♻️ అవసరతలోనున్న వారిని ఆదుకొంటున్నావా? .... అయితే?
అవసరతలోనున్న వారిని ఆదుకోవాలనే మనస్సు అనేకులు కలిగియున్నందుకు చెప్పలేనంత సంతోషం కలిగించే విషయమే. కానీ, వారి తపన చూస్తుంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసమే అన్నట్లు వుంది తప్ప, సేవాభావం మచ్చుకైనా కానరావట్లే.
నేను ఒక “అరటిపండ్ల గెల” ను, ఒక్క చేతితో మోసెయ్యగలను. అయితే, ఇటీవల కాలంలో సోషల్ మీడియా లో కొన్ని పోస్టింగ్స్ చూసా. “ఒక్క అరటిపండు” ను ( అరటిపండ్ల గెల కాదు) నాకంటే బలవంతులు, ఆరుగురు కలసి మోసుకెళ్లి, ఒక భిక్షగానికి దానం చేస్తున్నారు. ఆ భిక్షకుడు మాత్రమే, అయోమయంగా ఆ అరటిపండు వైపు చూస్తుంటే, మిగిలినవారంతా కెమెరాకు ఫోజులిస్తున్నారు.
కరోనా కారణంగా, ఏవో నిత్యావసర వస్తువులు పంచడం, వారు నైటీ తో వున్నా, షర్ట్ లేకుండా వున్నా వీరికనవసరం. ఫోటో తీసి, సోషల్ మీడియాలో షేర్ చెయ్యాల్సిందే. దీనిలో వీరి సేవాభావం కంటే, పబ్లిసిటీ కొరకే ప్రాకులాడినట్లుంది.
కొసమెరుపు ఏమిటంటే, ఇది పబ్లిసిటీ కోసం కాదు. ఇన్స్పిరేషన్ కోసం అంటూ వారి సేవాతత్వాన్ని సమర్ధించుకొంటారు. ఇన్స్పిరేషన్ అనేది, హృదయంలోనుండి జనించాలి. ఎవరో చేస్తున్నారని చేస్తే, వారు పది ఫొటోలో పెడితే, వీళ్ళమో ఇరవై పెడతారు.
నీవు చేసే సహాయం హృదయపూర్వకమైనదైతే, నీకు నీవే పబ్లిసిటీ కల్పించుకోనవసరం లేదు. నీ సహాయాన్ని పొందుకున్న వ్యక్తే, కృతజ్ఞతతో నీగురించి పదిమందితో చెప్తాడు. అట్లా కాకుండా, వాళ్ళ ఫోటోలు పెట్టి, పరువు తీసి, నీకు నీవే పబ్లిసిటీ పెంచుకొనే ప్రయత్నం చేస్తే, నీ సహాయాన్ని పొందుకున్న వ్యక్తికి కనీస కృతజ్ఞతా భావం కూడా కలుగదు.
నా వ్యాఖ్యలతో నీవు ఏకీభవించాల్సిన అవసరం లేదు గాని, పరిశుద్ధ గ్రంధం మాత్రం నీ పబ్లిసిటీని సమర్ధించదు.
మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. (మత్తయి 6 : 1-4)
దేవుని పిల్లలముగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే మనకు, రహస్యంగా చెయ్యాల్సిన సహాయం, బట్టబయలు చేయడం. కుడిచెయ్యి చేయునది, యెడమచేతికి తెలియకుండా చెయ్యాల్సిన సహాయం, బూర ఊదించుకొని, డప్పు వాయించుకోవడం అవసరమా? నిన్ను నీవే పరిశీలించుకో? నీ పబ్లిసిటీ తో, మనుష్యుల ముందర నిన్ను నీవు హెచ్చించుకొంటే, దేవుని ముందర తగ్గించబడతావు. అది మాత్రం గుర్తుంచుకో!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి