♻️ —— సామెతలు —— ♻️
క్లుప్త ధ్యానములు ( Part: 19)
నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘన పరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. సామెతలు 3:9,10
♻️ ప్రథమ ఫలములు:
నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. నిర్గమ 22:29
మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి. లూకా 6:36
ప్రథమ ఫలాలు, ప్రతిష్ఠితార్పణలు, దశమభాగముల వంటి విషయాలను గూర్చి స్పష్టముగా చెప్పబడింది. జ్యేష్ఠ కుమారుని సహితం దేవునికి ప్రథమఫలముగా సమర్పించాలి. అయితే, నూతన నిబంధనకు వచ్చేసరికి వీటికి అంత ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనబడదు. మరీ ముఖ్యంగా దశమ భాగములు పాతనిబంధనకు చెందినవే తప్ప, నూతన నిబంధనకు చెందినవి కాదనే అభిప్రాయం అనేకులలో వుంది.
అయితే, ఒక్క విషయం! నూతన నిబంధన విశ్వాసులు సహితం ప్రభుపరిచర్య కొరకు శక్తి కొలది ఇచ్చారు. వారి శక్తికిమించి ఇచ్చారు. దశమ భాగముల పేరుతో లెక్కలుకట్టి ఆయనకు ఇవ్వడం కాదుగాని, ప్రభువు మనకు అనుగ్రహించేకొలది, ఆయన పరిచర్యలో వాడదాం!
అట్లా అని, ఆయనకిస్తే మనకు రెట్టింపు అనుగ్రహిస్తారనే దురుద్ధేశ్యంతో కాకుండా, ఆయన మనకిచ్చినదానిలో కొంత ప్రభువు పరిచర్యకొరకు వాడుదాం! తద్వారా సువార్త పరిచర్యలో పాలిభాగస్తులవుదాము.
కొందరు వారి కానుకలు పెద్ద పెద్ద టీవీ స్పీకర్స్ గా భావించబడుతున్నవారికే పంపిస్తారు. బహుశా వాళ్ళ పేర్లను, ఫోటోలను కూడా టీవీ లో స్క్రీన్ పై చూడచ్చనేమో? అయితే, నీవు పంపించే కానుక, వారికి సూట్ కూడా రాదు, వారి ఏసీ రూమ్స్ కరెంట్ బిల్ కి కూడా చాలదు. వారి ఏసీ కార్లలో పెట్రోల్ కి కూడా చాలదు. ఇక నీ కానుక దేవుని పరిచర్యలో వాడడానికేముంటుంది?
ఆకలితో అలమటిస్తూ, నిస్వార్ధముగా, నమ్మకంగా ప్రభువు కొరకు సమర్పణ కలిగి, కనీసం సైకిల్ కూడాలేకుండా పరిచర్య చేసే సేవకులు ఎంతోమంది. వారిని ఒక్కసారి దృష్టించగలవా? నీ స్థానిక సంఘ సేవకుని అవసరాలలో నీవంతు సహాయం చేయగలవా?
నీవు చేసినదానికి నిజంగా రెట్టింపు ఆశీర్వాదాలతో, రెట్టింపు కాదు, నీవు విస్మయం చెందేటంత ఆశీర్వాదాలతో నీకుటుంబాన్ని ప్రభువు నింపుతారు. వాక్యం ప్రకటించడానికి దోనెలో స్థలమిచ్చినందులకే పేతురుకు, విస్తారమైన చేపలరాశిని రెంట్ గా చెల్లించారు. నిన్ను వట్టిచేతులతో ఎట్లా విడచిపెట్టేస్తారు? అట్లా జరగనే జరుగదు.
ప్రార్ధిద్దాం! ప్రభువు పరిచర్యలో సహకరిద్దాం! ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి