బైబిల్ లోని వివిధ భోజన బల్లలు ✍
ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి ఎర్రసముద్రము దాటి షూరు అరణ్యములో మూడు దినములు ప్రయాణము చేసి మారాకు చేరెను. అక్కడ నుండి ఏలీముకు వచ్చి ఆహారము గూర్చి దేవునికి మొఱ్ఱపెట్టుటకు బదులు ఆయనకు విరోధముగా సనిగిరి. దానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆసాపు ఈ విధముగా వ్రాస్తున్నాడు. "వారు అరణ్యములో మహోన్నతుని మీద తిరుగబడిరి, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు ఆయనకు విరోధముగా మాటలాడిరి." (కీర్తన 78:17) "అయితే కృప కలిగిన దేవుడు అరణ్యములో మన్నాను పూరేడుల మాంసమును వారికీ ఆకాశము నుండి కురిపించియున్నాడు. ఒరిమితో వారిని సహించుచు నలుబది సంవత్సరాలు వారి బట్టలు పాతగిలలేదు, వారి కాళ్ళు వాయలేదు." (ద్వితీ 8:4) తర్వాత వారు సినాయి అరణ్యమునకు వచ్చి అక్కడ దిగిరి. దేవుడు మోషే యెహోషువలను పర్వతము మీదికి పిలిచి ధర్మశాస్త్రము నిచ్చెను. అక్కడ మందిరము గూర్చి నమూనా ఇచ్చెను. ఆ మందిరము పేరే ప్రత్యక్ష గుడారము. దానిలో "దీపస్థంభము, బల్ల దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలము అని పేరు." (హెబ్రీ 9:2-5) "యెరూషలేములో సొలోమోను కట్టించిన దేవుని మందిరంలో ఈ సముఖపు రొట్టెలనుంచు బల్లలు స్వచ్ఛమైన బంగారుతోనే చేయించియున్నాడు. (1రాజులు7:48)
అయితే ఇశ్రాయేలు రాజులు జీవము గల దేవుని పరిశుద్ధ మందిరమును విడిచిపెట్టి ఉన్నత స్థలములపై బలిపీఠములు, దేవతాస్తంబములు నిలువబెట్టి విగ్రహారాధన ప్రోత్సహించిన కారణమున నెబుకద్నేజరుకు అప్పగించగా అతడు వచ్చి దేవాలయమును పడకొట్టి సిద్కియా రాజు కళ్ళు పిరికివేసి బందీగా చేసి, ఇశ్రాయేలీయులతో పాటు చేరగా తీసుకొనిపోయేను. 70 సంవత్సరాల చెర నుండి విడుదలైన తరువాత ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు, జెకార్య లాంటి మహామనులు, రాజైన కోరేషు ప్రోత్సాహముతో దేవాలయమును పునః నిర్మించెను. ఈ సందర్భములో పరిశుద్ధ బల్ల గూర్చి ప్రస్తావించకపోవడం మనం గమనించవచ్చు.
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తరువాత తాను జీవుంచిన చివరి దినాలలో పస్కా దినమున "ఒక రొట్టెను పట్టుకొని దాని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు దీనిని తీసుకొని తినుడు. ఇది నా శరీరము అని చెప్పెను. మరియు అయన గిన్నె తీసుకొని కృతజ్ఞతా స్థుతులు చెల్లించి వారికిచ్చి దినిలోనిది మీరందరూ త్రాగుడి.ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకులు కొరకు చిందించబడుచున్న నిబంధనరక్తము" (మత్తయి 26:26- 28). ప్రభువు పరలోకమునకు వెళ్లిన తరువాత సంగములోకి పరిశుద్ధాత్మ నింపి, సంఘము విస్తరించి లోకమునకు పంపెను. శిష్యులు మొదట క్రైస్తవులుగానూ, ఆ తరువాత అపోస్తులలుగాను పిలువబడ్డారు. వారిలో పౌలు ఒకడు. అతడు రొట్టె, ద్రాక్షరసములో పాలుపొందు కార్యక్రముమునకు 'ప్రభువు పరిశుద్ధ బల్ల' అని పేరు పెట్టాడు. మరి ప్రభు బల్లలో పాలుపొందువారు లోకములో వేరే విగ్రహార్పిత బల్లలలో పాలుపొందుకూడదు.
👉 బైబిల్ లో కొన్ని బల్లలు:-
🎯1. అరణ్యములోని సన్నిధి బల్ల :
"ప్రత్యక్ష గుడారములో రొట్టెలు పెట్టబడిన బల్ల ఉండుచోటు పరిశుద్ధ స్థలము... యాజకుడు, అతని సంతతియు పరిశుద్ధ స్థలములో వాటిని తినవలెను. అది అతిపరిశుద్ధము" (లేవి 24:5-9). ఈ రొట్టెలు ఇశ్రాయేలీయుల 12 గోత్రములు ఇశ్రాయేలీయుల పక్షమున యజకత్వము జరుపుచున్న వారు, వారి కుమారులు దేవుని సన్నిధిలోనే భుజింపవలెను. ఇది దేవుడు వారికీ సిద్ధపరచిన పరిశుద్ధ భోజనం.
🎯2. సౌలు బల్ల:
"అమావాస్య వచ్చినపుడు రాజు (సౌలు) భోజనము చేయ కూర్చుండినపుడు మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు .... దావీదు స్థలము ఖాళీగా ఉండెను" (1సమూ20:24-29). ఫిలిప్తియులు విజయము సాధించిన తరువాత దావీదును స్త్రీలు అధికముగా కొనియాడుటను బట్టి సౌలుకు దావీదు మీద ద్వేషము కలిగెను. తన కుమార్తె మీకాలును ఇచ్చి పెండ్లి చేసి చంపుటకు పథకాలు వేస్తుండగా, ఇది గ్రహించిన దావీదు యోనాతాను సహాయముతో సౌలు బల్ల యొద్ద నుండి తప్పించుకొనేను. సౌలు బల్ల యొద్ద పంచభక్ష పరమన్నాలు ఉన్న ప్రేమ లేదు.
🎯3. దావీదు బల్ల:
" కాగా మోఫిబోషేతు రాజకుమారులలో ఒకడయినట్టుగా రాజు(దావీదు) బల్ల యొద్ద భోజనము చేయుచుండెను" (2సమూ9:11). సౌలు, యోనాథాను చనిపోయిన తరువాత దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన తరువాత యోనాథాను బట్టి అతని కుమారుడు అయిన మోఫిబోషేతును పిలిచి రాజకుమారులలో ఒకడిగా చేసి, తన బల్ల యొద్ద భోజనము ఏర్పరిచెను. దావీదు బల్ల యొద్ద ప్రేమ, రక్షణ ఉండెను.
🎯4. సొలోమోను బల్ల:
"షేబ దేశపు రాణి... సొలొమోనుకు కలుగిన కీర్తిని గూర్చి విని, గొప్ప పరివారముతో యెరుషలేముకు వచ్చెను.... అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములు చూచి విస్మయమొందినదై". (1రాజు10:1-5). దావీదు తర్వాత ఆశీర్వదించబడిన రాజు. అతని కీర్తి ఇతర దేశములలో వ్యాపించెను. అతని బల్ల యొద్ద కీర్తి ఉంది.
🎯5. ధనవంతుని బల్ల:
"ధనవంతుడు ఒకడుండెను.... బహుగా సుఖపడుచుండెను. లాజరు అను ఒక దరిద్రుడుండెను... వాడు ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను" (లూకా 16:19-21). ధనవంతుని బల్ల యొద్ద జాలి, ప్రేమ లేదు ధన గర్వము కనబడుచుండెను.
🎯6. ధయ్యముల బల్ల:
"అన్యజనులు అర్పించు బలి దేవునికి కాదు దయ్యాములకే... మీరు ధయ్యముల బల్ల మీద ఉన్న దానిలో పాలుపొందనేరరు" (1కోరింథి 10:20-21). దేవునికి కానిది ఏదైనా దయ్యనిదే. దేవునికి చెల్లించ వలసిన ఏదైనా సరిగా లేకపోతే అది దయ్యనికే. మహిమ, ఘనత దేవునికే చెల్లాలి సుమా!
🎯7. ప్రభువు బల్ల:
"మనము దీవుంచు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములోనిది త్రాగుటయే గదా?" (1కోరింథి10:16).
ప్రభుబల్లలో పాలు పొందునపుడు
✴ ఆయన బలియాగాన్ని జ్ఞాపకము చేసుకోనుచున్నాము.(1కోరింథి 11:24)
✴ ఈ కార్యము ఆది సంఘం దినదినము,
ప్రతి ఇంట కుడుకొనుచు ఆచరించేవారు. (అపో. 2:42)
✴ దీనిని ప్రభువు వచ్చు వరకు ఆచరించెదము.
(1కోరింథి 11:26)
✴ అయన మరణము ప్రచురించు చున్నాము.
(1కోరింథి 10:16-17)
✴ దీనిలో పాలు పొందునపుడెల్ల మనలను మనము పరీక్షించుకుంటాము. (1కోరింథి11:28)
తెలియక కొందరు రక్షణ, ఆశీర్వాదము, రోగ విముక్తి కొరకు, సమస్యల పరిష్కారము కొరకు, ఫలహారం కొరకు ప్రభు బల్లలో పాలు పొందుతున్నారు. అలా కాకుండా నిర్దోషమైన చేతులతో ప్రభు బల్లలో పాలు పంచుకుందము. అటువంటి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి