భక్తి చేస్తున్నావ్!
దానిలో భయముందా?
——-▫️(part-2)▫️———
*భయభక్తులు అంటే?*
🔸దేవుని పట్ల, దేవుని వాక్యముపట్ల భయముతో కూడిన గౌరవం.
🔸దేవుని మహత్యాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా చెయ్యడానికి భయపడడం.
అంతరంగంలో లేని భక్తి, బాహ్యంగా ప్రదర్శించినంత మాత్రాన, అది నిజమైన భక్తి కానేరదు. (రోమా 2:28,29)
“భయపడకుడి” అనే మాట పరిశుద్ధ గ్రంధములో 366 సార్లు ఉందని చెబుతారు. అంటే లీపు సంవత్సరమును కూడా విడిచిపెట్టకుండా, రోజుకొకసారి ప్రభువు “భయపడకుడి” అనే వాగ్ధానం మనకిచ్చినట్లయ్యింది. మనమేమో, ఆ వాగ్ధానమిచ్చిన దేవునికే భయపడడం మానేసాము.
*దేవునికి భయపడే వానిలో వుండే లక్షణాలు:*
🔸పశ్చాత్తాపము
🔸పవిత్రత
*పవిత్రత:*
పవిత్రత అంటే? శరీరానికి, ఆత్మకును ఎట్లాంటి కల్మషము అంటకుండా జీవించడం.
నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.
-1 పేతురు 1 : 14
♻️ *యోసేపుగారికి గల పవిత్ర జీవితం*
యోసేపు ఐగుప్తులో బానిసగా జీవితాన్ని జీవిస్తున్నాడు. పోతీఫరు భార్య అతనిని కోరుకున్నది. అది అతనికి మంచి అవకాశమే. ఆమెతో స్నేహం చేస్తే, బానిసగా బ్రతకాల్సిన అవసరం లేదు. అతడు ఇంట్లో ఒంటరిగానున్న సమయంలో, ఆమె అతనిని బలవంతం చేసింది. అతడు ఒప్పుకున్నా ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. అయితే, మనుష్యుల కళ్లుకప్పినా, దేవుని నుండి తప్పించుకోలేననే గ్రహింపుగలిగిన యోసేపు, పాపమునకు అందనంత వేగంగా పారిపోయాడు. తన పవిత్రతను కాపాడుకోగలిగాడు. దేవునియందు భయము గలిగిన వ్యక్తి, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తాడు.
నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను. (ఆది 39 : 9)
♻️ *యోబుగారికి గల పవిత్ర జీవితం*
యోబుగారు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఆయన అరుణోదయమున లేచి, అనునిత్యము తన బిడ్డల నిమిత్తము దహనబలులు అర్పించేవారు. ఎందుకంటే, తన బిడ్డలు పాపం చేశారని కాదు. తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని.
వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను. యోబు 1 : 5
♻️ *మనము కలిగియుండాల్సిన పవిత్ర జీవితం*
పాపము చెయ్యడానికి అవకాశం లేక, పవిత్ర జీవితం జీవించడం కాదుగాని, మన కుటుంబస్తులకు, బంధువులకు దొరికిపోతామని పాపము చెయ్యడానికి దూరంగా ఉండడం కాదుగాని, మనుష్యులు చూడకపోయినా, దేవుడు చూస్తున్నాడు అనే భయము, మనము పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి కారణం కావాలి.
కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులై యున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.
-ఫిలిప్పీయులకు 2 : 12
ప్రియ నేస్తమా! భక్తి చెయ్యడం కాదుగాని, భయముతోకూడిన భక్తి చెయ్యాలి. ఆ భయము పవిత్రతలోనికి నడిపించాలి. లోకంనుండి ప్రత్యేకింపబడిన మన జీవితాలెట్లా వున్నాయి? నీటిలోని తామరాకువలే, ప్రత్యేకింపబడి, పవిత్ర జీవితాన్ని జీవించుటకు మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి