——♻️ శారా జీవితం ♻️—-
శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికినయేండ్లు నూట ఇరువది యేడు. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చు టకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను (ఆది 23:1,2)
శారా ఒక ప్రత్యేకమైన స్త్రీ. వాగ్ధాన దేశములో మృతిపొంది (ఆది 23:2 ) వాగ్ధాన దేశములో అబ్రాహామునకు కలిగిన ఏకైక స్వాస్థ్యమైన “మక్పేలా గుహ” లో పాతిపెట్టబడిన (ఆది 23:20) మొట్టమొదటి విశ్వాసి. ఎంత వయస్సులో మరణించిందనేది ఒక్క శారా విషయంలోతప్ప, మరే స్త్రీ విషయంలోనూ పరిశుద్ధ గ్రంధములో ప్రస్తావించబడలేదు. శారా 127సంవత్సరాలు జీవించింది. అంటే, ఇస్సాకు జన్మించిన తర్వాత 37సంవత్సరాలు జీవించింది. శారా మరణించేసమయానికి అబ్రాహాము శారాలు ఒకే ఊరిలోలేరు. శారా హెబ్రోనను కిర్యతర్బాలోను, అబ్రాహాము బెయేర్షెబాలోను వున్నారు. శారా మరణ వార్తను తెలుసుకొని అబ్రాహాము హెబ్రోనుకు వచ్చాడు.
♻️ శారా జీవితంలోని అపశ్రుతులు:
అబ్రాహాము కల్దీయుల దేశములోనున్నప్పుడు దేవుడతనిని పిలిచాడు. అప్పటికే అబ్రాహాముకు శారాతో వివాహమయ్యింది. అందుచే అబ్రాహాముతోపాటు ఇతరదేశములో పరదేశిగా, యాత్రికురాలిగా ఉండడానికి యిష్టపడింది. అయితే, తన విశ్వాస జీవితంలో శారా ఎంతో ఘోరంగా విఫలమైన సందర్భాలున్నాయి. అబ్రాహాము చెల్లెలనని అబద్దం చెప్పడానికి యిష్టపడింది. అది భర్తకు లోబడినట్లుండినాగాని దేవునికి విరుద్ధము. సంతానం కోసం హాగరు భార్యగా తీసుకొమ్మని సలహా ఇవ్వడం ద్వారా, అబ్రాహాము విశ్వాసయాత్రలో తప్పటడుగు వేయడానికి కారణంకావడమే కాకుండా, దేవుని శక్తిని శంకించినట్లయ్యింది. తద్వారా అనేక దుష్పరిణామాలు చోటుచేసుకోవడం విదితమే. హాగరును శ్రమ పెట్టడం ద్వారా శారాయి అనేపేరుకు జగడగొండి అని అర్ధం కాబట్టి, సార్ధక నామధేయురాలయ్యింది. దేవుడు ఆమె కుమారుని కంటుందని అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడు, అవిశ్వాసపు నవ్వునవ్వి, అబద్దం చెప్పి దేవునిచే గద్దించబడింది.
అబ్రాహాము తాను ప్రేమించే ఏకైక కుమారుని బలి యివ్వాల్సిన సందర్భములోకూడా కన్నీరు కార్చలేదుగాని, మొట్టమొదటిగా తన భార్యయైన శారా మృతిచెందినప్పుడు మాత్రం ఆయన అంగలార్చాడు. వివాహమైన నాటినుండి అతనివెంటే అడుగులో అడుగేసి నడిచిందేతప్ప, ఏనాడు అతనికి ఎదురుచెప్పిన సందర్భంలేదు. ఎంతటి భయంకరమైన పరిస్థితులైనాసరే, అబ్రాహాముతో చేసిన నిబంధనకే కట్టుబడివుంది తప్ప, వాటినెప్పుడూ మీరలేదు. భౌతికంగా ఆమె దూరంకావడాన్ని అబ్రాహాము తట్టుకోలేకపోయాడు. శారా వ్యక్తిత్వం గురించి ధ్యానంచేసి, అనుసరించడం మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరం.
♻️ ఆదర్శప్రాయమైన శారా జీవితం:
🔅1. శారా ఒక గుణవతియైన భార్యగా దర్శనమిస్తుంది. స్వంతదేశాన్ని, తండ్రి కుటుంబాన్ని, బంధువులను అందరిని విడచిపెట్టి భర్తతోనే ప్రయాణం కొనసాగించింది. అబ్రాహాము తన భార్యను మందలించిన సందర్భం ఎప్పుడూ కనబడదు. అంటే, ఆమె జీవితవిధానం ఎట్లా వుండివుంటుందో అర్ధం చేసుకోగలం.
🔹గుణవతియైన భార్య యొక్క గుణములు గూర్చి సామెతలు 31:10-31లో చెప్పబడింది. అందులో ఆమె హృదయము, చేతులు మరియు నాలుకను గూర్చి చక్కగా వివరించబడినది. ఆమె సొగసు గూర్చి ఏమీ చెప్పబడలేదు, పైపెచ్చు అవి వ్యర్థమైనవియు మరియు మోసకరమైనవని చెప్పబడెను (సామె 31:30). అందులో చెప్పబడిన “గుణవతికి దేవునికి భయపడే హృదయమున్నది” (సామె 31:30). ఇదే ఆమె జీవితమంతటికి పునాదిగా నున్నది. ఆమె తన చేతులను బట్టలుతుకుతూ, వంట చేస్తూ, మొక్కలు నాటుతూ మరియు బీదలకు సహాయపడుతూ ఉపయోగించేది (సామె 31:13-22). ఆమె అందముగా లేకపోయినా దేవుని భయము కలిగి, కష్టపడి పని చేయుచు దయకలిగియుండేది. ఒక భార్యగా ఇట్టి అనుభవం నీకుందా?
🔅2. తన భర్తను పేరుపెట్టి పిలిచేసాహసం కూడా ఎప్పుడూ చేయలేకపోయింది. తన భర్తను “యజమానుడు” అని సంబోధించింది. (ఆది 18:12)
🔹నీ భర్తను “యజమానుడు” అని పిలవవద్దులేగాని, వాడు, వీడు, ఒరేయ్ అని పిలవకుండా మర్యాదగా పిలిస్తేచాలు. నీభర్త ఎట్లాంటివాడైనా, నీవెంత సంపాదించినాసరే నీకు శిరస్సు నీ భర్త . నీ భర్తకు శిరస్సు ప్రభువు. అంటే నీ భర్తను గౌరవించడంలేదంటే, నీ భర్తకే కాకుండా, నీ భర్తకు శిరస్సైయున్న ప్రభువుకు కూడా నీవు అవమానమును తీసుకొచ్చేదానవని జ్ఞాపకముంచుకో. శిరస్సుయైన నీభర్తను గౌరవించలేకపోతే నీవు మొండెముగానే మిగిలిపోవలసివస్తుందనే విషయం గుర్తుపెట్టుకో. నీ భర్తను రాజునుచేసి అతనికి నీవు రాణిగా వుండు. “ఒక భార్య తన భర్తకు లోబడినప్పుడు, నిజానికి ఆ విధముగా చేయమని చెప్పిన దేవుని వాక్యపు అధికారానికి లోబడుచున్నది. మరియు ఆ విధముగా ఆమె చేయుటకు లోకములో నుండిన అతిగొప్ప శక్తి ఆమెపై ప్రభావము చేయుట చేత క్రీస్తు నెరుగని భర్తలు కూడా ఆ శక్తిచేత జయింపబడుదురు”. (1పేతురు 2:1,2)
🔅 3. గుడారములోపలవుండే అనుభవాన్ని కలిగివుందిగాని, భర్తమీద పెత్తనంచేసే సాహసం చెయ్యలేదు. (ఆది 18:9)
🔹గుడారములో నుండే అనుభవం నీకుందా? పరిశుద్ధాత్ముడు ఎలాగు కనబడకుండా, మౌనముగా నుండినా శక్తివంతముగా విశ్వానికి ఎలా సహాయము చేయునో, నీవు కూడా నీ భర్తకు అలా సహాయము చేయుటకు సృష్టింపబడినదానవనే గ్రహింపు నీ ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత శ్రేయస్కరం. అట్లాకాకుండా వీధిలో నీవుంటే, ఒక తిరుగుబాటుచేసే భార్య తన ఇంటిని పనికిరాని ఏ ఎడారి కంటే కూడా భయంకరముగా తయారు చేయును. “ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు”. ( సామె 21:19)
🔅4. దీర్గకాళికంగా బిడ్డలులేకపోయినప్పటికీ దానికి భర్తనే భాధ్యుడను చేసి వేధించిన సందర్భం మనకెక్కడా కనబడదు.
🔹నీకు వివాహమై, గర్భఫలము ఆలస్యమైతే, రాహేలువలే భర్తను మానసికంగా హింసించే ప్రయత్నం చెయ్యొద్దు. గర్భఫలమిచ్చేది దేవుడే తప్ప, నీభర్త కాదనే విషయం మరచిపోవద్దు. నీ భర్తను నీతోకలసి ప్రార్ధించడానికి ప్రోత్సహించి, నిర్ణయకాలము వరకు నిరీక్షణతో కనిపెట్టు. యవ్వన కాలంలోపుట్టిన బిడ్డలే ఆరోగ్యవంతులనే అపోహలొద్దు. వంద సంవత్సరాల వయస్సులో అబ్రాహాము కనిన కుమారుడు కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతుడే. దేవుడిచ్చేది ఏదైనా, ఎప్పుడైనా అది శ్రేష్ఠమైనదే అనేవిషయం గుర్తుపెట్టుకో.
🔅5. ఆమె చాలా సౌందర్యవతి అయినప్పటికీ తన అందముద్వారా అందలమెక్కాలని ఎన్నడూ యోచించినది కాదు. ఫరో, అబీమెలెకు వంటి రాజులు ఆమెను కోరుకున్నప్పటి, ఆ రాజ్యాలకు రాణిని కావొచ్చని ఎన్నడూ ఆశించినదికాదు. అబీమెలెకు శారాను అతని ఇంట చేర్చుకొనే సమయానికి ఆమె వయస్సు 80 సంవత్సరాలు. అప్పటికికూడా ఆమె సౌందర్యవంతురాలే. ఆమె అందాన్ని అందలమెక్కడానికిగాని, పాపం చెయ్యడానికిగాని ఖర్చుచేసినదికాదు. ఆమె శారీరికంగానే కాదు. ఆమె అంతరగమందునూ సౌందర్యవంతురాలే.
🔹దేవుడు నీకిచ్చిన అందాన్నిబట్టి, నీ భర్తచాటున పరాయి పురుషునితో పాపం చేస్తున్నావా? లేక నీభర్తచేత, నీ దేవునిచేత కొనియాడబడిన జీవితాన్ని జీవిస్తున్నావా? లేక నిన్నుబట్టి నీభర్తకు, నీదేవునికి అవమానం తెచ్చేజీవితాన్ని జీవిస్తున్నావా? నిన్ను నీవే పరిశీలన చేసుకో.
🔅6. ఆమెది ఆతిధ్యమిచ్చుటలో అందెవేసిన చెయ్యి అనుటకు సందేహంలేనేలేదు. (ఆది 18:6)
🔹ఆతిథ్యము విషయములో ఇంటిలో భార్యదే ముఖ్యమైన బాధ్యత.ఆమె ఒక ప్రవక్తకాకుండానే, ఒక ప్రవక్తను కేవలము తన ఇంటిలోనికి ఆహ్వానించుట ద్వారా ఆమె ఒక ప్రవక్త ఫలమును పొందును (మత్తయి 10:41). అలాగే యేసు క్రీస్తు శిష్యులలో అతిచిన్న వానికి ఆతిథ్యమిచ్చుటచేత ఆమె తగిన ప్రతిఫలము పొందును (మత్తయి 10:41). ఒక అపొస్తలునికి ఇంటిలో ఆతిథ్యమిచ్చుట యేసు ప్రభువును చేర్చుకొనుటతో సమానమైనది*
(మత్తయి 18:5). గొప్ప భోజనము పెడితేనే ఆతిథ్యమనుకోకుండునట్లు, బీద విధవరాండ్రు కూడా పరిశుద్ధులకు ఉపచారము చేసిరి. (1తిమోతి 5:10)
🔅 7. కల్దీయుల దేశములో తన భర్తతో కలసిచేసిన ఒప్పందం ప్రకారం తన భర్తను తన సహోదరుడని చెప్పింది. తద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ, భర్తకు తానిచ్చినమాటకు కట్టుబడివుంది.
🔹ఒక భార్య స్థానంలో నీవుండివుంటే ఇట్లాంటి అనుభవాలు నీకున్నాయా? భర్త అబద్దం చెప్పమంటే దానికి బద్దురాలివైయుండు అనేది నా ఉద్దేశ్యం కాదు. అబ్రాహాము జీవించన దినాలలోనున్న పరిస్థితి అట్లాంటిది. అందమైన భార్యకలిగియుంటే భర్తను చంపి భార్యను లాక్కొనే పరిస్థితి ఆదినాలలో ఉండేది. దానికితోడు పరదేశిగా పయనం. ఇప్పటిజీవితానికి, ఈ కాలానికి దానిని వర్తింపజేయడానికి వీల్లేదు. సప్పీరా తనభర్తయైన అననీయతో కలసి అబద్ధమాడితే జరిగిన పరిణామాలేమిటో తెలుసుకదా? వివాహసమయంలో నీవు చేసిన ప్రమాణము చొప్పున నీ భర్తకు లోబడిన జీవితముందా? అసలు ఆ ప్రమాణాలే గుర్తులేకుండాపోయాయా? శారాకు వివాహమయ్యేటప్పటికీ నిజదేవుడెవరో తెలియదు. అయిననూ ఆ ప్రమాణాలకు కట్టుబడివుంది. నిజదేవుని సమక్షంలో నీవు చేసిన ప్రమాణములను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో.
🔅8. శారాయి (జగడగొండి), శారా (రాజ కుమారి)గా మార్చబడింది. హాగరుని శ్రమపెట్టినప్పటికీ, తిరిగివచ్చిన హాగరును చేర్చుకొని ఆదరించింది. అట్టిరీతిగానే ఆమె కొనియాడబడింది.
🔹ఒకవేళ బాప్తీస్మం తీసుకున్నప్పుడు నీ పేరు మారిందేమో? కానీ, నీ బ్రతుకు మారిందా? పేరు మారకపోయినా పర్వాలేదు జీవితం మారితే, జీవితం మారకుండా పేరు మార్చుకుంటేమాత్రం ప్రయోజనం శూన్యం. నిన్ను నీవే పరిశీలన చేసుకో! సరిచేసుకో! అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి