.......... *క్రిస్మస్*.........
(ఏడవ భాగము)
*గొర్రెల కాపరులు* (2):
దూత చెప్పిన "రక్షకుడు పుట్టాడు" అనే, ఒక చిన్న సువార్తమానమునకు వారియొక్క ప్రతిస్పందన, బండబారిన మన రాతిహృదయాలకు గొప్ప ఆధ్యాత్మిక పాటం.
*"మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని*" (లూకా 2:15) "ఐకమత్యమే మహా బలం" అంటూ చిన్నప్పుడు నేర్చుకున్న పాటాలు లెక్కలేనన్ని.
🔸గడ్డి పరకలు అన్నీ కలిస్తే బలమైన ఏనుగునే బంధించేస్తాయి.
🔸చలి చీమలన్నీ కలిస్తే విష సర్పాన్నే చంపేస్తాయి.
🔸గొర్రెల కాపరులు సమాజములో బలహీనులే. కాని వారిబలం వారి ఐకమత్యమే.
బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొనినప్పుడు, వారిలో ఒక్కరు కూడా వ్యతిరేకించినట్లు చూడము. వారిదంతా ఒకే మాట. ఒకే బాట. అందుకే దూత చాటించిన సమాధానాన్ని పొందుకోగలిగారు.
షోమ్రోను పట్టణం శత్రువుల ముట్టడి వల్ల, పిల్లలను సహితం వండుకుతినే భయంకరమైన కరవుతో అల్లాడుతున్న సమయంలో, సిరియా దండు పేటకు వెళ్దామని నలుగురు కుష్టు రోగులు ఒకరితో నొకరు చెప్పుకొంటున్నప్పుడు, వారిలో ఒక్కరుకూడా వ్యతిరేకించ లేదు. వారిదంతా ఒకే నిర్ణయం. వారు బ్రతకనిస్తే బ్రతుకుదాం! చంపేస్తే చచ్చిపోదాం! ఒకే మాట, ఒకే బాట.
ఆ నలుగురు కుష్టురోగుల ఐక్యత షోమ్రోను పట్టణమునకు సంవృద్దియైన ఆహారం పెట్టగలిగింది. ఇట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో లోపించాయి. ప్రతీ ఒక్కరూ నేను అనుకున్నట్లే జరగాలంటూ ఇతరులతో ఏకీభవించలేని పరిస్థితి.
అందుకే, మన సంఘాలను, మన కుటుంబాలను సాతాను చీల్చి చెండాడుతున్నాడు. వాడి ఆటలు సాగుతున్నాయంటే? కారణం? మనలో ఐక్యత లోపించింది. ఐక్యత లోపించింది కాబట్టే, సమాధానం లోపించింది.
వద్దు! ఒకరినొకరు అర్ధం చేసుకుందాం! ఒకరితోనొకరు ఏకీభవిద్దాం! కలసి కట్టుగా దేవునికోసం జీవిద్దాం! సమాధానాన్ని అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి