✳ *క్రిస్మస్ సందేశాలు* ✳
(3 వ భాగము )
*గొప్ప దేవుని గొప్ప ప్రేమ*
యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో *ప్రేమించెను.*
*1.యేసు ఈ లోకంలో జన్మించుటకుగల కారణం దేవుని గొప్ప ప్రేమ:* దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ దేవుని స్వభావం. ఆయన మనలను ప్రేమించకుండా ఉండలేడు. ప్రభువు తానే మానవ అవతారం ఎత్తి, ఈలోకంలోనికి వచ్చి బహుదీనుడుగా పశువులశాలలో జన్మించుటకు కారణం, మానవుల యెడల ఆయనకున్న గొప్ప ప్రేమయే”
ఈలోకంలో అన్ని ప్రేమలకంటే తల్లి ప్రేమ గొప్పది అంటారు. అయితే దేవుని ప్రేమ తల్లి ప్రేమకంటె ఎంతో గొప్పది. దేవుని వాక్యము చెప్పునదేమనగా, "స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను". (యెషయా 49:15).
*2.సర్వ మానవుల యెడల ఆయనకున్న ప్రేమ గొప్పది:* దేవుడు తనప్రేమను చూపుటకును తనతో సహవాసము కలిగి యుండుటకును మానవుని సృష్టించెను.
దేవుడు మానవుని సృష్టించి నప్పుడు శరీరము మాత్రమే గాక, ప్రాణము, ఆత్మను కూడా యిచ్చెను. తన స్వరూపం, తన పోలిక, తన ఆత్మ ప్రభువు మనకిచ్చుట అనునది మానవుల యెడల ఆయన కున్న ప్రేమను తెలియజేయు చున్నది. ఆయన ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
"నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనై యుందును; మీరు నాకు ప్రజలై యుందురు" లేవి. కాం. 26:12. అటువంటి ప్రియమైన మానవుడు పాపంలో పడిపోతే, సర్వ సృష్టిని ఒక్క నోటిమాట చేత సృజించిన దేవుడు ఒక్క నోటిమాట చేత ఈ లోకములోని పాపులందరిని రక్షించలేడా? అవసరమైతే తన వేవేల దూతలను పంపి పాపులందరిని రక్షించగలడు. అయితే దేవుడే స్వయంగా రక్షించుటకు ఎందుకు దిగి వచ్చాడు?
ఒక రాజు తన కుమారునితో కలసి నదిలో ఓడ మీద షికారుకు వెళ్ళెనట. రాజకుమారుడు కాలుజారి నదిలో పడెనట. ఆ రాజకుమారుని రక్షించుటకు ఓడలో అనేకమంది పరివారమున్ననూ ఆ రాజుగారే స్వయంగా నదిలోనికి దూకి తన కుమారుని రక్షించాడు. దీనికి కారణం *తండ్రి ప్రేమ.*
సర్వశక్తిగల దేవుడు ఒక్క మాటచేత ఈ పాపులందరినీ రక్షింప సమర్ధుడైయుండియూ అట్లు రక్షింపక తానే మానవ అవతారం ఎత్తి, ఈలోకంలోనికి వచ్చి బహుదీనుడుగా పశువులశాలలో జన్మించుటకు కారణం, మానవుల యెడల ఆయనకున్న *గొప్ప ప్రేమయే”*
యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమయై యున్నాడు, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమ యున్నది.
*3.తిరుగులేని దేవుని ప్రేమ:* క్రీస్తు ఈలోకంలో జన్మించి మన స్థానంలో మరణించి మన పాపాలను తొలగించి వేశాడు. మనం ఆయన్ను నమ్మినప్పుడు క్రీస్తురక్తం మూలంగా మనలను నిర్దోషులుగా లెక్కించాడు; మనలను తన స్నేహితులుగా చేసుకున్నాడు. మన అనుభవాన్ని దృక్పథాన్ని మొత్తంగా మార్చేశాడు. తనఆత్మను మనలో ఉంచి మనల్ని నూతన సృష్టిగా చేశాడు. క్రీస్తు సిలువదగ్గర వెల్లడి అయిన దేవుని ప్రేమ మనకు నేర్పుతున్నదేమిటంటే, మనము పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. దీనిని మనం నమ్మినప్పుడు మనలను నిర్దోషులుగా ఎంచి తన స్నేహితులుగా చేసుకుంటాడు. ఇది తిరుగులేని దేవుని ప్రేమ.
రోమా 5:7-8 నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
*4. ప్రేమ శ్రేష్టమైనది:* ప్రేమ శ్రేష్టమైనది అని పౌలు చెప్పుచున్నాడు. అటువంటి దివ్య ప్రేమకు మూలాధారం దేవుడే, మానవుడు కాదు. దేవుడు మనకు నేర్పించకపోతే అదేమిటో మనకు తెలియదు. ఆయన మనల్ని ప్రేమించకపోతే, తన ప్రేమను మన హృదయాల్లో ఉంచకపోతే మనం ఆయన్ను ప్రేమించగలిగేవాళ్ళం కాదు.
1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
1 యోహాను 4:16 మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, 1 యోహాను 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. 1కొరి 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.
*5. ఆగాపే:* విశ్వాసులు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి ప్రేమించడంలో దేవుని లాగానే వారుండాలి. ఇక్కడ యోహాను చెప్తున్నది దివ్య ప్రేమ అనగా స్వార్ధం ఎరుగని ప్రేమ. (“ఆగాపే” – 1 కొరింతు 13:1 ) ప్రేమలన్నిటికంటే ఒక ఉన్నత స్థాయి ప్రేమను ఈ పదం “ఆగాపే” తెలియజేస్తున్నది. ఇది దేవుని ప్రేమ, క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి ఆయన ఇచ్చే ప్రేమ (యోహాను 17:26).
లోకంలో మరెవరిలోనూ ఇది లేదు. దేవుని ప్రేమనూ, విశ్వాసులు ఒకరిపట్ల ఒకరు పరస్పరం, దేవునిపట్ల కూడా చూపవలసిన ప్రేమనూ సూచించేందుకు ఈ మాటను వాడారు. ఇది స్వార్థం లేని ప్రేమ, ఎప్పుడూ ఇతరుల మేలు కోరే ప్రేమ. కామం, స్వార్థపరమైన కోరికలు, స్త్రీ పురుష సంబంధాల్లో ఉండే ప్రేమతో దీనికి ఎలాంటి సంబంధమూ లేదు. లోకంలో మనుషులకు తమ స్నేహితులపట్ల, కుటుంబాలపట్ల ఉండే సహజ ప్రేమ కంటే మించినది ఇది. లైంగిక ప్రేమతో గానీ మోహంతో గానీ లోకమంతటా కనిపించే భావోద్రేక పూరితమైన ప్రేమతో గానీ దీనికి సంబంధమే లేదు. ఇది స్వార్థం లేని ప్రేమ. సేవ చేస్తూ, ఇతరులకు దీవెనలు తేవాలని చూచే ప్రేమ. ఇతరుల ఆధ్యాత్మిక మేలును ఆశించే ప్రేమ. మన కోసం చనిపోయేందుకు దేవుడు తన కుమారుణ్ణి పంపడంలో ఇది చక్కగా కనిపించింది.
ఒక మనిషి ఆధ్యాత్మికంగా జన్మించాడు, దేవుణ్ణి ఎరిగినవాడు అనడానికి ఉన్న ఖాయమైన రుజువు ఏమిటంటే అతని హృదయంలో దేవుని ప్రేమ ఉండడమే.
*6. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం కావలి:* అనగా మనము ఒకరి నొకరు ప్రేమించు కోవాలి. దేవుడు మనలను ప్రేమించి మన కొరకై ఈ లోకములో జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములకై సిలువలో చనిపోయి, పాతిపెట్టబడి, తిరిగిలేచెనని, మనము విశ్వసించి, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన యెడల నశింపక నిత్యజీవము పొందెదము (యోహాను 3:16).
దేవుడు మనలో ఉంటే ప్రేమ మనలో ఉంటుంది. ప్రేమ (ఆగాపే) మనలో ఉంటే దేవుడు మనలో ఉంటాడు. ఆయన గొప్ప ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి అనగా దేవుని ప్రజలు ఒకరినొకరు ప్రేమించడం వల్లే దేవుని ప్రేమ ఈ భూమిపై నెరవేరుతుంది.
ప్రభువు మనకు అట్టి ప్రేమను మన హృదయంలో సమృద్ధిగా కుమ్మరించును గాక. ఆమెన్!
దైవాశ్శీసులు
From the desk of..
Pastor Jyothi Raju Vemula
_(Soli Deo Gloria)_
Immanuel Bible College
NIDUBROLU
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి