ప్రకటన గ్రంథములో ఇద్దరు సాక్ష్యులు:
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు. ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ముచేసి జయించి వారిని చంపును.
ప్రకటన 11:3-7
దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగియున్నాడు. దానిలో భాగంగా సంఘము ఎత్తబడిన తర్వాత ఇద్దరు సాక్ష్యులను పరలోకం నుండి భూమి మీదకు పంపించబోతున్నాడు.
ఇశ్రాయేలీయులపట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఎందుకు? పక్షపాతమా? కానే కాదు. మరెందుకు?
యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి ఏతెంచిన సమయంలో, యూదులు ఆయనను రాజుగా అంగీకరించకుండా వారి హృదయాలను కఠినం చేసింది దేవుడే. ఎందుకంటే? ఆయనను వారు రాజుగా అంగీకరించియుంటే? ఆయనను సిలువవేసే అధికారం మరెవ్వరికీ లేదు. ఆయన సిలువ వేయబడకుంటే? విమోచనా కార్యం జరుగదు. విమోచనాకార్యం జరగకపోతే? మనకు రక్షణ లేదు.
వారి హృదయ కాఠిన్యం వలన, క్రీస్తుకు పిలాతు తీర్పు తీర్చే సమయంలో “ఆ రక్తము మా మీద మాపిల్లలమీద వుండునుగాక” అని వారికి వారే శపించుకున్నారు. ఆ రక్తాపరాధాన్ని నేటికిని అనుభవిస్తూనే వున్నారు.
*క్రీస్తు రక్తాపరాధం వారిని అత్యంత దయనీయమైన స్థితికి చేర్చింది*
* మందిరం కూల్చబడింది
* రాజ్యాన్ని కోల్పోయారు
* యెరూషలేము పట్టణం సర్వనాశనం అయ్యింది.
* దేశం పాడు దిబ్బగా మారింది.
* ప్రపంచ పటములో ఇశ్రాయేల్ కు స్థానం లేకుండా పోయింది.
* అషూరీయులు, బబులోనీయులు, పారశీకులు, గ్రీకులు, రొమన్ల చేతిలో దాస్యత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది.
* ప్రపంచమంతా చెల్లాచెదురయ్యారు.
* టైటస్ పది లక్షల మంది యూదుల్ని చంపి, యెరూషలేము వీధులన్నీ, రక్తం పారించాడు.
* హిట్లర్ అరవై లక్షల మంది యూదులను ఊచకోత కోయించాడు.
ఇట్లా చెప్పుకొంటూపొతే లెక్కలేనన్ని.
అయితే, కృప గలిగిన దేవుడు వారి పట్ల తన ప్రణాళికను నెరవేర్చుతూనే వున్నాడు. దానిలో భాగంగానే సంఘము ఎత్తబడిన తర్వాత, ఏడేండ్ల శ్రమకాలంలో, వారి రక్షణార్థం ఇద్దరు సాక్ష్యులను పంపిస్తాడు.
ఇద్దరు సాక్ష్యులెందుకు? ఒక్కరు చాలరా?
నిబంధనలను స్థిరపరచు నిమిత్తము యూదులకు ఇద్దరు సాక్ష్యులు అవసరమై యున్నది. (ద్వితీ 17:6)
ఎవరీ ఇద్దరు సాక్ష్యులు?
🔶🔶🔶🔶🔶🔶🔶
పరిశుద్ధ గ్రంధము వారి పేర్లను ప్రస్తావించలేదు. పరిశుద్ధాత్ముడు మరుగుచేసిన వాటిని గురించి మనము మాట్లాడుకోవడం అది నిష్ప్రయోజనమే అవుతుంది. అయినా, వేద పండితులు కలిగియున్న రెండు అభిప్రాయాలను మాత్రమే మీ జ్ఞాపకములోనికి తీసుకొనివస్తాను.
ఆ ఇద్దరు సాక్ష్యులు ఏలీయా, మోషేలు అని కొందరి అభిప్రాయమైతే, ఏలీయా, హానోకు అనేది మరికొందరి అభిప్రాయము. మరి కొన్ని అభిప్రాయములున్నప్పటికీ ఈ రెండు ప్రాముఖ్యమైనవి.
ఏదిఏమైనప్పటికీ ఎక్కువ శాతం, ఆ ఇద్దరిలో ఏలీయా ఒకరు అనే విషయాన్ని మాత్రం తప్పక అంగీకరిస్తారు. దానికి గల కారణాలేంటి?
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
1. ఇద్దరు సాక్ష్యులకు తమ ప్రవచన కాలమందు వర్షము పడకుండా చేయుటకు వారికి అధికారము కలదు. (ప్రకటన 11:6)
* ఏలియా కూడా ఆలాగు చేసెను. (1రాజులు 17:1, యాకోబు 5:7)
2. తమకు కీడు చేయువారిని నోటనుండి వచ్చు అగ్ని చేత నశింపచేయగలరు. (ప్రకటన 11:5)
• ఏలియా ఆకాశము నుండి అగ్నిని దింపినాడు.
అందుకు ఏలీయానేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.
( 2రాజులు 1:10,12)
3. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. (మలాకీ 4:5)
4. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై *ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై* ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనంద మును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతో షింతురనెను. (లూకా 1:16,17)
దీని ఆత్మీయ అర్ధము యోహాను అయ్యున్నప్పటికీ, అక్షరార్ధముగా ఏలీయాయై యున్నది.
నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను. (యోహాను 1:19-21)
5. మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; (ప్రకటన 11:12)
* ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను:
వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను. (2రాజులు 2:11)
6. ప్రతి ఒక్కడు ఒకసారి మరణించవలెనని నిబంధన ప్రకారము ఏలీయా మరల వచ్చి, మరణించవలెను అనే అభిప్రాయం అనేకమందిలో వుంది.(హెబ్రీ 9:27)
ఇద్దరు సాక్ష్యులలో ఒకరు ఏలీయా అయితే, మరొకరో మోషే అనే అభ్కిప్రాయం కొందరిలో వుంది. దానికి గల కారణాలు:
✨✨✨✨✨✨✨✨✨
1. ఇద్దరు సాక్ష్యులకు నీటిని రక్తముగా మార్చుటకు అధికారము గలదు. (ప్రకటన 11:6)
* మోషే కూడా ఐగుప్తులో ఇట్లా చేసినట్లు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. (నిర్గమ 7:17,24; 8:11)
2. ప్రతీ విధమైన తెగుళ్లతో భూమిని శ్రమ పెట్టగలరు ( ప్రకటన 11:6)
* మోషే కూడా ఐగుప్తులో ఇట్లా చేసినట్లు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి.
(నిర్గమ 7, 8 అధ్యాయములు)
* మోషే, ఏలీయాలు రూపాంతరం కొండపైన ప్రభువు మరణ విషయములను గూర్చి మాటలాడిరి. (లూకా 9:30, మత్తయి 17:3)
* పునరుత్తానమును గూర్చి ప్రకటించింది వీరిని నమ్ము చున్నారు. ( లూకా24:4,7)
* ప్రభువు తిరిగి వచ్చునని ప్రకటించినవారు వీరి యుండాలి. (అపో 1:10,11)
* కనుక వీరు మహాశ్రమల కాలంలో వచ్చి, ప్రభువు రాకడను గురించి, వెయ్యేండ్ల పరిపాలనను గురించి ప్రకటించ వచ్చునని నమ్ముచున్నారు.
* మోషే ధర్మ శాస్త్రమును యిచ్చినాడు. , ఏలీయా ప్రవక్తలకు బారియై యున్నాడు. కావున, ఆ ఇద్దరు సాక్ష్యులు వీరి వుండవచ్చు అనే అభిప్రాయం కొందరిలో కలదు.
కొందరి అభిప్రాయం ఏలీయా, మోషేలు కాగా, మరికొందరు ఏలీయా, హానోకు అని తలంచు చున్నారు.
* హానోకు, ఏలియాలు మరణం లేకుండా కొనిపోబడ్డారు. కావున వారు మరలా వచ్చి మరణించవలెననేది వీరి వాదన.
* హానోకు, ఏలియాలు ఇద్దరూ ప్రవక్తలై యున్నారు. (యూదా 14-15)
* ఏలీయా ధర్మ శాస్త్ర యుగమునకు, హానోకు మనస్సాక్షి యుగమునకు సూచనగా యున్నారు.
Note: ప్రతీవారు చనిపోవాలన్నది దైవనియమమే. అట్లా అని, మరణించకపోతే పరలోకం లేదు అనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. ఎందుకంటే? ప్రభువు మధ్యాకాశంలోనికి వచ్చి బూర ఊదినప్పుడు, సజీవులైన పరిశుద్ధులు కూడా ఎత్తబడతారు. మరి వారు మరణించలేదు కదా? అందుచే ఏలీయా, హానోకు వచ్చి మరణించాలనే వాదన సమర్ధనీయం కాదు.
మరొకసారి ఈ విషయాన్ని మీ జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తున్నాను. ఆ ఇద్దరు సాక్ష్యులు ఎవరనేది మనకు ముఖ్యం కానేకాదు. దేవుడు ఎవరిని పంపిస్తే, వారు వస్తారు. వారికి అప్పగించిన భాధ్యతను నెరవేర్చి వెళ్తారు.
అయితే, మనకిప్పుడో సందేహం! ఎత్తబడిన సంఘంలో లేకపోయినా, రక్షించబడడానికి మరొక ఆప్షన్ వుంది కదా? ఇప్పుడెందుకు అంత తొందరపడటం? అయితే, ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆ దినం వరకు నేను బ్రతికే వుంటాననే గ్యారంటీ నీకుందా? ఒకవేళ, బ్రతికి యున్నామే అనుకుందాం. ఆ దినాల్లో రక్షించబడడం అంత సులభమేమి కాదు. ఎందుకంటే? పరిశుద్ధాత్ముడు కూడా సంఘముతోనే ఎత్తబడతాడు కాబట్టి, ఇక మన మనస్సాక్షిని ఒప్పించేవారెవ్వరూ వుండరు.
అనుక్షణం నీ మనస్సాక్షి (పరిశుద్ధాత్ముడు) నీవు తప్పు చేస్తున్నావ్, నీవు తప్పు చేస్తున్నావ్ అంటూ గద్దిస్తుంటే? వాని పీక పట్టుకొని, నులిమి, చంపేసి, నీకు నచ్చినట్లుగా నీవు జీవిస్తున్నావ్. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని చేస్తున్నప్పుడే, మన జీవితాల్లో ఎట్లాంటి మార్పులేదే. ఇక ఆదినాలను గురించి ఆలోచించడం వెఱ్ఱితనమవుతుంది. ఇదే రక్షణ దినం. వాయిదా వెయ్యకు. వేస్తే, శిక్షనుండి తప్పించుకోలేవోమో? అది అత్యంత భయంకరం.
ఈ విషయాలన్నీ చదువుతుంటే, ఇట్లా జరుగుతుందంటావా? అనే సందేహంతో నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చెయ్యొద్దు. నోవహు కాలంలో కూడా అదే జరిగింది. ఫలితం ఏంటో తెలుసుకదా?
🔺 *ఇద్దరు సాక్ష్యులు భూమి మీదకు ఎప్పుడు పంపబడతారు?*
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
* అంత్య క్రీస్తు రాజ్య స్థాపన అయిన వెంటనే సంఘము ఎత్తబడుతుంది.
* సంఘము ఎత్తబడిన తర్వాత, విడువబడిన సంఘానికి ఏడేండ్లు శ్రమకాలం.
* అబద్ధ ప్రవక్త అనేకమైన సూచక క్రియలను చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ, అంత్య క్రీస్తే, మెస్సియా అని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.
* అంత్య క్రీస్తు యూదులను, తానే మెస్సియానని నమ్మించడానికి దేవాలయములో ( సంఘము ఎత్తబడక ముందే మూడవ దేవాలయము నిర్మించబడుతుంది) బలులను, నైవేద్యములను ప్రవేశపెడతాడు.
* ఇశ్రాయేలీయులు అంత్య క్రీస్తును, మెస్సియా గా అంగీకరిస్తారు.
* ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు సంపూర్ణాధికారమిచ్చి ఇద్దరు సాక్ష్యులను భూమి మీదకి పంపిస్తాడు.
🔺 వీరెవరు?
వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు. (11:4)
* ఒలీవ చెట్లు “అభిషేకమునకు” (జెకర్యా4:3-14 ),
* దీప స్తంభములు “సాక్ష్యము చెప్పుటకు” (ప్రకటన 1:20) సాదృశ్యము.
* అనగా వీరు అభిషేకముగలిగి, శ్రమకాలములో క్రీస్తునిగురించి సాక్ష్య మిచ్చుటకు పంపబడినవారు.
🔺 *ఇద్దరు సాక్ష్యులు భూమి మీదకు రావడానికి గల ముఖ్య ఉద్ధేశ్యమేమి?*
* అంత్య క్రీస్తుని ఎదిరించుటకు
* అతడు మెస్సియా కాదని, క్రీస్తు విరోధియని లోకానికి ప్రకటించుటకు.
🔺 *ఇద్దరు సాక్ష్యులకు గల అధికారాలేమిటి? *
💥💥💥💥💥💥💥💥💥💥
* ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును. (ప్రక 11:5)
* తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. (ప్రక 11:6)
* వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును,(ప్రక 11:6)
* నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. (ప్రక 11:6)
🔺 *వారెంతకాలము ప్రవచిస్తారు?*
* మొదటి మూడున్నర సంవత్సరాలు
🔺 *వీరు ఎప్పుడు చంపబడతారు?*
* మొదటి మూడున్నర సంవత్సరములు ప్రవచించడం ముగించిన తర్వాత.
🔺 *వీరు ఎవరిచేత చంపబడతారు?*
* అంత్య క్రీస్తు చేత.
వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును. (11:7)
🔺 *వారెక్కడ సమాధి చేయబడ్డారు?*
💧💧💧💧💧💧💧💧💧💧
* వారు సమాధి చేయబడలేదు. మూడున్నర దినములు వారి శవములు యెరూషలేము వీధుల్లో పడివుంటాయి. వాటిని ప్రపంచమంతా చూస్తూ ఆనందముతో ఒకనికొకరు బహుమానాలు పంపుకుంటారు.
అయితే, 100 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం నెరవేరడం అసాధ్యమని అనుకున్నారు. కారణం? యెరూషలేములో పడియున్న వీరి శవాలను ఇండియాలో నున్నవారు ఎట్లా చూడగలరు? సాధ్యం కానేకాదు.
కానీ, 1926 లో జాన్ లోగిచెయర్ ‘టెలివిజన్’ కనిపెట్టిన తర్వాత, అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందరికి ఇంటర్నెట్, కంప్యూటర్ , స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో వున్నాయి. ప్రపంచంలోని ఎక్కడి సమాచారమైనా కనురెప్పపాటులో మనకు చేరిపోతుంది. ఆ దృశ్యాలను అత్యంత స్పష్టముగా చూడగలుగుతున్నాము. పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడినది అక్షరాలా నెరవేరుతుంది. సందేహం లేనేలేదు.
🔺 *ఇద్దరు సాక్ష్యులు మరణిస్తే? ప్రజలకెందుకు ఆనందం?* (11:10)
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
వీరు అంత్య క్రీస్తు, మెస్సియా కాదని నిరూపించడం కొరకు వర్షాలు పడకుండా చేస్తారు. నీటిని రక్తముగా మారుస్తారు. అనేక తెగుళ్లను రప్పిస్తారు. ఇట్లా అనేకమైన సూచక క్రియలు చేస్తారు. దానితో ప్రజలంతా చాలా ఇబ్బంది పడతారు. ప్రజల దృష్టిలో వీరు దుర్మార్గులు. అంత్య క్రీస్తు అయితే, మొదటి మూడున్నర సంవత్సరాలు శాంత మూర్తిగా వ్యవహరిస్తాడు కాబట్టి. అంత్య క్రీస్తు పట్ల సద్భావము కలిగియుంటారు.
🔺 *వీధులలో పడియున్న, వీరి శవములు సంగతేమిటి?* ( 11:11-13)
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
* మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. గనుక వారు పాదములు ఊని నిలిచిరి;
* వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.
* అప్పుడుఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి;
* వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి
* ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను.
* ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి.
* మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.
🔺 *యేసు క్రీస్తుకు, ఇద్దరు సాక్ష్యులకు మధ్య గల సారూప్యము:*
* యేసు క్రీస్తు పరిచర్య కాలము మూడున్నర సంవత్సరాలు.
* అనేక అద్భుతాలు చేశారు.
* యెరూషలేములో మరణించారు.
* మూడవ రోజు పునరుద్ధానం.
* ప్రభు లేచినప్పుడు గొప్ప భూకంపం.
* ఆరోహణము
* యేసు క్రీస్తు పునరుత్తానము తర్వాత అనేకులు రక్షించబడుట.
ఈ సంభవాలన్నీ ఇద్దరు సాక్ష్యులు విషయంలో కూడా నెరవేరుతాయి. (ప్రకటన 11వ అధ్యా)
ప్రియ విశ్వాసి! కృపాకాలం ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభవు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి