశ్వాసం గలిగిన స్త్రీ:* యేసును అనుసరించిన అనేకుల విశ్వాసం కంటే  మగ్దలేనే విశ్వాసం ఎంతో గొప్పది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. 

ఆమె విశ్వాసం ఎంతో గొప్పదో ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. యేసు సమాధిని జయించి తిరిగి లేచాడు. సమాధి ఖాళీ అయింది. మగ్దలేనే మొదలగు స్త్రీలు సుగంధ ద్రవ్యాలతో వచ్చారు, అప్పటికే సమాధి ఖాళీ చేయబడినది. వెంటనే స్త్రీలు శిష్యులకు ఈ విషయం చెప్పారు. శిష్యులు వచ్చారు, ఖాళీ సమాధిని దర్శించారు వెళ్ళిపోయారు. (యోహాను 20: 7) నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టి యుండుటయు చూచెను. 10  అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.)  

కాని పునరుత్థానుడైన యేసు శరీరాన్ని చూచేంతవరకు ఖాళీ సమాధిని విడువనని విశ్వాసంతో పట్టుబట్టి అక్కడే మగ్దలేనే కన్నీటితో ప్రార్ధన చేస్తూ కూర్చుండి పోయింది. (యోహాను 20:11  అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చుచుండెను.) 

ఆయన మొట్టమొదటిగా తన తల్లికి గానీ తన శిష్యుల్లో ఎవరికైనా గానీ కనిపించకుండా ఆమెకు కనిపించడానికి కారణం ఆమె విశ్వాసంతో చేసిన ప్రార్ధనయే. ఆత్మీయ విషయాలు తక్కువ తెలిసినాగాని, నమ్మకం ప్రేమ మాత్రం బలంగా ఉన్న ఆ స్త్రీ పై ఆయనకు జాలి కలిగింది. పునరుత్థానుడైన యేసును చూడాలని ఆమె కన్నీటితో చేసిన ప్రార్ధన ప్రభువు ఆలకించాడు. 

ఆనందించాల్సిన సమయంలో అనవసరంగా దుఃఖపడుతున్న ఆమెను ఓదార్చి సత్యం ప్రకటించుటకు ప్రభువు ఆమె దగ్గరకు వచ్చాడు. 

ప్రియ దేవుని బిడ్డలరా!
తమ గురించి దేవుడేమి చేస్తున్నాడో తెలియక కొన్ని సార్లు విశ్వాసులు ఆనందించవలసిన సందర్భాల్లో మగ్దలేనే మరియ మాదిరిగా అనవసరంగా ఏడుస్తుంటారు. అయితే ప్రభువు ఒదార్చువాడు.

వాస్తవానికి తన సిలువ విజయాన్ని మహిమలో ఉన్న తండ్రికి యేసు మొదటిగా నివేదించవలసి యున్నది. ఆతరువాతే ఆయన తన పునరుత్థాన దర్శనాలు శిష్యులకు ఇవ్వవలసి యున్నది. 

కాని ప్రభువు మగ్దలేనే విశ్వాసపు ప్రార్ధనతో, మహిమలో ఉన్న తండ్రి యొద్దకు వెళ్ళకుండానే మగ్దలేనేకు తన పునరుత్థాన దర్శనం ఇచ్చాడు. *మనుష్య జాతిలోనే ప్రభువు యొక్క మొట్టమొదటి పునరుత్థాన దర్శనం పొందుకున్న ఘనమైన స్త్రీగా ఆమె చరిత్రలో నిలిచి పోయింది.* ఇది ఆమె తన విశ్వాసం ద్వారా సాధించ గలిగింది.

మరియ తన పాదాల మీద పడబోతుంటే యేసు తనను తాక వద్దని వారించాడు కారణం ఆయన ఇంకా మహిమలో ఉన్న తండ్రి యొద్దకు వెళ్ళలేదు. మనుషుల విముక్తి కోసం దేవుడు చేసిన ఏర్పాటు పూర్తిగా నెరవేరాలంటే యేసు పరలోకానికి వెళ్ళి తండ్రికి తన విజయాన్ని నివేదించి రావలసి యున్నది. 

మరియకు పునరుత్థాన దర్శనం ఇచ్చిన తరువాత యేసు మహిమలో ఉన్న తండ్రి యొద్దకు వెళ్లి తరిగి వచ్చాడు గనుక మిగతా శిష్యులకు తన గాయాలలో వ్రేళ్ళుపెట్టి తనను తాకే అవకాశం ఇచ్చాడు.

యేసు సజీవంగా లేవడం గురించి ఇతరులకు తెలియపరచిన మొదటి సాక్షి మగ్దలేనే మరియ. అపోస్తలులకే సువార్త ప్రకటించిన మగ్దలేనే మరియ జీవితం నిజంగా ఎంతో ధన్యకరం.

మగ్దలేనే మరియ యేసు యొక్క పరిచర్య అంతటిలో ఆయనతోనే ఉన్నది. యేసు కల్వరిలో మరణించినప్పుడు ఆమె ఆయన పాదాల వద్ద కూడా కన్నీళ్లు కార్చింది. ఆయన శరీరం సమాధి చేయబడు వరకు ఆమె వెంబడించినది. ఇతరులు ప్రభువును విడిచి పారిపోయినప్పటికి, మగ్దలేనే మరియ మాత్రం ఆయన యందు చెదరిపోని విశ్వాసం గలిగి చివరి వరకు నమ్మకంగా ప్రభువుతోనే ఉన్నది. 

ఇటువంటి అత్యద్భుతమైన భక్తిని ప్రదర్శించిన మగ్దలేనే మరియ తన జీవితంలో పొందుకున్న ఫలమేమి? ఆయన సజీవుడై లేచినప్పుడు యేసు దర్శనమిచ్చినది మొట్టమొదటిగా మగ్దలేనే మరియకే.

ఈ సందేశం చదువుతున్న ప్రియ దేవుని బిడ్డా! మగ్దలేనే మాదిరి పాపంలో తప్పిపోయిన స్థితిలో ఉన్నావా? *రక్షించే యేసు నీ కొరకే సిద్ధంగా ఉన్నాడు.* ఒకవేళ రక్షించబడి ఆయనను సరైన రీతిగా వెంబడించ లేక పోతున్నావా? చివరి వరకు తనను వెంబడించడానికి మగ్దలేనేకు సహాయం చేసిన ప్రభువు నీకు కూడా సహాయం చేయగలడు.

ప్రభువును వెంబడించువారు చివరి వరకు వారి సిలువ ఎత్తికొని మగ్దలేనే మాదిరి వెంబడించాలి. అటువంటి వారి కొరకు ప్రభువు చూస్తున్నాడు. (మత్తయి 16:24  అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువ నెత్తికొని నన్ను వెంబడింప వలెను.) 

ప్రభువు యెడల మగ్దలేనే మరియకున్న విశ్వాసం ప్రేమ అమోఘమైనది. ప్రియమైన వారలారా! ఈ రీతిగా ఆయనను విశ్వాసంతో వెంబడించేందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా సమృద్ధిగా తన కృపను అనుగ్రహించును గాక. ఆమెన్!

దైవాశ్శీసులు!!!  

From the desk of...
Pastor Jyothi  Benjamin Vemula
_(Soli Deo Gloria)_

For daily messages
WhatsApp no 9346945687

*Immanuel Bible College*               
NIDUBROLU

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...